పశ్చిమ ఆంక్షల నడుమ high-income దేశంగా రష్యా!


ఉక్రెయిన్ పై దాడిని సాకుగా చూపిస్తూ రష్యా పైన అమెరికా, ఐరోపా దేశాలు విస్తృతమైన ఆంక్షలు అమలు చేసినప్పటికీ రష్యా ఉన్నత ఆదాయ దేశంగా అవతరించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన జాబితా ద్వారా ఈ సంగతి వెలుగు లోకి వచ్చింది.

నిజానికి రష్యా 2014 వరకు ఉన్నత ఆదాయ దేశమే. మార్చి 2014 లో ఉక్రెయిన్ లో ‘యూరో మైదాన్’ పేరుతో జరిగిన ఆందోళనల నేపధ్యంలో, అప్పటి వరకు జి8 గ్రూపు దేశాల కూటమిలో సభ్య దేశంగా ఉన్న రష్యాను గ్రూపులోని అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలు రష్యాను గ్రూపు నుండి బహిష్కరించాయి.

ఎందుకు బహిష్కరించాయి అంటే, ఉక్రెయిన్ నుండి ఆ దేశం తూర్పున ఉన్న లుగాన్స్క్, డోనెట్స్క్ రాష్ట్రాలు ఉక్రెయిన్ నుండి విడిపోయి స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడుతున్నట్లు ప్రకటించాయి. ఆ రెండు రాష్ట్రాలు విడిపోయేందుకు రష్యాయే కారణమని ఆరోపిస్తూ జి8 గ్రూపు నుండి ఆ దేశాన్ని బహిష్కరించాయి. దొంగే జనంలో కలిసిపోయి “దొంగ! దొంగ!!” అని అరిచినట్లన్న మాట!

యూరో మైదాన్, పశ్చిమ దేశాల కుట్రలు

అసలు ఉక్రెయిన్ లో ఆందోళనలను రెచ్చగొట్టింది అమెరికా, ఐరోపా దేశాలే. అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ యూరోపియన్ యూనియన్ (ఇయు) లో సభ్యత్వం తీసుకోవటాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఉక్రెయిన్ కి అటు రష్యా తోనూ, ఇటు ఐరోపా తోనూ వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇయులో చేరితే రష్యా నుండి దూరం కావలసి ఉంటుంది.

ఉక్రెయిన్ ప్రజలు జాతి, సంస్కృతుల పరంగా రష్యాతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇరు దేశాల ప్రజలు స్లావ్ జాతి వారసులు. తూర్పు ఉక్రెయిన్ లోని ప్రజలు ముఖ్యంగా “డాన్ బాస్” గా పిలిచే లుగాన్స్క్ డోనెట్స్క్ రాష్ట్రాలలో దాదాపు అందరూ రష్యన్లే. పైగా ఇయు కంటే రష్యా తోనే ఎక్కువ వాణిజ్యం జరుగుతోంది. ఇయులో చేరితే రష్యా వాణిజ్యాన్ని వదులుకోవలసి ఉంటుంది. కనుక ఇయు, రష్యాల మధ్య సమాన దూరం పాటించడం మంచిదని యనుకోవిచ్ భావించాడు. అందుకని ఇయులో చేరే విషయమై మరింత చర్చ జరగాలని చెబుతూ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు.

అప్పటికే అమెరికా, ఐరోపా దేశాలు ఉక్రెయిన్ లోని నయా నాజీ శక్తులు స్వోబోడా, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సేనలకు సహకరించిన యుపిఎ, రైట్ సెక్టార్ తదితర సంస్థల సభ్యులకు పక్కనే ఉన్న పోలండ్ లో ట్రైనింగ్ ఇచ్చి సిద్ధంగా ఉంచాయి. ఆందోళనల ద్వారా ప్రభుత్వాన్ని స్తంభింపజేయడం, ప్రజలను పోలీసుల పైకి రెచ్చగొట్టి ఆందోళనలు హింసాత్మకంగా మారేలా చేయడం, స్నైపర్ (దూరం నుండి తుపాకితో కాల్చి చంపే విద్య) ట్రైనింగ్, ఆందోళనకారులను తామే చంపి ఆ నేరాన్ని పోలీసుల మీదకి నెట్టడం మొదలైన చర్యల్లో వారికి శిక్షణ ఇచ్చాయి.

యనుకోవిచ్ ప్రభుత్వం ఇయులో చేరే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే శిక్షణ పొందిన నియో-నాజీ సంస్థలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో మైదాన్ పేరు గల సెంటర్ లో ఆందోళన ప్రారంభించారు. వారి గురించి తెలియని కొందరు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వారితో జత కలిసారు. అమెరికా, ఐరోపాల పధకం ప్రకారం ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు, పోలీసులు పెద్ద సంఖ్యలో చనిపోయారు. మెక్-కెయిన్ లాంటి అమెరికా సెనేటర్లు, ఉప విదేశీ మంత్రి విక్టోరియా నూలంద్ తదితరులు స్వయంగా మైదాన్ కు వచ్చి ఆందోళనకారులకు కుకీలు, చిప్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్ లు సరఫరా చేసి ఆందోళన తీవ్రం చెయ్యమని చెప్పి పోయారు.

ఈ పరిస్ధితుల్లో అధ్యక్షుడు యనుకోవిచ్ మొదట ఖార్కివ్ నగరానికి, ఆ తర్వాత రష్యాకు పారిపోవలసి వచ్చింది. అమెరికా నిత్యం వల్లించే ప్రజాస్వామిక సూత్రాల ప్రకారమే ఎన్నికల్లో గెలిచిన యనుకోవిచ్ ప్రభుత్వం ఆ విధంగా అమెరికా, ఐరోపాలు కుట్ర చేసి కూల్చివేశాయి. వారి లక్ష్యం ఉక్రెయిన్ ను ఇయులో సభ్య దేశంగా చేర్చి ఆ తర్వాత క్రమంగా నాటో మిలటరీ కూటమిలో చేర్చుకోవటం. తద్వారా ఉక్రెయిన్ లోని అరుదైన ఖనిజ వనరులను, సారవంతమైన నల్ల రేగడి భూములను స్వాయత్తం చేసుకోదలిచాయి.

అమెరికా, ఐరోపాల పధకం తెలిసిన వ్లాదిమిర్ పుతిన్ వేగంగా నిర్ణయం తీసుకొని క్రిమియా ద్వీపకల్పం లోకి సైన్యాన్ని నడిపించాడు. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి 90 శాతం పైగా ప్రజల ఆమోదంతో క్రిమియాను రష్యాలో కలుపుకున్నట్లు ప్రకటించాడు. లుగాన్స్క్, డోనెట్స్క్ ప్రజలు కూడా తామే సొంతగా ఫ్లెబిసైట్ జరుపుకుని అత్యధిక మెజారిటీతో తమను కూడా కలుపుకోమని రష్యాను అర్ధించాయి. దానితో అమెరికా, ఐరోపా దేశాలు షాక్ తిన్నాయి. ఉక్రెయిన్ సైన్యాన్ని డాన్ బాస్ ఏరియాపై యుద్ధానికి పంపాయి. రష్యా నుండి ప్రైవేటు మిలటరీ బలగాలు డాన్ బాస్ కు రక్షణగా దిగాయి.

అలా 2014లో మొదలైన ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. 24 ఫిబ్రవరి 2022లో రష్యా అధికారికంగా ఉక్రెయిన్ పై ‘స్పెషల్ మిలటరీ ఆపరేషన్’ ప్రకటించడంతో ఈ యుద్ధం ప్రముఖంగా ప్రపంచ రంగం మీద స్పష్టంగా కనిపించడం మొదలయింది. అందరూ భావిస్తున్నట్లు రష్యా దాడితోనే ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలు కాలేదు. ఉక్రెయిన్ సైన్యం లుగాన్స్క్, డోనెట్స్క్ లపై దాడి చేసినప్పటి నుండే యుద్ధం మొదలయింది. 2014 నుండి ఫిబ్రవరి 2022 వరకు ఉక్రెయిన్ బాంబు దాడుల వలన డాన్ బాస్ లో 14,000 మంది జనం చనిపోయారని ఐరాస అంచనా వేసింది.

ఈ 8 సం.లు డాన్ బాస్ ప్రజలు తమను రష్యాలో కలుపుకోవాలని పలుమార్లు అభ్యర్ధించినా పుతిన్ అంగీకరించలేదు. డాన్ బాస్ ని కలుపుకుంటే నాటో కూటమితో ఘర్షణ తలెత్తుతుందని భావించిన పుతిన్ అందుకు నిరాకరించాడు. దానికి బదులు డాన్ బాస్ పై ఉక్రెయిన్ దాడిని నిలిపేందుకు ఉక్రెయిన్, ఇయులతో చర్చలు జరిపాడు. ఉక్రెయిన్, డాన్ బాస్ ల మధ్య మిన్స్క్ -1, మిన్స్క్-2 ఒప్పందాలు కుదిర్చాడు. ఈ ఒప్పందాలకు జర్మనీ, ఫ్రాన్స్ లు హామీదారులుగా ఉన్నాయి. ఒప్పందాలను ఉక్రెయిన్ ఉల్లంఘించడం, చివరికి తమ భద్రత ప్రమాదంలో పడిన నేపధ్యంలో రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రకటించడం… ఈ అంశాల గురించి వివిధ సందర్భాల్లో ఈ బ్లాగ్ లోనే వివరించడం జరిగింది.

మళ్ళీ వరల్డ్ బ్యాంక్ నివేదికకు వద్దాం. ఇప్పటి వరకు ఎగువ మధ్య ఆదాయ దేశం (అప్పర్-మిడిల్ ఇంకం) గా ఉన్న రష్యా 2024 నుండి ఉన్నత ఆదాయ (high-income) దేశంగా అవతరించిందని సదరు నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం రష్యా వాణిజ్య వృద్ధి రేటు +6.8 శాతంగా నమోదు కాగా ఫైనాన్షియల్ రంగం +8.7 శాతం వృద్ధి నమోదు చేసింది. నిర్మాణ రంగం +6.6 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఫలితంగా రష్యా రియల్ జిడిపి 3.6 శాతం, నామినల్ జిడిపి 10.9 శాతంగా నమోదయింది.

అయితే రష్యా వృద్ధి ఏంతో కాలం మనజాలదని యుద్ధ ఆర్ధిక వ్యవస్థ వలన ఈ స్థాయి వృద్ధి నమోదు కావటమే అందుకు కారణం అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక కొందరు నిపుణులను ఉటంకిస్తూ చెపుతోంది. “2023లో మిలటరీ సంబంధిత కార్యకలాపాలు భారీగా పెరగడం వలన అది జిడిపి వృద్ధి రేటును ప్రభావితం చేసింది” అని వరల్డ్ బ్యాంక్ నివేదిక కూడా సన్నాయి నొక్కులు నొక్కింది. బహుశా ఈ విషయం కొంత వరకు వాస్తవమే కావచ్చు. కానీ అమెరికా, ఐరోపాలు రష్యా చమురు, గ్యాస్ లతో పాటు అనేక ఇతర సరుకుల వాణిజ్యంపై విధించిన ఆంక్షలు లేనట్లయితే రష్యా వృద్ధి ఎలా ఉండేది అన్న అంశాన్ని అది చర్చించలేదు.

“రష్యా ఆర్ధిక వ్యవస్థ ఓవర్ హీటింగ్ కి గురవుతున్న సూచనలు కొన్ని కనిపిస్తున్నాయి” అని ఐ.ఎం.ఎఫ్ వ్యాఖ్యానించింది. అంటే రష్యన్ మార్కెట్ అవసరాలకు మించి ఉత్పత్తి జరుగుతోందని అర్ధం. ఇంకాస్త వివరంగా చెప్పుకుంటే జిడిపి వృద్ధి రేటు నిలకడగా కొనసాగలేనంత ఎక్కువగా ఉన్నదని ఐఎంఎఫ్ చెబుతోంది. విదేశాల నుండి ఆర్ధిక పరమైన షాక్ లు ఎదురు కావటం, అసెట్ బబుల్స్ (వివిధ రకాల ఆస్తుల విలువ వాస్తవ ధర కంటే అధికంగా పలకడం. ఇది జరిగినప్పుడు అసెట్ బబుల్ ఎప్పటికైనా హఠాత్తుగా పేలిపోయే అవకాశం ఉంటుంది) ఏర్పడటం… లాంటివి జరిగినప్పుడు ఆర్ధిక వ్యవస్థ ఓవర్ హీట్ అయిందని చెబుతారు.

అసలు దేశాలను వివిధ ఆర్ధిక తరగతుల కింద ఏ ప్రాతిపదికన వర్గీకరిస్తారు అన్నది తెలుసుకోవాల్సిన సంగతి. ప్రపంచ బ్యాంకు, తలసరి గ్రాస్ నేషనల్ ఇన్కం (జిఎన్ఐ) ప్రాతిపదికన ఈ వర్గీకరణ చేస్తుంది. దిగువ తరగతి (low), దిగువ-మధ్య తరగతి (lower-middle), ఎగువ-మధ్య తరగతి (upper-middle), ఎగువ తరగతి (high) అని నాలుగు తరగతులుగా వరల్డ్ బ్యాంక్ దేశాలను వర్గీకరిస్తుంది.

అట్లాస్ జిఎన్ఐ పధ్ధతి ప్రకారం ప్రతి ఏటా జులై 1 తేదీన వర్గీకరణ ప్రమాణాలను ప్రపంచ బ్యాంకు నిర్ణయిస్తుంది. గడచిన మూడు సంవత్సరాల పాటు ఆయా దేశాల జిఎన్ఐ కదలికలను మృదువు కావించి ఆయా దేశాల కరెన్సీల నుండి అమరికన్ డాలర్లలోకి మార్చి ప్రమాణాలను బ్యాంకు నిర్ణయిస్తుంది. 2024-2025 సంవత్సరంలో సవరించిన ప్రమాణాల ప్రకారం ఎగువ తరగతిగా పరిగణించాలంటే తలసరి స్థూల జాతీయ ఆదాయం 14,005 డాలర్లకు మించి ఉండాలి. తలసరి జిఎన్ఐ $4,516 నుండి $14,005 వరకు ఉన్న దేశాలు ఎగువ-మధ్య తరగతి కిందికి వస్తాయి. $1,146 నుండి $4,515 వరకు ఉన్న దేశాలు దిగువ-మధ్య తరగతి కిందకు, $1,146 గానీ అంతకు తక్కువ గానీ ఉన్న దేశాలు దిగువ ఆదాయ తరగతి కిందకు వస్తాయి.

భారత దేశం

వరల్డ్ బ్యాంక్ ప్రకారం భారత దేశం తలసరి వార్షిక స్థూల జాతీయ ఆదాయం కేవలం $2,540 డాలర్లు. ఇది దాదాపు రు 2,10,820 లకు సమానం. అంటే ఇండియాలో పౌరుడు నెలకు రు 17,568/- సంపాదిస్తున్నాడు. ఈ సంఖ్యలోని కిటుకు ఏమిటి అంటే అందులో అంబాని, అదాని, టాటా, అజీం ప్రేం జీ, నారాయణ మూర్తి తదితర సూపర్ రిచ్ కార్పోరేట్ కంపెనీల యజమానుల ఆదాయం కూడా ‘తలసరి’ లెక్కలో కలిసి ఉంటుంది. ఉదాహరణకి నెలకు 7 వేల నుండి 17 వేల వరకు సంపాదించే వారి ఆదాయంలో సగటు విభజన లెక్కలో సూపర్ ధనికుల ఆదాయం వచ్చి కలిసి రు 17,568 కు పెరిగి వారి ఆదాయం కూడా అంతే వస్తున్నట్లుగా భావించబడుతుంది. సగటు/తలసరి లెక్కలు చేసే మాయాజాలం ఇది. టౌన్ సెంటర్ లో అడుక్కు తినేవారు కూడా రు 17,568 సంపాదిస్తున్నట్లే పరిగణించబడతారు.

అనేక ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో సబ్ స్టాఫ్/ ప్యూన్ ఉద్యోగాల నియామకాలను రద్దు చేసి వారికి రోజువారీ కూలి చెల్లిస్తున్నారు. (అంటే ప్రభుత్వ కంపెనీలే కనీస వేతన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి.) వారి రోజు వారీ కూలి ప్రస్తుతం 550 రూపాయలు. సెలవు దినాల్లో ఆ కూలీ వారికి దక్కదు. సెలవు పెట్టిన రోజు కూడా వేతనం ఇవ్వరు. ఆదివారం, పండగ సెలవులు తీసేస్తే ప్రభుత్వ ఆఫీసులు, కంపెనీల సబ్ స్టాఫ్ నెలకు 25 రోజులు పని దొరికితే ఎక్కువే. కనుక వారి నెల వేతనం రు 13,750/-. ఎల్.ఐ.సి లాంటి కంపెనీల్లో వారానికి 5 రోజులే పని. వారి నెల వేతనం అయితే నెలకు గరిష్టంగా 22 పని దినాల చొప్పున రు. 12,100/-. అనేక మంది గ్రాడ్యుయేట్లు ఇలా రోజు కూలీకి ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేస్తున్నారు. బెల్దారి కూలీ రు 700 వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మన దేశంలో గ్రాడ్యుయేట్ల కంటే చదువు లేని బేల్దారీ కూలీలే ఎక్కువ సంపాదిస్తున్నారు.

భారత దేశ ప్రజల పరిస్ధితి ఇలా ఉంటే ప్రధాని మోడీ గారు పదే పదే “ప్రపంచం లోనే అత్యధిక వేగంగా వృద్ధి చెందుతున్న దేశం. 5 ట్రిలియన్ డాలర్ల జిడిపి త్వరలోనే సాధించనున్న దేశం” అని గొప్పలు చెప్పుకుంటూ విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నాడు; భారత జనాన్ని ఉబ్బించే ప్రయత్నం చేస్తున్నాడు. వాజ్ పేయి ప్రభుత్వం “దేశం వెలిగి పోతోంది” అని చెప్పుకుంటే మోడీ ప్రభుత్వం “వేగంగా వృద్ధి చెందుతున్న దేశం” అని చెప్పుకుంటున్నాడు. బిజేఫై నేతలు, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ జిడిపి లెక్కలు, మరో పదేళ్ళలో సాధించే లక్ష్యాలు, వందేళ్ళ స్వతంత్రం (2047 సం.) నాటికి సాధించే లక్ష్యాలు… ఇలా సుదూర లెక్కలు వేయటమే గానీ ఇప్పుడు, ప్రస్తుతం దేశంలో సగటు జీవి, సగటు గ్రాడ్యుయేట్, సగటు కూలీ, సగటు రైతు, భూమి లేని పేద రైతు… ఇలాంటి వారి పరిస్ధితి ఏమిటో చెప్పిన ఉదాహరణ ఎన్నడూ లేదు. ఐదేళ్ళు, పదేళ్ళు, పాతికేళ్ళు ఇలా విజన్ లు ప్రకటిస్తే… ప్రజలకు ఏమిటి లాభం? అప్పటికి రాజెవడు? బంటు ఎవడు? ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత నుండి తేలికగా తప్పించుకునే లెక్కలే ఇవి తప్ప ప్రజోద్ధారణ కోసం ఉద్దేశించినవి కానే కావు.

రష్యా ఎలా సాధించింది?

అంత్యంత కఠిన ఆంక్షలు విధించినా సరే రష్యా తలసరి జిఎన్ఐ ఎలా వృద్ధి చెందింది? ఈ ప్రశ్నకు సమాధానాలు చెప్పుకోవాలి. ఆంక్షలు ప్రకటించడం, ఐరోపాకు గ్యాస్ సరఫరా చేసేందుకు నిర్మించిన నార్డ్ స్ట్రీం 1 మరియు 2 లను అమెరికా పేల్చివేయడంతో రష్యా అధ్యక్షుడు ఇక పశ్చిమ దేశాలపై నమ్మకం కోల్పోయాడు. గ్లోబల్ సౌత్ దేశాల వైపు దృష్టి సారించాడు. ముఖ్యంగా బ్రిక్స్ సభ్య దేశాలు చైనా, ఇండియాలు రష్యా వృద్ధిలో ఇతోధికంగా తోడ్పడ్డాయి. ఈ రెండు దేశాల లక్ష్యం రష్యాను ఉద్ధరించడం కాదు సుమా! కేవలం వచ్చిన అవకాశాన్ని అవి సద్వినియోగం చేసుకున్నయంతే.

రష్యా నుండి చమురు, గ్యాస్ దిగుమతులను చైనా బాగా పెంచేసింది. చైనా కూడా పశ్చిమ దేశాల నుండి ముఖ్యంగా అమెరికా నుండి ఆంక్షలు ఎదుర్కొంటోంది. దానితో చైనా రష్యాతో వాణిజ్య సంబంధాలు బాగా పెంచుకుంది. రూబుల్స్, యువాన్ కరెన్సీలలో వాణిజ్య చెల్లింపులు చేసుకోవడం ద్వారా డాలర్ కు మెల్లగా చెక్ పెట్టే పనిలో కూడా చైనా, రష్యాలు ఉన్నాయి. పవర్ ఆఫ్ సైబీరియా పైప్ లైన్ ద్వారా రష్యా చైనాకు గ్యాస్ సరఫరా చేస్తున్నది. ఈ పైప్ లైన్ కు సమాంతరంగా ఇంకొక పైప్ లైన్ నూ, మంగోలియా మీదుగా మరో పైప్ లైన్ నూ రష్యా నిర్మిస్తోంది. ఇవి 2027 నాటికి పూర్తి అవుతాయని అంచనా.

2022 లోనే రష్యా నుండి పైప్ లైన్ గ్యాస్ మరియు ఎల్.ఎం.జి లు వరుసగా 2.6 రెట్లు, 2.4 రెట్లు మేరకు ఎగుమతులు పెరిగాయి. డాలర్లలో ఈ ఎగుమతి వరుసగా $3.98 బిలియన్లు, $6.75 బిలియన్లకు పెరిగింది. పైన చెప్పినట్లు అదనంగా రెండు పైప్ లైన్లు పూర్తయితే ఏడాదికి 100 బిలియన్ క్యూబిక్ మీటర్లకు గ్యాస్ ఎగుమతి జరుగుతుందని రష్యా ఇటీవల తెలిపింది.

ఇండియా అయితే రాయితీ ధరలకు చైనా నుండి గ్యాస్, చమురు దిగుమతి చేసుకుని వాటిని శుద్ధి చేసి తిరిగి ఐరోపా దేశాలకు గ్లోబల్ ధరకు అమ్మకం చేస్తున్నది. ఈ మారు బేరం ద్వారా భారత ప్రభుత్వం లక్షల కోట్లు మిగుల్చుకుంటున్నప్పటికీ ఆ తగ్గుదలను ప్రజల దాకా రానివ్వకుండా ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించేందుకు వినియోగిస్తున్నది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు ఆ పెరిగిన ధరలను ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేసిన మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ధరలు తగ్గినపుడు మాత్రం ఆ తగ్గుదల ప్రజలకు చేరనివ్వడం లేదు.

అలాగే ఇండియా రాయితీ ధరలకు రష్యా నుండి బొగ్గు కూడా దిగుమతి చేసుకుంటోంది. 2022లో రష్యా నుండి ఇండియాకు బొగ్గు దిగుమతులు 15 శాతం పెరిగాయి. మరో పక్క రష్యా చవక చమురు, గ్యాస్ లను టర్కీ కూడా పెంచి దిగుమతి చేసుకుంటోంది. పశ్చిమ దేశాల ఆంక్షలను మొద్దుబారుస్తూ షాడో ఆయిల్ ట్యాంకర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇందుకోసం 600కు పైగా పాత చమురు రవాణా ట్యాంకర్లను రష్యా సమకూర్చుకుని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలను గ్లోబల్ సౌత్ దేశాలు ఎంత మాత్రం ఖాతరు చేయకపోవడంతో రష్యా చమురు, గ్యాస్, గోధుమ, బొగ్గు తదితర సరుకుల వాణిజ్యంకు నష్టం కలగటం అటుంచి సరికొత్త మార్కెట్ల వైపు దృష్టి సారించే అవకాశాన్ని రష్యా చేజిక్కించుకుంది.

రష్యాలో కార్పోరెట్ల పెట్టుబడులు వృద్ధి చెందడం కూడా రష్యా తలసరి జిఎన్ఐ వృద్ధికి తోడ్పడింది. డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాలలో కార్పోరేట్ పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో దానివలన జిడిపి వృద్ధిలో 4.5% పాయింట్లు కలిసినట్లు తెలుస్తోంది. గతంలో అమెరికా, ఐరోపాల నుండి దిగుమతి చేసుకున్న యంత్రాలు, ఎలక్ట్రానిక్ తదితర సరుకులను దేశీయంగా తయారు చేసుకోవడం ద్వారా ఆంక్షలను తిప్పి కొట్ట గలిగింది. ఫలితంగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన మరియు అభివృద్ధి రంగాలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయి.

రష్యాలో ప్రైవేటు రంగం వినియోగం బలంగా వృద్ధి చెందింది. ఈ అంశం జిడిపి వృద్ధిలో 2.9% పాయింట్లు కలిసేందుకు దోహదం చేసింది. దేశీయంగా రుణ వితరణ పెరిగి డిమాండ్ పెరిగేందుకు దారితీసింది. నిరుద్యోగం రికార్డు స్థాయిలో కేవలం 3 శాతానికి పడిపోయింది. వాలంటరీ మిలటరీ రిక్రూట్మెంట్ల ద్వారా లభించిన ప్రోత్సాహకాలతో ప్రజా వినియోగం వృద్ధి చెందింది. ఇక యుద్ధ పరికరాల ఉత్పత్తి అనేక రెట్లు పెరగడం తెలిసిన విషయమే. ఉక్రెయిన్ యుద్ధం ద్వారా జిడిపి వృద్ధిలో 7% పాయింట్లు తోడయ్యాయి.

అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ ప్రారంభానికి ముందే యుద్ధం వలన రష్యన్ చమురు ధర బ్యారెల్ కు 40 డాలర్లకు పడిపోతుందన్న అంచనా వేసి అందుకు తగినట్లుగా ఆర్ధిక వ్యవస్థలో మార్పులు, సవరణలు చేసుకుని ఆ తర్వాతనే యుద్ధాన్ని ప్రారంభించాడు. తీరా యుద్ధం మొదలయ్యాక అమెరికా, ఐరోపా దేశాలే రష్యన్ చమురు బ్యారెల్ కు 60 డాలర్లకు మించరాదని ఆంక్ష విధించాయి. అంటే పుతిన్ వేసుకున్న అంచనా కంటే ఆంక్షల ధర 20 డాలర్లు ఎక్కువ ఉండడంతో రష్యా ఇంధన ఎగుమతుల ఆదాయం తగ్గకపోగా నిలకడగా కొనసాగింది.

యుద్ధం మొదలయ్యాక రష్యన్ సెంట్రల్ బ్యాంకు రెపో రేటును 7.5% నుండి ఏక్ దం 16.5% కి పెంచడం ద్వారా ఆంక్షల షాక్ కు ముందుగానే ఒక కుషన్ ను సెంట్రల్ బ్యాంకు ఏర్పాటు చేసుకుంది. అయితే ఉక్రెయిన్ యుద్ధం కొనసాగే కొద్దీ రష్యన్ ఆర్ధిక వ్యవస్థ ప్రతికూల పరిణామాలకు గురి కాక తప్పదు. 1980ల నాటి ఆఫ్ఘన్ యుద్ధంతో రష్యన్ ఆర్ధిక వ్యవస్థ కుదేలై చివరికి దేశంలో సోషలిజం ఉందన్న నటనను కూడా మానుకుని పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థను బహిరంగంగానే కౌగిలించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి సేనలను ఉపసంకరించుకున్నప్పటికీ సదరు భారం రష్యాను సోషలిజం నటన నుండి బైటికి నెట్టివేసింది. కనుక ఉక్రెయిన్ యుద్ధం నుండి ఎంత త్వరగా బైటపడితే రష్యన్ ప్రజలకు అంత మంచిది.’

అయితే రష్యా అంతర్జాతీయంగా నాటో నుండి ఎదుర్కోనున్న యుద్ధ ప్రమాదం దృష్ట్యా ఉక్రెయిన్ ను నాటో ఉడుం పట్టునుండి తప్పించకుండా ఉక్రెయిన్ యుద్ధం నుండి విరమించుకోలేని భద్రతా ప్రమాద పరిస్ధితిని రష్యా ఎదుర్కొంటోంది. ముందు గొయ్యి, వెనుక గొయ్యి లాంటి ఇరకాటంలో ఉన్న రష్యా అందు నుండి ఎలా బైట పడుతుందో వేచి చూడాలి.

One thought on “పశ్చిమ ఆంక్షల నడుమ high-income దేశంగా రష్యా!

  1. అద్భుతంగా విశ్లేషణ చేసారు, చాల కాలంగా ఇలాంటి న్యూస్ ఛానెల్ కోసం చూస్తున్నాను. ధన్యవాదాలు

వ్యాఖ్యానించండి