అమరావతి రాజధానికి మద్దతుగా మహా పాదయాత్రలో బి‌జే‌పి!


Maha padayatra from Thulluru to Thirupathi

ఆంధ్ర ప్రదేశ్ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మించడానికి బదులుగా మూడు రాజధానుల పేరుతో జగన్ నేతృత్వం లోని వై‌సి‌పి ప్రభుత్వం విశాఖపట్నం నగరాన్ని ప్రముఖంగా ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతి బదులు విశాఖపట్నాన్ని వై‌సి‌పి ప్రకటించడంపై ఇంతవరకు పెద్దగా నోరు విప్పని బి‌జే‌పి ఇప్పుడు గత టి‌డి‌పి ప్రభుత్వ నిర్ణయం అమలుకై డిమాండ్ చేయటం విశేషం. 

విజయవాడలో బి‌జే‌పి ఎస్‌సి మోర్చా సమావేశం సందర్భంగా నవంబర్ 21 తేదీన అమరావతి రైతుల మహా పాదయాత్రలో పాల్గొనడానికి బి‌జే‌పి నిర్ణయం తీసుకున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించాడు.

45 రోజుల మహా పాదయాత్రను రాజధాని ప్రాంతం లోని తుళ్ళూరు, తాడికొండ మండలాలకు చెందిన 5,000 మంది రైతులు నవంబర్ 1 తేదీన ప్రారంభించారు. ఈ పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శత విధాలా ప్రయత్నించగా రాష్ట్ర హై కోర్టు కొన్ని షరతులతో ఇచ్చిన అనుమతితో రైతులు యాత్రను ప్రారంభించారు.

హై కోర్టు అనుమతి ఉన్నప్పటికీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను దించి యాత్రకు ఆటంకాలు కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లుగా కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించాయి. కానీ ప్రజల ప్రతిఘటన వలన పోలీసు బలగాలు వెనక్కి తగ్గినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

పాదయాత్రలో టి‌డి‌పి, కాంగ్రెస్… ఇరు పార్టీలకు చెందిన రైతులు పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సోము వీర్రాజు. తమ పార్టీ బి‌జే‌పి కూడా యాత్రలో పాల్గొంటుందని ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన వై‌సి‌పి ప్రస్తుతానికి రాజకీయంగా ఒంటరి అయినట్లు కనిపిస్తోంది.

రాజధానిని శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధాని, న్యాయ రాజధాని అంటూ మూడు భాగాలుగా విభజించడం ప్రగతి నిరోధక చర్య అని సోము వీర్రాజు ప్రకటించారు. నిజానికి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని కూడా ఆయన ప్రకటించారు. ఇప్పటికే రాజధాని మౌలిక నిర్మాణాల కోసం కేంద్రం 2,500 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి రెండేళ్ళు పైనే అయింది. ప్రకటించడమే కాకుండా విశాఖపట్నంలో ఆ మేరకు భూ సేకరణకు కొన్ని ప్రయత్నాలు కూడా చేసింది. ఈ లోపు కోర్టులో కేసులు దాఖలు కావడం వల్లనో, మరే కారణం వల్లనో మూడు రాజధానుల ప్రయత్నాల విషయంలో అడుగు ముందుకు పడలేదు. రాజధాని నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పుడు ఇన్నాళ్లూ రాష్ట్ర బి‌జే‌పి పార్టీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ మాటా పలుకూ లేకుండా ఎందుకు ఊరకున్నట్లు?

రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 2,500 కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్పడంలో వాస్తవం ఎంతవరకు ఉన్నదో ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వానికి బాకా ఊదే పత్రికలు అసలు కేంద్రం నుండి నిధులు రావడం లేదని చెబుతాయి. వివిధ పత్రికలు, చానెళ్లు వివిధ పార్టీలకు మద్దతుగా వార్తలు ఇవ్వడమే తప్ప ప్రజా ప్రయోజనాల దృష్టిలో వార్తలు ప్రచురించడం ఎప్పుడో మానేశాయి. దానితో ప్రజలకు వాస్తవాలు అందే దారులు మూసుకుపోవడం ఒక దౌర్భాగ్యం.

Amaravathi judicial complex -January, 2019

ఏ‌పి రీ-ఆర్గనైజేషన్ చట్టం కింద పోలవరం ప్రాజెక్టుకు 11,182 కోట్లు, రాజధాని అభివృద్ధి కోసం రు 2,500 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు కింద రు 1,750 కోట్లు ఇచ్చామని గత ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం రాజ్య సభలో ప్రకటించింది. అంటే ఆంధ్ర ప్రదేశ్ పునర్నిమాణానికి ఇప్పటివరకు కేవలం రు 12,932 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ముట్టినట్లు. రాజధాని నిర్మాణానికి కట్టుబడిన కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగింది ఇంత మొత్తమేనా?

ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి, బి‌జే‌పి మాజీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రాన్ని సదర్శించిన సంగతి విదితమే. ఈ సందర్భంలో రాష్ట్ర రాజధాని అమరావతి లోనే నెలకొల్పాలని ఆందోళన చేయాల్సిందిగా ఆయన బి‌జే‌పి శ్రేణులకు, నాయకులకు పిలుపు ఇచ్చినట్లుగా పత్రికలు తెలిపాయి. తద్వారా వై‌సి‌పి ఎన్ని ప్రకటనలు చేసినా చివరకు రాజధాని ఒకటే అవుతుందని అమిత్ షా స్పష్టం చేసినట్లయింది.

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అమిత్ షా పిలుపు ఒక ఆసక్తికర మలుపుగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో ఇక ఎంతమాత్రం సంబంధాలు పెట్టుకునేది లేదని 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు అమిత్ షా తీవ్ర స్వరంతో ప్రకటించారు. ఇటీవల అమిత్ షా, ప్రధాన మంత్రిలను కలిసేందుకు టి‌డి‌పి నేత చంద్రబాబు నాయుడు రెండు రోజులు ఢిల్లీలో ఎదురు చూసినప్పటికీ ఆయనకు ఇద్దరిలో ఎవరూ సమయం ఇవ్వలేదు. పాదయాత్రలో పాల్గొనాలన్న బి‌జే‌పి నిర్ణయంతో టి‌డి‌పి, బి‌జే‌పిలు ఆ పేరుతో దగ్గర కానున్నాయా? తెలియవలసి ఉన్నది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురయిన వెంటనే రాజ్యసభలోని పలువురు టి‌డి‌పి ఎం‌పి లు టి‌డి‌పి ని వీడి బి‌జే‌పిలో చేరిపోయారు. ఈ చేరిక చంద్రబాబు నాయుడు మంత్రాంగంలో భాగమే అని నాడు పలువురు విశ్లేషకులు ఊహించారు. ఆ మంత్రాంగమే నేడు ఒక రూపు దిద్దుకుంటున్నదా అన్న అనుమానాలు కూడా నేడు కలుగుతున్నాయి. అయితే టి‌డి‌పితో ఇక పొత్తు లేనే లేదని షా మళ్ళీ ప్రకటించారు. అయినప్పటికీ ఒకటి చెప్పి మరొకటి చేయడం ఎప్పటికెయ్యది ప్రస్తుతంబో  దానిని అమలు చెయ్యడం  రాజకీయ  నాయకులకు  కొత్త  కాదు.

కాగా మూడు రాజధానుల నిర్ణయం తుగ్లక్ చర్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంవత్సరానికి 3 పంటలు పండే సారవంతమైన భూముల్లో రాజధాని నిర్మించాలని నిర్ణయించడం ద్వారా టి‌డి‌పి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ధాన్యాగారాన్ని కాంక్రీటు వనంగా మార్చివేసి తద్వారా ప్రజల, రైతుల ప్రయోజనాలకు తీవ్రం నష్టం వాటిల్లడానికి దోహదం చేసింది.

రాజధానికి కొన్ని వందలు లేదా మహా అయితే రెండు మూడు వేల ఎకరాలు మాత్రమే అవసరం ఉన్నప్పటికీ 33,000 ఎకరాలు సేకరించి భారీ రియల్ ఎస్టేట్ వ్యాపార యజ్ఞానికి అప్పటి ప్రభుత్వం తెర తీసింది. విజయవాడ, గుంటూరు మధ్య వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ వాటిని వదిలి పంట భూములను కార్పొరేట్ రాబందుల పరం చేసేందుకు సిద్ధపడ్డారు.

అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ అంటూ 33,000 ఎకరాలు సేకరించి, ఆ భూముల్లో సిమెంటు రోడ్లు, భవనాలు నిర్మించాక హఠాత్తుగా మరో ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు అంటూ నిర్మాణాలు ఆపేయడం ద్వారా ఇప్పటి ప్రభుత్వం మరో మతిమాలిన చర్యకు దిగింది.

ఇలా రెండు ప్రభుత్వాలూ తమ తమ నీడలో ఉన్న ధనికవర్గాలకు ప్రయోజనాలు చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాయి తప్ప ప్రజల కష్ట నష్టాల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. మూడు రాజధానుల నిర్ణయం మరీ విచిత్రం. అభివృద్ధి వికేంద్రీకరణ అత్యవసరమే. కానీ వై‌సి‌పి ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయం అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా అవుతుందో అంతుబట్టని విషయం.

అభివృద్ధిని వికేంద్రీకరించడం అంటే రాజధాని ద్వారా జరిగే విధులను గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపు విధులను ఒక్కో మూలకు విసిరేయడం ఎంతమాత్రం కాదు. అభివృద్ధికి ప్రధాన సాధనం ఉత్పత్తి కార్యకలాపాలు తప్ప ప్రభుత్వ రాజధాని కార్యకలాపాలు కాదు. రాజధాని కార్యకలాపాలన్నీ ఒకే చోట జరిగితేనే ప్రజలకు, వివిధ వాణిజ్య, రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు పనులు సులువుగా జరుగుతాయి. కోర్టులో పని చూసుకుని ఆ తర్వాత తమ ప్రాంత ఎం‌ఎల్‌ఏ ను కలుసుకుని విన్నపాలు చేసుకుని, అనంతరం సెక్రెటేరియట్ లో పని చేయించుకోవాలనుకున్న వ్యక్తికి ఒకే రాజధాని ఉంటే ఉపయోగమా లేక మూడు నగరాలకు ప్రయాణించవలసి రావడం ఉపయోగమా?

వివిధ ప్రాంతాల్లో వివిధ ఉత్పత్తి కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఆయా ఉత్పత్తి కార్యకలాపాలకు తగినట్లుగా ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, వాణిజ్య కేంద్రాలు, రేవు పట్టణాలు, హోటళ్లు, బీచ్ రిసార్టులు, ఫిషింగ్ హార్బర్లు మొ.వి నెలకొల్పడం ద్వారా అభివృద్ధిని సమానంగా పంచేందుకు పూనుకుంటే అది అభివృద్ధి వికేంద్రీకరణ. ఈ తరహా చర్యల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఎక్కడికక్కడ ఉపాధి లభిస్తుంది. వలసలు తప్పుతాయి. ప్రాంతీయ వైషమ్యాలు కూడా నశిస్తాయి.

సొంత ఆస్తుల అభివృద్ధి, విస్తరణ కోసం అర్రులు చాచడం మానుకుని నిజమైన ప్రజా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకున్నట్లయితే ప్రజోపయోగమైన రాజధాని నిర్మించుకోవడంతో పాటు, వికేంద్రీకృత అభివృద్ధిని కూడా ఎలా సాధించుకోవచ్చో తెలుసుకోవడం పెద్ద పనేమీ కాదు. అందుకు తగ్గ మానవ, నీటి, తీర ప్రాంత వనరులు కూడా  రాష్ట్రానికి అందుబాటులో ఉన్నాయి. లేనిదల్లా నేతల్లో చిత్తశుద్ధి మాత్రమే.

Amaravathi unfinished

3 thoughts on “అమరావతి రాజధానికి మద్దతుగా మహా పాదయాత్రలో బి‌జే‌పి!

  1. ఛత్తీస్‌గడ్ రాజధాని నిర్మించడానికి ఇంత టైమ్ పట్టలేదు. అయినా బహుళ అంతస్తుల భవనాలు కట్టే టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో రాజధానికి 33 వేల ఎకరాలు అనవసరమే.

  2. నాది ఇంకొక డౌట్. చదరపు కిలో మీటర్ అంటే 247.105 ఎకరాలు. 33,000 ఎకరాలంటే 133.546468 చదరపు కిలోమీటర్లు. నాంపల్లి, బషీర్‌బాగ్‌లలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు చూసినవాడు ఎవ్వడూ అవి 133 చదరపు కిలోమీటర్లు అనుకోడు. 133 చదరపు కిలోమీటర్లు అంటే అది 60కి పైగా గ్రామాల చుట్టు ఉన్న వ్యవసాయ భూమితో సమానం. అసలు చంద్రబాబు బావిలోని కప్పా, లేదా అతను జనాన్ని బావిలోని కప్పలు అనుకుంటున్నాడా?

వ్యాఖ్యానించండి