
Destroyed equipment of Kiev regime forces in Kharov Region
రష్యా దాడిని ప్రతిఘటించేందుకు అమెరికా, ఇతర నాటో దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తున్నప్పటికి ఉక్రెయిన్ కు భవిష్యత్ లో భద్రత కల్పించేందుకు నాటో కూటమి ముందుకు రాలేదని అందుకే రష్యాతో చర్చలకు ముందుకు వచ్చామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ప్రకటించాడు.
చర్చల్లో ఉక్రెయిన్ తటస్థ వైఖరి గురించి చర్చించేందుకు కూడా జెలెన్ స్కీ సిద్ధపడటం ఒక విశేషం. అనగా అటు నాటో వైపు గానీ ఇటు రష్యా వైపు గానీ మొగ్గకుండా తటస్థ వైఖరి తీసుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉన్నది. అందుకు కొన్ని భద్రతా పరమైన గ్యారంటీలను ఉక్రెయిన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ తటస్థంగా ఉండే పక్షంలో ఆ దేశానికి తగిన భద్రత కల్పించేందుకు రష్యా మొదటి నుండి సిద్ధంగానే ఉన్నదని ఆ దేశ మంత్రులు చెబుతూ వచ్చారు. ఆ మాటకొస్తే 2014లో ఈయూ, అమెరికా లు పనిగట్టుకుని మరీ కూల్చివేసిన విక్టర్ యనుకోవిచ్ ప్రభుత్వం కూడా పూర్తిగా రష్యా పక్షం వహించలేదు. అలాగని అమెరికా/నాటో వైపు మొగ్గలేదు.
“మన దేశ భాగస్వాములు అందరికీ నేను చెబుతూ వచ్చాను: ‘ఈ సమయం అత్యంత కీలకమైనది. మా దేశ భవిష్యత్తు పందెంలో ఒడ్డబడింది’ అని. నేను వారిని అడిగాను ‘మీరు మాతో ఉన్నారా లేదా?’ అని. వాళ్ళు ‘అవును. ఉన్నాం’ అన్నారు. వాళ్ళు మనతో ఉన్నారు గానీ (నాటో) అలయన్స్ లో మనల్ని సభ్యులుగా చేసేందుకు సుముఖంగా లేరు. ఉక్రెయిన్ నాటో సభ్య దేశం అవుతుందా లేదా అని ఈ రోజు నేను 27 ఐరోపా దేశాల నేతల్ని అడిగాను,.. వారు సమాధానం ఏమీ ఇవ్వలేదు” అని జెలెన్ స్కీ శుక్రవారం ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశిస్తూ వీడియో ప్రకటన విడుదల చేశాడు.
రష్యా రూపొందించిన అంశాలపై చర్చించేందుకు అంగీకరిస్తే ఉక్రెయిన్ నాయకత్వంతో చర్చించేందుకు రష్యన్ అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మరోవైపు క్రెమ్లిన్ ప్రతినిధి పెష్కోవ్ మరో పక్క ప్రకటిస్తున్నాడు. ముఖ్యంగా ఉక్రెయిన్ తటస్థ వైఖరి అవలంబించడానికి కట్టుబడడంపై చర్చించడానికి పెష్కోవ్ సుముఖత వ్యక్తం చేశాడు.
“ఉక్రెయిన్ తటస్థ వైఖరి విషయమై చర్చించేందుకు సుముఖంగా ఉన్నట్లు మాకు మాస్కో ప్రకటనల ద్వారా తెలిసింది. మాకు రష్యా అంటే భయం లేదు. రష్యాతో చర్చలు జరిపేందుకు భయపడడం లేదు. మా దేశ భద్రతకు గ్యారంటీ ఇవ్వటం లాంటి ఏ విషయం గురించి చర్చించడానికైనా మాకు భయం లేదు. ఉక్రెయిన్ తటస్థ వైఖరి విషయం చర్చించడానికి సైతం మాకు భయం లేదు” అని జెలెన్ స్కీ టెలిగ్రామ్ చానల్ లో వీడియో విడుదల చేస్తూ చెప్పాడు.
సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వటానికి గానీ లేదా నాటో సభ్యత్వం ఇవ్వటానికి గానీ తేల్చి చెప్పేందుకు అమెరికా, నాటో సిద్ధం కాకపోవడం బట్టి ఆ దేశాల వైఖరి అర్థం చేసుకోవచ్చు. వారి దృష్టిలో ఉక్రెయిన్ సమాన దేశం కాదు. రష్యా నుండి కాపాడుకోవలసిన దేశం కూడా కాదు. ఉక్రెయిన్ అన్నది కేవలం రష్యాను లొంగదీసుకునేందుకు ఉపయోగపడే ఒక సాధనం లేదా పరికరం మాత్రమే.
ఉక్రెయిన్ ప్రజల భద్రత గురించి గాని, అభివృద్ధి గురించి గాని నాటో, అమెరికాలకు పట్టింపు లేదు. ఉక్రెయిన్ అడుగుతున్న గ్యారంటీలు ఇవ్వడం ద్వారా రష్యాతో నేరుగా ఘర్షణ పడే పరిస్థితిలో అవి లేవు. నాటో, రష్యా యుద్ధం అంటే అది అనివార్యంగా ప్రపంచ స్థాయి యుద్ధంగా పరిణమిస్తుంది. కనుక రష్యన్లతో యుద్ధం చేయటం కంటే రష్యాను ఇబ్బంది పెట్టడం, చికాకు పెట్టడం, రష్యాలో అంతర్గత వైషమ్యాలు పెంచడం, అసంతృప్తిని తీవ్రం చేయడం. చివరికి పుతిన్ ని బలహీనం చేసి అధికారం నుండి తప్పించడం… ఇవే అమెరికా, నాటో లక్ష్యం.
ఈ లక్ష్యం ప్రపంచ శాంతికి తీవ్ర భంగకరం. ఉక్రెయిన్, రష్యా ప్రజలకు ముఖ్యంగా కార్మికవర్గ ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ప్రపంచ యుద్ధం వస్తే మొదట నష్టపోయేది కార్మికవర్గ ప్రజలే. వారే ఆయుధాలు పట్టాలి, వారే యుద్ధాలు చేయాలి, వారే ప్రాణాలు కోల్పోవాలి, ధనికవర్గాల ప్రయోజనాల యజ్ఞంలో వారే సమిధలు కావాలి. అందుకే అమెరికా నేతృత్వం లోని నాటో కూటమి ప్రపంచ ప్రజలకు నాశనకారి. నాటో విస్తరణ ప్రపంచాన్ని వినాశనం వైపు తీసుకెళుతుంది. కనుక నాటో విస్తరణకు రష్యా ఇస్తున్న ప్రతిఘటన సమర్ధనీయం. కానీ అందుకు ఉక్రెయిన్ ను, ఆ దేశ ప్రజలను బలిపశువును చేయడం అభ్యంతరకరం.
అయితే బూర్జువా పెట్టుబడిదారీ శక్తి అయిన రష్యా నుండి ఇంతకంటే మెరుగైన పరిష్కారం వస్తుందని ఆశించడం వృధా. అసలైన ప్రత్యామ్నాయం రష్యా, ఉక్రెయిన్ దేశాల శ్రామికవర్గం మాత్రమే ఇవ్వగలదు. వారు ఆర్గనైజ్ కాలేకపోవటం చారిత్రక బలహీనత.