
Jakia Jafri visits her house along with Teesta Setalvad
గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ రాష్ట్ర వ్యాపితంగా ముస్లింలపై జరిగిన మారణకాండ విషయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. క్లీన్ చిట్ పై నిరసన పిటిషన్ దాఖలు చేసిన జకీయా జాఫ్రీ తరపున అడ్వకేట్ కపిల్ సిబాల్ తన వాదనలు ఈ రోజు కొనసాగించారు. జాఫ్రీ చేసిన ఫిర్యాదుపై అనేక సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పటికీ వాటిపై పరిశోధన జరపకుండానే నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చి ‘క్లోజర్ రిపోర్ట్’ దాఖలు చేశారని కపిల్ సిబాల్ వాదించారు.
జకీయా జాఫ్రీ గుజరాత్ కి చెందిన దివంగత ఎంపి ఎహసాన్ జాఫ్రీ భార్య. కాంగ్రెస్ పార్టీ ఎంపి అయిన ఎహసాన్ జాఫ్రీని గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం జరిగిన మారణ కాండలో హిందూత్వ (హిందూ కాదు) సంస్ధల మూకలు చంపేశాయి. మొదట ఆయనను క్రూరంగా నరికి అనంతరం సజీవ దహనం చేశారు. హిందూత్వ మూకలకు భయపడి ఎంపి ఇంట్లో తలదాచుకున్న వారిని కూడా సజీవ దహనం చేసి చంపేశారు.
అహ్మదాబాద్ లోని గుల్బర్గ్ సొసైటీ కాలనీలో 29 బంగళాలు, 10 అపార్ట్^మెంట్ లు ఉండగా అన్నింటినీ మూకలు తగలబెట్టేశాయి. ఈ మారణకాండలో 69 మంది ముస్లింలను చంపి దహనం చేయగా వారిలో 31 మంది శవాలు మాత్రమే లభించాయి. 28 మంది అవశేషాలు కూడా లభించకుండా కాలి బూడిదై పోయారు. ఒక్కో ఇంటినీ వెతికి వెతికి పట్టుకుని మరీ నరికి మంటల్లో విసిరేశారని అప్పట్లో పత్రికలు, స్వతంత్ర సంస్ధల నివేదికలు తెలిపాయి. మారణకాండలో పాల్గొన్న హంతకులే తెహెల్కా పత్రిక స్టింగ్ ఆపరేషన్ లో రహస్య కెమెరాల ముందు, స్వయంగా ఈ సంగతిని ధృవపరిచారు.
ఈ మారణకాండ వెనుక ముఖ్యమంత్రి నరేంద్ర మోడి కుట్ర ఉన్నదని ఎహసాన్ జాఫ్రీ భార్య జకీయా జాఫ్రీ ఆరోపించింది. ఈ మేరకు ఆమె అప్పటి నుండి కోర్టుల్లో అలుపెరుగకుండా పోరాటం చేస్తోంది. 28, ఫిబ్రవరి 2002 ఉదయం నుండే హిందూత్వ మూకలు గుల్బర్గ్ సొసైటీ కాలనీ గేటు వద్ద మూకలు గుమి కూడారు. కాలనీలో అత్యధికులు ముస్లింలు. ఎగువ మధ్య తరగతి నుండి సంపన్న తరగతికి చెందినవారు. పలువురు వ్యాపారులు, ఉన్నతోద్యోగులు ఇక్కడ నివశిస్తుండేవారు. (ఇప్పుడు ఎవరూ నివసించడం లేదు. ఒక ఇల్లు మాత్రమే తిరిగి బాగు చేసుకున్నారని పత్రికల వార్తలను బట్టి తెలుస్తోంది. ఏడాదికి ఒక్కసారి ఆ కుటుంబాల్లో చావకుండా మిగిలినవారు కాలనీలో సమావేశమై మృతులను స్మరించుకుంటున్నారు.)
ఆ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎంపి ఎహసాన్ జాఫ్రీ తమ సొసైటీని రాళ్ళు, కత్తులు, బరిసెలు, పెట్రోల్ బాంబులతో మూకలు చుట్టుముట్టారని తమను కాపాడాలని, పోలీసు ఫోర్స్ ని పంపాలని కోరుతూ పలుమార్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ కూ, డిజేపి కి ఫోన్లు చేసినప్పటికీ వారు పోలీసులను పంపలేదు. చివరికి ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి కూడా ఆయన ఫోన్ చేశారు. అనేకసార్లు కాల్ చేశాక చివరకు మోడి ఫోన్ ఎత్తి “నువ్వు ఇంకా చావలేదా?” అంటూ తిట్టు పదం ప్రయోగించాడని ఆ సమయంలో జాఫ్రీతో పాటు ఉన్న రూపా బెన్ తెలిపారు. గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండలో ఆమె తన కుమారుడిని కోల్పోయింది.

Ehsan Jafri with his daughter
4,500 కు పైగా మూకలు చుట్టుముట్టిన ఆ సమయంలో అక్కడ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎం కే టాండన్ నేతృత్వంలోని ‘పోలీస్ స్ట్రైకింగ్ ఫోర్స్’ పొజిషన్ తీసుకుని ఉన్నారు. కానీ వారు మూకలను ఆపే ప్రయత్నం చేయలేదు. మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్న జాయింట్ కమిషనర్ మధ్యాహ్నం సమయానికి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆయన వెళ్ళాక హిందూత్వ మూకలు చెలరేగిపోయాయి. సొసైటీ గేటు బద్దలు కొట్టి లోపలికి చొరబడి యధేచ్ఛగా స్వైర విహారం చేశారు. దొరికినవాళ్లని దొరికినట్లు నరికి పెట్రోలు పోసి కాల్చి చంపారు. ఎహసాన్ జాఫ్రీ ఇంటిని (అపార్ట్మెంట్) చుట్టు ముట్టారు. అప్పటివరకూ పోలీస్ కమిషనర్, డిజేపి, ముఖ్యమంత్రిలకు ఫోన్లు చేసి విఫలం చెందిన జాఫ్రీ చివరకు మూకలకు నచ్చజెప్పేందుకు తానే ఇంటి గేటు దాటారు. వెంటనే ఆయన్ని మూకలు ఈడ్చుకెళ్ళి నరికి, పొడిచి చివరికి పెట్రోలు పోసి తగలబెట్టారు.
జాఫ్రీపై జరిగిన హత్యాకాండకు రూపాబెన్ ప్రత్యక్ష సాక్షి. పోలీసు అధికారులకు, ముఖ్యమంత్రికి ఫోన్ చేయమని ఆమె కూడా పదే పదే జాఫ్రీని కోరింది. వీలయితే బైట ఉన్న గూండా మూకలకు కూడా ఫోన్ చేసి తమను వదిలిపెట్టమని అడగమని ఆమె కోరింది. చివరికి ఇంటి బైటికి అడుగు పెట్టిన జాఫ్రీ నరహంతకుల మతవిద్వేషానికి, విద్వేషాల మంటల్లో రాజకీయ భవిష్యత్తుని చూసుకున్న నరహంతక రాజకీయ నాయకుల కుట్రకు బలయ్యాడు.
విచిత్రం ఏమిటంటే కోర్టులు సైతం జాఫ్రీయే మూకలను రెచ్చగొట్టాడని తేల్చడం. వేలమంది కత్తులు, బరిసెలు, పెట్రోలు క్యాన్ లు చేతబట్టి ఇంటిలోకి చొరబడితే ఆత్మరక్షణ కోసం ప్రయత్నించరా? సమీపిస్తున్న మూకలను హెచ్చరించేందుకు జాఫ్రీ తన తుపాకీని గాలిలో పేల్చాడు. తద్వారా మూకలు తమను సమీపించడానికి వెనకడుగు వేస్తారని ఆశించాడు. ఆయన తుపాకి కాల్చడం వల్లనే మూకలు 69 మందిని చంపారని, ఇంకా అనేక మందిని గాయపరిచారని అర్ధం వచ్చేట్లుగా కోర్టులు తీర్పులు వెలువరించాయి. సుప్రీం కోర్టు నియమించిన సిట్ కూడా ఇదే నిర్ణయానికి వచ్చింది.
19 డిసెంబర్ 2002 నుండి 2 మే 2004 వరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పని చేసిన విశ్వేశ్వర్ నాధ్ ఖరే (విఎన్ ఖరే) గుజరాత్ మారణకాండలో ముఖ్యమంత్రి నరేంద్ర మోడి హస్తం ఉందని ఖరాఖండిగా తేల్చి చెప్పాడు. అయితే ఆయన పదవీ విరమణ చేశాక మాత్రమే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ముఖ్యమంత్రి మద్దతు, పాత్ర లేకుండా గుజరాత్ లో ఆ విధంగా రాష్ట్ర స్ధాయిలో ఒక పధకం ప్రకారం అలాంటి మారణకాండ జరగడం సాధ్యం కాదని, అది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన హత్యాకాండ అనీ వి ఎన్ ఖరే స్పష్టం చేశాడు.
2004 లో హార్డ్ న్యూస్ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ జస్టిస్ విఎన్ ఖరే తన అభిప్రాయం ప్రకారం నరేంద్ర మోడిని (గుల్బర్గ్ సొసైటీ మారణకాండ కు గాను) మూకుమ్మడి నరమేధం (genocide), నరహత్య (manslaughter) నేరాలకు బాధ్యుడిని చేస్తూ ప్రాసిక్యూట్ చేయాలని చెప్పాడు. నరేంద్ర మోడి దీనికి స్పందిస్తూ ఖరే ఇప్పుడు ఎలాంటి బాధ్యతాయుత పదవిలో లేడని గమనించాలని వ్యాఖ్యానించాడు. తనకు జాఫ్రీ ఎవరో తెలియదనీ, ఆయన తనకు ఫోన్ చేయలేదని చెప్పాడు. నరేంద్ర మోడి ఏ సమయంలోనూ “వెళ్ళి ముస్లింలను చంపండి” అని చెప్పలేదు అని సిట్ తన వాదనల్లో వ్యాఖ్యానించింది.
మోడి కుట్ర చేశారా లేదా అన్నది పక్కన పెడితే, అసలు మతవిద్వేష మారణకాండకు పధకం వేసినవాళ్లు, అందునా రాజకీయ నేతలు ఫలానా మతం వారిని చంపండి అని సాక్ష్యాలు దొరికే విధంగా ఆదేశాలు ఇస్తారా? ర్యాలసీమ ఫ్యాక్షన్ తగాదాలను చూపిస్తున్నట్లు చెప్పే సినిమాల్లో విలన్లు తప్ప అలాంటి డైలాగ్ లు బహిరంగంగానో ఇంకో విధంగానో వల్లిస్తారా?
ఈ తరహాలో సిట్ చేసిన తప్పుల్ని, తన నివేదికలోనే మోడీకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను సిట్ పట్టించుకోకపోవడాన్ని, తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ వెల్లడించిన వాస్తవాలను అసలు పరిగణనలోకే తీసుకోకపోవడాన్ని ఎత్తి చూపిస్తూ జకీయా జాఫ్రీ దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ పై ప్రస్తుతం సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. జకీయా జాఫ్రీ తరపున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబాల్ ఈ రోజు (10/11/2021) వినిపించిన వాదనల్లోని ముఖ్యం అంశాలు ఇలా ఉన్నాయి.
సిట్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. స్టేట్^మెంట్లు రికార్డ్ చేయలేదు. నిందితుల స్టేట్^మెంట్ లను యధావిధిగా రికార్డ్ చేసి క్లోసర్ రిపోర్ట్ (మూసివేత నివేదిక) ను దాఖలు చేసింది. నిందితుల ఫోన్ లు స్వాధీనం చేసుకోలేదు. సిడిఆర్ (కాల్ డేటా రికార్డ్) లను పరీక్షించలేదు. సిడిఆర్ లను ఎందుకు నాశనం చేశారో పరిశీలించలేదు. పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకుండా ఎందుకు నిలబడిపోయారో విచారించలేదు.
-
అత్యంత నష్టకరమైన, ఆందోళనకరమైన అంశం ఏమిటంటే తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ నివేదికలను సిట్ పూర్తిగా విస్మరించడం. ఈ నివేదికలను నరోడా పాటియా హత్యాకాండ లాంటి కేసుల్లో “న్యాయస్ధానేతర ఒప్పుకోలు” (extra-judicial confession) కింద పరిగణనలోకి తీసుకున్నారు.
-
మిలార్డ్స్! వాల్యూమ్ VA, పేజీ 291 చూడండి. (తెహెల్కా) రికార్డింగ్ లకు సంబంధించి రాత రూపం లో ఇక్కడ ఉన్నాయి. ఈ టేపులను సిబిఐ ప్రామాణికమైనవిగా నిర్ధారించింది. కానీ సిట్ మాత్రం వీటిని ముట్టుకోలేదు.
తెహెల్కా స్టింగ్ రిపోర్ట్ ను సిబాల్ కోర్టులో చదివి వినిపించాడు. ఒక నిందితుడు బాంబులను తయారు చేయడం గురించి, వాటిని మత హత్యల్లో వినియోగించడం గురించి ఆ రికార్డ్ లో వివరించి చెప్పాడు.
-
సిట్ అతనిని అరెస్ట్ చేయలేదు. అతని స్టేట్మెంట్ ని రికార్డ్ చేయలేదు. ఆ స్పాట్ ని సందర్శించలేదు. గుజరాత్ హై కోర్టు స్వయంగా ఈ టేపులు ప్రామాణికమైనవేనని నరోడా పాటియా కేసులో నిర్ధారించింది.
తెహెల్కా స్టింగ్ నివేదికలోని ఆ నిందితుడి స్టేట్మెంట్స్ లో ఎక్కడైనా “భారీ కుట్ర” జరిగిన విషయాని వెల్లడి చేశాడా అని జస్టిస్ ఖన్వీల్కర్ సిబాల్ ను ప్రశ్నించింది.
-
వాస్తవం ఏమిటంటే మిలార్డ్స్, ఈ అంశాన్ని సిట్ పరిశోధించనే లేదు. భారీ కుట్ర జరిగిందన్న విషయాన్ని ఎలా నిర్ధారించగలం? స్టింగ్ నివేదికలోని ఇతర అంశాలను నేను ఇప్పుడు చదవడం లేదు. దయచేసి మీరే చదవండి.
-
ఇక్కడ పాయింట్ ఏమిటంటే, సిట్ ఈ అంశంపై పరిశోధన జరపలేదు. ఈ వ్యక్తుల్లో ఎవ్వరినీ సిట్ అరెస్ట్ చేయలేదు.
-
నా ఆందోళన అంతా వాస్తవానికి భవిష్యత్తు గురించి. అలంకారిక పదాల్లో చెప్పాలంటే మత హింస అగ్ని పర్వతం నుండి వెలువడుతున్న లావా లాంటిది. అది ఈ మతం వాళ్ళు జరిపినా సరే. అది వ్యవస్ధీకృతం కావించబడిన హింస. అది భవిష్యత్తులో పగ, ప్రతీకారాలు సాధించడానికి కావలసినట్లుగా భూమిని సారవంతం చేస్తుంది.
-
(కాసింత గద్గద స్వరంతో) పాకిస్తాన్ లో మా అమ్మ తరపు తాతయ్య, అమ్మమ్మలను నేను కోల్పోయాను. ఈ తరహా హింసకు నేనూ బాధితుడినే. ఒక A నో, B నో నేను నిందించడం లేదు. దీనిని సహించబోమని ప్రపంచానికి ఒక సందేశం పంపించాలి.
-
క్లోజర్ రిపోర్ట్ కూడా తెహెల్కా స్టింగ్ రిపోర్ట్ ను పూర్తిగా విస్మరించింది. అనిల్ పటేల్ విషయాన్నే ప్రస్తావించలేదు. నేను చదివిన నివేదిక బాబు బజరంగి కి చెందినది. బాబు బజరంగిని అరెస్ట్ చేయడానికి బదులు సిట్, అతను చెప్పింది రికార్డ్ చేసుకుని వదిలిపెట్టారు.
-
పరిశోధన జరపడం సిట్ విధి. తెహెల్కా టేపులను గానీ, ఇతర సాక్ష్యాలను గానీ పరిగణించడానికి సరిపోతాయో లేదా అన్నది మేజిస్ట్రేట్ నిర్ణయించుకుంటారు.
-
విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని చెప్పేందుకు భారీ మొత్తంలో పత్రాలు ఉన్నాయి. కానీ వాటిపై ఏ చర్యా తీసుకోలేదు.
-
భారీ కుట్ర జరిగింది అని చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉండవు. పరిస్ధుతుల (circustances) నుండి వాటిని సంగ్రహించాల్సి ఉంటుంది. అందుకోసం పరిశోధన జరపాలి, సాక్షాలు సేకరించాలి. స్పాట్ ని సందర్శించాలి. స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇవేవీ సిట్ చేయలేదు.
(………………………. మిగతా రెండో భాగం)