
యోం కిప్పుర్ వార్
1973 అక్టోబర్ లో సిరియా, ఈజిప్టులు ఓ పక్కా, ఇజ్రాయెల్ మరో పక్కా జరిగిన యుద్ధమే ‘యోం కిప్పుర్’ వార్. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించిన గోలన్ హైట్స్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడం సిరియా లక్ష్యం. అలాగే ఇజ్రాయెల్ ఆక్రమించిన తన భూభాగం సినాయ్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఈజిప్టు లక్ష్యం. 1967 ఆరు రోజుల యుద్ధంలో ఓటమి ద్వారా కోల్పోయిన ప్రతిష్టను మరో యుద్ధంలో విజయం ద్వారా తిరిగి సంపాదించి ఈజిప్టు ప్రజల్లో మద్దతు సంపాదించాలన్నది కూడా సాదత్ సాధించదలచిన మరో లక్ష్యం. అయితే అన్వర్ సాదత్ అమెరికా, ఇజ్రాయెల్ ల దుష్ట కూటమికి పరోక్ష మద్దతు ఇస్తూ సిరియాకు వెన్ను పోటు పొడిచేందుకు సిద్ధపడ్డాడు.
యోం కిప్పుర్ వార్ ఆరంభంలో ఈజిప్టు, సిరియా సైన్యాలు పై చేయి సాధించాయి. ఈజిప్టు సైన్యం సూయజ్ కాలువ దాటి సినాయ్ లోకి చొచ్చుకు వెళ్ళాయి. సిరియా సైన్యం దాదాపు గోలన్ హైట్స్ అవతలి సరిహద్దు సమీపం వరకు పురోగమించాయి. ఈ పరిణామాలతో అమెరికా కంగారు పడింది. అత్యవసరంగా ఆయుధాలను ఇజ్రాయెల్ కు విమానాల్లో (ఎయిర్ లిఫ్ట్) పంపింది. రష్యా కూడా సిరియా, ఈజిప్టులకు ఆయుధాలు విమానాల్లో సరఫరా చేసింది. (అలీన ఉద్యమం నేత అయినప్పటికీ నాజర్ నేతృత్వం లోని ఈజిప్టు, ఇండియా వలే, రష్యాతో సంబంధాలు కొనసాగించింది) కానీ అప్పటికే ఇజ్రాయెల్ ఆరంభించిన కౌంటర్ అఫెన్సివ్ (ప్రతి దాడి) పురోగమనం సాధించింది.
ఇజ్రాయెల్ సైన్యం సూయజ్ ను దాటి కైరో సమీపానికి రావడంతో సోవియట్ యూనియన్ తమ సేనలు రంగంలో దిగాల్సి ఉంటుందని బహిరంగంగా హెచ్చరించింది. ఇజ్రాయెల్ ను కట్టడి చేయాలని ఐరాస శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ ని ఒప్పించాలని సౌదీ అరేబియా, అమెరికాను గట్టిగా కోరింది. (అమెరికా, సౌదీ అరేబియాకు అతి పెద్ద చమురు కస్టమర్. కాగా 1970లో చమురు అమ్మకాలు డాలర్లలో జరపాలని అమెరికా సౌదీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్లనే పెట్రో డాలర్ ఆధిపత్యం సాధ్యమయింది) దానితో ఇజ్రాయెల్ పురోగమనానికి బ్రేకు పడింది. అణు వార్ హెడ్ లతో కూడిన స్కడ్ మిసైళ్ళను రష్యా మధ్య ప్రాచ్యంకు తరలించిందన్న వార్తలు వ్యాపించాయి. పులిట్జర్ ప్రైజ్ విజేత జర్నలిస్టు సేమూర్ హర్ష్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఇజ్రాయెల్, అమెరికాకు రహస్య వర్తమానం పంపుతూ వెంటనే ఆయుధాలు ఎయిర్ లిఫ్ట్ చెయ్యకపోతే తమ అణ్వాయుధాలు సిద్ధం చేస్తామని తెలియజేసింది. అమెరికా వెంటనే తన స్ట్రాటజిక్ ఎయిర్ కమాండ్, కాంటినెంటల్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్, యూరోపియన్ కమాండ్, ఇటలీలోని సిక్స్త్ ఫ్లీట్ అన్నింటినీ డెఫ్కాన్ 3 (DEFCON 3) లెవెల్ అప్రమత్తతలో ఉంచింది. దీనర్ధం అమెరికా బలగాలు సాధారణ సంసిద్ధత కంటే అధిక స్థాయిలో అప్రమత్తంగా ఉండి ఆదేశాలు వెలువడ్డ 15 నిమిషాల్లో మోహరింపుకు సిద్ధంగా ఉండటం. అణు యుద్ధం తప్పదా అన్నంత పరిస్ధితి ఏర్పడింది.

రష్యాను చల్లబరిచేందుకు అమెరికా విదేశీ మంత్రి హెన్రీ కిసింజర్ హుటాహుటిన మాస్కో వెళ్లి చర్చలు జరిపాడు. గోలన్ హైట్స్ ను దాటి ఇజ్రాయెల్ సిరియా రాజధాని డమాస్కస్ కు 40 కి.మీ చేరువగా వెళ్ళాయి. అమెరికా సాయంతో మొదలైన ఇజ్రాయెల్ రెండవ కౌంటర్ అఫెన్సివ్ (మొదటి కౌంటర్ అఫెన్సివ్ ను సిరియా, ఈజిప్టులు తిప్పి కొట్టాయి) తీవ్రంగా ఉండడంతో, సిరియా అధ్యక్షుడు హఫీజ్, సినాయ్ వద్ద దాడి తీవ్రత పెంచాలని అన్వర్ సాదత్ కు రహస్య వర్తమానం పంపాడు. అలా చేస్తే ఇజ్రాయెల్ సేనలు సినాయ్ వద్ద కేంద్రీకరణ పెంచుతుందని, తద్వారా గోలన్ హైట్స్ ను దాటిన ఇజ్రాయెల్ సైన్యాన్ని తిప్పి కొట్టవచ్చని హఫీజ్ ఆశించాడు.
కాని యుద్ధం ముందు నుండే ఇజ్రాయెల్, అమెరికాలతో స్నేహానికి తాపత్రయ పడిన అన్వర్ సాదత్ సిరియా కోరికను తిరస్కరించాడు. రష్యాలో ఉన్న కిసింజర్, కాల్పుల విరమణకు రష్యాను ఒప్పించాడు. ఈ ఒప్పందాన్ని ఐరాస తీర్మానంగా ఆమోదించింది. ఒప్పందానికి అంగీకరించిన ఇజ్రాయెల్ డమాస్కస్ సమీపం నుండి వెనక్కి మళ్లింది. కానీ గోలన్ హైట్స్ ను వదలలేదు. గోలన్ హైట్స్ పునః స్వాధీనంలో సిరియా విఫలం అయింది. ఇజ్రాయెల్ సేనలు డమాస్కస్ కు 40 కి.మీ దూరంలోనూ, కైరోకు 80 కి.మీ దూరంలోనూ ఉండగా యుద్ధం ముగిసింది. యుద్ధంలో గెలిచామని ఇజ్రాయెల్, ఈజిప్టు రెండూ ప్రకటించాయి. అయితే ఇజ్రాయెల్ అజేయుడు ఏమీ కాదని, అరబ్ ప్రజలతో పాటు ప్రపంచానికి ఎరుకలోకి వచ్చింది. కుట్ర, మోసం లకు అలవాటు పడ్డ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మళ్ళీ కాల్పులు ప్రారంభించింది. సోవియట్ యూనియన్ ఈజిప్టుకు సైన్యం పంపుతానని మరోసారి హెచ్చరించింది. అమెరికా ఒత్తిడి చేయడంతో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది.
క్యాంప్ డేవిడ్ ఒప్పందం
ఈజిప్టు నేత అన్వర్ సాదత్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిసింజర్ తో దగ్గరి సంబంధాలు నెలకొల్పుకున్నాడు. తద్వారా జియోనిస్ట్ ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య సంబంధాల సాధారణీకరణ కు వ్యతిరేకించి, పాలస్తీనా విమోచనకు మద్దతు సమకూర్చిన అరబ్ జాతీయోద్యమానికి కూడా వెన్ను పోటు పొడిచాడు. సాదత్ నేతృత్వంలో ఈజిప్టు అనుసరించిన జియోనిజం (అమెరికా, ఇజ్రాయెల్ లు ప్రవేశ పెట్టిన పొలిటికల్ జుడాయిజం) అనుకూల విధానాలు అరబ్ జాతీయోద్యమాన్ని మరణ శయ్య ముందు నిలబెట్టడంలో ఇప్పటికీ పాత్ర పోషిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు.
1971 లోనే (యోం కిప్పుర్ వార్ కి ముందు) అన్వర్ సాదత్ ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందానికి ప్రయత్నించాడు. సినాయ్ ప్రాంతానికి వెనక్కి ఇచ్చేస్తే, ఈజిప్టు ఇజ్రాయెల్ తో వైరం మానుకుని స్నేహంగా ఉంటుందని ప్రతిపాదించాడు. కానీ 1967 అరబ్-యూదు యుద్ధం విజయం మత్తులో ఉన్న ఇజ్రాయెల్ అందుకు తిరస్కరించింది. అరబ్బు దేశాల వల్ల ఇజ్రాయెల్ కు కొత్తగా వచ్చే ప్రమాదం లేదనీ యుద్ధం జరిగితే మనదే విజయం అనీ ఇజ్రాయెల్ సైన్యాధికారులు గట్టి హామీ ఇవ్వడం ఈ తిరస్కరణకు కారణమని చెబుతారు. ఈ తిరస్కరణ సాదత్ ను 1973 యుద్ధానికి పురికొల్పింది. అంతే తప్ప పాలస్తీనా విముక్తి లక్ష్యం ఆయన దృష్టిలో లేదు.
అప్పటికి ఈజిప్టు పాలకవర్గాలు ఆర్ధికంగా బలహీన స్థితిలో ఉన్నాయి. ఆర్ధిక సంక్షోభం చుట్టుముట్టింది. చమురు వనరుల అన్వేషణకు, వాణిజ్యం అభివృద్ధికి అమెరికా సహకారం అత్యవసరమని వారు భావించారు. పాలస్తీనా విమోచన పక్కన పెట్టి ఇజ్రాయెల్ తో రాజీకి వస్తే తప్ప అమెరికాతో సాన్నిహిత్యం సాధించలేమని వారు నమ్మారు. మరో పక్క ఈజిప్టు, ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకుంటే ఇజ్రాయెల్ వ్యతిరేక పాలస్తీనా విమోచన ఉద్యమం చావు దెబ్బ తింటుందని అమెరికా, ఇజ్రాయెల్ లు గ్రహించాయి. అందుకు ఏర్పాట్లు ప్రారంభించాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, ఈజిప్టు లు 1979లో క్యాంప్ డేవిడ్ ఒప్పందంపై సంతకం చేశాయి. క్యాంప్ డేవిడ్ అన్నది అమెరికా అధ్యక్షుడు సెలవు కాలంలో విశ్రమించే ప్రదేశం. ఇది మేరీ లాండ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ 12 రోజుల పాటు రహస్య చర్చలు జరిగాయి. దానికి ముందు 14 నెలల పాటు ఒప్పందాలపై కసరత్తు జరిగింది.

Camp David Accord -Anwar Sadat, Jimmy Carter, Menachem Begin (Israel PM)
అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, ఈజిప్టుతో పాటు ఇతర అరబ్ దేశాలు చర్చల్లో పాల్గొంటారని, తద్వారా పాలస్తీనా సమస్య ఒక కొలిక్కి వచ్చి ఇజ్రాయెల్ కు శాశ్వత రక్షణ లభిస్తుందని భావించాడు. అయితే జోర్డాన్ రాజు అరబ్ ప్రజల వ్యతిరేకతకు జడిసి చర్చల్లో పాల్గొనేందుకు తిరస్కరించాడు. సిరియా అధ్యక్షుడు హఫీజ్ ఆల్-అస్సాద్ అయితే పాలస్తీనా విమోచన సాధించే వరకూ ఇజ్రాయెల్ తో శాంతికి ఒప్పుకునేది లేదు పొమ్మన్నాడు. సౌదీ అప్పటికే అమెరికాకు మిత్ర దేశంగా ఉన్నది. ఈ నేపధ్యంలో ఈజిప్టు, ఇజ్రాయెల్ మధ్య రెండు ప్రధాన ఒప్పందాలు జరిగాయి.
మొదటిది: ఫ్రేం వర్క్ ఫర్ పీస్ ఇన్ మిడిల్-ఈస్ట్ (మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనా వ్యవస్థ). రెండవది: ఈజిప్టు-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం సాధనా వ్యవస్థ.
మొదటి అంశం ప్రకారం వెస్ట్ బ్యాంక్, గాజా లలో స్వయం ప్రతిపత్తి గల స్వయం పాలిత అథారిటీని ఏర్పరచాలి. ఐరాస తీర్మానం 242 ను పూర్తిగా అమలు చేయాలి. పాలస్తీనా ప్రజల న్యాయమైన హక్కులు గుర్తించడం, ఐదేళ్ల లోపు పూర్తి స్వయం ప్రతిపత్తి ఏర్పడేలా ఫ్రేం వర్క్ ని అమలు చేయడం, పూర్తి స్వయం ప్రతిపత్తి గురించి ఈజిప్టు, జోర్డాన్, పాలస్తీనా నేతలతో చర్చించడం, స్వయం పాలిత అథారిటీ ఎన్నిక అయ్యాక వెస్ట్ బ్యాంక్, గాజా నుండి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ. ఈ ఫ్రేం వర్క్ లో సిరియా నుండి ఇజ్రాయెల్ ఆక్రమించిన గోలన్ హైట్స్ ప్రస్తావనే లేదు. లెబనాన్ నుండి లాక్కున్న దక్షిణ ప్రాంతం గురించి ప్రస్తావించ లేదు. జోర్డాన్ రాజు ఒప్పందానికి కట్టుబడి ఉంటాడని ఆయన తరపున అన్వర్ సాదత్ హామీ ఇచ్చేశాడు. జెరూసలెం ప్రస్తావన అసలే లేదు. (తూర్పు జెరూసలెం తమ రాజధానిగా ఉండాలన్నది పాలస్తీనా డిమాండ్. వెస్ట్ బ్యాంక్, గాజాలకు స్వయం ప్రతిపత్తి అన్నారు తప్ప ప్రత్యేక పాలస్తీనా రాజ్య స్థాపన గురించి చర్చించలేదు.
రెండవ అంశం పూర్తిగా ఇజ్రాయెల్, ఈజిప్టు ద్వైపాక్షిక శాంతి, సంబంధాల గురించినది. సినాయ్ నుండి సేనల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. సినాయ్ లోని నాలుగు వాయు సేన స్థావరాలను తొలగించడం, అక్కడ నివాసం ఏర్పరచుకున్న 4,500 మంది యూదు సెటిల్‌మెంట్ లను తొలగించడం, ఇరు దేశాల మధ్య సాధారణ దౌత్య సంబంధాలు నెలకొల్పడం, సూయజ్ కాలువలో స్వేచ్ఛగా ప్రయాణం చేసేందుకు ఇజ్రాయెల్ కు గ్యారంటీ మొ.న అంశాలు రెండవ ఫ్రేం వర్క్ లో ఉన్నాయి.
ఐరాస తిరస్కరణ
ఐరాస జనరల్ అసెంబ్లీ మొదటి ఫ్రేం వర్క్ ని పూర్తిగా తిరస్కరించింది. ఐరాస, పాలస్తీనా ప్రజల ప్రతినిధి పిఎల్ఓ ల పాత్ర లేకుండా ఒప్పందాలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. పాలస్తీనా ప్రజలు తిరిగి సొంత భూభాగాలకు తిరిగి వచ్చే హక్కును, వారి స్వయం నిర్ణయాధికారాన్ని ఒప్పందం గుర్తించలేదని ఎత్తి చూపింది. ఐరాస రూపొందించిన ఫ్రేం వర్క్, ఐరాస చార్టర్, తీర్మానాల పరిధిలో లేని ఒప్పందాలకు విలువ లేదని తెగేసి చెప్పింది. (ఆ మేరకు తీర్మానం ఆమోదించింది.) ఐరాస చార్టర్ లో పాలస్తీనా ప్రజలు తిరిగి వచ్చే హక్కు, జాతీయ స్వతంత్రం సాధించే హక్కు, పాలస్తీనా సార్వభౌమాధికారం ఉన్నాయని గుర్తు చేసింది. పాలస్తీనా ప్రజల హక్కులు, సమగ్ర శాంతి సాధనల గురించి పట్టించుకోని ఇతరేతర, ప్రత్యేక పాక్షిక ఒప్పందాలు చెల్లుబాటు కావని తీర్మానం ఆమోదించింది. వెస్ట్ బ్యాంక్, గాజాల ఆక్రమణ కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ వైఖరిని ఖండించింది. ఆక్రమణల నుండి వైదొలగాలని ఆదేశించింది.
———–సశేషం