ఒమిక్రాన్ వైరస్ మిస్టరీ!


శాస్త్రవేత్తలకు ఒమిక్రాన్ ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది. దానికి కారణం గత కోవిడ్ రకాలతో పోల్చితే దీని లక్షణాలు కాస్త భిన్నంగా ఉండడం.

డెల్టా రకం వైరస్ తో పోల్చితే ఒమిక్రాన్ లక్షణాలు తేలికపాటి గా ఉండడం ఇప్పటికీ ఊరటగా ఉంది. కానీ లక్షణాలు తేలికగా ఉన్నాయని చెప్పి దాన్ని తక్కువ అంచనా వేయడం తగదని WHO గట్టిగా హెచ్చరిస్తోంది.

ప్రస్తుతం ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉన్నా ముందు ముందు అది ఎలాంటి లక్షణాలు సంతరించు కుంటుందో చెప్పగల పరిస్థితుల్లో సైంటిస్టులు లేరని WHO చెబుతోంది. కొత్త రకం వైరస్ పైన తగినంత డేటా శాస్త్రవేత్తలకు అందుబాటులో లేకపోవడం వల్ల ఒమిక్రాన్ ఇంకా మిస్టరీ గానే ఉందని వివిధ వైరాలజీ పరిశోధక సంస్థలు చెబుతున్నాయి

WHO ప్రకారం ఒమిక్రాన్ వైరస్ 77 దేశాలకు వ్యాపించింది. గత రకాల కంటే వేగంగా వ్యాపించింది. డెల్టా రకం కంటే 2 నుండి 3 రెట్లు వేగంగా వ్యాపించినట్లు ఇప్పటికీ గుర్తించారు. ఈ వేగమైన వ్యాప్తి వల్ల ప్రపంచ వ్యాపితంగా ఉన్న శాస్త్రవేత్తలు ఓమిక్రాన్ వైరస్ ని అధ్యయనం చేస్తున్నారని WHO చెబుతోంది.

మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ రకం వైరస్ ఇప్పటి వరకు తయారు చేసిన వ్యాక్సిన్ లను ప్రతిఘటించే సామర్థ్యం కనబరచడం. శాస్త్రవేత్తల వివరణ బట్టి చూస్తే ప్రతిఘటన అనడం కంటే కొత్త వైరస్ ని వ్యాక్సిన్ లు గుర్తించ లేక పోతున్నాయి అనడం కరెక్ట్ అవుతుందేమో.

ఎందుకంటే ఒమిక్రాన్ రకం గత వైరస్ లోని ముళ్ళు (spikes) అధిక భాగం జన్యు పరివర్తనానికి (mutation) గురి కావడం ద్వారా ఉనికి లోకి వచ్చింది. వ్యాక్సిన్ లను ప్రధానంగా ఈ స్పైక్ లను టార్గెట్ చేస్తూ తయారు చేశారు. Spike ల ద్వారానే వైరస్ లు మన శరీర కణాల్లో కి ప్రవేశిస్తున్నాయి గనక.

వ్యాక్సిన్ లను కొత్త రకం కొవిడ్ గుర్తించడం లేదు అంటే అది కంపెనీలకు చెడ్డ పేరు. దాని వల్ల వ్యాక్సిన్ ల పైన జనానికి నమ్మకం పోయినా పోవచ్చు. నమ్మకం పోతే, వ్యాక్సిన్ ల అమ్మకం తగ్గినా, ఆగినా కంపెనీలకు నష్టం. ప్రతిఘటన అంటే నెపాన్ని వైరస్ మీదికి నెట్టి వేయొచ్చు

Omicron వైరస్ సోకిన వారందరూ ఒకటే రకం లక్షణాలు కలిగి లేరట. అయితే ఒక కామన్ లక్షణం ఏమిటంటే గొంతు లో కిచ్ కిచ్. లేదా గొంతులో దురదగా ఉండడం (scratchy throat). గత రకాల్లోని వైరస్ లక్షణం గొంతు నొప్పి లేదా soar throat కావడం గమనార్హం.

డిస్కవరీ హెల్త్ సీఈఓ డాక్టర్ రేయాన్ నోచ్ ప్రకారం ఒమిక్రాన్ వైరస్ సోకిన వారిలో కనిపించే మొదటి లక్షణం గొంతులో దురద. తర్వాత ముక్కు దిబ్బడ, పొడి దగ్గు, మయాల్గియా వల్ల కలిగే దిగువ నడుము నొప్పి. డా నొచ్ పరిశీలనతో బ్రిటిష్ వైద్య ఆరోగ్య నిపణులు సర్ జాన్ బెల్ ఏకీభవించారు. బిబిసి 4 రేడియో తో మాట్లాడుతూ ఆయన ఒమిక్రాన్ లక్షణాలు గత రకాల తో భిన్నంగా ఉన్నట్లు చెప్పాడు. పై లక్షణాలతో పాటు నీళ్ళ విరేచనం కూడా అవుతున్నట్లు బెల్ చెప్పాడు.

రెండు రోజులతో పాటు బూస్టర్ డోసు వేసుకుంటే కొత్త రకం వైరస్ నుండి రక్షణ పొందవచ్చని అమెరికా అధ్యయనం చెప్పినట్లు గత ఆర్టికల్ లో చూసాం. ఇండియాలో బూస్టర్ డోసు వేస్తున్నట్లు ప్రభుత్వాలు చెప్పలేదు. కానీ బూస్టర్ డోసు వేయమని అడిగిన వారికి ఇప్పటికే వేస్తున్నట్లు తెలుస్తోంది.

రెండు డోసుల తర్వాత ఉండవలసిన కాలం 6 నెలలా లేక 9 నెలలా అన్నది తేలక ప్రకటించలేదని చెబుతున్నారు. కానీ చాలా మందికి మొదటి డోస్ కూడా పడ లేదు. కనుక బూస్టర్ డోస్ అధికారికంగా మొదలు పెడితే విమర్శలు వస్తాయని చెప్పకుండా బూస్టర్ వేయటం మొదలు పెట్టారని కొందరు విమర్శిస్తున్నారు.

వ్యాఖ్యానించండి