ఇండియన్ ట్విట్టర్ ‘కూ’ మూసివేత!


ట్విట్టర్, ఇపుడు ఎక్స్, కు భారతీయ పోటీగా ప్రస్తుతించ బడిన భారతీయ మైక్రో బ్లాగింగ్ కంపెనీ ‘కూ’ ను మూసి వేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు ప్రకటించారు. కూ అభివృద్ధికి అవసరమైన నిధులను సంపాదించడం కష్టంగా మారడంతో సంస్థను మూసివేయక తప్పడం లేదని వారు ప్రకటించారు.

“కూ యాప్ ను కొనసాగించడం మాకు ఇష్టమే అయినప్పటికీ టెక్నాలజీ సేవలను నిర్వహించేందుకు అయే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నందున ఈ కష్టమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు” అని కూ కంపెనీ సహా వ్యవస్థాపకుడు మయాంక్ బిడావత్కా జులై ౩ తేదీన ప్రకటించాడు.

భారతీయ స్టార్టప్ కంపెనీలకు అత్యధిక ప్రోత్సాహం కల్పిస్తున్నామనీ, ప్రపంచ దిగ్గజ సోషల్ మీడియా కంపెనీలతో పోటీ పడే భారతీయ కంపెనీలు ఉద్భవించి అభివృద్ధి కావాలనీ అనేక మార్లు ఉపన్యాసాలు దంచి అందుకోసం 3,000 కోట్ల రూపాయలు కేటాయించాం అనీ బీరాలు పలికిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పరిణామానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది.

ఆయా దేశాల ప్రభుత్వాల సహాయం, ప్రోత్సాహం లేకుండా అమెజాన్, గూగుల్, ఫేస్ బుక్, వాట్సప్ లాంటి అమెరికా టెక్ కంపెనీలు గానీ, ఆలీబాబా, షామి, వన్ ప్లస్, టిక్ టాక్ లాంటి చైనీయ టెక్ కంపెనీలు గానీ, స్యామ్సంగ్ లాంటి కొరియా కంపెనీలు గానీ అభివృద్ధి చెందలేదు. సరిగ్గా చెప్పాలంటే ఆయా ప్రభుత్వాలు అనుసరించే క్రోనీ కేపిటలిజం ద్వారానే వివిధ కంపెనీల అసామాన్య అభివృద్ధి సాధ్యం అవుతుంది. క్రోనీ మద్దతు కాకపోయినా కనీసం స్వదేశీ కంపెనీ అన్న సెంటిమెంటుతో కూడా మద్దతు, ప్రోత్సాహం భారత ప్రభుత్వం నుండి కూ సంస్థకు అందలేదని సంస్థ మూసివేత ద్వారా అర్ధం అవుతున్నది.

నిజానికి ట్విట్టర్ కంపెనీకి, భారత ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతున్న సమయంలో ఫెబ్రవరి 2021 లో కూ యాప్ ని స్థాపించారు. స్థాపించిందే తడవుగా పలువురు బిజేపి నాయకులు, మంత్రులు ట్విట్టర్ నుండి కూ కు తరలిపోయారు.

ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, వార్తలు ట్వీట్ చేస్తున్న ట్విట్టర్ ఖాతాలను రద్దు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్విట్టర్ కంపెనీని కోరగా ఆ కంపెనీ అందుకు నిరాకరించింది. అలాగే బిజేపి అధికార ప్రతినిధి (సంబిట్ పాత్ర) చేసిన ఒక వీడియో ట్వీట్ ని ‘మేనిపులేటేడ్ మీడియా’ గా ట్యాగ్ తగిలించింది. భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించే కంపెనీ కనుక తమ ఖాతాదారుల ఖాతాలు రద్దు చేయలేమని చెప్పింది. తమ టి&సి ప్రకారమే బిజేపి నేత వీడియోను మార్ఫ్ చేసిన వీడియోగా ట్యాగ్ తగిలించామని తెలిపింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖాతాలను రద్దు చేయబోమని చెప్పినప్పటికీ అనేక ట్విట్టర్ ఖాతాలను ఆ కంపెనీ రద్దు చేసింది కూడా. తాము ఇచ్చిన జాబితాలోని అన్ని ఖాతాలను రద్దు చేయనందుకు మోడీ ప్రభుత్వం ఆగ్రహించింది. ముఖ్యంగా తమ నాయకుడి ట్వీట్ ని ట్యాగ్ తగిలించడం పట్ల అగ్గి మీద గుగ్గిలం అయింది. ఈ నేపధ్యం లోనే అనేక మంది బిజేపి మంత్రులు, నాయకులు కూ కంపెనీలో ఖాతాలు తెరిచారు.

తమ ఆదేశాల మేరకు రద్దు చేయకుంటే కంపెనీ ఇండియా అధికారి పైన కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తామని బెదిరించింది. ఆ మేరకు డిల్లీ పోలీసులు డిల్లీ, గురుగ్రాం లలోని ట్విట్టర్ ఆఫీసులని మే 2021లో సందర్శించి కలకలం రేపారు. ముఖ్యంగా టెర్రరిజం నిరోధక సెల్ కు చెందిన పోలీసులు ట్విట్టర్ ఆఫీస్ కి వెళ్ళడం అనేక ప్రశ్నలు రేకెత్తించింది. కానీ అప్పటికీ ట్విట్టర్ ఆఫీసులు ఖాళీ అయ్యాయి. అక్కడ సిబ్బంది ఎవరూ లేరు. చేసేది లేక పోలీసులు వెనుదిరిగారు.

సంబిట్ పాత్ర ఫేక్ వీడియోలు, బొమ్మలు తయారు చేసి (లేదా చేయించి) ట్వీట్ చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు. జే.ఎన్.యు విద్యార్ధి నేతల ప్రసంగాలు, నినాదాల వీడియోలపై వివాదాస్పద నినాదాలను సూపర్ ఇంపోజ్ చేసి వాటిని అసలు వీడియోలుగా వార్తా చానళ్ళ చుట్టూ తిరిగి ప్రచారం చేసిన ఘనుడు ఈ సంబిత్ పాత్ర.

ఈ సారి ఆయన కరోనా వైరస్ అంతానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విఫలం చేసేందుకు కాంగ్రెస్ ఒక ‘టూల్ కిట్’ తయారు చేసి అమలు చేస్తున్నదని ట్వీట్ చేశాడు. ఇది శుద్ధ అబద్ధం అనీ, ఫేక్ అనీ.., ఆల్ట్ న్యూస్ సంస్థ రుజువు చేసింది. ఐనప్పటికీ పోలీసులు ట్విట్టర్ ఆఫీసులపై దాడికి వెళ్ళారు. “ఏ సమాచారం బట్టి పాత్ర ట్వీట్ ని ‘మేనిపులేటెడ్’ గా ముద్ర వేశారో ఆ వివరాలు మాకు కావాలి” అందుకే ట్విట్టర్ ఆఫీసులకి వెళ్లాం” అని పోలీసులు పత్రికలకు చెప్పారు.

ఈ పరిస్ధితుల్లో కూ యాప్ ని ప్రకటించడంతో బిజేపి నేతలు మంచి జోష్ తో కూ యాప్ లో ఖాతాలు తెరిచారు. అమెరికన్ ట్విట్టర్ కు సమాధానమే మా ‘కూ’ అని అట్టహాసంగా ప్రకటించారు. దానితో కూ కంపెనీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని అంతా భావించారు. ఆగస్టు 2021 నాటికి కూ డౌన్ లోడ్ల సంఖ్య 10 మిలియన్లకు చేరింది. మరో సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాదా కృష్ణన్ ఆ ఉత్సాహంతో కంపెనీ 1 బిలియన్ డౌన్ లోడ్ లకు చేరుకునే సత్తా ఉందని ప్రకటించాడు.

ఆరంభంలో కంపెనీ $275 మిలియన్ల వాల్యుయేషన్ తో $65.7 మిలియన్ల ఫండింగ్ (ఋణం) సేకరించింది. Accel (అమెరికా), టైగర్ గ్లోబల్ (అమెరికా), Mirae Asset (సౌత్ కొరియా), కలారి క్యాపిటల్ (ఇండియా), 3one4 క్యాపిటల్ (ఇండియా) కంపెనీలు ఈ ఋణం ద్వారా మదుపు చేశాయి. కానీ ప్రభుత్వం నుండి మాత్రం సాయం అందలేదు.

నానాటికి సబ్ స్క్రైబర్ ల సంఖ్య తగ్గిపోవడంతో కంపెనీ భాగస్వాముల కోసం వెతుకులాట మొదలు పెట్టింది. తమకు నిధులు ఎవరూ ఇవ్వడం లేదని సెప్టెంబర్ 2023లో మయాంక్ ప్రకటించాడు. షేర్ ఛాట్, ఇన్ షార్ట్స్ యాప్ కంపెనీలతో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నట్లు చెప్పాడు. కానీ అవి ఓ కొలిక్కి రాలేదు.

2024 లో డెయిలీ హంట్ యాప్ కంపెనీతో చర్చలు జరిపారు. చర్చలు జరుగుతుండగానే భాగస్వామ్య ఒప్పందం కుదిరితే తప్ప తాము సిబ్బందికి ఇక వేతనాలు చెల్లించలేని స్థితికి చేరామని ఏప్రిల్ 25 తేదీన ప్రకటించారు. డెయిలీ హంట్ తో ఒప్పందం కుదరక పోవటంతో కంపెనీని మూసివేస్తునట్లు వ్యవస్థాపకులు ప్రకటించారు.

టిక్ టాక్ యాప్ ని ఇండియా నుండి గెంటివేయటం, ట్విట్టర్ కీ, భారత ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరిన పరిస్ధితులు ఆరంభంలో కూ యాప్ కు అనుకూలించాయి. అయితే ఇల్లలకగానే పండగ కాదు అన్నట్లు ఆరంభంలో అంది వచ్చిన ప్రోత్సాహం ఆ తర్వాత కొనసాగలేదు. కొనసాగే పరిస్ధితులు లేకుండా అమెరికా ప్రభుత్వంలో పెద్దలు తెరవెనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

అమెరికన్ వాల్ స్ట్రీట్ ఫైనాన్స్ కంపెనీల మద్దతు లేకుండా ఇతర దేశాల్లో స్టార్టప్ కంపెనీలు స్వతంత్రంగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. అది సాధ్యం కావాలంటే మొదట భారత ప్రభుత్వ నేతలకు స్వతంత్రంగా ఆర్ధిక అభివృద్ధి సాధించాలన్న బలమైన కాంక్ష తప్పనిసరిగా ఉండాలి. ఆ కాంక్ష ఉన్న ప్రభుత్వాలు దేశంలో పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) రంగాలలో ఇతోధికంగా పెట్టుబడి పెట్టి స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (MSME – Micro, Small, Medium Enterprises) కంపెనీల అభివృద్ధికి సహకరించాలి. నిధుల లేమి అన్నది వాటికి సమస్య కాకుండా చూడాలి.

ఈ క్రమంలో అమెరికా, ఐరోపా మాన్యుఫాక్చరింగ్ మరియు ఫైనాన్స్ కంపెనీల నుండి విపరీతమైన ఒత్తిడి వస్తుంది. దేశీయ ఆర్ & డి లో పెట్టుబడులు పెట్టొద్దని ప్రభుత్వాన్ని శాసిస్తాయి. టెక్నాలజీ మేమే అందిస్తాం అని ఆశ చూపిస్తాయి (కానీ ఎప్పటికీ టెక్నాలజీ సాయం అందదు). ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపులలో స్థానిక సైన్స్, టెక్నాలజీ రంగాలకు భాగం లేకుండా చూస్తాయి. ప్రభుత్వం ధైర్యం చేసి స్థానిక కంపెనీల అభివృద్ధికి పూనుకుని, బడ్జెట్ కేటాయింపులు చేస్తే కొరడా ఝళిపిస్తాయి. ఇండియాలో మానవ హక్కులు లేవు అని ప్రచారానికి దిగుతారు. మత స్వేచ్ఛ లేదు అని గగ్గోలు పెడతాయి. (వారి మాట విని సహకరిస్తే ఇవేవీ ఉండవు). ఈ సమస్యలను చూపిస్తూ ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు అమలు చేస్తాయి. రష్యా, చైనాల వలే అమెరికా బెదిరింపులకు నిలబడి ఎదురు నిలిచే ధైర్యం భారతీయ పాలకులకు ఎన్నడూ లేదు (ఇందులో ఏ పార్టీ అయినా ఒకటే).

కూ కంపెనీ అభివృద్ధి చెందకుండా ఆటంకాలు ఏర్పరచడంలో పశ్చిమ ఫైనాన్స్ కంపెనీలు, సోషల్ మీడియా దిగ్గజాలు అంతర్గతంగా, అజ్ఞాతంగా ఎంత కృషి చేశాయో మనకు తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. ఎక్కడికక్కడ అమెరికా, ఐరోపా దేశాల వేగులు నిండి ఉన్న దృష్ట్యా ఈ వివరాలు ఎప్పటికీ బైటికి రావు. ఎప్పుడో బ్రాడ్లీ మ్యానింగ్, జులియన్ అసాంజే, ఎడ్వర్డ్ స్నోడెన్ లాంటి వారి బహిర్గత పరిస్తే తప్ప అమెరికా ఫైనాన్స్ కంపెనీల అరాచకాలు తెలియదు.

కూ కంపెనీ చేతులు ఎత్తేసి కంపెనీ మొత్తాన్ని రద్దు చేసుకోవడం వెనుక ఫండింగ్ లేక పోవడం ప్రధాన కారణం అన్నది నిజమే. కానీ ఆ ఫండింగ్ లేకపోవడం వెనుక ఏయే శక్తులు పని చేశాయో వెల్లడి కావలసిన అవసరం ఉన్నది.

వ్యాఖ్యానించండి