ఈజిప్టు: పాలస్తీనా ప్రతిఘటనలో ట్రోజాన్ హార్స్ (4)


Egypt President Abdel Fattah El-Sisi with Saudi Prince Mohammed Bin Salman

పాన్ అరబ్బు జాతీయ ఉద్యమానికి, పాలస్తీనా విముక్తికి సిరియా, ఈజిప్టుల వ్యూహాత్మక సహకారం అత్యవసరం అని ఈజిప్టు నేత గమాల్ అబ్దుల్ నాజర్, సిరియా నేత హఫీజ్ ఆల్-అస్సాద్ లు సరిగ్గానే గుర్తించారు. ఇరు దేశాల సహకారాన్ని అమెరికా, బ్రిటన్ లు ఇజ్రాయెల్ సహాయంతో నివారించగలిగాయి. నాజర్ హత్య తర్వాత అన్వర్ సాదత్ నేతృత్వం లోని ఈజిప్టు ద్వారానే పాన్ అరబ్బు ఉద్యమాన్ని బలహీన పరిచి అరబ్ దేశాల మధ్య చీలికలు, పరస్పర విరుద్ధ ప్రయోజనాలు సృష్టించి అంతిమంగా ఇజ్రాయెల్ ను ప్రాంతీయ శక్తిగా మార్చడంలో పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు సఫలం అయ్యాయి. ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఇ, బహ్రెయిన్ దేశాల నుండి ఋణ సహాయం, పెట్టుబడుల సహకారం ఆశ చూపుతూ ఈజిప్టు సార్వభౌమాధికారం సైతం ప్రమాదంలో పడ వేసే ఎత్తుగడలు రూపొందించారు.

ఈజిప్టుకు సౌదీ అరేబియా గతం లోనూ సహాయం చేసినప్పటికీ ఇప్పుడు చేస్తున్న భారీ వాణిజ్య సహకార ఒప్పందాలు ఎన్నడూ ఎరగనివి. ఇరు దేశాల వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు పెంచాలని సౌదీ లక్ష్యంగా చేసుకోవడంతో పాటు 4 బిలియన్ డాలర్ల విలువతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, మిలటరీ ఉత్పత్తుల నిమిత్తం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదరడం.. ఇవన్నీ ఈజిప్టు ప్రజల భవితవ్యాన్ని సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల రాజులకు తాకట్టు పెట్టనున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. మరో వైపు అబుదాబి (యుఏఇ) $22 బిలియన్లతో ఈజిప్టు తీర అభివృద్ధికి హామీ ఇచ్చింది. ఈ ‘సహాయం’ ఫలితంగా ఒక్క 2024 లోనే ఈజిప్టు $6.3 బిలియన్ల వడ్డీ, $22.9 బిలియన్ల వాయిదా చెల్లించాల్సి ఉంటుంది (సబ్ స్టాక్, వెనిసా బీలే, జూన్ 14 2024). నాటో కూటమి తరపున రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ మాత్రమే ఈజిప్టు కంటే అధిక విదేశీ అప్పు కలిగి ఉండడం ఈ సందర్భంగా గమనార్హం.

సద్దాం హుసేన్ నేతృత్వం లోని ఇరాక్ పై 1991 లో యుద్ధం ప్రకటించిన అమెరికా కూటమికి మద్దతు ఇచ్చినందుకు గాను ఈజిప్టు అప్పును అమెరికా క్షమించి రద్దు చేసింది. ఇప్పుడు గాజా (పాలస్తీనా) ప్రజల హత్యాకాండకు, గాజా-వెస్ట్ బ్యాంక్ నుండి పాలస్తీనీయుల తరిమివేతకు మద్దతు ఇస్తున్నందుకు ఐ‌ఎం‌ఎఫ్, వరల్డ్ బ్యాంక్, గల్ఫ్ రాజుల నుండి భారీ ఆర్ధిక (ఋణ) ప్యాకేజీ లను ఈజిప్టు అందుకుంటోంది. కనుక హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం విరమణకు ఈజిప్టును నిజాయితీ మధ్యవర్తిగా నమ్మలేని పరిస్ధితి నెలకొన్నది. మధ్య ప్రాచ్యంలో అమెరికా, బ్రిటన్, ఈయు లతో ఇప్పటి వరకు అంట కాగిన అరబ్ దేశాలన్నింటికీ ఈజిప్టు భారీ మొత్తంలో ఋణ పడి ఉన్నది. కనుక ఒక సార్వభౌమ దేశంగా హమాస్-ఇజ్రాయెల్ యుద్ధ విరమణలో ఈజిప్టు మధ్యవర్తిత్వం అనివార్యంగా పాలస్తీనా విమోచనకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపడం తథ్యంగా కనిపిస్తున్నది.

ఇజ్రాయెల్ తో ఈజిప్టు ఆర్ధిక, మిలటరీ కుమ్మక్కు దినదిన ప్రవర్థమానం

ఈజిప్టు దేశం, గమాల్ అబ్దుల్ నాజర్ నాయకత్వంలో పాన్-అరబ్ జాతీయోద్యమంతో పాటు పాలస్తీనా విమోచనోద్యమం లో కూడా ప్రగతి శీల పాత్ర పోషించగా, నాజర్ హత్యానంతరం అన్వర్ సాదత్ హయాం నుండి క్రమ క్రమంగా అరబ్ జాతీయ ప్రయోజనాలను పరిత్యజించి అమెరికా, బ్రిటన్ పశ్చిమ దేశాలకు లొంగిపోయి, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఒక ప్రబల శక్తిగా ఎదగడంలో ఎలా సహాయ పడిందీ చూశాం. ఈ విద్రోహ పర్వంలో ఈజిప్టు ప్రజలు భాగస్వామ్యం వహించ లేదన్న సంగతిని తప్పనిసరిగా గుర్తించాలి. నాజర్ అనంతరం అమెరికా, బ్రిటన్ పశ్చిమ దేశాలకు దళారులుగా మారిన ఈజిప్టు పాలక వర్గాలే తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ అనుకూల విద్రోహ పాత్రను స్వీకరించారు. ఈజిప్టు వనరులను పశ్చిమ దేశాలకు దోచి పెట్టడమే కాకుండా దేశాన్ని ఋణ ఊబిలోకి దించారు. రుణాల చెల్లింపుకు మరిన్ని అప్పులు చేశారు. అన్వర్ సాదత్, హోస్నీ ముబారక్, మహమ్మద్ మోర్సి, ఇప్పుడు అబ్దుల్ ఫతే ఆల్-సిసి లు వరుసగా ఇవే లొంగుబాటు విధానాలు అనుసరించారు. ఇప్పుడు ఇజ్రాయెల్ తో ఈజిప్టు ఆర్ధికం గానూ, మిలటరీ పరం గానూ ఎలా కుమ్మక్కు అవుతున్నది చూద్దాం.

ఇజ్రాయెల్ అన్నది మధ్య ప్రాచ్యంలో ఒక ప్రత్యేక దేశంగా ఉన్నప్పటికీ ఆచరణలో (for all practical purposes) చూస్తే అది అమెరికాలో భాగమైన ఒక రాష్ట్రంగానే పని చేస్తుంది. ఒక్కోసారి ఇజ్రాయెల్ పాలకులు మధ్య ప్రాచ్యంలో అమెరికా విధానాలను శాసిస్తున్నట్లు కనిపిస్తుంది. అమెరికాకు తోకగా ఇజ్రాయెల్ ను పరిగణిస్తే శరీరం తోకను ఊపడం బదులు తోకే శరీరాన్ని ఊపుతోందా అన్న భ్రమ కలుగుతుంది. వాస్తవం ఏమిటంటే అమెరికా ప్రయోజనాలే ఇజ్రాయెల్ ప్రయోజనాలు, ఇజ్రాయెల్ ప్రయోజనాలు అనివార్యంగా అమెరికాకు అనుసంధానం అయి ఉంటాయి. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఉనికి అమెరికా ఉనికితో సమానం.

Israel PM Benjamin Netanyahu with Egypt President Fattah El-Sisi

ఈజిప్టు, మిలటరీ ప్రయోజనాల పరంగా తనపై ఆధారపడేలా చేసేందుకు ఇజ్రాయెల్, సినాయ్ లో ఇస్లామిక్ టెర్రరిస్టు మూకలను ప్రవేశపెట్టి అస్థిరతను సృష్టించింది. అరబ్ వసంతం పేరుతో ఇరాక్ లో అమెరికా ప్రవేశపెట్టిన ఐసిస్ (ISIS) కు చెందిన ఒక పిలక ‘విలాయత్ సినాయ్’ లేదా ‘సినాయ్ ప్రావిన్స్’ (ఎస్.పి) పేరుతో సినాయ్ లో 2011లో ప్రవేశించింది. సినాయ్ లో ఎస్.పి కార్యకలాపాలు తీవ్రం కావడంతో ఈజిప్టు ‘ఆపరేషన్ ఈగిల్’ కింద 1000 మంది సైన్యాన్ని, సాయుధ వాహనాలను సినాయ్ కు పంపింది. 1973 నాటి యోం కిప్పుర్ వార్ తర్వాత ఈజిప్టు ఇంత సంఖ్యలో సినాయ్ ద్వీప కల్పంలో సైన్యం దించడం ఇదే ప్రధమం. ఈ ఆపరేషన్ తో సినాయ్ లో మిలటరీ, భద్రతా పరిస్ధితిలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. మహమ్మద్ మోర్సి ప్రభుత్వం సినాయ్ ను పూర్తి మిలటరీ ఆధీనంలోకి తీసుకున్నాడు. ఈజిప్టు, గాజా సరిహద్దు మూసి వేసి గాజాను లాక్ డౌన్ లో ఉంచాడు. ఈజిప్టు, గాజా సరిహద్దులో భూగర్భ సొరంగాలు ఉంటాయి. ఈ సొరంగాలు గాజా ప్రజలకు జీవ నాడి అని చెప్పవచ్చు. గాజా సముద్రం తీరాన్ని ఇజ్రాయెల్ నేవీ కాపలా కాస్తుంది. ఉత్తర, తూర్పు సరిహద్దుల వెంబడి కంచె నిర్మించింది. భూ ఉపరితలం పైన ఈజిప్షియన్ రఫా, గాజా రఫా ల సరిహద్దును ఈజిప్టు సైన్యం నియంత్రిస్తుంది. దరిమిలా భూగర్భ సొరంగాలు మాత్రమే గాజాకు సరఫరాలు అందే మార్గం. ఈ సొరంగాలలో మురుగుతో నిండిన వరద నీటిని బలంగా పంపడం ద్వారా గాజా ప్రజల జీవనాన్ని వారాల పాటు నాశనం చేశాడు. హమాస్ నుండి సినాయ్ లోని ఐసిస్ టెర్రరిస్టులకు ఆయుధాలు అందకుండా అడ్డుకునేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని బొంకాడు.

నిజానికి సినాయ్ లో హమాస్, ఐసిస్ ల మధ్య సంబంధాలు లేవన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో సిరియా లోని బషర్ ఆల్-అస్సాద్ నేతృత్వం లోని సెక్యులర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తన ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకర్తలను ఐసిస్ కు సహాయంగా పంపాడు. (అమెరికా, బ్రిటన్, టర్కీ, కతార్, యుఏఇ, సౌదీ అరేబియాలు ధన, ఆయుధ సాయంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కార్యకర్తలను సమీకరించి సిరియాలో హింసాత్మక టెర్రరిస్టు చర్యల నిమిత్తం సరఫరా చేశాయి. అనేక ఫాల్స్ ఫ్లాగ్ టెర్రరిస్టు చర్యలకు పాల్పడ్డాయి. ఈ చర్యలను సిరియాలో అరబ్ వసంతంగా ప్రచారం చేశాయి.) ఈ సంగతి ఎవరో ఊహించి చెప్పడం కాదు. అమెరికన్ ధింక్ ట్యాంక్ లలో ఒకటైన “ద వాషింగ్టన్ ఇనిస్టిట్యూట్ ఫర్ నియర్ ఈస్ట్ పాలసీ” సంస్థ 2016 సెప్టెంబర్ లో విడుదల చేసిన నివేదికలో వెల్లడి చేసింది. కతార్ లోని ముస్లిం బ్రదర్ హుడ్ మత గురువు యూసఫ్ ఆల్-కరదావి, ప్రపంచం లోని సున్నీ ముస్లింలు అందరూ సిరియా యుద్ధంలో పాల్గోవాలని పిలుపు ఇచ్చాడు.

Mohammed Morsi

మిలటరీ కుట్ర ద్వారా మోర్సిని ఈజిప్టు అధ్యక్ష పదవి నుండి ఫతే ఆల్-సిసి కూల్చి వేశాక ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకలాపాలు ఇంకా తీవ్రం అయినాయి. ఈజిప్టు యువత సిరియా వెళ్ళడం కూడా పెరిగింది.

ఆల్-సిసి హయాంలో సినాయ్ ద్వీప కల్పం టెర్రరిస్టులకు నిలయం అయింది. సినాయ్ నుండి ఈజిప్టు ప్రభుత్వంకు వ్యతిరేకంగా సాయుధ చర్యలు జరిపారు. వాషింగ్టన్ డి.సి. లోని ‘అరబ్ సెంటర్ 2022 లో ఒక నివేదికలో ఇలా తెలియజేసింది, “గత దశాబ్దంలో ఈజిప్టులో టెర్రరిస్టు చర్యలకు సినాయ్ ఒక బేస్ అయింది. భద్రతా బలగాలు, మిలటరీ కాన్వాయ్ లు, చెక్ పాయింట్లు మొ.న వాటిని టార్గెట్ చేసుకుని దాడులు చేశారు. రఫా తో సహా, ఉత్తర సినాయ్ లో ఇవి ఎక్కువగా జరిగాయి. నవంబర్ 2017 లో మసీదుపై జరిగిన ఒక తీవ్రవాద దాడిలో 300కు పైగా చనిపోగా 128 మంది గాయపడ్డారు. ఇందులో 27 మంది పిల్లలు.” ఆల్-సిసి జరిపిన మిలటరీ ఆపరేషన్ల వల్ల పెద్దగా ఫలితం రాలేదు. పైగా టెర్రరిజంపై యుద్ధం పేరుతో ఈజిప్టు మిలటరీ కూడా అనేక మంది పౌరులను హత్యలకు, టార్చర్ లకు గురి చేసింది. నిజానికి సినాయ్ లో టెర్రరిజం అణచివేతలో ఆల్-సిసి ప్రభుత్వానికి నిజాయితీ లేదనీ, ఈజిప్టు ప్రధాన భూభాగంలో తన ప్రభుత్వానికి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు సినాయ్ టెర్రరిజంపై యుద్ధాన్ని పొడిగిస్తూ పోయాడని ఆరోపణలు ఉన్నాయి.

అనగా సినాయ్ టెర్రరిజం వల్ల ఆల్-సిసి రాజకీయ ప్రయోజనాలు నెరవేరాయి. ఈ క్రమంలో ఈజిప్టు, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలు మరింత లోతులకు పాతుకున్నాయి. అమెరికా కూటమి ప్రవేశ పెట్టిన ఐసిసి టెర్రరిజం అందుకు సానుకూల పరిస్ధితులు కల్పించింది. 1979 నాటి క్యాంప్ డేవిడ్ శాంతి ఒప్పందం ప్రకారం ఈజిప్టు సైన్యం ఇజ్రాయెల్ సమీప ప్రాంతాలకు రాకూడదు. దీనికి భిన్నంగా ఈజిప్టు సైన్యం, ఆయుధాలు ఈశాన్య సినాయ్ (గాజా సరిహద్దు సమీప ప్రాంతం) లో మోహరించేందుకు ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. సినాయ్ లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడులు చేసేందుకు ఈజిప్టు అనుమతి ఇచ్చింది (న్యూయార్క్ టైమ్స్, ఫిబ్రవరి 3, 2018). తద్వారా గాజాకు జరిగే సరుకుల రవాణాను ఆటంకపరిచేందుకు ఈజిప్టు సహకరించింది. పాలస్తీనా ప్రతిఘటనా బలగాలపై కూడా డ్రోన్ దాడులు చేసేందుకు ఈ అనుమతి అవకాశం ఇచ్చింది. 2015-2018 మధ్య ఇజ్రాయెల్ 100కు పైగా డ్రోన్ దాడులు చేసి గాజా (పాలస్తీనా) ప్రతిఘటనపై ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ ఆపరేషన్ల సందర్భంగానే ఇజ్రాయెల్ 2014 లో గాజాలో చొరబడి దారుణ మారణ కాండకు తెగబడింది.

తన 2018 రిపోర్ట్ లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈజిప్టు, ఇజ్రాయెల్ లను ‘రహస్య మిత్రులు’ గా అభివర్ణించడం విశేషం. ఈజిప్టు ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ను ఆల్-సిసి ఖండించవలసి వచ్చింది. టైమ్స్ పత్రిక రిపోర్ట్ దరిమిలా ఆల్-సిసి ప్రభుత్వం సినాయ్ ప్రాంతాన్ని సైనిక కవచంతో నింపి ఈజిప్షియన్ రఫా లోని ఇళ్లను, ఇతర మౌలిక నిర్మాణాలను నేలమట్టం కావించాడు. అక్కడ నివసించే వేలాది బెడ్ విన్ తెగ ప్రజలు ప్రాణభయంతో చెల్లాచెదురయ్యారు. 2019 లో సిబిఎస్ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆల్-సిసి, ఇజ్రాయెల్-ఈజిప్టు సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేనంత సన్నిహితం అయ్యాయని పేర్కొన్నాడు. “మా వాయు దళాలు ఒక్కోసారి ఇజ్రాయెలీ సరిహద్దు దాటి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఇజ్రాయెల్ తో విస్తారమైన సహకార సంబంధాలు నెలకున్నాయి” అని అంగీకరించాడు.

ఈజిప్టు ప్రజలకు భయపడి ఈ ఇంటర్వ్యూను ప్రసారం చెయ్యొద్దని ఆల్-సిసి బేరసారాలు జరిపినా కుదరలేదు. సినాయ్, గాజా మధ్య సొరంగాలను మెజారిటీ మూసివేయడంలోనూ ఆల్-సిసి ఇజ్రాయెల్ కు సహకరించాడు. ముందు చెప్పినట్లు సొరంగాల ద్వారానే గాజా ప్రజలు బైటి ప్రపంచానికి రాకపోకలు జరుపుతారు. సరుకులు తెచ్చుకుంటారు. తమ సరుకులు రవాణా చేస్తారు. ఈజిప్టు సైనికులు ఉద్దేశ్య పూర్వకంగా గాజా ప్రజలను చిన్న చూపు చూస్తూ వారిపై దాష్టీకం చెలాయిస్తారు. సరిహద్దు దాటేందుకు గంటలు, రోజుల తరబడి వేచి ఉండేలా చేస్తారు.

ఇజ్రాయెలీ పత్రికల వార్తల ప్రకారం మే 2020లో ఇజ్రాయెల్ ఇంటలిజెన్స్ ఏజన్సీ మొస్సాద్ అధిపతి రహస్యంగా కైరో కు ప్రయాణం చేసి ఈజిప్టు అధికారులతో చర్చలు జరిపాడు. పాలస్తీనా ప్రజల భూభాగంగా ఐరాస తీర్మానాలు గుర్తించిన వెస్ట్ బ్యాంక్ ను ఇజ్రాయెల్ లో కలుపుకునేందుకు చర్యలు తీసుకోనున్నామని ఈ చర్చల ద్వారా ఇజ్రాయెల్, ఈజిప్టుకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడి అయింది.

వ్యాఖ్యానించండి