రష్యాతో యుద్ధానికి 8 లక్షల సైన్యం, ప్లాన్ సిద్ధం చేస్తున్న జర్మనీ


German Superior Tank -Leapord 2A7A1

కొన్ని వందల వేల సైన్యాన్ని రష్యాతో యుద్ధానికి జర్మనీ సిద్ధం చేస్తున్నట్లు న్యూస్ వీక్ పత్రిక వెల్లడి చేసింది. జర్మనీ పత్రిక డెష్పీగెల్ (Der Spiegel) ప్రభుత్వం తయారు చేసిన ఒక రహస్య పత్రాన్ని సంపాదించి దాని వివరాలు వెల్లడి చేయగా ఆ వివరాలని న్యూస్ వీక్ ఆన్ లైన్ అమెరికన్ పత్రిక న్యూస్ వీక్ ప్రచురించింది.

త్వరలోనే రష్యాతో యుద్ధం తలెత్తవచ్చని పశ్చిమ పత్రికలన్నీ అడపా దడపా విశ్లేషణలు ప్రచురిస్తూ ఉన్నాయి. ఫిబ్రవరి 2022 లో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక, రష్యా త్వరలో తూర్పు యూరప్ దేశాలపై కూడా దాడి చేస్తుందనీ, ఆ తర్వాత పశ్చిమ యూరప్ దేశాలపై దాడికి తెగబడుతుందనీ అమెరికా, పశ్చిమ యూరప్ పత్రికలు ఒక ఫ్యాంటసీ లాంటి కధను సృష్టించి ప్రచారంలో పెట్టడం ప్రారంభించాయి. అంటే నాటో కూటమి దేశాలపై రష్యా దాడి చేయనుందని చెప్పడం వాటి ఉద్దేశం.

న్యూస్ వీక్ ప్రకారం, రష్యాతో యుద్ధం వచ్చిన పక్షంలో కొన్ని వందల వేల సైనికులు జర్మనీలోని హైవే ల గుండా జర్మనీ పశ్చిమ భాగం నుండి వేగంగా ప్రయాణం చేయగలిగే మార్గాన్ని జర్మనీ అభివృద్ధి చేస్తున్నది. దాదాపు 8 లక్షల మంది జర్మనీ మరియు ఇతర నాటో దేశాల సైనికులు తన పోర్టులు, హైవేలు, రైల్వేల ద్వారా తూర్పు దిశలో సాధ్యమైనంత వేగంగా ప్రయాణం చేయవలసి ఉంటుందని జర్మనీ భావిస్తున్నది. భారీ సంఖ్యలో ఆయుధాలు, ఇతర పరికరాలు, 2 లక్షలకు పైగా యుద్ధ వాహనాలు కేవలం 3 నుండి 6 నెలల్లోనే సమీకరించ వలసి ఉంటుంది(ట). వాటిలో అత్యధికం జర్మనీ నార్త్ సీ పోర్టుల ద్వారా జర్మనీలో ప్రవేశించి అక్కడి నుండి తూర్పున ఏర్పడబోయే యుద్ధరంగాలకు తరలివెళతాయి(ట).

జర్మనీ పధకంలో పశ్చిమ నగరం ఒబహాజెన్ నుండి తూర్పున పోలండ్ సరిహద్దులోని బెర్లిన్ నగర శివార్ల వరకు 300 మైళ్ళ దూరం మేర ఉండే ఎ2 హైవే, సైనికుల సామూహిక తరలింపులో ముఖ్య భూమిక పోషించనుంది అని న్యూస్ వీక్ తెలిపింది. ఈ మార్గం వెంట ఉన్న అనేక వంతెనలు రష్యా మిసైల్ దాడులకు టార్గెట్ అవుతాయని, ఆ దాడుల వలన నాటో సైనిక కదలికలు ఆలస్యం అవుతాయని, అందుకని జర్మనీ అప్పటికప్పుడు రూట్ మార్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను, తాత్కాలిక వంతెనలను తయారు చేసేందుకు సిద్ధపడుతోందని పత్రిక తెలిపింది.

అంతే కాకుండా జర్మనీ గుండా ప్రయాణించే నాటో సైన్యం సేద తీరేందుకు, భోజన వసతి పొందేందుకు, పునఃసరఫరాలు చేసేందుకు తగిన పధకాలను జర్మనీ రూపొందిస్తోందని, ప్రతి 300 నుండి 500 మీటర్లకు ఆగి సప్లైలు స్వీకరించేందుకు నాటో కాన్వాయ్ లకు వసతులను జర్మనీ అభివృద్ధి చేస్తున్నదని న్యూస్ వీక్ తెలిపింది.

ఇంతా చెప్పిన న్యూస్ వీక్ పత్రిక డెష్పీగెల్ అందజేసిన సమాచారం సాధికారతను స్వతంత్రంగా రూఢి చేయలేనని చెప్పింది. అయితే ఈ తరహా భారీ సైనిక కదలికలను ఆమోదించే వసతి ఇప్పటి జర్మనీ రాజ్యాంగంలో లేదు. కనుక జర్మనీ ప్రభుత్వం కొత్త చట్టాలు చేసి తదనుగుణమైన అధికారాలు తనకు తాను కట్టబెట్టుకోవలసి ఉంటుంది. యుద్ధ ఖైదీలను ఉంచే క్యాంపుల ఏర్పాటు, జనాన్ని సైన్యంలోకి రిక్రూట్ చేసుకునే చట్టాలు చేసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ (హిట్లర్) నేతృత్వం లోని అక్ష రాజ్య కూటమి ఓడిపోయాక జర్మనీ, జపాన్ ల రాజ్యాంగాలలో ఇతర దేశాలపై దాడి చేసే అవకాశాలు లేకుండా షరతులు విధించి అమలు చేశాయి.

కాగా, అమెరికాతో సహా నాటో కూటమికి చెందినా సైన్యం మరియు యుద్ధ పరికరాలు ప్రయాణించేందుకు నాటో దేశాల గుండా ల్యాండ్ కారిడార్ ల అభివృద్ధికి నాటో కూటమి పధకాలను అభివృద్ధి చేస్తున్న సంగతి గత జూన్ నెలలో టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. ఇటలీ నుండి స్లోవేనియా, క్రొయేషియా, హంగెరీ వరకు ఉన్న రూట్ తో పాటు టర్కీ, గ్రీసు, బల్గేరియా, రొమేనియా, స్కాండినేవియా దేశాల గుండా వెళ్ళే మరో రూట్, నాటో పరిశీలనలో ఉన్నాయి.

రానున్న దశాబ్దంలో రష్యాతో ప్రత్యక్ష ఘర్షణ తలెత్తే అవకాశాలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయని జర్మనీ అధికారులే నాటో కూటమి దేశాలను హెచ్చరిస్తున్నారు. ఈ వార్తా కధనాలు ప్రచురించిన పత్రికలే అదే చేత్తో మాస్కోతో ప్రత్యక్ష ఘర్షణ నివారించేందుకు కట్టుబడి ఉన్నామన్న అభిప్రాయాన్ని నాటో నాయకులు పదే పదే వ్యక్తం చేస్తున్నారని రాస్తున్నాయి. కానీ ఇంతకు మించిన వంకర రాత మరొకటి ఉండదు. ఎందుకంటే రష్యా, చైనాలను తమ శత్రువులుగా ప్రకటిస్తూ వ్యూహా పత్రాలు విడుదల చేసినది నాటో కూటమే. చైనా ఆర్ధిక వృద్ధిని నిలువరించే లక్ష్యంతో ‘పివోట్ టు ఆసియా’ వ్యూహాన్ని ప్రకటించి అమలు చేస్తున్నది అమెరికాయే.

ప్రపంచ దేశాల ఆర్ధిక, విదేశీ విధానాలపై పెత్తనం చేస్తూ వాటిని తమ ప్రయోజనాలకు అనుగుణంగా తయారు చేయాలని ఒత్తిడి చేసి సాధిస్తున్నది అమెరికా, పశ్చిమ దేశాలదే. ఎక్కడి వరకో ఎందుకు? రష్యా, ఉక్రెయిన్ లలోని గ్యాస్, చమురు, పంట చేల వనరులపై కన్నేసి వాటిని తమ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది కూడా అమెరికా, పశ్చిమ దేశాలే. అందులో భాగంగానే ఉక్రెయిన్ లో ప్రభుత్వాన్ని కూల్చి ఆ దేశం నిండా రసాయన ఆయుధ ప్రయోగశాలలతో నింపి, అక్కడ నయా-నాజీ గ్రూపులను పెంచి పోషిస్తున్నది, వాటిని రష్యాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టినదీ అమెరికా, పశిమ ఐరోపా దేశాలే.

నాటోతో రష్యా కయ్యానికి కాలు దువ్వుతోందా?

రష్యా నిజంగానే ఉక్రెయిన్ యుద్ధం ముగిశాక ఇంకా ముందుకు వెళ్లి నాటో కూటమి దేశాలపై యుద్ధానికి తయారుగా ఉందా? వాస్తవంలో రష్యా అలాంటి ఉద్దేశ్యం ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. పోనీ నాటోతో యుద్ధానికి తగిన ఏర్పాట్లు చేస్తున్న సూచనలు కూడా ఏమీ లేవు. ఆ మాటకు వస్తే నాటో కూటమిని కెలకడం, కెలికి లేని పోనీ తలనొప్పి తెచ్చుకోవడం అన్నది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ కు ఎంత మాత్రం ఇష్టం లేని వ్యవహారం. అమెరికా నాయకత్వం లోని నాటో కూటమే తూర్పు యూరప్ దేశాలను ఒక్కొక్కటిగా కూటమిలో చేర్చుకుంటూ రష్యా సరిహద్దుల వరకు నాటోని విస్తరించి రష్యా భద్రతను ప్రమాదంలో పడవేస్తూ వచ్చింది తప్ప సోవియట్ రష్యా కూలిపోయాక రష్యా ఎప్పుడూ నాటో కూటమితో ఘర్షణకు తలపడింది లేదు.

తూర్పు, పశ్చిమ జర్మనీ దేశాలను ఒకే దేశంగా విలీనం చేసేందుకు రష్యా అంగీకరిస్తూ “నాటో కూటమిని తూర్పు వైపుకు విస్తరించారాదు” అని ఒకే ఒక షరతు విధించింది. ఆ షరతుకు నాటో కూటమి ఒట్టు పెట్టి అంగీకరించింది కూడా. తీరా రెండు జర్మనీలు విలీనం అయ్యాక ఒట్టు తీసి గట్టున పెట్టేసింది. యుగోస్లోవియాపై బాంబుల వర్షం కురిపించి ఆ దేశాన్ని 7 ముక్కలుగా విడగొట్టింది. 1990 వరకు సోవియట్ రష్యా నీడన ఉన్న తూర్పు యూరప్ దేశాలు అన్నింటినీ నాటో మిలటరీ కూటమిలో చేర్చుకుని కూటమిని రష్యా పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించింది. ఈ క్రమంలో పుటిన్ అనేక మార్లు నాటో కూటమి ఇచ్చిన హామీని గుర్తు చేసి తీవ్ర నిరసన తెలియజేశాడు. రష్యా నిరసనను అమెరికా, పశ్చిమ ఐరోపాలు ఎంత మాత్రం పట్టించుకోలేదు.

రష్యా దృష్టిలో ఉక్రెయిన్, జార్జియాలను నాటో కూటమిలో చేర్చడం అంటే తాను గీసిన రెడ్ లైన్ ను నాటో కూటమి దాటి వచ్చినట్లే. అంటే ఆ రెండు దేశాలు నాటోలో చేర్చుకుంటే చూస్తూ ఊరుకోదు. అందుకు వ్యతిరేకంగా తగిన చర్యలు తీసుకుంటుంది. 2008లో నార్త్ ఒస్సేటియా, అబ్ఖాజియా రిపబ్లిక్ లపై (అమెరికా దన్నుతో) జార్జియా దాడి చేసినప్పుడు రష్యా వెంటనే రంగం లోకి దిగి జార్జియా రాజధాని వరకు సైన్యాన్ని నడిపించింది. జార్జియాను రెచ్చగొట్టిన అమెరికా, రష్యా దాడితో గమ్మున ఉండిపోయింది.

2014లో ఉక్రెయిన్ లో నయా-నాజీ మూకలను ప్రవేశపెట్టి కృత్రిమ ఆందోళనలు సృష్టించి యనుకోవిచ్ ప్రభుత్వాన్ని నాటో కూటమి కూలదోసింది. ఆ తర్వాత ఉక్రెయిన్ ను మొదట యూరోపియన్ యూనియన్ లోకి తర్వాత నాటో లోకి చేర్చుకునేందుకు పధక రచన చేసింది. ఈ పధకం పారకుండా చేయటానికి రష్యా పదే పదే పశ్చిమ ఐరోపా దేశాలతో చర్చలు జరిపింది. మిన్స్క్ 1, 2 ఒప్పందాలు చేసుకుంది. ఒప్పందాల అమలుకు జర్మనీ, ఫ్రాన్స్ లు గ్యారంటర్లుగా ఉన్నాయి కూడా. కానీ ఆ ఒప్పందాలను కూడా నాటో బుట్ట దాఖలు చేసేసింది.

మొదట చెప్పినట్లు రష్యా అధ్యక్షుడు పుటిన్ కి నాటో తో ఘర్షణ మరో రెడ్ లైన్. ఎట్టి పరిస్ధితుల్లోనూ నాటో కూటమితో యుద్ధం ఏర్పడే పరిస్ధితులను రష్యా తానుగా కల్పించరాదని పుటిన్/రష్యా స్వయంగా విధించుకున్న రెడ్ లైన్. కానీ ఆ పరిస్ధితిని నాటో కూటమే కల్పిస్తే మాత్రం తాము చేష్టలుడిగి ఉండబోమని పుటిన్ అనేక సార్లు హెచ్చరించాడు. ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో కూడా నాటో అత్యుత్సాహంతో ఉక్రెయిన్ లోకి నాటో సైన్యాన్ని దించితే రష్యా గత్యంతరం లేని పరిస్ధితుల్లో అణు బాంబులు ప్రయోగించేందుకు తయారుగా ఉంటుందని హెచ్చరించాడు.

నాటోతో యుద్ధం జరిగే ప్రమాదాన్ని తెచ్చే చర్యలు రష్యా వైపు నుండి జరగకుండా పుటిన్ జాగ్రత్తలు తీసుకున్న సంగతిని, వాగనర్ ప్రవేటు మిలటరీ కంపెనీ ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. వాగ్నర్ కంపెనీ అధిపతి ఎవ్గనీ ప్రిగోఝిన్ జూన్ 2023లో ఉక్రెయిన్ తో తమ కంపెనీ యుద్ధం చేస్తున్నపుడు రష్యన్ మిలటరీ చాలినన్ని యుద్ధ పరికరాల్ని సఫరఫా చేయలేదని ఆరోపిస్తూ తన ప్రైవేటు సైన్యాన్ని మాస్కో మీదికి నడిపాడు. ఇది సాయుధ తిరుగుబాటుతో సమానం. మాస్కో సమీపానికి వచ్చాక పుటిన్ ప్రిగోఝిన్ తో చర్చలు జరిపి వాగ్నర్ సైన్యాన్ని వెనక్కి తిరిగి వెళ్ళేలా చేశాడు. మాస్కో పైకి వచ్చిన వాగ్నర్ సైనికులు, ప్రిగోఝిన్ లు రష్యా మిత్ర దేశం’ బెలారస్ వెళ్లేందుకు అంగీకరించాడు. మిగిలిన వాగ్నర్ సైన్యాన్ని రష్యన్ మిలటరీలో విలీనం చేశాడు.

అయితే ప్రిగోఝిన్ బెలారస్ లో ఊరకనే ఉండలేదు. పుటిన్ విధించిన షరతును ఉల్లంఘిస్తూ అనేకసార్లు రష్యా వచ్చాడు. బెలారస్ లోని వాగ్నర్ సైనికులు అడపా, దడపా పక్కనే ఉన్న పోలండ్ లోకి వెళ్ళడం తిరిగి బెలారస్ లోకి రావడం చేశాయి. ఒక దశలో పోలండ్ మీదికి సైన్యాన్ని నడపనున్నట్లు ప్రకటించాడు. దానితో పోలండ్ బెలారస్ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేసి పెద్ద ఎత్తున సైన్యాన్ని సరిహద్దు వద్దకి పంపింది. వాగ్నర్ చర్యల వల్ల పోలండ్ తో ఘర్షణ తలెత్తే వాతావారణం ఏర్పడింది. పోలండ్ నాటో సభ్య దేశం. నాటో కూటమి నిబంధనల ప్రకారం కూటమి సభ్య దేశాలలో ఏ ఒక్క దేశం పైనైనా ఇతరులు దాడి చేస్తే అది నాటో కూటమి పైనే దాడి చేసినట్లు పరిగణిస్తారు.

ఇలాంటి పరిస్ధితుల్లో ప్రిగోఝిన్ తో పాటు మరి కొందరు వాగ్నర్ టాప్ కమాండర్లు 23 ఆగస్టు 2023 తేదీన మాస్కో నుండి సెయింట్ పీటర్స్ బర్గ్ కు విమానంలో వస్తుండగా విమానం కొండలు, దట్టమైన అడవులు ఉన్న ప్రాంతంలో కూలిపోయింది. ప్రిగోఝిన్ తో పాటు విమానంలో ఉన్న అందరూ చనిపోయారు. సాంకేతిక లోపంతో విమానం కూలినట్లు రష్యా ప్రకటించింది గానీ, నిజానికి అది ప్రమాదం కాదు. ఉద్దేశపూర్వకంగా జరిగిన కూల్చివేత. మిసైల్ దాడితో రష్యన్ మిలటరీయే విమానాన్ని కూల్చివేసింది. ఈ కూల్చివేతకు పుటిన్ ఆమోదం ఉందన్నది రష్యా ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించని నిజం.

తనకు సన్నిహిత మిత్రుడైన ప్రిగోఝిన్ హత్యకు పుటిన్ ఎందుకు అంగీకరించాడో సిఐఏ వర్గాలే స్వయంగా కొందరు విలేఖరులకు లీక్ చేశాయి. ప్రిగోఝిన్, పోలండ్ తో యుద్ధ పరిస్ధితులు ఏర్పడేలా బెలారస్ లోని తన వాగ్నర్ సైనికులను ప్రేరేపించడం పుటిన్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. బెలారస్ వెళ్లి అక్కడ బెలారస్ జాతీయ సైన్యానికి శిక్షణ ఇవ్వమని తాను పంపితే అది మానేసి పోలండ్ సరిహద్దు వద్ద రెచ్చగొట్టే చర్యలకు దిగడం ద్వారా పుటిన్ స్వయంగా విధించుకున్న రెడ్ లైన్ ను ప్రిగోఝిన్ ఉల్లంఘించాడని, అందుకే తన మిత్రుడు ఐనప్పటికీ దేశ భద్రతకు ప్రమాదం తేవడాన్ని సహించలేక ఆయన హత్యకు ఆమోదం తెలిపాడని సిఐఎ విశ్లేషించింది.

దీనర్ధం ఏమిటి? ఏమిటంటే నాటో తో యుద్ధం తలెత్తే పరిస్ధితిని పుటిన్ లేదా రష్యా తానుగా తీసుకురాదు. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇదే సూత్రాన్ని పుటిన్ దృఢంగా పాటించాడు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, పోలండ్, నార్వే, ఇటలీ తదితర దేశాలు అత్యాధునికమైన ట్యాంకులు, మిసైళ్ళు ఉక్రెయిన్ కి సరఫరా చేస్తున్నప్పటికీ, ఆ దేశాల మిలటరీ సలహాదారులు స్వయంగా ఉక్రెయిన్ లో వేల మంది ప్రవేశించి ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్నప్పటికీ రష్యా సంయమనం పాటిస్తోంది. నిజానికి ఉక్రెయిన్ కు ఆయుధ సరఫరా చేసే దేశాలు తమకు చట్టబద్ధమైన టార్గెట్ అవుతాయని ఆదిలోనే రష్యా హెచ్చరించింది. కానీ ఆ హెచ్చరికను అమలు చేయలేదు. అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలు తమ రెగ్యులర్ సైన్యానికి ప్రైవేటు కాంట్రాక్టు సైనికుల పేరుతో ఉక్రెయిన్ లో దిగి ఉక్రెయిన్ తరపున రష్యా సైన్యంతో తలపడుతున్నాయి. దీనికి కూడా రష్యా సంయమనం పాటించింది.

ఐనప్పటికీ అమెరికా నేతృత్వం లోని పశ్చిమ దేశాలు నిరంతరం రష్యా వ్యతిరేక వార్తలు వండి వారిస్తూ పచ్చి అబద్ధాలను ప్రచారంలో పెడుతున్నాయి. ఒక పక్క లిబియా, ఈజిప్టు, సిరియా, ఇరాక్, సోమాలియా, యెమెన్ మొ.న దేశాలపై నిత్యం డ్రోన్ దాడులు చేస్తూ, ఐసిస్-ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థల ద్వారా ఆ దేశాల్లో కృత్రిమ తిరుగుబాట్లను రెచ్చగొడుతూ ఆ దేశాల ప్రభుత్వాలను కూల్చి తమకు, ప్రయోజనాలకు లొంగుబాటుతో వ్యవహరించే పాలకులకు అధికారం అప్పగించేందుకు నిరంతర కృషి చేస్తున్న అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు మరో పక్క రష్యా, ఇరాన్ లాంటి స్వతంత్ర దేశాలను విలన్లుగా ప్రపంచం ముందు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాయి. అవి ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ వాస్తవాలు గ్లోబల్ సౌత్ దేశాల దృష్టి దాటి పోవడం లేదు. గ్లోబల్ సౌత్ దేశాలు అంతకంతకూ అమెరికా, పశ్చిమ దేశాల శిబిరం నుండి దూరం అవుతూ రష్యా, చైనాలకు దగ్గర అవుతున్నాయి. దానితో అమెరికా, పశ్చిమ ఐరోపాలు మరింత పెట్రేగిపోతున్నాయి.

డెష్పీగెల్ పత్రికను ఉటంకిస్తూ న్యూస్ వీక్ పత్రిక వెల్లడి చేసిన సమాచారం ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో నాటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్ బర్గ్ చేస్తున్న దూకుడు ప్రకటనలను బట్టి, అమెరికా సెనేట్ లోని తీవ్ర మితవాద సభ్యుల ప్రకటనలను బట్టి చూస్తే ఈ సమాచారం వాస్తవం కావటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రపంచాన్ని మరోసారి ప్రపంచ యుద్ధంలోకి నెట్టివేసే నాటో కుయత్నాలను తిప్పికొట్టవలసిన భారం నాటో దేశాల ప్రజలపైన అధికంగా ఉన్నది.

వ్యాఖ్యానించండి