
Gujarat High Court
ప్రజల ఆహార అలవాట్లపై నిర్బంధం విధించాలని ప్రయత్నిస్తున్న హిందూత్వ పాలకులకు గుజరాత్ హై కోర్టు కాస్త గడ్డి పెట్టింది. అహ్మదాబాద్ మున్సిపాలిటీలో మాంసాహారం అమ్ముతున్న తోపుడు బండ్ల ను మునిసిపాలిటీ స్వాధీనం చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రజలు ఏ ఆహారం తినాలో నిర్ణయించే అధికారం పాలకులకు లేదని తేల్చి చెప్పింది. స్వాధీనం చేసుకున్న తోపుడు బండ్లను వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది.
“మీరు మాంసాహారం భుజించరు. అది మీ దృక్పధం. కానీ జనం ఏమి తినాలన్నది మీరెలా నిర్ణయిస్తారు? ప్రజలు తాము కోరుకునేదాన్ని తినకుండా మీరు ఎలా నిరోధిస్తారు? అని గుజరాత్ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీరెన్ వైష్ణవ్ అహ్మదాబాద్ మునిసిపాలిటీని ప్రశ్నించారు.
మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ని వెంటనే కోర్టుకు హాజరు కావాలని జస్టిస్ వైష్ణవ్ మొదటి సెషన్ లో ఉత్తర్వులు ఇచ్చారు. మధ్యాహ్నం హాజరైన కమిషనర్ తరపు లాయర్ కి కూడా అవే ప్రశ్నలు సంధించారు.
“ప్రజలు ఏమి తినాలో మీరు ఎలా నిర్ణయిస్తారు? అధికారంలో ఉన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఓ రోజు ఇది చేయాలని భావిస్తే చేసేస్తారా? రేపు మా ఇంటి బైట నేనేం తినాలో కూడా మీరు నిర్ణయిస్తారా? రేపు వచ్చి .డయాబెటిస్ రావచ్చని చెప్పి నేను చెరుకు రసం తాగకూడదనో లేకపోతే నా ఆరోగ్యానికి మంచిది కాదు గనక కాఫీ తాగొద్దనో చెబుతారా?” అని ఆయన ప్రశ్నించారు.
జస్టిస్ బీరెన్ వైష్ణవ్ ప్రశ్నలకు కారణం అహ్మదాబాద్ మునిసిపాలిటీ అధికారులు మాంసాహారం అమ్మే తోపుడు బండ్ల వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రూల్స్ ప్రకటిస్తూ వారి బండ్లను స్వాధీనం చేసుకోవడం.
రాజ్ కోట్ మునిసిపాలిటీలో మొదట ఈ సమస్య మొదలయింది. మునిసిపల్ కొన్సిలర్ ఒకరు ఓ రోజు మాంసాహారం అమ్మే ముస్లిం తోపుడు బండ్ల వ్యాపారుల వల్ల మత సెంటిమెంట్లు దెబ్బ తింటున్నాయని చెబుతూ నిరసన ప్రకటన జారీ చేశాడు. ఆయన ప్రకటన ఇతర బిజేపి ఛోటా మోటా నాయకులకు స్ఫూర్తి అయింది. వరుసగా ఒక్కో పట్నంలో బిజేపి నేతలు ఈ తరహా ప్రకటనలు జారీ చేస్తూ వచ్చారు. చివరికి మాంసాహారాన్ని బహిరంగంగా అమ్మడాన్ని నిషేధించాలి అనేంతవరకూ వెళ్లారు.
ఈ నేపధ్యంలో అహ్మదాబాద్ మునిసిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎగ్ ఆమ్లెట్లు, చికెన్, మటన్ లతో ఆహార పదార్ధాలు అమ్ముకుని జీవనం సాగించే చిన్న చిన్న వ్యాపారులకు చెందిన తోపుడు బండ్ల పైన దాడులు ప్రారంభించారు. వారిపై దాడి చేసి బలవంతంగా వారి బండ్లను లాక్కుపోయారు. వారు వ్యాపారం నిమిత్తం ఉపయోగించే స్టౌలు, వంట సామాన్లు, కుర్చీలు, బల్లలు, ప్లేట్లు, గ్లాసులు లాంటి చిన్న పెద్ద సామానుతో సహా ట్రక్కుల్లో వేసుకుని తీసుకెళ్లిపోయారు. దానితో వారికి జీవనోపాధి కరువయింది. వ్యాపారుల్లో ఎక్కువ మంది ముస్లింలు ఉండడం గమనార్హం.

Food carts being removed in Ahmedabad
నిజానికి చిరు వ్యాపారుల రక్షణ కోసం గుజరాత్ ప్రభుత్వం 2014లో ఒక చట్టం చేసింది. Street Vendors [Protection of Livelihood and Regulation of Street Vending] Act, 2014 పేరుతో చేసిన ఈ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ తోపుడు బండ్లు ఇతర సామాన్లు పోగొట్టుకున్న వ్యాపారులు పాతిక మంది వరకు హై కోర్టును ఆశ్రయించారు.
మాంసాహారం అమ్మే ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారన్న అపప్రధ రాకుండా ఉండేందుకు ఒకరిద్దరు పండ్ల వ్యాపారుల బండ్లు, పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా పౌల్ట్రీ, చేపలు, గుడ్లు మొ.న ముడి పదార్ధాలు ఉపయోగించి వండిన ఆహారంతో వ్యాపారం చేసుకునే తోపుడు బండ్లు లక్ష్యంగా చేసుకుని డ్రైవ్ నిర్వహించారు. అనగా ఆమ్లెట్లు వేసి అమ్ముకునేవారు, కోడి పకోడీ, చీకులు, కబాబ్ లు మొ.న ఆహారాలు అమ్ముకునే వాళ్ళను టార్గెట్ చేశారు.
ఇలాంటి పదార్ధాలు పెద్ద పెద్ద హోటళ్లలోనూ సర్వ్ చేస్తారు. స్టార్ హోటళ్లు కూడా వీటిని సర్వ్ చేస్తాయి. పెద్ద హోటళ్ళకు వెళ్లలేని అనేక మంది దిగువ మధ్య తరగతి, పేద వర్గాలు తోపుడు బండ్లపై అమ్మే పదార్ధాలతో సంతృప్తి పడతారు. అయితే రాను రాను నిరుద్యోగులు పెరుగుతున్న నేపధ్యంలో కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళు కూడా వంటకాలు నేర్చుకుని కాస్త శుభ్రత పాటిస్తూ, రుచికరంగా వండుతూ ధనిక కస్టమర్లను కూడా ఆకర్షించడం ప్రారంభించారు. వారివల్ల పెద్ద హోటళ్ళ వ్యాపారం తగ్గిపోయే పరిస్ధితి ఏర్పడింది. ఈ పెద్ద వ్యాపారుల ప్రోద్బలంతోనే మునిసిపల్ కౌన్సిలర్లు మతపర సెంటిమెంట్లను అడ్డం పెట్టుకుని ఆ పేరుతో స్ట్రీట్ వెండర్ల వ్యాపారాలను ఎత్తివేసే కార్యక్రమానికి దిగారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
తోపుడు బండ్ల వ్యాపారుల తరపున అడ్వకేట్ రోనిత్ జాయ్ వాదనలు వినిపిస్తూ “గుజరాత్ రాష్ట్రంలో నాన్-వెజ్ ఆహారం తయారు చేసి అమ్మే వ్యాపారం వందల సంవత్సరాలుగా నడుస్తోంది. గుడ్లు అమ్మడం పైన గానీ లేదా ఇతర నాన్-వెజ్ ఆహారం అమ్మకాల పైన గానీ నిషేధం విధించే చట్టాన్ని ఏదీ పార్లమెంటు చేయలేదు. పిటిషన్ దారులు వ్యాపారం చేసుకోనివ్వకుండా అధికారులు ఏ అధికారంతో, ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో తెలియడం లేదు” అని కోర్టుకు విన్నవించారు.
“పిటిషనర్లను గానీ లేదా ఇతరులను గానీ తోపుడు బండ్ల వ్యాపారం చేయకుండా వివిధ ఆహార పదార్ధాలు అమ్ముకోకుండా అడ్డుకోవడం గానీ నిరోధించడం గానీ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 చట్టానికి పూర్తిగా విరుద్ధం. కనీసం ఆలోచన లేకుండా ఈ చర్యలకు పాల్పడ్డారు” అని వ్యాపారుల అడ్వకేట్ కోర్టుకు విన్నవించారు.
పెద్దపెద్ద హొటెల్‌వాడు కూడా చీప్ క్వాలిటీ పామాయిల్‌తోనే వంట చేస్తాడు తప్ప సన్ ఫ్లవర్ ఆయిల్ వాడడు. ఆ హొటెల్‌లో శాకాహారం తిన్నా విరోచనాలు అవుతాయి. ఇక్కడ మాంసాహారం ఎప్పుడు సమస్య అయ్యింది? నిన్న లైసెన్స్డ్ రైల్వే కేంటీన్‌లో తిన్న సమోసాల వల్ల నాకు ఎసిడిటీ అయ్యింది. హిందువులు మాంసం తినకూడదు అని రూల్ వచ్చింది ఆది శంకరాచార్యుల కాలంలో. అయినప్పటికీ శూద్రుల్లో ఎక్కువ మంది ఇప్పుడు కూడా మాంసం తింటారు. వీళ్ళు బాపనాచారాలని శూద్రుల మీదకి రుద్దుతున్నారు అంటే ప్రిసైజ్‌గా ఉంటుంది.