నైజర్, సహేల్ నుండి అమెరికా, ఫ్రాన్స్ సేనల పలాయనం!


People on street in support of Military in Niger waving Russian flags

ఆఫ్రికా ఖండంలో చైనా, రష్యాల చొరబాటు పెరిగే కొద్దీ ఒక్కొక్క దేశమూ అమెరికా ఉడుం పట్టు నుండి జారిపోతున్నాయి. అమెరికా కేంద్రంగా ఏక ధృవ ప్రపంచం రద్దయి పోయి బహుళ ధృవ ప్రపంచం స్థిరపడే (consolidate) దిశగా ఒక్కొక్క అడుగూ బలీయం అవుతోంది. తమ దేశాన్ని వెంటనే ఖాళీ చేయాలని నైజర్ మిలటరీ ప్రభుత్వం ఏప్రిల్ 2024లో అల్టిమేటం ఇచ్చిన నేపధ్యంలో తమ సేనల్ని ఆ దేశం నుండి ఉపసంహరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

సెప్టెంబర్ 15 తేదీ లోపు నైజర్ నుండి అమెరికా సేనల్ని పూర్తిగా ఉపసంహరించేందుకు నైజర్, అమెరికా నైజర్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. నైజర్ లోని అమెరికాకు చెందిన రెండు మిలటరీ స్థావరాలలో 1100 మందితో కూడిన సైన్యం తిష్ట వేసింది. రాజధాని నియామీ తో పాటు అగాదేజ్ పట్టణంలో ఈ స్థావరాలు నెలకొల్పింది. ఈ స్థావరాల నుండి అమెరికా సైన్యం డ్రోన్ ల సాయంతో నిఘా, రెక్కీ మిషన్ లను నిర్వహించేది. మిలటరీ తిరుగుబాటు అనంతరం అమెరికా కార్యకలాపాలు ఒక్క నియామీ స్థావరం వరకే పరిమితం అయ్యాయి.

పశ్చిమ ఆఫ్రికా దేశాలు లేదా సహేల్ ప్రాంతం దేశాల రక్షణ కోసం అని చెబుతూ అమెరికా నైజర్ లో ఈ సైనిక స్థావరాలు ఏర్పరిచింది. అయితే 26, జులై 2023 లో నైజర్ మిలటరీ పాలకులు అమెరికా మరియు ఫ్రాన్స్ దేశాలకు సేవ చేస్తున్న మహమ్మద్ బజౌమ్ ప్రభుత్వాన్ని కూల దోసి మిలటరీ పాలన ప్రారంభించారు. బజౌమ్ భద్రతను చూసే ప్రెసిడెన్షియల్ గార్డులే ఆయనను అరెస్టు చేసి మిలటరీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నట్లు ప్రకటించారు. కొద్ది నెలల తర్వాత తమ దేశం నుండి వెళ్ళిపోవాలని ఫ్రాన్స్ సైన్యాన్ని ఆదేశించారు. మరీ ముఖ్యంగా పశ్చిమ దేశాల పుండు మీద కారం రాస్తూ తమ దేశ రక్షణ బాధ్యతలు తీసుకోవాలని రష్యా ప్రైవేట్ మిలటరీ సంస్థ వాగ్నర్ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

నైజర్ లో మిలటరీ అధికారం చేపట్టడాన్ని “సైనిక కుట్ర” గా గుర్తిస్తూ అక్టోబర్ 2023లో అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఫలితంగా అమెరికా చట్టాల ప్రకారం నైజర్ కు మిలటరీ మద్దతు గానీ ఇతర సహాయం గానీ చేయడం రద్దయింది. “రష్యా, ఇరాన్ దేశాలతో నైజర్ స్నేహ సహకార ఒప్పందాలు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి” అని ప్రకటించింది.

అయితే నైజర్ తొణకలేదు, బెణకలేదు. అమెరికాతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న “మిలటరీ సహకార ఒప్పందం” అని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దానితో నైజర్ లో అమెరికా సేనల ఉనికి చట్ట విరుద్ధం గా మారింది. వెంటనే దేశాన్ని ఖాళీ చేయాలని అమెరికాకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే అమెరికా సేనల ఉనికి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఉదాహరణకి 2022లో ‘ఆఫ్రికా బారోమీటర్ సంస్థ జరిపిన సర్వేలో మూడింటి రెండు వంతుల మంది ప్రజానీకం దేశ రక్షణ కోసం ప్రభుత్వం అమెరికా మిలటరీ బలగాల సహాయం తీసుకోవడం పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. ఈ అసంతృప్తి నేపధ్యంలో నైజర్ ప్రజలు మిలటరీ పాలనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వీధుల్లోకి వచ్చారు. ఫ్రాన్స్ జెండాలను తగులబెట్టారు. ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపై దాడులు చేశారు. అమెరికా సైనిక స్థావరం వద్ద ప్రతి రోజూ ఆందోళనలు చేయడం ప్రారంభించారు. దానితో నైజర్ భద్రత పేరుతో తిష్ట వేసిన అమెరికా సైన్యానికే అక్కడి ప్రజల నుండి భద్రత కరువయింది.

ఫలితంగా నైజర్ నుండి ఉపసంహరించుకోవడం తప్ప వేరే మార్గం అమెరికాకు లేకుండా పోయింది. దశాబ్దం పైగా నైజర్ లోని సహజ వనరులను కొల్లగొట్టిన అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఇక పలాయనం చిత్తగించక తప్పదని తెలిసి వచ్చింది. మే నేల రెండవ వారంలో మిలటరీ పాలకులతో అమెరికా చర్చలు జరిపింది. తమ సేనలను ఉపసంహరించే వరకు తమ సైన్యానికి భద్రత కావాలని, ఉపసంహరణలో తమ సైనికులకు ఎలాంటి హాని కలగకుండా చూడాలనీ, తమ మిలటరీ విమానాలు సైనిక స్థావరం నుండి ఎగరడానికి అనుమతి ఇవ్వాలని ఈ చర్చలలో అమెరికా కోరింది. చర్చల్లో మిలటరీ విమానాలు ఎగరడానికి అనుమతి ఇచ్చే అంశంలో ఇరు పక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు నైజర్ వదిలి వెళ్లిన అమెరికా సేనలు మిలటరీ విమానాలకు బదులు వాణిజ్య విమానాల ద్వారా దేశం విడిచి వెళ్ళారని అమెరికా అధికారులను ఉటంకిస్తూ సిఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది. దేశంలో మిగిలి ఉన్న సైనికులు తమతో పాటు తమ యుద్ధ పరికరాలను కూడా తీసుకెళ్లాల్సి ఉంది. అయితే నైజర్ నుండి అమెరికాకు తరలించేందుకు వీలు కానీ భారీ యుద్ధ సామాగ్రిని అక్కడే వదిలి వెళ్లాలని అమెరికా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

నియామీ సైనిక స్థావరాన్ని రష్యాకు చెందిన ప్రైవేటు మిలటరీ సంస్థ స్వాధీనం చేసుకుంది. స్థావరంలో ఓ పక్క అమెరికా సేనలు మిగిలి ఉండగానే మరో పక్క వాగ్నర్ బలగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. స్థావరం నుండి సున్నిత పరికరాలు, ప్రాణహాని కలిగించే పరికరాలు, ప్రమాదకర (hazardous) పరికరాలు మొ.న వాటిని తరలిస్తామని అమెరికా సైనికాధికారులు తెలిపారు.

“ఉపసంహరణ జరుగుతున్న క్రమంలో అమెరికా బలగాలకు రక్షణ మరియు భద్రత కల్పించేందుకు గ్యారంటీ ఇస్తూ ఇరు దేశాల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. అమెరికా సేనల ప్రవేశం మరియు తరలింపు ఎలా జరగాలి అన్న విషయంలో ఒప్పందం కుదిరింది. మిలటరీ విమానాలు ల్యాండింగ్ మరియు ఓవర్ ఫ్లైట్ ల అంశం లోనూ ఒప్పందం కుదిరింది” అని అమెరికా, నైజర్ ల ఉమ్మడి ప్రకటన తెలిపింది. “అమెరికా వదిలి వెళ్ళే యుద్ధ పరికరాలు రష్యా సేనల చేతుల్లోకి వెళ్లబోవని మేము ఇప్పటికైతే ఆశిస్తున్నాం” అని అమెరికా సైనికాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అమెరికా సైనికులు ఖాళీ చేస్తున్న స్థావరాన్నే రష్యా ప్రైవేటు సైన్యం స్వాధీనం చేసుకున్నందున అమెరికన్ల యుద్ధ పరికరాలను రష్యా సేనలు స్వాధీనం చేసుకోవన్న గ్యారంటీ లేదు. దీని వల్ల అమెరికా యుద్ధ పరికరాల రహస్యాలు కొంతవరకైనా రష్యా చేజిక్కే అవకాశం మెండుగా ఉన్నది. అయితే అమెరికాకు దీన్ని నిరోధించే దారి లేదు.

నైజర్ నుండి అమెరికా వెళ్లిపోతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని ఉమ్మడి ప్రకటనలో చెప్పడం విశేషం. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య స్నేహం కొనసాగుతుందని ప్రకటన చెప్పింది గానీ అది ఎలా ఉంటుందన్నదీ వివరించలేదు. ఇది కేవలం మర్యాదపూర్వక రాయబార భాష తప్ప మరొకటి కాదన్నది స్పష్టమే.

ఒక్క నైజర్ మాత్రమే కాదు. సహేల్ ప్రాంతంలోని మాలి, బర్కినాఫాసో దేశాలలో కూడా మిలటరీ అధికారులు సో-కాల్డ్ ఎన్నికల ప్రభుత్వాలను కూల దోసి అధికారం స్వాధీన చేసుకున్నాయి. ఈ రెండూ నైజర్ కు పొరుగు దేశాలే. ఈ దేశాల నుండి ఫ్రెంచి, అమెరికా సేనలు వెళ్ళిపోవడం, ఆ దేశాలు రష్యా ప్రైవేటు మిలటరీ, వాగ్నర్ తో రక్షణ, భద్రత ఒప్పందాలు చేసుకోవడంతో సహేల్ ప్రాంతంలో అమెరికా, ఫ్రాన్స్ ల ప్రభావం లేదా పశ్చిమ దేశాల ప్రభావం తీవ్రంగా సన్నగిల్లింది.  

2015 నుండి బర్కినా ఫాసోలో ఆల్-ఖైదా, ఐసిస్ గ్రూపులు హింసాత్మక చర్యలకు పాల్పడుతూ వచ్చాయి. ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపులకు అమెరికా పరోక్ష మద్దతు ఉంటుంది. వాటికి ఆయుధాలు, మందుగుండు వివిధ ఛానెళ్ల ద్వారా సి‌ఐ‌ఏ సరఫరా చేస్తుంది. టెర్రరిస్టు చర్యల ద్వారా ఆయా దేశాలను అస్థిర పరచడం, ఆనక ఆ దేశాలకు టెర్రరిస్టుల నుండి రక్షణ కల్పించి, స్థిరత్వం నెలకొల్పే సాకుతో ఆ దేశాలకు తమ సేనలను పంపడం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర పశ్చిమ దేశాలు అనాదిగా పాటిస్తున్న అనాచారం. ఆఫ్రికా దేశాల్లో ప్రధానంగా ఫ్రాన్స్, అమెరికా దేశాలు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుంటాయి.

ఫ్రాన్స్, అమెరికా దేశాల కుట్రలకు స్థానిక దళారీ ప్రభుత్వాలు సహకరిస్తూ తమ దేశాల్లోని ఖరీదైన, అరుదైన ఖనిజాలను కొల్లగొట్టుకు పోయేందుకు పశ్చిమ దేశాలకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాయి. అనేక దశాబ్దాలుగా జరుగుతూన్న ఈ అరాచకాలకు వ్యతిరేకంగా ఆఫ్రికా ప్రజలు మెల్ల మెల్లగా ఆందోళనలు నిర్వహించడం ప్రారంభించారు. ప్రజల ఆందోళనలను పక్కదారి పట్టించేందుకు అమెరికా ఐసిస్, ఆల్-ఖైదా మూకలను చొప్పించి వారి ద్వారా ఆఫ్రికా దేశాల్లో ప్రవేశించే ఎత్తుగడను అనుసరించింది. ఈ చర్యలకు అమెరికన్ వాల్ స్ట్రీట్ ఫైనాన్స్ కంపెనీలు నిధులు అందిస్తాయి. ఈ నిధులు ఒక వైపు ఆల్-ఖైదా, ఐసిస్ ముఠాలకు మరో వైపు ఆయా దేశాల దళారీ పాలక ముఠాలకు చేరతాయి.

ఐరోపా దేశాలను గంప గుత్తగా హ్యాండిల్ చేసేందుకు అమెరికా యూరోపియన్ యూనియన్ ను ఏర్పాటు చేసినట్లే సహేల్ ఆఫ్రికా ప్రాంతాన్ని కంట్రోల్ లో ఉంచుకునేందుకు ఎకోవాస్ (ECOWAS – Economic Community of West African States) గ్రూపును ఏర్పాటు చేసింది. (ఈ కూటమి నైజర్, బర్కినాఫాసో, మాలి తిరుగుబాట్లకు వ్యతిరేకంగా ఆంక్షలు విధింపుకు తెగించింది) సహారా ఎడారికి దక్షిణాన ఆనుకుని ఆఫ్రికాలో పశ్చిమం నుండి తూర్పు వరకు ఉన్న దేశాలను సహేల్ ప్రాంతం అంటారు. మారిటానియా, సెనెగల్, మాలి, బర్కినా ఫాసో, నైజర్, నైజీరియా, చాద్, సూడాన్, ఎరిట్రియా… ఈ పది దేశాలు కలిపి సహేల్ ప్రాంతంగా పిలుస్తున్నారు. అనగా మధ్య ప్రాచ్యం ప్రాంతానికీ, సబ్ సహారా ప్రాంతంగా పిలిచే ఆఫ్రికా దక్షిణ దేశాలకూ మధ్య ఉన్న ప్రాంతమే సహేల్ ప్రాంతం. ఇంకో విధంగా చెప్పాలంటే ఆఫ్రికా ఖండంలో ఉత్తరాన ఉన్న అరబిక్, ఇస్లామిక్ మరియు దేశ ద్రిమ్మరి (Nomadic) సంస్కృతులకూ, దక్షిణాన ఉన్న దేశీయ (Indigenous) మరియు సాంప్రదాయక సంస్కృతులకు మధ్య వారధిగా ఉండే ప్రదేశం.

సహేల్ ప్రాంతంలో ఖనిజ, చమురు వనరులు సమృద్ధిగా లభిస్తాయి. మాలి, బర్కినాఫాసో, మారిటానియా దేశాలు బంగారు నిక్షేపాలకు ప్రసిద్ధి. చాద్, నైజర్, నైజీరియా దేశాలు చమురు వనరులకు ప్రసిద్ధి. మాలి ఆఫ్రికాలో మూడవ అతి పెద్ద బంగారం ఉత్పత్తిదారు. ఇక్కడ 800 టన్నుల బంగారం, 2 మిలియన్ టన్నుల ఇనుప నిక్షేపాలు, 5 వేల టన్నుల యురేనియం, 20 మిలియన్ టన్నుల మాంగనీసు, 4 మిలియన్ టన్నుల లిథియం, 10 మిలియన్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాలు ఉన్నాయి. నైజర్, ప్రపంచంలో అతి పెద్ద యురేనియం సరఫరాదారు. వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ప్రకారం ప్రపంచం లోని అత్యంత నాణ్యమైన యురేనియం గనుల్లో 5 శాతం నైజర్ లో ఉన్నాయి. కాని మానవ అభివృద్ధి సూచికలో నైజర్ 189వ స్థానంలో ఉన్నది. సహేల్ కు అనుకుని ఉన్న గినియా బాక్సైట్, ఐరన్, బంగారం, వజ్రాలకు నిలయం. ప్రపంచంలోని బాక్సైట్ గనుల్లో 4వ వంతు (7.4 బిలియన్ మెట్రిక్ టన్నులు) గినియాలోనే ఉన్నాయి. బర్కినా ఫాసో లో బంగారం, వజ్రాలు, జింక్, కాపర్, మాంగనీసు, ఫాస్ఫేట్, సున్నపురాయి గనులు సమృద్ధిగా ఉన్నాయి. ఛాద్ లో విస్తారమైన చమురు నిల్వలు ఉన్నాయి.

సహేల్, సంపద్వంతం అయినా అవి అత్యంత పేద దేశాలు. అందుకు కారణం ఆ దేశాల దళారి పాలకులు అవినీతికి పాల్పడుతూ, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ పశ్చిమ దేశాలకు సాగిలపడుతూ తమ దేశాల వనరులను అత్యంత చౌకగా కొల్లగొట్టుకుపోవటానికి అనుమతించడమే. నైజర్ నుండి ఫ్రాన్స్ అత్యంత చౌకగా యురేనియం ఖనిజాన్ని కొల్లగొడుతోంది. నైజీరియా చమురు వనరులను కొల్లగొట్టడంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, డచ్ దేశాల బహుళజాతి చమురు కంపెనీలు నిమగ్నమై ఉన్నాయి.

ఫలితంగా సహేల్ ప్రాంత దేశాల ప్రజలు ఆకలి, దరిద్రాలతో మాడుతున్నారు. దారిద్ర్యం, అసమానతలు, నిరుద్యోగం, దళారీ పాలకుల నాయకత్వం, నిరక్షరాస్యత తదితర సమస్యలన్నీ ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. మిలటరీ పాలకులు కూడా ఏదో ఒక సామ్రాజ్యవాద దేశంపై ఆధారపడి ఉండడమే తప్ప తమ దేశాల మానవ వనరులను వినియోగించి స్వయం అభివృద్ధి సాధించే ఆలోచనలు చేయడం లేదు. ఆఫ్రికా నుండి తరలించుకు పోయిన అపార వనరులు ఇప్పుడు సామ్రాజ్యవాద పెట్టుబడి రూపంలో పశ్చిమ దేశాల వద్ద పోగు బడి ఉండడంతో వారు అనివార్యంగా పశ్చిమ దేశాలపై ఆధారపడుతూ, చివరికి వారితో కుమ్మక్కు అవుతూ వచ్చారు. ఈ దేశాల ఆర్ధిక సంక్షోభాలను పరిష్కరించే పేరుతో వరల్డ్ బ్యాంక్, ఐ‌ఎం‌ఎఫ్ సంస్థలు సైతం వారిని పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద దోపిడీకి కట్టివేసే షరతులు, విధానాలు వారిపై రుద్దుతూ వచ్చాయి. ఈ విష వలయం నుండి బైట పడాలంటే ఆయా దేశాల ప్రజలే స్వయంగా పూనుకోవాల్సి ఉంది. చరిత్ర నిర్మాతలు ప్రజలే గానీ పాలక వర్గాలు కాదు. కనుక సహేల్ ప్రజలు ఐక్యమై సామూహిక విప్లవాలకు పూనుకుంటే తప్ప వారి విముక్తి సాధ్యం కాదు. సామ్రాజ్యవాదులు, స్థానిక దళారీ దోపిడీ పాలకవర్గాలను తగిన వ్యూహం, ఎత్తుగడలతో సాయుధ విప్లవాలకు వారు పూనుకోవాలి.

వ్యాఖ్యానించండి