మీరు హిందువు కాదు -మోడీతో రాహుల్


జులై 1 తేదీన ప్రతిపక్ష నేత మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. “తమను తాము హిందువులుగా చెప్పుకునే వాళ్ళు నిరంతరం హింస, విద్వేషాలకు పాల్పడుతున్నారు” అని ఆరోపించాడు.

ఇదే అవకాశంగా దొరకబుచ్చుకున్న ప్రధాని మోడీ రాహుల్ మాటలను వక్రీకరిస్తూ “హిందూ సమాజం మొత్తాన్ని హింసాత్మకం గా వర్ణించడం చాలా తీవ్రమైన విషయం” అని విమర్శించాడు.

ప్రధాని ఆరోపణలకు బదులిస్తూ రాహుల్ గాంధీ “నేను అన్నది బిజేపి పార్టీని. మీ పార్టీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ మాత్రమే ‘హిందూ సమాజం మొత్తం కాదు” అని తిప్పి కొట్టాడు.

అప్పటికే తయారుగా ఉన్న హోం మంత్రి అమిత్ షా లేచి రాహుల్ గాంధీ పై ఆరోపణలను రెట్టింపు చేస్తూ హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణించినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు.

జే.ఎన్.యు విద్యార్ధి నేతల ప్రసంగాల వీడియోలను మార్ఫింగ్ చేసి అందులో ఇండియా వ్యతిరేక నినాదాలు చొప్పించి వాటిని ట్యాబ్ లలో చూపిస్తూ టి.వి చానెళ్ళు అన్నీ తిరగడం ద్వారా జే.ఎన్.యు విద్యార్ధులపై విషం విరజిమ్మారు.

ముజఫ్ఫర్ నగర్ జిల్లాలో ఓ చిన్న గ్రామంలో యువకుల మధ్య తగాదాను హిందూ-ముస్లిం అల్లర్లుగా మార్చి వందల మంది ముస్లింల పై మారణకాండ జరిపి ఆ విద్వేషపూరిత వాతావరణాన్ని ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విజయానికి వినియోగించారు.

ఇప్పుడు సాక్షాత్తు రాజకీయ దేవాలయంగా చెప్పుకునే పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి మాటలను చెప్పింది చెప్పినట్లుగా స్వీకరించి వాటికి సమాధానం చెప్పలేని పరిస్ధితిలో పాలక పార్టీ ఉండడం గర్హనీయం.

పార్లమెంటులో శివుడి చిత్ర పటాన్ని చూపిస్తూ రాహుల్ గాంధీ భయ రాహిత్యం, అహింసలే ఇక్కడ వ్యక్తం అవుతున్న సందేశం అని వ్యాఖ్యానించాడు. “సకల మతాలూ, మన గొప్ప నాయకులు అంటా అహింస, భయ రాహిత్యంల గురించే మాట్లాడారు. కానీ తమను తాము హిందువులుగా పిలుచుకునే వారు మాత్రం హింస, విద్వేషం, వంచనలకు పాల్పడుతున్నారు. ఆప్ హిందూ హో హీ నహీ (మీరు ఆసలు హిందువులే కాదు)” అని అన్నాడు.

Image courtesy: The Hindu

ఈ వ్యాఖ్యలతో ట్రెజరీ బెంచి సభ్యులు (ప్రధాని, ఆర్ధిక మంత్రి తదితర ప్రభుత్వ నేతలు కూర్చునే ముందు బెంచి) ఆర్తనాదాలు చేస్తూ లేచి నిలబడ్డారు. తమను తాము హిందువులుగా చెప్పుకుని గర్వించే కోట్లాది మంది ప్రజల, దేశ మనోభావాలను గాయపరిచినందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశాడు.

ఇస్లాం, క్రైస్తవం, బుద్ధిజం, జైనిజం, సిఖిజం ఇలా అన్ని మతాలూ ధైర్యం గురించే మాట్లాడుతాయని, భయ రాహిత్యం ప్రాముఖ్యత గురించి నొక్కి చేబుతాయనీ రాహుల్ వివరించే ప్రయత్నం చేశాడు.

బిజేపి ఒక పధ్ధతి ప్రకారం రాజ్యాంగం పైనా, ఇండియా అనే ఒక భావన పైనా దాడులు చేస్తున్నాడని రాహుల్ ఆరోపించాడు. మిలియన్ల మంది ప్రజలు పాలక పార్టీ ప్రతిపాదిస్తున్న భావాలను ప్రతిఘటిస్తున్నారని ఎత్తి చూపాడు. “ప్రధాన మంత్రి మోడీ ఆదేశాల మేరకే నాపై దాడి జరిగింది. నాపై 20కి పైగా కేసులు నమోదయ్యాయి. నా ఇంటిని లాక్కున్నారు. ఇడి చేత 55 గంటల పాటు విచారణ ఎదుర్కొనే భాగ్యం కలిగింది” అని సభకు తెలియజేశాడు.

ఇన్ని జరుగుతున్నప్పటికీ రాజ్యాంగం పరిరక్షణకు సామూహికంగా జరిగిన ప్రయత్నాల పట్ల తనకు గర్వంగా ఉందని రాహుల్ చెప్పుకున్నాడు. “నా తర్వాత బిజేపి సభ్యులు కూడా ‘జై సంవిదాన్’ అనక తప్పని పరిస్ధితి కలిగడం చాలా బాగుంది” అన్నాడు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగం పై మాట్లాడుతూ “అయోధ్యలో రాముడి గుడి కట్టామని చెప్పుకున్నారు. అయోధ్య ప్రజలే మిమ్మల్ని తిరస్కరించారు. కారణం ఏమిటంటే మీరు అక్కడ ప్రజల భూములు లాక్కున్నారు. ప్రజల ఇళ్ళను కూల గొట్టారు” అని గుర్తు చేశాడు.

రాముని గుడి ప్రారంభించారు. అక్కడికి అంబాని వచ్చాడు. అదాని వచ్చాడు. కానీ అయోధ్య ప్రజలని మాత్రం రానివ్వలేదు. అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ప్రజలకు చెప్పుకున్న మీరు అదే ప్రజలని మాత్రం ఆలయం ప్రారంభానికి రానివ్వలేదు” అని లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు విమర్శించాడు.

వ్యాఖ్యానించండి