ప్రశ్న: రియల్ జిడిపి, నామినల్ జిడిపిల మధ్య తేడా ఏమిటి?


అంకమ్మ ‘ ‘: సర్, రియల్ జిడిపి, నామినల్ జిడిపిల మధ్య తేడా ఏమిటో చెప్పండి.

జవాబు: మీ పేరు చివర తోకను రాయనందుకు అన్యధా భావించ వద్దు. నిన్న రష్యా ఆర్ధిక వ్యవస్థ గురించి రాసిన టపాలో రియల్, నామినల్ జిడిపి ల గురించి ప్రస్తావించాను. బహుశా అది చదివాక మీకు ఈ ప్రశ్న ఉదయించి ఉంటుంది. ఈ జవాబు పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను.

రియల్ జిడిపి: పేరులోనే ఉన్నట్లు రియల్ జిడిపి ఒక దేశంలో నిర్దిష్ట కాలంలో ఉత్పత్తి అయిన సరుకులు సేవల మొత్తం విలువను వాస్తవంగా ఎంత ఉన్నదో తెలియజేసే సంఖ్య. దీన్ని చూసే ముందు మొదట జిడిపి గురించి క్లుప్తంగా చూస్తే తదుపరి వివరణ అర్ధం చేసుకునేందుకు ఉపయోగంగా ఉంటుంది.

సాధారణంగా ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఒక సంవత్సరం… ఈ నాలుగు కాల పరిమితులను ప్రామాణికంగా తీసుకుంటారు. దీర్ఘ కాలిక విధాన నిర్ణయాలను తీసుకునేందుకు లేదా దీర్ఘ కాలికంగా ఒక దేశపు ఆర్ధిక పనితీరును పరిగణించ వలసిన అవసరం వచ్చినపుడు ఐదు సంవత్సరాలు, పది సంవత్సరాల కాల పరిమితులను కూడా ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.

జిడిపి లెక్కను మరో విధంగా కూడా లెక్కించవచ్చు. నిర్దిష్ట కాలపరిమితిలో ఒక దేశం లోని అందరు వినియోగదారులు వివిధ సరుకులు, సేవల కొనుగోలు కోసం పెట్టే ఖర్చు, ప్రభుత్వ ఖర్చులు, పెట్టుబడులు, మరియు ఎగుమతులు వీటన్నింటి విలువలను కలిపి వాటిలో నుంచి దిగుమతుల విలువను తీసివేస్తే వచ్చే విలువ ఆ దేశ జిడిపి అవుతుంది.

అనగా సైద్ధాంతికంగా, ఒక దేశం సరిహద్దుల లోపల ప్రజలు, సంస్థలు, ప్రభుత్వం పెట్టే ఖర్చుల మొత్తం, ఆ దేశం సరిహద్దుల లోపల ప్రజలు, సంస్థలు, ప్రభుత్వం చేసే ఉత్పత్తుల మొత్తం విలువతో సమానంగా ఉండాలి (పై వివరణలను అన్నింటిని పరిగణన లోకి తీసుకుంటూ). అలా సమానంగా లేకపోతే ఆ లెక్కలో ఎదో లోపం ఉన్నట్లు అర్ధం. సమానంగా ఉన్న ఆ విలువ ఆ దేశ జిడిపి అవుతుంది.

ఖర్చుల కోణం లో నుంచి జిడిపి లెక్కిస్తే అది ఎక్స్^పెండిచర్ అప్రోచ్ అంటారు. ఆదాయం కోణం లోంచి లెక్కిస్తే అది ఇన్^కం అప్రోచ్ అంటారు. ఎటు వైపు నుండి లెక్కించినప్పటికీ ఒకటే సంఖ్య వస్తుంది, రావాలి.

ఇపుడు రియల్ జిడిపి గురించి చూద్దాం. కరెన్సీ విలువలు స్థిరంగా ఉండవు. ద్రవ్యోల్బణం, ప్రతి-ద్రవ్యోల్బణంల వలన అవి మారుతూ ఉంటాయి. మరో విధంగా చెప్పాలంటే సరుకులు, సేవల ధరలు మారుతూ ఉంటాయి. ఈ విధంగా ఎప్పటికప్పుడు మారే కరెన్సీ విలువలతో (ఎప్పటికప్పుడు మారే సరుకులు, సేవల ధరలతో) జిడిపి లెక్కించినపుడు ఒక సంవత్సరం జిడిపిని తదుపరి సంవత్సరం జిడిపితో పోల్చడం ద్వారా లెక్కించే జిడిపి వృద్ధి రేటు, నిర్దిష్ట దేశం యొక్క వాస్తవ వృద్ధి రేటును ప్రతిబింబించదు.

అందుకని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఒక ఆర్ధిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. దానిని బేస్ సంవత్సరం (base year) అంటారు. ఆ బేస్ ఇయర్ లోని సరుకులు, సేవల ధరలను ప్రామాణిక ధరలుగా నిర్ధారిస్తారు.

ఇప్పుడు ఒక సంవత్సరం (లేదా నెల లేదా క్వార్టర్ ఇయర్ లేదా హాఫ్ ఇయర్) లో ఉత్పత్తి అయ్యే సరుకులు, సేవల పరిమాణాలను (క్వాంటిటీలను) నమోదు చేస్తారు. అలా నమోదు చేసిన పరిమాణాలకు, బేస్ ఇయర్ లోని ధరలను ఉపయోగించి వాటి విలువ లెక్కిస్తారు. అలా లెక్కించే మొత్తం ఉత్పత్తుల విలువను రియల్ జిడిపి అంటారు.

అనగా దేశంలో సరుకులు, సేవల ధరలు బేస్ ఇయర్ లోని ధరల వద్ద స్థిరంగా ఉన్నట్లు భావిస్తూ జిడిపిని లెక్కిస్తే అది రియల్ జిడిపి. ఈ లెక్కలో ద్రవ్యోల్బణం, ప్రతి-ద్రవ్యోల్బణంల వలన ధరలు మరియు కరెన్సీ విలువలలో వచ్చే ఎగుడు దిగుడుల ప్రభావం జిడిపి లెక్కలలో నుండి తొలగించబడుతుంది. రియల్ జిడిపి ద్వారా ఒక దేశం యొక్క వాస్తవ ఆర్ధిక పరిస్ధితిని (వాస్తవ జిడిపి వృద్ధి లేదా కుదింపులను) అంచనా వేయటం సాధ్యం అవుతుంది.

ప్రభుత్వాలు తమ పనితీరు భేషుగ్గా ఉందని చెప్పుకునేందుకు బేస్ ఇయర్ ని ముందుకు జరుపుతూ ఉంటాయి. ఆ విధంగా జిడిపి, జిడిపి వృద్ధి రేట్లను కృత్రిమంగా పెంచి చూపిస్తూ ఉంటాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారం లోకి వచ్చిన వెంటనే బేస్ ఇయర్ ను 2005 నుండి 2012 కు ముందుకు జరిపి జిడిపి, జిడిపి వృద్ధి రేటు లెక్కించడం మొదలు పెట్టింది. దానిని మరింత ముందుకు అనగా 2023 కు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఇటీవల తెలియజేసింది. ఇలా బేస్ ఇయర్ ను మార్చేసి తద్వారా వచ్చే జిడిపి లెక్కలను యుపిఏ ప్రభుత్వం లోని జిడిపి లెక్కలతో పోల్చడం ద్వారా బిజెపి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తున్నది.

నామినల్ జిడిపి: ఒక దేశంలో వినియోగం అయ్యే సరుకులు, సేవల విలువ, ప్రభుత్వ ఖర్చులు, పెట్టుబడులు, ఎగుమతులు వీటన్నింటినీ కలిపి ఆ మొత్తం లోనుండి దిగుమతుల విలువను మైనస్ చేస్తే వచ్చే విలువను ఆ దేశ నామినల్ జిడిపి అంటారు. ఇక్కడ తేడా ఏమిటి అంటే ఈ విలువలను అప్పటికి అమలులో ఉన్న ధరలతోనే లెక్కిస్తారు. ద్రవ్యోల్బణం, ప్రతి-ద్రవ్యోల్బణంల ప్రభావాలను తొలగించే పని పెట్టుకోరు.

ద్రవ్యోల్బణం, ప్రతి-ద్రవ్యోల్బణంల ప్రభావాలు, కరెన్సీ విలువలో వచ్చే మార్పుల ప్రభావాలు తొలగించని కారణంగా నామినల్ జిడిపి దేశం యొక్క వాస్తవ ఆర్ధిక పరిస్ధితిని సరిగ్గా ప్రతిబింబించదు. జిడిపి వృద్ధి చెండుతున్నదా లేక కుచించుకు పోతున్నదా అన్న అంశంలో తప్పుడు దృశ్యాన్ని నామినల్ జిడిపి మన ముందు ఉంచుతుంది. నిర్దిష్ట కాలంలో ఆర్ధిక వ్యవస్థ ఎంత మేరకు పెరిగిందీ లేక తరిగిందీ అన్న విషయంలో కూడా నిజమైన పరిస్ధితి వెల్లడి కాదు.

నామినల్ జిడిపిని లెక్కించేందుకు రియల్ జిడిపి లెక్కలో సేకరించే సమాచారాన్నే సేకరిస్తారు. కానీ విలువ కట్టేటప్పుడు బేస్ ఇయర్ ధరలు కాకుండా ప్రస్తుత మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు. కనుక నామినల్ జిడిపి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఉపయోగించే అవకాశం మెండుగా ఉన్నది. నిజానికి రియల్ జిడిపి లెక్కలను ప్రభుత్వాలు ప్రముఖంగా పత్రికలకు విడుదల చేసిన ఉదాహరణలు ఉండవు. రియల్ జిడిపిని తెలియజేసే పత్రాలు అంత తేలికగా ప్రజలకు అందుబాటులో ఉండవు.

అంతెందుకు? ఆర్ధిక సంవత్సరం ఆరంభం లేదా ఫిబ్రవరి నెలలో ప్రకటించే బడ్జెట్ లెక్కలను ప్రముఖంగా ప్రకటిస్తారు గానీ అసలు బడ్జెట్ లో వివిధ పద్దులకు చేసిన కేటాయింపులను ఆయా పద్దుల్లో నిజంగా ఖర్చు పెట్టారా లేదా అన్న సంగతి కూడా వెలుగులోకి రాదు. ఉదాహరణకి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పధకానికి బడ్జెట్ లో చేసిన కేటాయింపులు ఆ సంవత్సరం మధ్య లోనే ఖర్చైపోయేంత తక్కువగా కేటాయింపులు జరుగుతున్నాయి. కూలీలు చేసిన పనికి వేతనాలు చెల్లించేందుకు సదరు పద్దులో ఇక డబ్బు లేని పరిస్ధితిలో అదనపు కేటాయింపులు చేయాల్సిన పరిస్ధితి ప్రతి ఏడాదీ వస్తోంది.

ఉదాహరణకి 2022-23 బడ్జెట్ లో రు 73,000 కోట్లు కేటాయించగా చివరికి రు రు 89,400 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అయినా, 2023-24 ఆర్ధిక సం. బడ్జెట్ లో రు 60,000 కోట్లకు తగ్గించారు. మళ్ళీ వాస్తవ చెల్లింపులు రు 86,000 కోట్లు చేయాల్సి వచ్చింది. 2024-25 సం.కి గాను అదే రు 86,000 కోట్లు కేటాయించి కూలీల జీవితాలను పరహిసించారు. 2020-21లో వాస్తవ చెల్లింపులు రు 111,170 కోట్లు ఉండగా అది 2023-24కి వచ్చేసరికి రు 86,000 పడిపోవటం తీవ్రమైన విషయం అని హక్కుల సంఘాలు ఘోష పెడుతున్నా పట్టించుకునే వారు లేరు.

ఎం.జి.ఎన్.ఆర్.జి.ఎ చట్టం/పధకం ప్రకారం పధకంలో ప్రవేశించే ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని ఇవ్వాలి. కానీ వాస్తవంలో సగటున ఒక్కో కుటుంబానికి 2016-17లో 46, 2017-18లో 46, 2018-19లో 51, 2019-20 లో 48, 2020-21లో 52, 2021-22లో 45, 2022-23లో 42 పని దినాలు మాత్రమే కల్పించారు. పధకం ప్రకారం 100 రోజుల పని కల్పించాలంటే కనీసం 2.72 లక్షల కోట్లు కేటాయించి ఖర్చు పెట్టాలని ఎన్.ఆర్.ఇ.జి.ఎ సంఘర్ష్ మోర్చా లాంటి సంస్థలు 2023-24లో లెక్క కట్టాయి.

ఈ అంకెలను బట్టి ప్రభుత్వాలకు దేశం లోని కోట్లాది దిగువ ఆదాయ వర్గాలకు ఉపాధి కల్పించడంలో ఎంత ఉదాసీనంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అంబాని, అదాని, టాటా లాంటి సూపర్ ధనిక కుటుంబాల రుణాలను లక్షల కోట్ల మేరకు ఒక్క కలం పోటుతో మాఫీ (write-off) చేసే ప్రభుత్వాలు (2022తో ముగిసిన 5 ఏళ్ల కాలంలో బ్యాంకులు రు 10,09,511 కోట్లు రైట్-ఆఫ్ చేసాయి) శ్రమ జీవులకు మాత్రం కాసిని మెతుకులు కూడా విదిలించడం లేదు. కూలీలకు చేసే చెల్లింపులు కోశాగారానికి భారం అవుతున్నాయని మంత్రులు ఎప్పుడూ సణుగుతుంటారు. కార్పోరేట్ల రుణాల రద్దులో మాత్రం ఉత్సాహంగా వ్యవహరిస్తారు.

జిడిపి విషయానికి వస్తే, విధాన నిర్ణేతలు, వ్యాపారాలు, అంతర్జాతీయ సంస్థలు రియల్ జిడిపి లెక్కలకు ప్రాధాన్యత ఇస్తారు. స్వల్ప కాలిక విశ్లేషకులు, నిర్దిష్ట కాంట్రాక్టు ఒప్పందాలలో ఉండే వాళ్ళు దేశాల బడ్జెట్ లను పోల్చి చూసే నిపుణులు నామినల్ జిడిపి లను పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిగణించే అవసరం లేని ఆర్ధిక సూచకాలను పోల్చే వారు కూడా నామినల్ జిడిపి లను ఉపయోగిస్తారు.

వివిధ కాలాలలో ఆర్ధిక వృద్ధి ను పోల్చి చూసేటప్పుడు రియల్ జిడిపి కి ప్రాధాన్యత ఇస్తారు. సాధారణ ధరల స్థాయిలో మార్పులను రియల్ జిడిపి నుండి తొలగిస్తారు కాబట్టి ఈ పోలిక పక్కాగా చేయవచ్చు. ఒక ఆర్ధిక వ్యవస్థ నిజంగా వృద్ధిలో ఉన్నదా లేక సంకోచిస్తున్నదా అన్న సంగతిని రియల్ జిడిపి పట్టిస్తుంది. ఆర్ధిక వ్యవస్థ దీర్ఘ కాలిక ధోరణుల విశ్లేషణకు రియల్ జిడిపి బాగా ఉపకరిస్తుంది. వివిధ దేశాల ఆర్ధిక పనితీరు లను పోల్చేందుకు రియల్ జిడిపి లను చూస్తారు. ఈ అంశంలో నామినల్ జిడిపి లను చూస్తే తప్పుడు నిర్ణయాలకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు, వివిధ పెట్టుబడుల విశ్లేషణకు కూడా రియల్ జిడిపి ఉపకరిస్తుంది.

స్వల్ప కాలిక ఆర్ధిక పనితీరు విశ్లేషణకు నామినల్ జిడిపి ని చూస్తారు. రెవిన్యూ వసూళ్ల ముందస్తు అంచనాలకు, రెవిన్యూ లెక్కింపులకు నామినల్ జిడిపియే ఉపకరిస్తుంది. ఎందుకంటే పన్నులు ప్రస్తుత ధరల ప్రకారమే నిర్ణయిస్తారు కాబట్టి. వివిధ సంస్థలు, ప్రభుత్వాలు, వ్యాపారాలు బడ్జెట్ లను విశ్లేషించేటప్పుడు నామినల్ జిడిపిలను పరిగణిస్తారు, బడ్జెట్ అంచనాలు, ఖర్చులు ప్రస్తుత ధరల లోనే ఉంటాయి కనుక. ఇక మార్కెట్ సెంటిమెంట్ ని ప్రోత్సాహకంగా ఉండేందుకు నామినల్ జిడిపి ఒక మాయా దృశ్యాన్ని ట్రేడర్ల ముందు ఉంచుతుంది. చిన్న చిన్న రిటైల్ ట్రేడర్లు ఈ వలలో పడి మునిగిపోతే మళ్ళీ పైకి తేలడం కష్టంగా మారుతుంది.

ఏ రకం జిడిపిలో నైనా ఉండే అతి పెద్ద లోపం ఏమిటంటే అవి బ్లాక్ మార్కెట్ ను పరిగణనలోకి తీసుకోవు. పశ్చిమ దేశాల్లో, చైనా ఇండియా లాంటి పెద్ద దేశాల్లో బ్లాక్ మార్కెట్ లో చెలామణిలో ఉండే సరుకుల విలువ భారీ మొత్తంలో ఉంటుంది. కనుక ఏ జిడిపి అయినా సంపూర్ణ వాస్తవ పరిస్ధితిని ప్రతిబింబించదు అన్నది కఠిన వాస్తవం. పాలక వర్గాలలో ఉండే ప్రముఖులు, పెద్దలే బ్లాక్ మార్కెట్ ల నిర్వాహకులు అని వేరే చెప్పనవసరం లేదు.

వ్యాఖ్యానించండి