ఎలక్షన్ కమిషన్ కప్పదాట్లు, జనస్వామ్యానికి అగచాట్లు!


2024 సాధారణ ఎన్నికల సందర్భంగా ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని అమలు చేయడంలో వ్యవహరించిన తీరు అత్యంత వివాదాస్పదంగా ఉండటం సో-కాల్డ్ భారత ప్రజాస్వామ్యానికి, ప్రధాని మోడీ భాషలో చెప్పాలంటే, ప్రజాస్వామ్య దేశాలకు తల్లిలాంటి భారత ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారడం విషాదకరం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని చెప్పేది నిజమే అయితే ఆ ప్రభువులకి పాలక వర్గాలతో పాటు ఎన్నికల కమిషన్ కూడా ఒక శత్రువుగా, కక్ష పూరితంగా వ్యవహరించింది అంటే తప్పు కాబోదు.

ఎన్నికల కమిషనర్ ప్రధాన బాధ్యత ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా చూడటమే కాకుండా, అన్ని పార్టీలకు సమాన ప్రచార అవకాశాలు కల్పించడం; మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వివక్ష చూపకుండా పక్షపాతం లేకుండా పోటీలో అన్ని పక్షాలకు సమానంగా వర్తింప చేయడం. అలా చేయడంలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలం అయిందని వివిధ వివాదాస్పద అంశాలకు, వివిధ పార్టీల ఫిర్యాదుల పట్ల అది స్పందించిన తీరును బట్టి భావించవలసి వస్తోంది.

ముఖ్యంగా బి.జే.పి అగ్ర నేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా లతో పాటు ఇతర చోటా మోటా నాయకులు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ సాగించిన ప్రసంగాల పట్ల, వాటిపై వచ్చిన ఫిర్యాదుల పట్ల ఎన్నికల కమిషన్ “కత్తిని గాయాన్ని ఒకే గాటన కట్టినట్లు” గా స్పందించింది.

ఇంటర్నెట్ పత్రిక స్క్రోల్ విలేఖరి ఛీఫ్ ఎన్నికల కమిషనర్ ని ఇదే అంశంపై జూన్ ౩వ తేదీనాడు ప్రశ్నించింది. స్క్రోల్ ప్రశ్నకు సి.ఇ.సి ఇచ్చిన సమాధానం బహు వింతగా ఉండడం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భారత దేశ ముస్లిం ప్రజలను టార్గెట్ చేస్తూ చేసిన ప్రసంగాలను కట్టడి చేయడంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ) ఎందుకు విఫలం అయింది? అని స్క్రోల్ ప్రశ్నించింది.

దానికి సిఇసి ఇచ్చిన సమాధానం: “మనది చాలా పెద్ద దేశం. అందుకే ఇరు పార్టీల (బి.జే.పి, కాంగ్రెస్) లోని ఇద్దరు బడా నేతలను మేము ఉద్దేశ్యపూర్వకంగానే తాకలేదు. ఇరు పార్టీల అధ్యక్షులను మేము సమానంగా తాకాము (విమర్శించాము / హేచ్చారించాము). ఇవతల ఇద్దరినీ, అవతల ఇద్దరినీ మేము ఎందుకు వదిలివేశాము? ఇంత పెద్ద దేశంలో అధికారిక హోదాలో ఉన్న వ్యక్తులకు కూడా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను మేము వారికి గుర్తు చేశాము” అని రాజీవ్ కుమార్ తన భుజాన్ని తానే చరుచుకున్నారు. ఈ సమాధానానికి కారణమైన ఆ ఫిర్యాదులను చూద్దాం.

ఏప్రిల్ 21 తేదీన రాజస్థాన్ లోని బంస్వారాలో ప్రధాని మోడీ ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోపై విమర్శలు చేస్తూ “భారతీయుల ప్రైవేటు ఆస్తులను, సంపదలను స్వాధీనం చేసుకుని అధిక సంతానం కలిగి ఉన్న చొరబాటుదారులకు పంచి పెడతామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో వాగ్దానం చేసింది” అని ఆరోపించారు. ముస్లింలు అని నేరుగా చెప్పకుండా, ‘అధిక సంతానం కలిగిన చొరబాటుదారులు’ అని మోడీ గారు పరోక్షంగా లక్ష్యం చేసుకున్నారన్నది స్పష్టమే. (ముస్లింలు అని ఆయన అనలేదు కదా? అని ప్రశ్నించేవారికి ఒక నమస్కారం!)

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంతటితో ఆగలేదు. అదే ప్రసంగంలో ఆయన “ముస్లింలకు భారతీయ సంపదను పునః పంపిణీ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ, ‘పెళ్ళయిన హిందూ మహిళల మంగళ సూత్రాలను’ తెంచివేయటానికి కూడా వెనకాడదు” అని ఆరోపించారు.

హిందూ స్త్రీలు తమ భర్త చనిపోయాక వారి మెడ లోని మంగళ సూత్రంను తెంచి, నుదుట సింధూరాన్ని తుడిపి వేసే ఆచారం దేశం అంతటా ఉన్నది. క్రైస్తవులుగా మారిన దళిత కులాల ప్రజలు కూడా అనేక చోట్ల ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఆస్తులు పపిణీ చేసేందుకు హిందూ పురుషులను అంతం చేస్తుందని ప్రధాన మంత్రి పరోక్షంగా ఆరోపిస్తున్నారు. ఇంతకు మించిన ఘోరమైన ఆరోపణని మెదడులో కాస్త తెలివి, ప్రజల బాధ్యత ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా చేయగలరా అన్నది ఒక దశాబ్దం కిందట అయితే ఊహించలేనిది.

ప్రధాన మంత్రి చేసిన ఈ ఆరోపణ పూర్తి అసత్యమే కాకుండా భారతీయ ముస్లింలను అణచివేతకు గురవుతున్న ఇతర సామాజిక గ్రూపులకు వ్యతిరేకంగా నిలబెడుతుంది. కనుక ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు బద్ధ విరుద్ధం.

ఈ ప్రసంగం చేసింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. కనుక ఎన్నికల కమిషన్ ఆయనకు నోటిస్ జారీ చేయాలి. ఆయన వద్ద నుండి సమాధానం వచ్చాక కోడ్ ప్రకారం తగిన చర్య తీసుకోవాలి. అందుకు బదులు ఎన్నికల కమిషన్ ఒక కొత్త తరహాలో స్పందించింది. మోడీకి బదులు బిజేపి అధ్యక్షుడు జే.పి.నడ్డాకు నోటీసు పంపిస్తూ “మీ పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్లు అందరూ రాజకీయ ప్రచారంలో ఉన్నత శ్రేణి ప్రమాణాలను అనుసరించేలా చూడండి. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో పొందుపరిచిన సూత్రాల స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించేలా చూడండి” అని కోరి చేతులు దులుపుకుంది.

బిజేపి అధ్యక్షుడికి పంపిన తాఖీదును ప్రధాని మోడీ ఖాతరు చేయలేదు. ఏప్రిల్ 30 తేదీన తెలంగాణలో శ్రోతలను ఉద్దేశిస్తూ “నేను జీవించి ఉన్నంతవరకు ఎస్.సి, ఎస్.టి, ఓబిసి లకు రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్లను ముస్లింలకు పంచి పెట్టేందుకు సుతరామూ అంగీకరించేది లేదు. అందుకు ఎంత మూల్యం చెల్లించేందుకు అయినా నేను సిద్ధం” అని ఆయన ప్రకటించాడు. ఒక సమూహానికి చెందిన ప్రజలను మరో సమూహం ప్రజలపైకి ఉసి గొల్పడం ఈ ప్రకటన లక్ష్యం అని తేలికగానే అర్ధం అవుతుంది.

ఇది, బాబాలు గాలిలో నుండి బంగారు గొలుసు సృష్టించినట్లు, నోట్లో నుండి శివ లింగాన్ని బైటికి తీసినట్లు, వివాదం అన్నదే లేని చోట సరికొత్త వివాదాన్ని సృష్టించి లబ్ది పొందాలని చూసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అంతేకాక భారత సమాజంలో సామాజికంగా, ఆర్ధికంగా అత్యంత వెనుకబడి, ఎటువంటి ప్రజాస్వామిక హక్కులు, పౌర హక్కులు లేకుండా తీవ్ర అణచివేతకు గురవుతున్న వివిధ ప్రజా సమూహాల మధ్య చిచ్చు పెట్టి తమాషా చూడటం కూడా.

మే 7వ తారీఖున ప్రధాన మంత్రి మధ్య ప్రదేశ్ లో ధార్ లో ప్రసంగిస్తూ “స్పోర్ట్స్ రంగంలో మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యం. దానర్ధం, ఆటగాళ్ళ మతాన్ని బట్టి వారు క్రికెట్ టీం లో ఉండాలా లేదా అన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది” అని ఆరోపించారు. “నేను కాంగ్రెస్ ని అడుగుతున్నా. అలా చేయదలిస్తే 1947లో దేశాన్ని మూడు ముక్కలుగా ఎందుకు విభజించింది? అదే సమయంలో దేశం మొత్తం పాకిస్తాన్ గా మార్చి ఉండొచ్చు. ఇండియా అన్నదాన్ని లేకుండా చేయొచ్చు” అని ప్రధాని మోడీ ఆరోపించారు.

“కాశ్మీర్ కోసం ఆర్టికల్ 370 ని కాంగ్రెస్ పార్టీ పునరిద్ధరించకుండా ఉండాలంటే, అయోధ్య లోని రామాలయానికి ‘బాబ్రీ తాళం” వేయకుండా ఉండాలంటే బిజేపి నేతృత్వం లోని ఎన్.డి.ఏ కూటమికి 400 సీట్లు కట్టబెట్టండి” అని ఆయన తన ప్రసంగంలో కోరారు.

వీటిని ఉద్దేశిస్తూ సిఇసి రాజీవ్ “ఇవి రెండు సార్లు కోర్టు వరకు వెళ్ళాయి. ఒకసారి ఢిల్లీ హై కోర్టుకు, మరోసారి సుప్రీం కోర్టుకు! ఒకసారి తీర్పు వెలువడ్డ అంశం గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు” అని చెప్పి ఎంచక్కా తప్పించుకున్నారు.

కాని జరిగింది అది కాదు. రాజీవ్ కుమార్ కోర్టుకు వెళ్ళిన అంశం గురించి పాక్షిక సత్యం మాత్రమే చెప్పాడు. మే 14 తేదీన మోడీ ప్రసంగాలపై చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ని ఆదేశాలించాలని సుప్రీం కోర్టుని పిటిషనర్లు కోరారు. “ఈ పిటిషన్ పట్ల సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తూ “మీరు మొదట ఈ అంశం పైన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయండి” అని కోరింది. దీని అర్ధం ఎన్నికలు జరిగే సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అమలు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ది కనుక ముందు అక్కడికి వెళ్ళండి. ఆ తర్వాతే కోర్టుకు రండి అని సుప్రీం కోర్టు సూచించింది.

రాజ్యాంగం ఎగ్జిక్యూటివ్ విభాగం కి అప్పగించిన పనుల్ని ఆ విభాగమే చూడాలి. కోర్టుకు అప్పగించిన పనుల్ని కోర్టు చూడాలి. పార్లమెంటుకి (లెజిస్లేచర్) అప్పగించిన పనుల్ని పార్లమెంటే చూడాలి అని కోర్టు అనేక సందర్భాల్లో సూచించింది. అందులో భాగమే పై పిటిషన్ పట్ల సుప్రీం కోర్టు చేసిన సూచన. అంతే తప్ప పార్టీల నాయకులు ఏం మాట్లాడినా ఎదో ఒక వంకతో నిష్క్రియగా చూస్తూ ఉండమని కాదు.

“అసలు విద్వేష పూరిత ప్రసంగాలని చేసిన నాయకులను వదిలి పెట్టి పార్టీల అధ్యక్షులకు డైరెక్షన్ ఇవ్వడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి?” అని ప్రశ్నించిన పత్రికలకు సమాధానం ఇస్తూ సిఇసి, “అయితే ఏంటి? కమిషన్ పూనుకుని ‘బలమైన మార్గ నిర్దేశకాలను’ ఇవ్వడం ద్వారా ఈ పార్టీల నాయకులకు వారి బాధ్యతను మేము గుర్తింప జేశాము. అని చెప్పి రాజీవ్ కుమార్ తన చర్యలను సమర్ధించుకున్నాడు. ఆ విధంగా ఎన్నికల కమిషన్ పైన రాజ్యంగబద్ధ బాధ్యతను ఎన్నికల కమిషన్ పార్టీల అధ్యక్షుల మీదకు నెట్టివేసింది. ఈ లాజిక్ ప్రకారం కుటుంబంలో కుర్రాడు తాగి స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, కోర్టు ఆ కుర్రాడిని వదిలి పెట్టి కుటుంబ పెద్ద అయిన తండ్రిని శిక్షించడమో లేదా ఆయన బాధ్యతను ‘బలంగా గుర్తింపజేయడమో’ చేయాలన్నమాట!

సిఇసి ఇంకా ఇలా చెప్పాడు. “పార్టీ అధ్యక్షుడికి డైరెక్షన్ ఇవ్వడం వల్ల ఆ పార్టీ లోని రెండవ స్థాయి నాయకుల్లో 80 శాతం అప్పటి నుండి అటువంటి ప్రసంగాలు మానేశారు” అని మరొకసారి తన భుజం తాను చరుచుకున్నారు. (20 శాతం నాయకులు తన డైరెక్షన్ పట్టించుకోలేదని ఆయన పరోక్షంగా అంగీకరించాడు.) రెండవ స్థాయి నాయకులంటే ఎవరో కూడా సిఇసి రాజీవ్ కుమార్ చెప్పారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, యు.పి ముఖ్య మంత్రి ఆదిత్యనాద్, కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్, తమిళనాడు సి.ఎం ఎంకే స్టాలిన్… ఇలాంటి వారి అని ఆయన ఉదాహరించారు.

కానీ సిఇసి చెప్పినట్లు పైన చెప్పిన బిజేపి రెండో స్థాయి నాయకులు ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ను ఏ మాత్రం ఖాతరు చెయ్యలేదు. హిమంత బిశ్వా శర్మ పదే పదే ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేశాడు. అస్సాం నివాసితుల్లో 1.25 కోట్ల మంది వరకు బంగ్లాదేశ్ నుండి వచ్చిన చొరబాటుదారులే అని నిందించాడు. యు.పి ముఖ్యమంత్రి ఒక ర్యాలీ లో ప్రసంగిస్తూ “ఈ ఎన్నికలు రామ భక్తులకు, రామ ద్వేషులకు జరుగుతున్న ఎన్నికలు” అని తేల్చేశాడు.

సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తక్కువ తినలేదు. “మీ పిల్లల సంపదను ముస్లింలకు అప్పగించేందుకు, భారత అణు ఆయుధాలను తుద ముట్టించేందుకు దేశాన్ని కుల, మతాల ఆధారంగా విభజించేందుకు ప్రోత్సహించేలా కాంగ్రెస్ పార్టీ వెనుక ఒక విదేశీ హస్తం పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది” అని ఆరోపించాడు. “కాంగ్రెస్ లాంటి టుక్డే టుక్డే గ్యాంగ్ (దేశాన్ని ముక్కలు చేసే మూకలు) కి మద్దతు ఇవ్వాలా లేక ఒకే ఒక శ్రేష్టమైన భారత్ ని నిర్మించేందుకు నడుం బిగించిన నరేంద్ర మోడికి మద్దతు ఇవ్వాలా అన్నది మీరే తేల్చుకోండి” అని పిలుపు ఇచ్చాడు.

కాంగ్రెస్ పార్టీ బలన్గానో లేక తాలుగానో స్వతంత్ర ఉద్యమంలో పని చేసింది. దోపిడీ వర్గాల కోసమైనా సరే, కోట్లాది ప్రజల్ని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కూడగట్టింది. బహుళార్థసాధక ప్రాజెక్టులు నిర్మించింది. పశ్చిమ దేశాల స్పాన్సర్షిప్ తో నైనా ఐ.ఐ.టిలు, ఐ.ఐ.ఎం లు స్థాపించింది. నిజంగానో లేక ఒక మాట మాత్రపు ఆదర్శం కోసమో సెక్యులరిజం, సోషలిజం స్థాపన లక్ష్యంగా రాజ్యాంగంలో ప్రకటించింది. అయిష్టంగానైనా అంబేద్కర్ కృషిని అంగీకరించి రాజకీయ, ఉద్యోగ, విద్యా రిజర్వేషన్ల ద్వారా సానుకూల (అఫర్మేటివ్) చర్యలు అమలు చేసింది.

కాని బి.జే.పి/జన సంఘ్ ల మాతృక అయిన ఆర్.ఎస్.ఎస్ ఏమి చేసింది? బ్రిటిష్ పాలకులతో అంట కాగింది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనవద్దని తన శ్రేణులకు పిలుపు ఇచ్చింది. బ్రిటిష్ పాలకులకు మద్దతుగా సేవలు చేసింది. కనుకనే కొందమంది కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ పోలిసుల వేట నుండి తప్పించుకునేందుకు అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఆర్.ఎస్.ఎస్ నాయకుల ఇళ్ళల్లో రహస్యంగా, అనుమానం రాకుండా ఉండగలిగారు. ఆర్.ఎస్.ఎస్ ఆరాధ్య దైవం వీర సావర్కార్, అండమాన్ జైలు నుండి తనను తప్పించమని కోరుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక ఉత్తరాలు రాశాడు. తనను విడుదల చేస్తే బ్రిటిష్ పాలనకు పూర్తిగా విధేయంగా ఉంటానని అనేకమార్లు విన్నవించుకున్నాడు. ఈ ఉత్తరాలను పలు పత్రికలు బైట పెట్టాయి కూడా. స్వాతంత్ర సంగ్రామంలో పరాయి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మీరు చేసిన కృషి ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆర్.ఎస్.ఎస్ నుండి సత్య ప్రమాణమైన జవాబు రాదు.

ఇప్పుడు వీళ్ళు తమను ప్రశ్నించిన వారిని అందరిని దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. హిందూత్వ పట్ల భక్తి ప్రపత్తులు చాటుతారు గాని హిందూ మతం లోని కుల జాడ్యాన్ని, అంటరానితనం అమానుషాన్ని రూపు మాపేందుకు వారి వద్ద ఎలాంటి కార్యక్రమం ఉండదు. హిందూ సమాజాన్ని వేలాది కులాలుగా విడగొట్టటానికి మద్దతుగా నిలిచే వీరు టుక్డే, టుక్డే గ్యాంగ్ అంటూ కాంగ్రెస్ నుండి, కమ్యూనిస్టుల వరకూ, దళితుల నుండి హేతువాదుల వరకూ అందరి పైనా ముద్ర వేసి, కృత్రిమ వీడియోలు తయారు చేసి అబద్ధాలను ప్రచారంలో పెడుతున్నారు.

బూర్జువా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో వారు ప్రకటించుకున్న రాజ్యాంగం ప్రకారమే అధికార పక్షానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ప్రతిపక్షానికి కూడా అంటే ప్రాధాన్యత ఉన్నది. పాలక పక్షం, ప్రతిపక్షం రెండూ కలిగిన ఉంటేనే అది పార్లమెంటు. ఆ పార్లమెంటును మూడు ప్రజాస్వామ్యం మూల స్తంభాలలో ఒకటిగా రాజ్యాంగం నిర్దేశించింది. కాని ప్రధాని నరేంద్ర మోడీ “కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటూ “ప్రతిపక్షం లేని పార్లమెంటు” ను ఆదర్శంగా ప్రకటించి, ఆ మేరకు పిలుపు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి లేదా ఇ.డి, ఐ.టి కేసులతో అదిరించి, బెదిరించి ప్రభుత్వాలను కూడగోట్టడం ఒక కార్యక్రమంగా పెట్టుకుని అమలు చేశారు. ‘మదర్ ఆఫ్ దేమోక్రసీస్’ గా ప్రకటించుకున్న దేశంలోని ప్రభుత్వాలు చేసే పనులేనా ఇవి?

ఇటువంటి పార్టీ నాయకుల విద్వేష పూరిత, టుక్డే టుక్డే ప్రసంగాలను వెర్రి మొర్రి సాకులు చూపి చూసీ చూడనట్లు వదిలివేయడం ద్వారా, ద్వేష ప్రసంగాలు చేసిన వారిని వదిలేసి అతి తెలివిగా పార్టీల అధ్యక్షులకు నోటీసులు ఇవ్వడం ద్వారా భారత ఎన్నికల కమిషన్ అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించింది. “అవతలి వైపు (కాంగ్రెస్) పార్టీ నాయకుల ప్రసంగాల పట్ల కూడా ఇదే విధమైన మెతక వైఖరి అవలంబించాం కదా?” అని రాజీవ్ కొమార్ ప్రశ్నించి తన దివాలాకోరుతనాన్ని నిస్సిగ్గుగా బైట పెట్టుకున్నాడు.

చర్యలు ఎందుకు తీసుకోరు? అని ప్రశ్నిస్తే ఇరు పక్కలా చర్యలు తీసుకోలేదు కదా ని ఎదురు ప్రశ్నించడం ద్వారా ఎన్నికల కమిషన్ తనకు అప్పగించబడ్డ రాజ్యాంగబద్ధ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని స్వయంగా ప్రత్యక్షంగానే అంగీకరించింది. అసలు ఒకరిని వదిలేసి ఇంకొకరిపై చర్యలు తీసుకోమని గానీ, లేదా ఇరు పక్కలా సమాన పద్ధతిలో అభ్యంతరకర ప్రసంగాలను, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలను చూసి చూడనట్లు వదిలెయ్యమని రాజ్యాంగం నిర్దేశించిందా? లేదు కదా?

ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే కోడ్ ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని మాత్రమే రాజ్యాంగం ఎన్నికల కమిషన్ కు బాధ్యత అప్పగించింది. ఆ బాధ్యత నిర్వహించడానికి బదులు ఒక పార్టీ బెదిరింపులకు భయపడి లేదా ప్రలోభాలకు ఆశపడి ఉల్లంఘనలపై చర్య తీసుకోకపోవడం ద్వారా ఎన్నికల కమిషన్ సో-కాల్డ్ బూర్జువా ప్రజాస్వామ్యానికి (వాస్తవానికి బూర్జువా నియంతృత్వం అనాలి) బూర్జువా వర్గాలకు చెందిన అధికార ప్రభువులే తూట్లు పొడవడం ద్వారా ఎన్నికల కమిషన్ సారం లేని జన స్వామ్యాన్ని మరింత పచ్చిగా, నగ్నంగా “మేము దోపిడీ స్వామ్యానికి ప్రతినిధులం” చాటి చెప్పారు.

వ్యాఖ్యానించండి