
అమెరికా, ఇండియాలతో పాటు మరో 12 దేశాలు ‘ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేంవర్క్’ పేరుతో ఏర్పాటు చేసిన మరో కొత్త ఆర్ధిక కూటమి ఈ నెలలో కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ) ద్వారా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా కు పెను సవాలు ఎదురవడంతో ఆయా దేశాలతో సరికొత్త ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అమెరికా చైనాకు చెక్ పెట్టాలని చూస్తున్నది. అందులో భాగమే ఈ ఐపిఇఎఫ్ కూటమి.
మే 23, 2022 లో ఏర్పాటు చేసిన ఈ కూటమిలో అమెరికా మిత్ర దేశాలతో పాటు కొన్ని ఆగ్నేయాసియా దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఐపిఇఎఫ్ సభ్య దేశాలు: ఆస్ట్రేలియా, బ్రూనే దారుస్సలాం, ఫిజి, ఇండియా, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, న్యూ జీలాండ్, ఫిలిప్పైన్స్, సింగపూర్, ధాయిలాండ్, అమెరికా, వియత్నాం.
ఇండో-పసిఫిక్ పద ప్రయోగం అమెరికా బుర్రలో పుట్టింది. చైనాకు సవాలుగా ఇండియాను అమెరికా ప్రయోజనాల ప్రతినిధిగా నిలబెట్టేందుకు మాత్రమే ఇండో-పసిఫిక్ ప్రాంతం అంటూ కొత్త పదబంధాన్ని భౌగోళిక రాజకీయాల లోకి చొప్పించింది. WTO వేదికపై చైనా, ఇండియా, బ్రెజిల్ ల నుండి వ్యవసాయ రంగం సబ్సిడీల విషయమై అమెరికాకు అసౌకర్యం కలిగించే ప్రశ్నలు, ప్రతిపాదనలు ఎదురవున్న నేపధ్యంలో ఆ వేదికను అమెరికా బొంద లోకి నెట్టేసింది.
తన మాట చెల్లుబాటు అయ్యే వరకు WTO వేదికను వినియోగించుకున్న అమెరికా ఇప్పుడు దానిని వదిలి సరికొత్త కూటములను, ఒప్పందాలను నిర్మిస్తోంది. తాను స్వయంగా రక్షణ (protective) ఆర్ధిక విధానాలు అవలంబిస్తూ వివిధ కూటముల పేరుతో ఆర్ధిక, మిలటరీ పెత్తనాన్ని కొనసాగించేందుకు ఎత్తుగడలు వేస్తున్నది.
ఐపిఇఎఫ్ ద్వారా దక్షిణ చైనా సముద్రం, దక్షిణ ఆసియా దేశాలలో ప్రభావాన్ని పెంచుకుని చైనా సవాలును నిలువరించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఆగ్నేయాసియా దేశాలు క్రమంగా చైనా పెత్తనానికి భయపడే దశలో ఉన్నాయి. దానితో అమెరికా ఏర్పరిచే కూటములు పేరుకు మాత్రమే అన్నట్లుగా ఉంటున్నాయి తప్ప చైనాను నిలువరించే కార్యకలాపాలు పెద్దగా నిర్వహించలేకపోతున్నాయి.
ఐపిఇఎఫ్ కూటమి ప్రధానంగా క్లీన్ ఎకానమీ మరియు ఫెయిర్ ఎకానమీ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. క్లీన్ ఎకానమీ ఒప్పందం పర్యావరణ కాలుష్య నివారణకు సంబంధించినది కాగా ఫెయిర్ ఎకానమీ ఒప్పందం పన్నులు, కస్టం సుంకాలు, అవినీతి లాంటి అంశాలకు సంబంధించినది. సింగపూర్ లో జరిగిన ఐపిఇఎఫ్ సమావేశాలలో జరిగిన ఒప్పందాలు 4 స్తంభాల (పిల్లర్) పై ఆధారపడి ఉన్నట్లు అమెరికా కామర్స్ సెక్రటరీ జినా రైమండో చెబుతోంది.
నాలుగు పిల్లర్లలో పిల్లర్ 1: వాణిజ్యం. పిల్లర్ 2: సప్లై చెయిన్ పిల్లర్. సరుకుల రవాణా, వివిధ ఉత్పత్తి స్థానాల లింకేజి, ముడి సరుకుల సరఫరా మొదలైన అంశాలలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ పిల్లర్ విషయమై జరిగే ఒప్పందాలు తోడ్పడతాయి. పిల్లర్ 3: క్లీన్ ఎకానమీ, పిల్లర్ 4: ఫెయిర్ ఎకానమీ. ఇండియా రెండు నుండి 4 వరకు ఉన్న పిల్లర్ల ఒప్పందాలలో చేరింది. పిల్లర్ 1 ఒప్పందంలో కేవలం పరిశీలక దేశంగా చేరింది.
పిల్లర్ 1 లో ఉన్న డిజిటల్ కామర్స్, మరియు లేబర్ అంశాలపై కూటమిలో విభేదాలు తలెత్తడం వలన దానిపై ఒప్పందం సాధ్యం కాలేదు. ఈ అంశంలో ఒప్పందాలు ఎప్పుడు కుదిరేదీ, అసలు ఒప్పందం సాధ్యమా అన్న అంశం పైన కూడా అమెరికా ప్రతినిధి ఏమీ చెప్పలేకపోయింది.
అమెరికా కంపెనీలు బ్లాక్ రాక్, జిఐసి, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, టేమాసేక్ మొ.వి రానున్న కాలంలో ఇండో-పసిఫిక్ ప్రాంతం లోని ఎమర్జింగ్ మార్కెట్ల ఇన్ఫ్రా స్ట్రక్చర్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని అమెరికా ప్రతినిధి ప్రకటించింది.
అయితే అమెరికా ఆర్ధిక శక్తి క్షీణిస్తున్న నేపధ్యంలో ఈ పెట్టుబడుల వాగ్దానం ఏ మేరకు వాస్తవ రూపం దాల్చుతుంది అన్నది అనుమానమే. ఒక్క ఉక్రెయిన్ యుద్ధం, గాజా మారణకాండ లకు ఆయుధాలు సరఫరా చేయడం తప్ప ఈ మధ్య కాలంలో అమెరికా తన మిత్ర దేశాలకు ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు కాణీ కూడా విదల్చలేదు. అమెరికా ఫైనాన్స్ కంపెనీలకు, మిలటరీ ఇండస్ట్రియల్ కంపెనీలకు లాభాలు వచ్చే అవకాశం ఉంటే తప్ప అమెరికా నుండి ఎలాంటి సహకారం అందదు అని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
గతంలో జరిగిన ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్ (TPP) ఒప్పందం నుండి ట్రంప్ హయాంలో అమెరికా బైటికి వచ్చేసింది. చైనా నాయకత్వంలో ఏర్పడిన 15 దేశాల రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్టనర్షిప్ (RCEP) లో అమెరికా చేరలేదు. ఇండియా కూడా చివరి నిమిషంలో RCEP చర్చల నుండి బైటికి వచ్చేసింది. అమెరికా పాత్ర లేని ఈ రెండు ఒప్పందాలకు సమాధానంగానే అమెరికా ఐపిఇఎఫ్ కు రూపకల్పన చేసిందని పరిశీలకుల నిశ్చితాభిప్రాయం.