
రెండవ భాగం తర్వాత
తద్వారా క్యాంప్ డేవిడ్ ఒప్పందం, ముఖ్యంగా అందులో మొదటి ఫ్రేం వర్క్ కేవలం పాక్షిక ఒప్పందమే తప్ప పాలస్తీనా సమస్యను పరిష్కరించే సంపూర్ణ ఒప్పందం కాదని తేల్చి చెప్పింది. అయితే రెండవ ఒప్పందం ఇజ్రాయెల్, ఈజిప్టు లకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందం కనుక, అందులోనూ ఆక్రమిత సినాయ్ నుండి వైదొలగుతామని ఇజ్రాయెల్ అంగీకరించినందున దాని జోలికి ఐరాస జనరల్ అసెంబ్లీ పోలేదు. దాని గురించిన అధికారిక వ్యాఖ్యానం కూడా ఏమీ చేసినట్లు కనిపించదు. అరబ్ లీగ్ సైతం ఈజిప్టును కూటమి నుండి బహిష్కరించింది. (1989లో తిరిగి చేర్చుకుంది అది వేరే విషయం.)
ఋణ బందిఖానా
ఈ విధంగా సిరియా గోలన్ హైట్స్ ప్రాంతం ఇజ్రాయెల్ ఆక్రమణలో కొనసాగుతుండగా, సినాయ్ తిరిగి ఈజిప్టులో కలిసింది. అందుకు ప్రతిఫలంగా సిరియాను వెన్ను పొడిచిన ఈజిప్టు పాలస్తీనా సమస్య పరిష్కారం విషయంలో అమెరికా-ఇజ్రాయెల్ ల విద్రోహ శిబిరంలో చేరిపోయింది. అప్పటి నుండి ఈజిప్టు ప్రతి ఏటా అమెరికా నుండి బిలియన్ల కొద్దీ డాలర్లు సహాయం గానూ, ఋణం గానూ అందుకుంటూ వచ్చింది. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లు లిబరల్ గా ఈజిప్టుకు రుణాలు అందజేసి ఆ దేశాన్ని శాశ్వతంగా అమెరికా, పశ్చిమ దేశాల ఆర్థిక బందిఖానాలో కట్టి పడేశాయి. అన్వర్ సాదత్ అనంతరం అప్పటి ఉపాధ్యక్షుడు హోస్నీ ముబారక్ అధ్యక్ష పదవి చేపట్టాడు. ఆయన కూడా అన్వర్ సాదత్ విద్రోహ పూరిత లెగసీని కొనసాగించాడు. ఈజిప్టును అమెరికా (సిఐఎ), బ్రిటన్ (ఎంఐ6), ఇజ్రాయెల్ (మొస్సాద్) ఇంటలిజెన్స్ వర్గాలకు ఆటస్థలంగా మార్చి వేశాడు.
ఏ దేశమైనా, దేశీయ ఆర్ధిక వ్యవస్థ సొంత ఆర్ధిక విధానాల ద్వారా స్వావలంబన సాధించకుండా కేవలం రుణాల ద్వారా రోజులు గడిపితే ఆ దేశం అభివృద్ధి చెందడానికి బదులు రుణాల ఊబిలో కూరుకుపోతుంది. ఈజిప్టు దళారీ పాలకులు అటు పాలనా వ్యవస్థను, ఇటు సైనిక వ్యవస్థను కూడా అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులకు అప్పగించడంతో కొద్ది మంది దళారీ సూపర్ ధనికులు లబ్ది పొందగా శ్రామిక వర్గం దేశ రుణాల చెల్లింపులో నిమగ్నం కావలసి వచ్చింది. దశాబ్దాల పాటు ఈ దోపిడీ కొనసాగింది. 2011లో అరబ్ వసంతం పేరుతో అధికారం చేపట్టిన ముస్లిం బ్రదర్ హుడ్ కూడా అమెరికాకు సేవ చేయడం మానలేదు. ఏడాదికే మరోసారి చెలరేగిన ప్రజల నిరసనలను అడ్డం పెట్టుకుని సైన్యాధికారి అబ్దుల్ ఫతా అల్-సిసి నేతృత్వంలో సైనిక కుట్రతో ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. అధ్యక్షుడు మహమ్మద్ మోర్సిని సుప్రీం కోర్టు విచారించి జైల్లో పెట్టింది.
అక్టోబర్ 7
అక్టోబర్ 7, 2023 తేదీన హమాస్ తో పాటు పాలస్తీనా జిహాద్ లాంటి సంస్థలు గాజా చుట్టూ ఇజ్రాయెల్ నిర్మించిన ముళ్ల కంచెను ఛేదించి 200 కు పైగా ఇజ్రాయెలీ పౌరులు, సైనికులను కిడ్నాప్ చేయడంతో పాలస్తీనా సమస్య తీవ్ర స్థాయిలో తిరిగి అంతర్జాతీయ రంగం మీదికి వచ్చింది. ఈ కిడ్నాప్ లో హమాస్ నేతృత్వం లోని పాలస్తీనా ఉద్యమం తక్షణ లక్షణం అబ్రహాం ఎకార్డ్స్ పేరుతో అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్-అరబ్ దేశాల సంబంధాల సాధారణీకరణ (నార్మలైజేషన్) ప్రక్రియను అమలు చేసేందుకు వీలు లేని పరిస్ధితులు కల్పించడం; ఇజ్రాయెల్ జైళ్లలో విచారణ లేకుండా ఉన్న వేలాది మంది పాలస్తీనా పౌరులను హమాస్ కార్యకర్తలను విడిపించడం.

Abraham Accords Signing Ceremony at White House
అబ్రహాం ఎకార్డ్స్ అన్నవి వరుసగా ఇజ్రాయెల్-యుఏఇ, ఇజ్రాయెల్-బహ్రెయిన్, ఇజ్రాయెల్-మొరాకో ల మధ్య కుదిరిన ద్వైపాక్షిక శాంతి ఒప్పందాలు. సెప్టెంబర్ 15, 2020 తేదీన వైట్ హౌస్ లో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ సంతకాల సమావేశాల్లో పాల్గొన్నాడు. ఆగస్టు 13, 2020 తేదీన ఇజ్రాయెల్-యుఏఇ ఒప్పందం ప్రకటించగా, సెప్టెంబర్ 11, 2020 తేదీన ఇజ్రాయెల్-బహ్రెయిన్ ఒప్పందం ప్రకటించారు. ఈ ఒప్పందాలకు కొనసాగింపుగా అక్టోబర్ 23, 2020 తేదీన ఇజ్రాయెల్-సూడాన్ లు సంబంధాల సాధారణీకరణకు ఒప్పందం చేసుకోవాలని అంగీకరించాయి. అయితే ఈ ఒప్పందంపై ఇంకా సంతకాలు జరగలేదు. డిక్లరేషన్ పై మాత్రమే సంతకాలు జరిగాయి. అయితే అమెరికా తన టెర్రరిస్టు దేశాల జాబితా నుండి సూడాన్ ను తొలగించి 1.2 బిలియన్ డాలర్ల అప్పు మంజూరు చేసింది. డిసెంబర్ 22, 2020 తేదీన ఇజ్రాయెల్-మొరాకో దేశాలు ‘సంబంధాల సాధారణీకరణ ఒప్పందం’ పైన సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలు అన్నింటిలో అరబ్ ప్రజల ప్రయోజనాలను అరబ్ పాలకులు చట్ట విరుద్ధంగా ఏర్పడిన యూదు దేశానికి తాకట్టు పెట్టారు.
అబ్రహాం ఒప్పందం దరిమిలా యుఏఇ, బహ్రెయిన్ లు ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని గుర్తించాయి. అనగా అత్యంత సహజమైన, చారిత్రక పాలస్తీనా సార్వభౌమాధికారాన్ని తిరస్కరించాయి. ఇజ్రాయెల్ తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు నెలకొల్పాయి. (ఇజ్రాయెల్-జోర్డాన్ ల మధ్య 1994 లోనే శాంతి ఒప్పందం కుదిరింది. తద్వారా తన అధీనం లోని వెస్ట్ బ్యాంక్ ను జోర్డాన్, ఇజ్రాయెల్ కు అప్పగించింది.) యుఏఇ మొదటిసారి ఇజ్రాయెల్ తో టెలిఫోన్ సంబంధాలు నెలకొల్పింది. వెస్ట్రన్ సహారా దేశంపై మొరాకో సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. వెస్ట్రన్ సహారా ప్రజలు అనేక ఏళ్ళుగా మొరాకో నుండి స్వతంత్రం కోసం పోరాడుతుండగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా మొరాకో తన దురాక్రమణకు పశ్చిమ దేశాల ఆమోదం సాధించుకుంది. సహరావీ అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సంస్థ నాయకత్వంలో జరుగుతున్న అరబ్ ప్రజల పోరాటం అణచివేతకు మార్గం ఏర్పరచుకుంది. వెస్ట్రన్ సహారా లోని చమురు వనరులు మొరాకో ఆక్రమించగా, వెస్ట్రన్ సహారా ప్రజలు జీవన వనరులు కరువై దరిద్రం అనుభవిస్తున్నారు. జులై 2023 వెస్ట్రన్ సహారా పైన మొరాకో సార్వభౌమాధికారం గుర్తిస్తున్నట్లు ఇజ్రాయెల్ కూడా ప్రకటించడంతో ఇజ్రాయెల్-మొరాకో సంబంధాల సాధారణీకరణ అధికారిక ప్రక్రియ అయింది.

Gazans Celebrate Destroyed Israeli Tank on October 07, 2023
కిడ్నాప్ అయిన ఇజ్రాయెలీ సైనికులు, పౌరుల విడుదలకు ఇజ్రాయెల్ ఎలాంటి ప్రయత్నమూ చేయకపోగా గాజా నుండి పాలస్తీనా ప్రజలను వెళ్లగొట్టి సంపూర్ణంగా ఆక్రమించేందుకు ఇదే అదనుగా భావించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ అవినీతికి వ్యతిరేకంగా రెండేళ్ల నుండి ఇజ్రాయెల్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఆయన అవినీతి నేరానికి గాను జైలు శిక్ష దాదాపు ఖాయం అయింది. దానితో ఇజ్రాయెల్ సుప్రీం కోర్టు అధికారాలు కత్తిరించి కోర్టుపై ప్రభుత్వానికి విస్తృత అధికారాలు కట్టబెడుతూ చట్టాలు చేశాడు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రజలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అక్టోబర్ 7 నాటి హమాస్ కిడ్నాప్ వ్యవహారం ప్రధాని బెంజిమన్ కు వరంగా కలిసి వచ్చింది. ఇజ్రాయెల్ ప్రజల దృష్టి అనివార్యంగా కిడ్నాప్ పైకి మళ్లింది. బెంజిమిన్ ప్రకటించిన గాజా దురాక్రమణ, గాజా నుండి పాలస్తీనా ప్రజలను వెళ్లగొట్టే లక్ష్యానికి గణనీయ మద్దతు లభించింది. బందీల విడుదల కోసం కొందరు ఆందోళన చేసినప్పటికీ గాజాలో ఇజ్రాయెల్ సైన్యాలు సాగిస్తున్న మారణ కాండ, జాతి హననం (జీనోసైడ్) పై అంతర్జాతీయంగా వెలువడుతున్న ఖండన ఆందోళనల ముందు అది వట్టిపోయింది.
హమాస్ ప్రభుత్వం లోని ఆరోగ్య శాఖ ప్రకారం ఇప్పటి వరకు 24 వేలకు మందికి పైగా ప్రజలు ఇజ్రాయెల్ సైన్యం ఊచకోతకు గురయ్యారు. అంతకు రెట్టింపు మంది అవయవాలు కోల్పోయి వికలాంగులు అయ్యారు. మృతులు, వికలాంగులుగా మారినవారిలో 75 శాతం స్త్రీలు, పిల్లలే. అయితే అనధికార అంచనాల ప్రకారం 5 లక్షల మంది పాలస్తీనా ప్రజలు యూదు సైన్యం సాగిస్తున్న జీనోసైడ్ లో హతులయ్యారు.
ఈజిప్టు విద్రోహం మరోసారి…
గాజా నుండి పాలస్తీనా ప్రజలను ఖాళీ చేస్తే వారిని ఎక్కడికి తరలించాలి? ఇజ్రాయెల్ ప్రకారం వారిని ఈజిప్టు లోని సినాయ్ ద్వీప కల్పానికి తరలించాలి. అయితే సినాయ్, ఇజ్రాయెల్ సరిహద్దును ఈజిప్టు మూసి వేసింది. దానితో ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడి నుండి తప్పించుకుని గాజా దక్షిణ అంచున గల రఫా పట్టణంలో శరణార్థి శిబిరాలకు చేరారు. బందీల విడుదల పేరుతో అప్పటికే ఉత్తర గాజా లోని ఇళ్లతో సహా సమస్త నిర్మాణాలను నేలమట్టం కావించిన యూదు సైన్యం జూన్ నెలలో రఫా పై దాడి ప్రారంభించింది. యూదు సైన్యం ఎంత అమానుషంగా హత్యాకాండ సాగిస్తున్నదంటే ఆసుపత్రులు అన్నింటినీ నేలమట్టం కావించింది. దాడిలో గాయపడి ఆసుపత్రుల్లో చేరిన వారినీ కూడా చంపేస్తోంది. శరణార్థి శిబిరాలలోకి సైనికులు జొరబడి శిబిరాలను నేలమట్టం చేస్తోంది.
జూన్ 14 తేదీన ఒక శిబిరం పైన దాడి చేసి 274 మంది పాలస్తీనా పౌరులను ఊచకోత కోసి 4 గురు బందీలను విడిపించినట్లు రాయిటర్స్ తో సహా అనేక పశ్చిమ పత్రికలు ప్రకటించాయి. ఐరాస, రష్యా ఇతర దేశాలు పంపిన ఆహార సహాయం ట్రక్కుల్లో యూదు సైనికులు దాక్కుని శిబిరాల్లో జొరబడి హత్యాకాండ సాగిస్తున్నారు. ఆహార సరఫరా ట్రక్కులు శరణార్థులను చేరకుండా బాంబింగ్ జరిపి నాశనం చేస్తున్నారు. రఫా లో ఐరాస ఆహార సరఫరా ట్రక్కులు పేరుకు పోయాయి గానీ వాటిని రఫా సరిహద్దు దాటకుండా ఈజిప్టు సైన్యం కాపలా కాస్తోంది.
రఫా సరిహద్దు తెరిస్తే పాలస్తీనా ప్రజలను సినాయ్ కు తరలించే ఇజ్రాయెల్ కుట్ర సఫలం అవుతుందని ఈజిప్టు చెబుతోంది. తద్వారా గాజాను ఇజ్రాయెల్ లో కలిపేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న కుట్ర సఫలం అవుతుందని చెబుతున్నది. పైకి చూసేందుకు ఇది సరైన కారణమే అయినప్పటికీ ఈజిప్టు ఉద్దేశాలు వేరే ఉన్నట్లు భౌతిక వాస్తవాలు తెలియజేస్తున్నాయి. సినాయ్ లో ఒక పెద్ద ఏరియాలో పాలస్తీనా శరణార్థులు నివసించేందుకు ఈజిప్టు ఏర్పాట్లు చేస్తున్నదని శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తున్నది. ఇవి ఆహార సహాయ నిల్వలు ఉంచేందుకు చేస్తున్న నిర్మాణాలు అని ఈజిప్టు చెబుతున్నది. కానీ ఈజిప్టు వైపు నుండి ఇంతవరకు కాస్త సహాయం కూడా పాలస్తీనా ప్రజలకు చేరలేదు.
ఈజిప్టు అసలు పధకం వేరే ఉన్నది. అరబ్-ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ కు వ్యతిరేకంగా, పాలస్తీనా విమోచన కేంద్రంగా, తలెత్తిన గాజా దురాక్రమణ (పాలస్తీనా దురాక్రమణ) సమస్యను ఉపయోగించుకుని లబ్ది పొందడం ఈజిప్టు అసలు లక్ష్యం. ఈ మేరకు ఈజిప్టు, అమెరికాతో, సౌదీ, యుఏఇ లాంటి అరబ్ దేశాలతో అనేక ఆర్ధిక ఒప్పందాలు, ఋణ ఒప్పందాలు వరుస బెట్టి చేసుకుంటోంది.

Walled Enclosure in Sinai
ఇజ్రాయెల్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకు ప్రతిఫలంగా, మార్చి 2024 చివర ఐఎంఎఫ్, ఈజిప్టుకు $7.4 బిలియన్ల ఋణ సహాయం ప్రకటించింది. స్తంభన కు గురైన ఈజిప్టు ఆర్ధిక వ్యవస్ధలో వృద్ధి పునరుద్ధరణకు ఈ సహాయాన్ని ఉద్దేశించారు. ఈ సహాయాన్ని ప్రకటిస్తూ ఐఎంఎఫ్ ఇలా పేర్కొంది, “గాజా ను జాతిపరంగా శుభ్రం చేసేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాల వల్ల పాలస్తీనా శరణార్థులు పెద్ద ఎత్తున ఈజిప్టుకు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈజిప్టు ఆర్ధిక కష్టాలు ఎదుర్కోనుంది. ఈ సందర్భంగా ఈజిప్టు ఋణం ఆమోదించేందుకు జరుగుతున్న చర్చల్లో అద్భుతమైన ముందడుగు పడింది”. ఈ మేరకు సినాయ్ ద్వీపకల్పంలో శరణార్థి శిబిరాల నిర్మాణం మొదలైనట్లు ఫిబ్రవరి 2024 నాటి శాటిలైట్ చిత్రాల్లో స్పష్టం అయింది.
నవంబరు 2023 లో ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జీవా, “స్థానిక మరియు విదేశీ కారణాల మధ్య (గాజాపై ఇజ్రాయెల్ దాడి, ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలతో సహా) ఈజిప్టు ఆర్ధిక వ్యవస్థ నిలబడేందుకు ఋణం $10 బిలియన్ల వరకు చేరే అవకాశం ఉంది. గాజా సరిహద్దు లోని తూర్పు సినాయ్ ఎడారిలో జరుగుతున్న సెక్యూరిటీ జోన్ నిర్మాణం, పాలస్తీనియన్ల పునరావాసానికి బఫర్ జోన్ గా ఉపయోగపడే అవకాశం ఉన్నది” అని తెలియజేసింది. ఈజిప్టు నెత్తిపైన ఉన్న $160 బిలియన్ డాలర్ల ఋణ భారం నుండి విముక్తి చేసినందుకు ప్రతిఫలంగా పెద్ద సంఖ్యలో స్థాన భ్రంశం చెందుతున్న పాలస్తీనీయులను ఈజిప్టు ఇముడ్చుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని అక్టోబర్ 2023 లోనే వార్తలు వెలువడ్డాయి. గాజాకు మానవతా సాయం అందించే పేరుతో అమెరికా గాజా మధ్యధరా సముద్రం తీరాన జెట్టీ (pier) నిర్మించింది. దీని ద్వారా ఆహార సరఫరా అందజేస్తామని అమెరికా చెప్పింది. కానీ వాస్తవంలో గాజా లోని పాలస్తీనా ప్రజలను ఉత్తర లెబనాన్, సైప్రస్, తదితర చోట్లకు తరలించేందుకు అమెరికా జేట్టీని వినియోగిస్తున్నదని గాజా లోని ప్రతిఘటన మిలీషియా తెలిపింది.
ఈజిప్టుకు $7.4 బిలియన్లు ఋణం అందజేస్తామని మార్చి నెలలో యూరోపియన్ యూనియన్ కూడా ప్రకటించింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఈయు కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లేయేన్, గ్రీకు, ఆస్ట్రియా, బెల్జియం ప్రధాన మంత్రులు, సైప్రస్ అధ్యక్షుడు అంతా కలిసి కైరో వెళ్లి చర్చలు జరిపారు. రెన్యుబుల్ ఎనర్జీ, వాణిజ్యం, భద్రతలకు గాను వచ్చే మూడేళ్లలో రాయితీ రుణాలు, పెట్టుబడులు అందిస్తామని ఈజిప్టుకు వాళ్ళు హామీ ఇచ్చారు. 5 బిలియన్ యూరోల రాయితీ రుణాలు, 1.8 బిలియన్ యూరోల పెట్టుబడులు, 600 బిలియన్ యూరోల గ్రాంట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో 200 మిలియన్ యూరోలు శరణార్థి వలసకు కేటాయించారు. (రాయిటర్స్, మార్చి 18 2024).
ఐరోపాతో పాటు ధనిక అరబ్ దేశాలు తమ వంతు సాయం ప్రకటించారు. యుఏఇ తో కుదిరిన నిధుల సమీకరణ ఒప్పందం ప్రకారం ఈజిప్టు మధ్యధరా సముద్ర తీరంలో రస్ ఆల్ హెక్మా పేరుతో రిసార్ట్ అభివృద్ధికి ఈజిప్టుకు $20 బిలియన్లు అందనుంది. మే నెలలో ఇందులో $5 బిలియన్లు అందాయి కూడా. ఇదే తరహాలో సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకునేందుకు ఈజిప్టు ప్రయత్నిస్తోంది. ఎర్ర సముద్రం తీరం వెంబడి షర్మ్ ఎల్-షేక్ దగ్గర రిసార్ట్ లు తదితర అభివృద్ధి చర్యలు చేపట్టేందుకు సౌదీ అరేబియా హామీ ఇచ్చింది. దక్షిణ సినాయ్ లో 1000 చదరపు కి.మీ ఏరియాను సౌదీకి ఈజిప్టు అప్పగించనుంది. ఈ ఒప్పందాల నేపధ్యంలో సౌదీ పాలకులు తమ దేశంలో విస్తృతంగా చెలరేగిన పాలస్తీనా అనుకూల ఆందోళనలను పోలీసు, మిలటరీలతో అణచివేస్తున్నది. యుఏఇ చేసినట్లు విద్యార్ధుల పాఠ్యాంశాల నుండి ఇజ్రాయెల్ వ్యతిరేక అంశాలను తొలగిస్తున్నది. గాజా యుద్ధం నేపధ్యంలో వివిధ వార్షిక ఉత్సవాలను వాయిదా వేయకుండా ప్రభుత్వం అడ్డు పడుతున్నది.
బహ్రయిన్ అయితే చురుకుగా ఈజిప్టులో పెట్టుబడులు పెడుతోంది. ఇదే సందుగా తానూ ప్రాంతీయ ఫైనాన్షియల్ హబ్ గా అవతరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. వెస్ట్ బ్యాంక్, గాజాలలో ఇజ్రాయెల్ పాల్పడుతున్న జాతి హననానికి స్పందనగా యెమెన్ లోని హుతీ తిరుగుబాటు ప్రభుత్వం ఇజ్రాయెల్ కు వచ్చే పోయే సరకు రవాణా నౌకలపై దాడులు చేస్తున్న నేపధ్యంలో ఈ సమస్య నుండి గట్టెక్కేందుకు బహ్రెయిన్, యుఏఇ లు ల్యాండ్ బ్రిడ్జి సౌకర్యం కలుగజేశాయి. గాజా యుద్ధంలో లక్షల మంది అరబ్ స్త్రీలు, పిల్లలు హతులు అవుతున్న పరిస్ధితిని తమ వాణిజ్య, ఆర్ధిక సంబంధాల వృద్ధికి వినియోగించడంలో ఈజిప్టుతో పాటు సౌదీ అరేబియా, బహ్రెయిన్, యుఏఇ, అమెరికా, ఈయు అన్నీ సమిష్టి కృషి, ద్వైపాక్షిక కృషి చేస్తున్న దారుణాన్ని ప్రపంచ వ్యాపితంగా ఉన్న శ్రామిక ప్రజలు గమనించి తీరాలి. తదనుగుణంగా అంతర్జాతీయ కార్మిక ఉద్యమ సంఘీభావాన్ని నిర్మించేందుకు కృషి చేయాలి. లేదంటే కార్మికవర్గ అంతర్జాతీయకు అర్ధమే లేకుండా పోతుంది.
———-సశేషం
sir, please check under the heading of అక్టోబర్ 7 , you mentioned the year as 2024 !
Corrected. Thanks Moola.