ప్రశ్న: గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ గురించి వివరించండి


Global North & Global South

ప్రశ్న (పేరు ఇవ్వలేదు): క్యూబా వ్యాక్సిన్ ఆర్టికల్ లో గ్లోబల్ సౌత్ అన్న పదజాలం వాడారు. భూమధ్య రేఖకు దిగువ దేశాలు అంటూనే ‘కొన్ని పరిమితులతో’ అన్నారు. కాస్త వివరించగలరు.

జవాబు: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం చాలా అవసరం. ప్రపంచ స్ధాయి పరిణామాలు, ముఖ్యంగా భౌగోళిక రాజకీయార్ధిక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఆంగ్ల పత్రికలు తరచుగా గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ అన్న పదజాలాల్ని ఉపయోగిస్తాయి. ఈ పేర్లు సూచించే విధంగా ఉత్తరార్ధ గోళంలో ఉన్న దేశాలు గ్లోబల్ నార్త్ గానూ, దక్షిణార్ధ గోళంలో ఉన్న దేశాలు గ్లోబల్ సౌత్ గానూ భావించడం కద్దు. కానీ అది పూర్తిగా కరెక్ట్ కాదు.

ఒకే తరహా ఆర్ధిక, సామాజిక పరిస్ధితులు, సామాజికార్ధిక చరిత్ర, ప్రజల స్ధితిగతులు కలిగి ఉండడం గ్లోబల్ నార్త్, సౌత్ విభజనకు ప్రాతిపదికగా క్లుప్తంగా చెప్పవచ్చు. అంటే అభివృద్ధి చెందిన సంపన్న దేశాలను గ్లోబల్ నార్త్ అనీ, ఆర్ధికంగా పేద-వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న (వర్ధమాన) దేశాలను గ్లోబల్ సౌత్ అనీ పరిగణిస్తున్నారు.

ఈ పద ప్రయోగం నిర్ధిష్టంగా ఎవరు మొదలు పెట్టినదీ తెలియదు గానీ ఇవి రెండూ ఒకే సారి పుట్టలేదని చెప్పవచ్చు. సంపన్న దేశాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా అనేక వర్ధమాన దేశాలు కాస్తో, కూస్తో గొంతు విప్పిన కాలంలో, అనగా 1940-70ల మధ్య కాలంలో ‘గ్లోబల్ సౌత్’ అన్న ప్రయోగం మొదలయింది. ఈ కాలంలోనే ఐరోపా దేశాల వలస పాలనలో మగ్గుతున్న దేశాలు వివిధ పోరాటాలతో స్వతంత్రం పొందాయి.

[స్వతంత్రం అంటే పూర్తి స్ధాయి స్వతంత్రత కాదు. వలస పాలకులు వలసలను ప్రత్యక్షంగా పాలించడానికి బదులుగా తాము భౌతికంగా తప్పుకుని ఆయా దేశాల ప్రజలే స్వయంగా ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునే ఏర్పాట్లు చేశారు. ఈ పాత వలస దేశాల పాలకులు అవడానికి స్వదేశీయులే అయినప్పటికీ ఆచరణలో సంపన్న దేశాల అదుపాజ్ఞలకు లోబడి పని చేయడం ప్రారంభించారు.

అనగా సంపన్న దేశాలు వలస దోపిడీ ద్వారా లెక్కకు మిక్కిలిగా పోగయిన పెట్టుబడిని వివిధ మార్గాల్లో పెట్టుబడులుగా, అప్పులుగా ఈ దేశాలకు ఎగుమతి చేస్తూ తమ పాత వలసలను నియంత్రణలో ఉంచుకున్నారు. ఇప్పటికీ ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. అంటే స్వతంత్రం పేరుతో జరిగింది అధికార మార్పిడి తప్ప అచ్చమైన స్వతంత్రం కాదు.

ఇరాన్, వెనిజులా, ఉత్తర కొరియా, లిబియా, ఇటీవలి వరకు ఇరాక్, సిరియా మొ.న దేశాల వలే తమ దేశాల ఆర్ధిక-ఖనిజ-నీటి-చమురు వనరులను తమ నియంత్రణలోనే ఉంచుకుంటూ స్వతంత్ర అభివృద్ధికి కృషి చేస్తే అంతర్జాతీయ నిబంధనలు, ఐరాస తీర్మానాలు ఇంకా మన్నూ మశానం పేరుతో వాటిపై ఆర్ధిక-వాణిజ్య ఆంక్షలు విధించి, వస్తువులు, సరుకులు అందకుండా చేసి, కొండొకచో దాడులు, యుద్ధాలు, దురాక్రమణలు కూడా సాగించి వేధించడం, అణచివేయడం చేస్తాయి.

ప్రత్యక్ష పాలనను వలస వాదం (Colonialism) అంటారు. కాగా పెట్టుబడుల ఎగుమతితో పరోక్షంగా చేసే పాలనను సామ్రాజ్యవాదం (Imperialism) అంటారు. అది వేరే కధ.]

క్లుప్తంగా చూస్తే ఐరోపా దేశాలు, వాటి పాలన నుండి విడివడిన (తెల్ల ప్రజల) దేశాలను గ్లోబల్ నార్త్ గా పరిగణించవచ్చు. అంటే, ఐరోపా, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ లు. జపాన్ ఒక్కటే తెల్ల-యేతర దేశం. రష్యా ఆసియా-ఐరోపాల్లో విస్తరించిన ఐరోపా దేశం. సౌదీ అరేబియా చమురు వనరుల రీత్యా నార్త్ లో చేరింది. అనంతర కాలంలో సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ లను కూడా సంపన్న దేశాలుగా అవతరించి గ్లోబల్ నార్త్ లో భాగంగా పరిగణించబడుతున్నాయి. వీటిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు దక్షిణార్ధ గోళంలో పూర్తిగా అట్టడుగున్న ఉన్న దేశాలు. కానీ అవి గ్లోబల్ నార్త్ లో భాగమే. అలాగే అవి ఉండడడానికి తూర్పున ఉన్నా, పశ్చిమ దేశాలలో భాగంగా పరిగణించబడతాయి. ఇండియా, నైజీరియా మరియు దానికి ఎగువన ఉన్న ఆఫ్రికా దేశాలు ఉత్తరార్ధ గోళంలో ఉన్నా అవి గ్లోబల్ సౌత్ లో భాగం.

పైన చెప్పినట్లు గ్లోబల్ సౌత్ నుండి గ్లోబల్ నార్త్ కు మారిన దేశాలున్నాయి గానీ, గ్లోబల్ నార్త్ నుండి గ్లోబల్ సౌత్ కు మారిన దేశాలు లేవు. దాదాపు ఒక శతాబ్దం క్రితం అర్జెంటీనా సంపన్న దేశాల్లో ఒకటిగా ఉండేది. తర్వాత మధ్యాదాయ దేశం అయింది. కానీ ఈ మార్పు నార్త్, సౌత్ విభజనకు ముందే ముగిసింది గనక అది మార్పుగా పరిగణించ బడడం లేదు.

విభజన ఎలా జరిగింది?

ఇది చెప్పుకున్నాక విభజన గురించిన కారణాలను కాస్త చెప్పుకోవడం సముచితం. నిజానికి విభజనకు నిర్దిష్టత గానీ, నిర్వచనం గానీ పుస్తకాల్లో, తీర్మానాల్లో ఎక్కడా లేదు. రాజకీయార్ధిక (political-economy) పదజాలంగా వివిధ రాజకీయార్ధిక పరిణామాలను, సంబంధాలను వివియరించే క్రమంలో పరిగణించే క్రమంలో, అభివర్ణించే క్రమంలో వాడుకలోకి వచ్చేసింది. సైద్ధాంతికంగా గానీ ఇతరత్రా గానీ ఈ విభజనతో విభేదించేవారు ఎవరూ లేరు.

Equator and World Map

గ్లోబల్ నార్త్ అనగానే దాని వెనుక ఒక చరిత్ర, ఆధిపత్యం, పెత్తనం, పెట్టుబడిదారీ విధానం, దోపిడి, తెల్ల జాత్యహంకారం స్ఫురణకు రావాలి. గ్లోబల్ సౌత్ అనగానే వలస-సామ్రాజ్యవాద దోపిడి కింద మగ్గడం, వెనుకబాటుతనం, పేదరికం, అధిక మానవ వనరులు, ఖనిజ వనరులు, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ప్రజల పోరాటాలు గుర్తుకు రావాలి. ఇవే విభజనకు ప్రాతిపదిక. తెల్ల దేశాల పండితులు మరింత ఆమోదనీయమైన సున్నిత పదజాలంతో విభజనకు నిర్వచనం ఇవ్వజూపుతారు. అందులో మర్మం ఎరిగి ఉండాలి.

జపాన్ వలస పాలనతో పాటు అంతర్గతంగా భూస్వామ్య-పెట్టుబడిదారీ వర్గాలపై పోరాడి విజయం సాధించడం ద్వారా చైనా ప్రజలు తమ దేశాన్ని ప్రముఖ దేశంగా ప్రపంచ పటంలో నిలిపారు. ఆనంతర కాలంలో వలస వ్యతిరేక పోరాటాల ద్వారా కాలనీ దేశాలు ప్రత్యక్ష పాలన నుండి బైటపడ్డాయి. ఈ దేశాలకు చెందిన పాలకవర్గాలు పశ్చిమ దేశాలలో చదువుకుని వచ్చినవారిని బ్యూరోక్రసీలోకి ప్రమోట్ చేసుకుని అక్కడి అభివృద్ధి పంధాను అనుసరించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో తమ వర్గ ప్రయోజనాల కోసం (దేశ ప్రయోజనాల కోసం కాదు) తమ దేశాలను ఒక గ్రూపుగా ఏర్పాటయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

పైన చెప్పినట్లు 1940-70 కాలంలో సంపన్న దేశాలు ఒక గ్రూపు గానూ, బీద, వర్ధమాన దేశాలు వివిధ పేర్లతో గ్రూపులుగానూ ఏర్పడ్డాయి. అలా గ్రూపులుగా ఏర్పడడంలో సంపన్న దేశాల లక్ష్యం తమ దోపిడి, ఆధిపత్యాలను ఉమ్మడి నిర్ణయాల ద్వారా, ఒకరినొకరు సంప్రదించుకుంటూ, ఇచ్చి పుచ్చుకుంటూ, సమన్వయం చేసుకుంటూ కొనసాగించడం. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐ‌ఎం‌ఎఫ్) ఆర్ధిక పనిముట్లుగానూ, ఐరాసను రాజకీయ పనిముట్టుగాను తమ లక్ష్యం కోసం ఉపయోగిస్తాయి. జి7, ఓ‌ఈ‌సి‌డి లాంటి సంస్ధల ద్వారా తమ ప్రయోజనాలను సంరక్షించుకుంటాయి.

గ్లోబల్ సౌత్ దేశాలు గ్రూపుగా ఏర్పడడంలో వారి లక్ష్యం తమ ప్రయోజనాలు పరిరక్షించుకోవడమే అయినా ఆ ప్రయత్నాల్లో సంపన్న దేశాల ఆధిపత్యం నుండి బైటపడే లక్ష్యం లేదు. కేవలం సంపదలో తమ వాటా మెరుగుపరుచుకోవడం, తగ్గకుండా చూసుకోవడం మాత్రమే వారి లక్ష్యం. తమ వర్గ ప్రయోజనాలనే తమ దేశాల ప్రయోజనాలుగా చెబుతారు.

అలీన ఉద్యమం, G77, OPEC మొదలైన గ్రూపులను గ్లోబల్ సౌత్ ఉద్యమంలో భాగంగా చూడవచ్చు. ఇవే మూడో ప్రపంచ దేశాలుగా ప్రసిద్ధం అయ్యాయి. (ఒకటవ, రెండవ ప్రపంచంల నిర్వచనంలో పశ్చిమ దేశాలకు ఒక నిర్వచనం, ఛైర్మన్ మావో-జెడాంగ్ ప్రవేశపెట్టిన మరొక నిర్వచనం ఉన్నాయి.)

1955లో ఇండియా, ఈజిప్టు, ఇండోనేషియా, బర్మా, పాకిస్తాన్, శ్రీలంక లు ఆసియా-ఆఫ్రికా కాన్ఫరెన్స్ పేరుతో బాండుంగ్ లో సమావేశం అయ్యాయి. చైనాతో సహా 29 దేశాలు పాల్గొన్నాయి. సమావేశంలో ఇండియా ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తాము అమెరికా, సోవియట్ రష్యాల కోల్డ్-వార్ లో ఎవరి పక్షమూ కాదనీ, అలీనంగా ఉండడమే తమ విధానమని ప్రకటించాడు. ఈ సమావేశం 1961లో అలీన ఉద్యమం (NAM: Non-Aligned Movement) అవతరించటానికి దారితీసింది. ఈ గ్రూపు నికరంగా సాధించిన ప్రయోజనాలు లేవు గానీ ఒకరినొకరు దగ్గరావడానికి ఉపయోగపడింది. ఆచరణలో పరోక్షంగా ఎటోవైపు మొగ్గడాన్ని NAM నిరోధించలేకపోయింది.  ఇది ఇప్పుడు ఉనికిలో నామమాత్రమే.

1960లో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులాలు OPEC (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం) ఏర్పాటు చేశాయి. చమురు ఉత్పత్తి, ధరల విషయమై వైరుధ్యాలు లేకుండా సంయుక్తంగా విధాన నిర్ణయాలు తీసుకుని తమ ప్రయోజనాలు సంరక్షించుకోవడం ఈ సంస్ధ లక్ష్యం. తర్వాత నైజీరియా, ఇండోనేషియాలు జత కలిశాయి. ఆచరణలో ఈ గ్రూపు కూడా పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల పెట్టుబడులకే పెద్ద పీట వేశాయి. స్వతంత్ర అభివృద్ధి పంధాకు ఇరాన్, ఇరాక్ మాత్రమే ప్రయత్నించాయి. ఫలితంగా ఇరాన్ అనేక ఆర్ధిక, రాజకీయ, వాణిజ్య ఆంక్షలతో సతమతం అవుతుండగా, ఇరాక్ అమెరికా దాడిలో సర్వ నాశనం అయింది. OPEC గ్రూపు తోటి మూడో ప్రపంచ దేశాలకు సానుభూతిగా ఉండడం లోనూ విఫలం అయ్యాయి.

1974లో జనాభా నియంత్రణ కోసం ఐరాస బుఖారెస్ట్ లో ఒక సమావేశం నిర్వహించింది. ఇందులో 77 మూడో ప్రపంచ దేశాలు తమ పేదరికం, దారిద్ర్యం లకు కారణం తాము, తమ జనాభా కాదని నిరాకరించాయి. వలసవాదం తమపై రుద్దిన పశ్చిమ ధనిక దేశాలే తమ దుస్ధితికి కారణమని ఎలుగెత్తి చాటాయి. ఈ దేశాల సమూహం G77 గా వాడుకలోకి వచ్చింది. అడపా దడపా ఒక గ్రూపుగా సమావేశాలు కూడా జరుపుతున్నాయి. అయితే ఈ గ్రూపులో ఇప్పుడు 134 మూడో ప్రపంచ దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

బుఖారెస్ట్ సమావేశంలోనే చైనా నేతృత్వంలో జి77 గ్రూపు దేశాలు నూతన అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్ధ (New International Economic Order –NIEO) ఏర్పాటుకు డిమాండ్ చేశాయి. అందుకోసం కృషి మాత్రం జరగలేదు. సమావేశంలో పాల్గొన్న భారత ప్రతినిధి బృందం ఇచ్చిన ఒక నినాదం ప్రసిద్ధిగాంచింది: “అభివృద్ధే అత్యంత మెరుగైన జనాభా నియంత్రణ సాధనం” అన్నదే ఆ నినాదం. ఆర్ధిక అభివృద్ధి సాధించిననాడు జనాభా నియంత్రణ అంటూ ప్రత్యేక విధానాలు అమలు చేయాల్సిన అవసరం లేదనీ, అభివృద్ధే ప్రజలకు అన్నీ నేర్పుతుందని దాని భావం. ఇది పచ్చి నిజం. మూడో ప్రపంచ దేశాలు వలస, సామ్రాజ్యవాద దోపిడీలకు గురికానట్లయితే,  వారి వనరులు వారి ప్రజలకే ఉపయోగపెడితే, వర్గ దోపిడీ నశించినట్లయితే అభివృద్ధికి అవి పర్యాయపదంగా నిలిచేవి. పశ్చిమ దేశాల సంపన్నత ఏనాడూ సాధ్యమయ్యేది కాదు.

ఈ విధంగా సంపన్న దేశాల దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా మూడో ప్రపంచ దేశాల ప్రజలు అనేక పోరాటాలు చేయగా, వాటి అండతో ఆ దేశాల పాలకవర్గాలు తమ వాటా మెరుగుపరచుకునేందుకు తమ అసంతృప్తికి ఒక రూపం ఇచ్చారు. ఆ రూపమే వివిధ కూటములు. ఈ కూటములు వివిధ డంకెల్ డ్రాఫ్ట్ చర్చలలోనూ, అనతరం WTO వాణిజ్య నిబంధనల ఏర్పాటులోనూ, ఉరుగ్వే-దోహా రౌండ్ చర్చలలోనూ తమ ప్రయోజనాల కోసం ఉమ్మడిగా బేరసారాలు జరిపాయి.  ఫలితంగా మూడో ప్రపంచ దేశాలను గ్లోబల్ సౌత్ గా వ్యవహరిస్తున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s