ఇయు ఎన్నికల్లో మేకరాన్ బోల్తా, ఫ్రాన్స్ మధ్యంతర ఎన్నికలు!


National Rally party workers’ jubilation

యూరోపియన్ పార్లమెంటు ఎన్నికల్లో బొక్క బోర్లా పడడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేకరాన్ దేశంలో మధ్యంతర ఎన్నికలు ప్రకటించాడు. జూన్ 6 తేదీ నుండి 9 తేదీ వరకు యూరోపియన్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి.

ఫ్రాన్స్ లో అతి మిత వాద పార్టీగా పేరు పొందిన లీ పెన్ నాయకత్వం లోని నేషనల్ ర్యాలీ పార్టీ ఫ్రాన్స్ నుండి అత్యధిక ఓట్లు సంపాదించడంతో మేకరాన్ అనూహ్యంగా మధ్యంతర ఎన్నికలు ప్రకటించాడు.

మధ్యంతర ఎన్నికల ద్వారా మెరైన్ లీ పెన్ సాధించిన ఆధిపత్యాన్ని అరికట్టవచ్చని మేకరాన్ అంచనా వేస్తున్నట్లు కనిపిస్తోంది. 2017 లో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మేకరాన్ వరుసగా 2022 ఎన్నికల్లో కూడా గెలుపొంది అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు.

అయితే 2022 లో గెలుపొందిన తర్వాత నుండి ఫ్రాన్స్ ఆందోళనలతో అట్టుడికింది. ముఖ్యంగా రైతులు, ట్రక్కర్లు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. యూరోపియన్ యూనియన్ విధానాలు ఫ్రాన్స్ రైతులు, ఇతర శ్రామిక ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ 2022 నుండి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 2023 లో మరింత విస్తరించిన ఆందోళనలు 2024 లోనూ కొనసాగాయి.

నిజానికి మేకరాన్ 2017 లో మొదటిసారి ఎన్నికయిన రెండేళ్ళ తర్వాత కూడా ఆందోళనలు జరిగాయి. ‘ఎల్లో వెస్ట్స్’ ఉద్యమం పేరుతో ప్రాచుర్యం పొందిన ఈ ఉద్యమాన్ని మొదట ట్రక్కు డ్రైవర్లు మేకరాన్, డీజెల్ పై విధించిన గ్రీన్ ట్యాక్స్ కు వ్యతిరేకంగా ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్ధులు, కార్మికులు, మధ్య తరగతి ప్రజలు కూడా ఆందోళనల్లో పాల్గొనడం ప్రారంభించారు.

యూరోపియన్ యూనియన్ విధానాల్లో భాగంగా పర్యావరణం కాలుష్యం పేరుతో డీజెల్ వినియోగంపై భారీ పన్ను విధించడంతో ట్రక్కు రవాణాపై భారం పడింది. ఇయు నిర్దేశించిన కనీస వేతన చట్టం ప్రకారం ఇస్తున్న 1350 డాలర్లు పెంచాలని కార్మిక వర్గం డిమాండ్ చేస్తోంది.

మధ్యతరగతి ఉద్యోగులైతే తమ వేతనాలు ఓ పక్క సోషల్ వెల్ఫేర్ బెనిఫిట్స్ పొందడానికి వీలు లేనంత ఎక్కువ గానూ, మరో పక్క కనీస జీవన ప్రమాణాలతో జీవించలేనంత తక్కువ గానూ ఉన్నాయని నిస్పృహ వ్యక్తం చేశారు.

ఆందోళనకారులు ప్రధానంగా అధ్యక్షుడు మేకరాన్ నే లక్ష్యంగా చేసుకున్నారు. మొదటి అధ్యక్షరికంలో కార్మిక చట్టాలను బలహీన పరచడమే కాకుండా సంపన్నులపై విధించిన వెల్త్ ట్యాక్స్ (సంపద పన్ను) ను రద్దు మేకరాన్ రద్దు చేశాడు. గ్రీన్ ట్యాక్స్ పేరుతో డీజెల్ పై ఇంధన ట్యాక్స్ విధించాడు. ఈ విధానాలతో మేకరాన్ “ధనవంతుల అధ్యక్షుడు” అని పేరు తెచ్చుకున్నాడు.

ఆరంభంలో రైతులు ఫ్రెంచి రాష్ట్రాలలో ఆందోళన ప్రారంభించారు. 2022 నుండి 2024 వరకు ఆందోళనలు ప్యారిస్ కు విస్తరించాయి. ఆందోళనకారులు పలు చోట్ల అల్లర్లు, లూటీలకు సైతం పాల్పడ్డారు. అతి మిత వాద గ్రూపులు, అల్ట్రా లెఫ్ట్ గ్రూపులు ఈ హింసకు పాల్పడ్డారని ప్రభుత్వం ఆరోపించింది.

మిత వాద పార్టీ నేషనల్ ర్యాలీ (అంతకు మునుపు ఈ పార్టీ పేరు నేషనల్ ఫ్రంట్) నేత లీ పెన్ తో పాటు పార్లమెంటరీ లెఫ్టిస్టు పార్టీలు ప్రజల ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. అయితే ఆందోళనలను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఆ పార్టీలను అనుమతించలేదు. ఫ్రాన్స్ లోని అన్ని పార్టీలతో ప్రజలు విసిగిపోయారని ఈ పరిణామంతో స్పష్టం అయింది.

Yellow Vest rally in Paris

ఎల్లో వెస్ట్స్ ఆందోళన అయిదారేళ్ళ పాటు కొనసాగడం గుర్తించవలసిన అంశం. “ఫ్రాన్స్ లో ఇక బ్రతకలేము, మా ఫ్రిడ్జ్ లు ఖాళీ అయినాయి” అని కొందరు చెప్పగా ఆసుపత్రులు, ఇతర సామాజిక సేవలు అధ్వాన్నంగా ఉన్నాయని మరి కొందరు చెప్పారు. దేశంలో అసమానతలు మునుపు ఎన్నడూ ఎరగని రీతిలో పెరిగిపోయాయని అనేక మంది వివరించారు. “మాకు సామాజిక న్యాయం, మరింత నిజమైన ప్రజాస్వామ్యం కావాలి” అని ముక్త కంఠంతో ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

అయితే ఫ్రాన్స్ లో ప్రత్యామ్నాయం కొరవడిన పరిస్ధితుల్లో ప్రజలు ఇయు పార్లమెంటు మెరైన్ లీ పెన్ నాయకత్వం లోని అతి మితవాద పార్టీ వైపు మొగ్గారు. మేకరాన్ పార్టీ రినైసేన్స్ (15%) కంటే లీ పెన్ పార్టీకి రెట్టింపు (32%) ఓట్లు జూన్, 2024 ఎన్నికల్లో లభించాయి.

2007-08 నాటి ప్రపంచ ఆర్ధిక-ద్రవ్య సంక్షోభం అనంతరం యూరప్ లో ఋణ సంక్షోభం ఏర్పడింది. గ్రీసు లో మొదలైన ఈ సంక్షోభం ఆనతి కాలంలోనే ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ లాంటి దక్షిణ యూరప్ దేశాలకు వేగంగా విస్తరించింది. ఋణ సంక్షోభం నుండి బైట పడే పేరుతో ఐరోపా దేశాలు ‘ఫిస్కల్ కన్సాలిడేషన్’ పేరుతో అత్యంత కఠినమైన పొదుపు విదానాలు అమలు చేయడం ప్రారంభించారు. ఋణ సంక్షుభిత రాజ్యాలపై ఋణ భారం మరింత పెంచి అనేక విషమ షరతులు విధించడం ద్వారా ఆ దేశాల ఆర్ధిక వ్యవస్ధల సార్వభౌమత్వాన్ని సైతం పాక్షికంగా జర్మనీ, ఫ్రాన్స్ లు తమ చేతుల్లోకి తీసుకున్నాయి.

ఋణ సంక్షోభం పేరుతో విధించిన పొదుపు విధానాలు చివరికి జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం లాంటి ఉత్తర ఐరోపా దేశాలు కూడా అమలు చేయడం మొదలు పెట్టాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా రష్యా చమురు, గ్యాస్ వాణిజ్యంపై అమెరికా విధించిన షరతుల వల్ల ఐరోపా దేశాలకు అత్యంత చౌకగా లభించే రష్యన్ గ్యాస్, చమురు రవాణా రద్దయింది.

రష్యా గ్యాస్, చమురు లనే ఇండియా లాంటి దేశాల నుండి కొనుగోలు చేయడం ద్వారా నష్టాలు పూడ్చుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ అమెరికా నుండి రెండు, మూడు రెట్లు ధరతో దిగుమతి అవుతున్న గ్యాస్ వలన ఐరోపాలో ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్ లలో మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా అన్తర్జాతీయ మార్కెట్లో ఆ దేశాల ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయి ఆర్ధిక వ్యవస్థలు క్రమంగా రిసెషన్ (మాంద్యం) లోకి జారుకున్నాయి.

పొదుపు విధానాల ద్వారా కార్మిక వర్గం, మధ్య తరగతి ఉద్యోగుల వేతనాలను కత్తిరించడం, ఉన్న ఉద్యోగులను తొలగించి అత్యంత తక్కువ వేతనాలకు కొత్త ఉద్యోగులను నియమించడం, భారీ లే ఆఫ్ లు ప్రకటించడంతో శ్రామిక వర్గం వేతనాలు సౌకర్యాల నుండి భారీ వాటా బహుళజాతి కంపెనీలకు మరింత పెరిగిన లాభాలుగా తరలిపోయింది.

ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఐరోపా దేశాల్లో మితవాద గాలి వీస్తోంది. వామపక్షం పేరుతో చెలామణి అవుతున్న పార్లమెంటరీ లెఫ్ట్ పార్టీలు ప్రజల్లో ఇప్పటికే పలుచన కావడంతో వారిని నమ్మే పరిస్ధితిలో జనం లేరు. ప్రత్యామ్నాయంగా ప్రజలకు మితవాద పార్టీలే కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ లో అత్యధిక ఓట్లు మితవాదులు సంపాదించగా ఇతర దేశాల్లోని మితవాద పార్టీలు తమ బలాన్ని గణనీయంగా పెంచుకున్నాయి.

ఐరోపాలో రాజకీయ కేంద్రం సెంట్రిస్టు పార్టీల నుండి మితవాదం వైపుకి జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐరోపా రాజకీయాలు, ఫ్రాన్స్ రాజకీయాలు వేరు వేరని దేశాధ్యక్షుడు మేకరాన్ నమ్ముతున్నాడు. ఇయు పార్లమెంటుకి మితవాదులని అధిక సంఖ్యలో పంపినప్పటికీ ఫ్రాన్స్ కి వచ్చేసరికి ప్రజలు సెంట్రిస్టు పార్టీ వైపే మొగ్గుతారని ఆయన భావిస్తున్నాడు. ఆ నమ్మకంతోనే ఫ్రాన్స్ ఎన్నికలకు పిలుపిచ్చాడు. ఈ ఎన్నికల వల్ల మేకరాన్ అధ్యక్ష పదవికి ముప్పు లేనప్పటికీ పార్లమెంటు మెజారిటీ మితవాదుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉన్నది.

ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం ఎన్నికల్లో మెరైన్ లీ పెన్ విజయం సాధించినప్పటికీ మేకరాన్ విధానాలు బలహీనపడక పోగా మరింత తీవ్రం అయ్యే అవకాశం మెండుగా ఉన్నది. లీ-పెన్ పార్టీ ఇప్పటికే సూపర్ రిచ్ వర్గాల కట్టుబాట్ల లోకి వెళ్ళిపోయింది. నేషనల్ ర్యాలీ ఆధిక్యం సాధిస్తే ప్రజలకు కనిపించడం కోసం అధ్యక్షుడు మేకరాన్, లీ-పెన్ నేతృత్వం లోని పార్లమెంటు ఘర్షణ పడినట్లు షో ప్రదర్శించవచ్చు. వాస్తవంలో మరింత వేగంగా ఇండియాలో మితవాద హిందూత్వ పార్టీకి మల్లేనే కార్మిక వ్యతిరేక సంస్కరణలు అమలు చేయటానికే నేషనల్ ర్యాలీ పార్టీ మొగ్గు చూపుతుంది. ఆ మేరకు మేకరాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది.

జర్మనీలో సెంటర్-రైట్ పార్టీలు అధిక స్థానాలు గెలిచినప్పటికీ అక్కడి మితవాద పార్టీ ‘ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ’ (AfD), జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ కు చెందిన సోషల్ డెమొక్రాట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించి అతి పెద్ద రెండవ పార్టీగా అవతరించింది. పార్లమెంటరీ లెఫ్ట్ పార్టీలు ఉన్న బలాన్ని కూడా కోల్పోయాయి.

స్కాండినేవియా దేశాలు మాత్రం మితవాద పార్టీల వేవ్ ను తప్పించుకున్నాయి. స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ లలో మితవాదుల బలం గతం కంటే తగ్గింది. కానీ లిబరల్, గ్రీన్ మరియు లెఫ్టిస్టు పార్టీలు ఐరోపా వ్యాపితంగా సీట్లు కోల్పోయి బలహీనపడ్డాయి. ఇటలీ మితవాద ప్రధాన మంత్రి జార్జియా మెలోని నాయకత్వం లోని ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీ యూరోపియన్ పార్లమెంటులో సీట్లు రెట్టింపు చేసుకుంది.

పాలకవర్గాలు తమలో తాము సెంటర్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్, లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్, లిబరల్, రైట్, అల్ట్రా రైట్, అల్ట్రా లెఫ్ట్ ఇత్యాది పేర్లతో గ్రూపులుగా విడిపోయి ప్రజలను ఆకర్షించి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అంతిమ పరిశీలనలో వారి విధానాలలో, ముఖ్యంగా కార్మికవర్గం పట్ల అవి అనుసరించే విధానాలలో ఎలాంటి తేడాలు ఉండవు.

వివిధ పార్టీలను ఒకదాని తర్వాత మరొక దాన్ని లేదా ఒక గ్రూపు తర్వాత మరొక గ్రూపును అధికారంలోకి ఎక్కిస్తూ, దించుతూ పోవడాన్ని పార్లమెంటరీ పార్టీల పట్ల ప్రజల్లో భ్రమలు బలహీనపడుతున్న పరిస్ధితిగానే చూడాల్సి ఉంటుంది తప్ప అధికారం అప్పజెప్పే పార్టీ పట్ల వారికి ఏవో ఆశలు ఉన్నట్లుగా అర్ధం చేసుకోలేము. అనగా ప్రతి ఎన్నికలోనూ ప్రజలు నెగిటివ్ ఓటు వేస్తున్నారు తప్ప పాజిటివ్ ఓటు వేస్తున్న దాఖలా లేదు. ఈ నేపధ్యంలో నిజమైన ప్రత్యామ్నాయంతో సామాజిక న్యాయం అందించగల, అసమానతలు తొలగించగల రివల్యూషనరీ శక్తులు ప్రభావ హీనంగా ఉండడం విచారకరమైన సంగతి!

వ్యాఖ్యానించండి