
Vice President at 150th anniversary event
ఇటీవల కాలంలో క్రైస్తవ మతం అనుసరిస్తున్న ప్రజలపై దాడులు పెరిగాయి. హిందూ మతం పేరు చెప్పుకుని వివిధ రౌడీ మూకలు ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. తమ దాడులకు న్యాయ బద్ధత, నైతిక సమర్థత కల్పించుకునేందుకు మత మార్పిడి జరుగుతోందని, దాన్ని అడ్డుకుంటున్నామని సాకు చెబుతున్నారు.
కొన్నిసార్లయితే బహిరంగంగానే పర మత విద్వేషం చాటుకుంటున్నారు. మధ్య యుగాల నాటి శైవ, వైష్ణవ ఊచకోతలు, ఆసియా-ఐరోపాల్లోని క్రైస్తవ క్రూసేడ్లను తలపిస్తూ ముస్లింలు, క్రైస్తవులపై దాడులకు తెగబడుతున్నారు. కర్ణాటక బిజేపి ఎంపి తేజస్వి లాంటి వారయితే ప్రపంచ వ్యాపితంగా ఇస్లాం, క్రిస్టియానిటీ లలోకి వెళ్ళిన హిందువులను కోటాలు వేసుకుని మరీ హిందూ మతం లోకి తిరిగి తేవాలని పిలుపులు ఇస్తున్నారు.
ఇలాంటి వీర హిందూత్వ భక్తులందరూ తమ నాయకుడు, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చెప్పిన మాటల్ని శ్రద్ధగా ఆలకించాలి. కేరళ, కొట్టాయంలో సెయింట్ కురియకోస్ ఎలియాస్ చవర 150వ వర్ధంతి దినాన్ని పురస్కరించుకుని ఆయన చేసిన ప్రసంగాన్ని విని కాస్త బుద్థి తెచ్చుకుని మసలు కోవాలి.
“విద్వేష ప్రసంగాలు, రాతలు దేశ సంస్కృతి, వారసత్వం, సంప్రదాయం మరియు రాజ్యాంగ నీతి, హక్కులకు బద్థ వ్యతిరేకం. దేశంలో ప్రతి వ్యక్తీ అతడి లేదా ఆమె మతాన్ని ఆచరించడానికీ, ప్రచారం (preach) చేసుకోవడానికీ హక్కు కలిగి ఉన్నారు. మీ మతాన్ని ఆచరించండి కానీ (ఇతర మతాలను) దూషించకండి. విద్వేష ప్రసంగాలు చేయడం, విద్వేష రాతలు రాయడం లాంటివాటిలో పాల్గొనకండి.” అని వర్ధంతి సభలో ఉప రాష్ట్రపతి ప్రసంగించారు.
“ఇతర మతాలను అపహాస్యం చేసే ప్రయత్నాలను, తద్వారా సమాజంలో అసమ్మతిని సృష్టించడాన్ని నేను ఆమోదించను” అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టంగా చెప్పారు.
19వ శతాబ్దానికి చెందిన కేధలిక్ మత బోధకుడు, తత్వవేత్త, సంఘ సంస్కర్త అయిన చవర బోధనలను ఉప రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. “శాంతియుత మానవ సంబంధాలు చాలా పవిత్రమైనవనీ ఏ ఇతర అంశం కంటే కూడా అవి చాలా ముఖ్యమైనవని ఆయన బోధించారు… ఈ రోజు ప్రతి మతానికీ ఒక చవర అవసరం ఉన్నది… సమాజంలోని సకల సెక్షన్లను సామాజికంగా, సాంస్కృతికంగా ఐక్యం చేసే దృక్పధం మరియు దేశాన్ని ముందుకు తీసుకుపోయే చూపు కలిగిన ఒక ఎత్తైన శిఖరం లాంటి వారాయన” అని వెంకయ్య నాయకుడు పేర్కొన్నారు.
“మన దృష్టిలో ప్రపంచం అంతా ఒక కుటుంబం. ‘వసుధైక కుటుంబం’ అనే కాలాతీతమైన ఆదర్శం లోనే ఈ సూత్రాన్ని ఇముడ్చుకున్నాం. ఈ స్ఫూర్తి తోనే మనం ముందుకు వెళ్ళాలి.”

Indian stamp in memory of St Kuriakose
“సెయింట్ చవర సామాజిక మరియు విద్యా సేవలు కేవలం తన మతానికి మాత్రమే ఆయన పరిమితం చేయలేదు. కేధలిక్ బోధకుడైన సెయింట్ చవర విశాల దృష్టితో కూడిన దృక్పధంతో కొట్టాయం లోని మన్నానం లో 1846లో సంస్కృత పాఠశాల ప్రారంభించారు” అని వెంకయ్య వివరించారు.
కేరళను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు విద్యా, సామాజిక న్యాయం రంగాల్లో, మహిళా సాధికారత విషయంలో సెయింట్ చవర, సంస్కర్త నారాయణ గురు లాంటి వారు తీసుకున్న చొరవలను అనుసరించాలని వెంకయ్య కోరారు.
వెంకయ్య నాయుడు ప్రసంగంలో నిజానికి గతంలో లేని, కొత్తగా చెప్పిన అంశాలు ఏమీ లేవు. పైగా ఆయన ఆదర్శంగా చెపుతున్న అంశాలన్నీ మత గురువులు బోధించినవే. అవన్ని హిందూ, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ మత బోధకులు, గురువులు చెప్పారని, వాటిని పాటించాలనీ మనం చిన్నప్పటి నుండీ చదువుకుంటున్నాం, వింటున్నాం.
అయితే ప్రతి అంశానికి స్థలం, కాలం అనే రెండు అంశాలు జతపడి ఉంటాయి. ఈ రోజు వెంకయ్య నాయుడి ప్రసంగానికి జతపడి ఉన్న స్థల, కాలాలే చాలా సామాన్యమైన ఆ ప్రసంగానికి ప్రత్యేకతను తెచ్చి పెట్టాయి. ప్రత్యేకత తెచ్చిపెట్టడమే కాదు, ఈ నేపధ్యంలో ఆయన మాటలు వింటుంటే మన చెవుల్లో అమృతం బొట్లు బొట్లుగా పడుతున్నట్లు అనిపిస్తోంది.
వెంకయ్య నాయుడు ఏ పార్టీకైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఆ పార్టీకి చెందిన ప్రధాన మంత్రి ఈ ప్రసంగంలోని భావాలతో ఏకీభవించడం లేదు. పైగా వెంకయ్య నాయుడు వేటినైతే “కూడదు” అంటున్నారో వాటినే భారత ప్రధాని, ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి ప్రత్యక్షంగా, పరోక్షంగా ముఖ్యమైన కార్యకలాపాలుగా అమలు చేయిస్తున్నారు.
అవి లవ్ జిహాద్ అని ఆరోపిస్తూ ముస్లింలపై చేస్తున్న ఆరోపణలు, మరియు విద్వేష పూరిత దాడులు కావచ్చు, మత మార్పిడి పేరుతో క్రైస్తవ, ముస్లిం మత ప్రజలపై నేరుగా చట్టాల ద్వారానే తల పెట్టిన అణచివేత కావచ్చు, విదేశీ సంస్కృతి పేరుతో పార్కులపైన దాడి చేసి బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడం కావచ్చు; గోహత్య పేరుతో పశువుల రవాణాలను కూడా అడ్డుకుని చచ్చేలా, చచ్చేవరకూ చావబాదడం కావచ్చు; ఆనక తిరిగి బాధితుల పైనే గోవధ చట్టాలూ, మత మార్పిడి చట్టాలు, సెడిషన్ కేసులు బనాయించడం కావచ్చు; చివరికి అస్పృశ్యత, చిన్న చూపు భరించలేక క్రీస్తును ఆరాధించడం ప్రారంభించిన దళితుల ఇళ్ళల్లో చొరబడి హత్యా బెదిరింపులకు పాల్పడటం కావచ్చు….. ఎన్నో ఈ దేశంలో 2014 నుండీ జరుగుతున్నాయి.
హిందూత్వ భక్తులు వెంకయ్య నాయుడి మాటలు వింటే, విని ఆచరిస్తే నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్న ఆందోళనల్లో (anxities) గణనీయ భాగం ఆవిరైపోతుంది. జనం తమకి వాస్తవంగా ఏమి కావాలో వాటిని సాధించుకోవడం పైన దృష్టి పెడతారు.
ముస్లింలు ఏ క్షణంలో ఏ మూక వచ్చి పడుతుందో అన్న ఆందోళన నుండి బైటపడి కాస్త ప్రశాంతంగా కూలి పనికో, తోపుడు బండి పనికో, టైలరింగ్ పనికో వెళ్ళి వస్తాడు. శుక్రవారం కాస్త ప్రశాంతంగా దర్గా/మసీదు వెళ్ళి కాసిన్ని గుంజీళ్ళు తీసి వస్తాడు. అతని కొడుకు, కూతురు నిమ్మళంగా బడికో, కాలేజీకో వెళ్ళి వస్తారు.
“దేశంలో ప్రతి వ్యక్తీ అతడి లేదా ఆమె మతాన్ని ఆచరించడానికీ, ప్రచారం (preach) చేసుకోవడానికీ హక్కు కలిగి ఉన్నారు. మీ మతాన్ని ఆచరించండి కానీ (ఇతర మతాలను) దూషించకండి” అన్న వెంకయ్య నాయుడి గారి మాటలను ఆయన పార్టీ కింద పని చేస్తున్న హిందూత్వ గణాలు విని ఆచరిస్తే దళిత భక్తుడు కాస్త నింపాదిగా తమ ఆసామి పొలంలో పనికి వెళ్ళి వస్తాడు; ఆదివారం ధైర్యంగా చర్చిలో ప్రార్ధనకు హాజరవుతాడు. క్రిస్మస్ పండక్కి నలుగురిని పిలిచి ఇంట్లో ప్రార్ధన జరిపించుకుంటాడు.
ఈ హక్కులన్నీ ఈ దేశం లోని ప్రతి ఒక్క ముస్లిం కీ, ప్రతి ఒక్క దళితుడికీ ఉన్నాయనీ, రాజ్యంగా ఆ హక్కులు కల్పించిందని ఉప రాష్ట్రపతి చెబుతున్నారు. పరమత విద్వేషం ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధం అని బిజేపి నేత వెంకయ్య నాయుడు గారు చెబుతున్నారు. హిందూత్వ భక్తులారా కాస్త ఆలకించండి.