
Four horses of Apocalypse -Painting
భారత ప్రభుత్వం 2018-19 కి గాను ఎకనమిక్ సర్వేను విడుదల చేసింది. ఏటా బడ్జెట్ ప్రకటనకు ముందు విడుదలయ్యే ఎకనమిక్ సర్వే భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి (జిడిపి గ్రోత్ కి) నాలుగు పెద్ద గండాలు ఉన్నాయని హెచ్చరించింది. భారత దేశానికి ప్రధాన ఆర్ధిక సలహాదారు (చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్) అరవింద్ సుబ్రమణియన్ రచించిన ఎకనమిక్ సర్వే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పుకుంటున్న ఆర్ధిక గొప్పలను పరిహాసం చేసినంత పని చేసింది.
క్రైస్తవులకు చివరి గ్రంధం అయిన బుక్ ఆఫ్ రివలెషన్ (ప్రకటనల గ్రంధం) లో యుగాంతం గురించి చెప్పబడి ఉంటుంది. ఇందులో “యుగాంతపు నాలుగు గుర్రపు రౌతుల” గురించిన వివరణ ఉంటుంది. ఈ నాలుగు గుర్రాల రాక యుగాంతాన్ని సూచిస్తుందని క్రైస్తవుల నమ్మిక. ఆ నాలుగు గుర్రాలు: విజయం (Conquest), యుద్ధం (War), కరువు (Famine), చావు (Death). ఈ నాలుగింటిని యుగాంతపు నాలుగు గుర్రపు రౌతులు (ద ఫోర్ హార్స్ మెన్ ఆఫ్ అపోకలిప్స్) అంటారు.
మానవ ప్రపంచానికి ఈ నలుగురు / నాలుగు అంశాలు యుగాంతాన్ని సూచించినట్లే భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి వచ్చే 2018-19 ఆర్ధిక సంవత్సరంలో నాలుగు ప్రధాన గండాలు యుగాంతం తరహా పరిస్ధితిని చవి చూపుతాయని ప్రధాన ఆర్ధిక సలహాదారు తన తాజా ఎకనమిక్ సర్వే లో హెచ్చరించారు. గండాలు ఉన్నాయని ఓ పక్క చెబుతూనే వచ్చే యేడు భారత ఆర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం కంటే ఎక్కువగా 7% నుండి 7.5% వరకు వృద్ధి నమోదు చేస్తుందని సర్వే అంచనా వెయ్యడం గమనార్హం. ఆర్ధిక విశ్లేషణ ఒకింత వాస్తవ పంధాలో సాగినా ఫలితాన్ని మాత్రం మోడి-జైట్లీ గొప్పలకు భిన్నంగా పోయే సాహసం చేయలేకపోయింది. అది సలహాదారుకు ఉండే పరిమితి అని సరిపెట్టుకోవాలి కాబోలు!
అరవింద్ సుబ్రమణియన్ సూచించిన నాలుగు గండాలు ఇవి:
-
గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా తగులుతున్న ఎదురుదెబ్బల వల్ల ఎగుమతి అవకాశాలు తగ్గిపోవడం
-
వనరులను తక్కువ ఉత్పాదకత నుండి అధిక ఉత్పాదకత వైపు తరలించదంలో ఎదురయ్యే ఇబ్బందులు
-
టెక్నాలజీ-తీవ్రత రంగం డిమాండ్లకు అనుగుణంగా మానవ పెట్టుబడిని ఉన్నతీకరించడంలో ఎదురయ్యే సవాళ్ళు
-
వాతావరణ మార్పు వల్ల కలిగే వ్యవసాయ ఒత్తిడిని ఎదుర్కోవలసి రావడం
ఈ నాలుగు అంశాలు భారత జిడిపి వృద్ధిని దిగదోస్తాయని సుబ్రమణీయన్ విరచిత ఆర్ధిక సర్వే అంచనా. ఇవి సర్వే కొత్తగా కనిపెట్టినవేమీ కాదు. గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనించిన వారికి ఇవి స్పష్టంగా అగుపిమించినవే. కాకుండా స్పష్టంగా కనిపించిన వాటిని సర్వే ఆర్ధిక పరిభాష వెనుక నర్మగర్భంగా దాచిపెట్టి ఉంచాడు. తద్వారా ప్రమాదాన్ని తేలిక చేసేందుకు విఫల యత్నం జరిగినట్లు కనిపిస్తోంది. నాలుగింటిని కాస్త వివరంగా చూద్దాం.
1. గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా ఎదురు దెబ్బలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆంగ్లంలో దీనిని బ్యాక్ లాష్ అని సర్వే చెప్పింది. అంటే నిజానికి ‘గ్లోబలైజేషన్ బెడిసికొట్టడం’ గా చెప్పాలి. ఈ గ్లోబలైజేషన్ బెడిసికొట్టడం అనేది సదరు గ్లోబలైజేషన్ కు ఇన్నాళ్లూ నాయకత్వం వహించిన అమెరికా వల్లనే జరగడం చెప్పుకోవలసిన సంగతి. ఎన్నికల ప్రచారంలోనూ, ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన తర్వాత కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్లోబలిస్టు-వ్యతిరేక నినాదాలు ఇచ్చాడు, ఇస్తున్నాడు.
గ్లోబలైజేషన్ వల్ల అమెరికా చాలా నష్టపోయిందని ఆయన చెబుతున్నాడు. గ్లోబలైజేషన్ ను ఉపయోగించుకుని అమెరికా నుండి లబ్ది పొందిన దేశాలు తిరిగి అమెరికాకు ఏమీ ఇవ్వడం లేదని దానితో అమెరికా నుండి పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాలు, వనరులు తరలిపోతున్నాయని ట్రంప్ గగ్గోలు పెడుతున్నాడు. నాఫ్తా (NAFTA) పై తిరిగి చర్చలు చేసి మోడిఫై చేస్తానన్నాడు. టిపిపి (ట్రాన్స్ పసిఫిక్ పార్ట్ నర్ షిప్) నుండి బైటికి వచ్చేశాడు. టిటిఐపి (ట్రాన్స్-అట్లాంటిక్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ పార్టనర్ షిప్ చర్చలు ఆపేశాడు. చైనాపై కరెన్సీ యుద్ధం ప్రకటించాడు. ఆ దేశాన్ని కరెన్సీ మానిపులేటర్ గా ప్రకటిస్తానన్నాడు. ‘అమెరికా ఫస్ట్’ నినాదం ఇచ్చాడు. తద్వారా అమెరికా ప్రయోజనాల తర్వాతే ఇతర ప్రపంచం గురించి ఆలోచిస్తానన్నాడు. ఆ మేరకు ఇమ్మిగ్రేషన్, వీసా విధానాల్లో మార్పులు తెస్తున్నాడు. అనగా ప్రొటెక్షనిస్టు విధానాలు అమలు చేస్తున్నాడు.
అమెరికాను తిరిగి అగ్ర స్ధానంలో నిలపడం కోసం ట్రంప్ తీసుకుంటున్న చర్యలను ఇటీవల భారత ప్రధాని మోడి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలను దావోస్ లో ప్రారంభిస్తూ పేరు చెప్పకుండా విమర్శించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.

Modi for Globalization
“ప్రొటెక్షనిజం శక్తులు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా తల ఎత్తుతున్నాయి. ప్రపంచీకరణ జరగడానికి బదులు దానికి వ్యతిరేకంగా జరుగుతున్న భావన కలుగుతోంది… ఈ తరహా ఆలోచనా విధానం యొక్క వ్యతిరేక ప్రభావం వాతావరణ మార్పుల ప్రభావం కంటే లేదా ఉగ్రవాదం ప్రభావం కంటే తక్కువగా ఉంటుందని భావించలేము”
ట్రంప్ ప్రొటెక్షనిజం వల్ల భారత ప్రధాని కూడా ఆగ్రహంగా ఉన్నాడన్న మాట! ట్రంప్ ప్రొటెక్షనిజం వల్ల ఇండియాకు నష్టం ఏమిటన్నదీ మొదటి గండంలో ఆర్ధిక సర్వే చెప్పింది. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా అనుసరిస్తున్న ప్రొటెక్షనిస్టు విధానాల వల్ల భారత కంపెనీల ఎగుమతులు పడిపోతున్నాయి. అంటే భారత దళారీ కంపెనీలకు, దళారీ ప్రభుత్వానికి ఎగుమతి ఆదాయం తగ్గిపోతోంది. టిసిఎస్, ఇన్ఫోసిస్, సత్యం లాంటి ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సేవల కంపెనీలకు ప్రధాన ఎగుమతి మార్కెట్టు అమెరికాయే. అలాంటి అమెరికా, ఇండియా లాంటి దేశాల నుండి వచ్చే దిగుమతులపై పన్నులు వేస్తే భారత కంపెనీలు లాభాలు అటుంచి భారీ నష్టాలు మోయాల్సి ఉంటుంది. వీసా విధానాల వల్ల సాఫ్ట్ వేర్ ఉపాధి పడిపోతుంది. ఫలితంగా విదేశాల్లోని భారతీయుల నుండి దేశంలోకి వచ్చి చెల్లింపులు నష్టపోవాలి. భారత జిడిపి లో ఇవి ముఖ్యమైన భాగం. కాబట్టి ఇండియా జిడిపి అధోదిశలో ప్రయాణం కడుతుంది.
2018-19 లో ట్రంప్ నేతృత్వం లోని అమెరికా మరిన్ని రక్షణ చర్యలు తీసుకుంటే భారత ఎగుమతులకు కష్టకాలం దాపురిస్తుంది. ఫలితంగా ఎగుమతుల కోసం ఉత్పత్తి చేసే కంపెనీలు, ప్రధానంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు, తమ ఉత్పత్తిని తగ్గించేస్తాయి. దానితో ఉపాధి కూడా పడిపోతుంది. నిరుద్యోగం పెరుగుతుంది. ఉద్యోగులు నిరుద్యోగులుగా మారిన మేరకు ఇతర రంగాల కొనుగోళ్ళు (ఆటో, వస్త్రాలు, వెచ్చాలు, లగ్జరీ సరుకులు మొ.వి) తగ్గిపోతాయి. చివరికి మోడి అట్టహాసంగా ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కే ఎసరు వస్తుంది. మోడీకి కోపం రాదా మరి?
2. వనరులను తక్కువ ఉత్పాదకత నుండి ఎక్కువ ఉత్పాదకత వైపుకు తరలించడంలో ఇబ్బందులు లేదా ఆటంకాలు ఎదురవుతాయని సర్వే చెబుతోంది. దీనినే మరో మాటగా వ్యవస్ధాగత పరివర్తనకు ఆటంకం ఏర్పడుతుందని సర్వే చెప్పింది.
ఇక్కడ సర్వే చెప్పదలచుకున్నది ఏమిటి అంటే భారత దేశంలో వనరులు -మానవ శ్రమ, నీరు, ఖనిజాలు, భూములు- ప్రస్తుతం సమర్ధవంతమైన ఉత్పాదకత సాధించే రీతిలో వినియోగించబడడం లేదని. అనగా భారత దేశంలో వివిధ రంగాలలో ఉత్పత్తి విధానాలు వెనుకబడి ఉన్నాయని, వాటిని ఆధునీకరించాలని చెప్పడం. భారత దేశంలో సాంకేతిక పరిజ్ఞానం వెనుకబడి ఉన్నది కనుక దానిని అభివృద్ధి చేసుకోవాలని చెప్పడంలో తప్పు లేదు. కానీ సర్వే ఉద్దేశం అది కాదు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన విదేశీ కంపెనీలను భారత వనరులను వెలికి తీయడానికి మరింతగా చేతులు చాచి ఆహ్వానించాలని, కానీ అందుకు ఆంటంకాలు ఉన్నాయని సర్వే ఉద్దేశం.
ఉత్పత్తి రంగాల ఆధునీకరణకు ఇబ్బందులు తప్పవని చెప్పడం అంటే ట్రేడ్ యూనియన్ ల నుండి, కార్మికుల పోరాటాల రూపంలో ఆటంకాలు ఎదురవుతాయని వాటిని అధిగమించాలని సర్వే చెబుతోంది. నిజానికి ట్రేడ్ యూనియన్ లను నీరు గార్చడంలో, బలహీనం చేయడంలో పాలకవర్గాలు గొప్పగా సఫలం అయ్యాయి. ఉన్న కార్మిక సంఘాల నుండి గ్లోబలైజేషన్ విధానాలకు ఎదురవుతున్న ప్రతిఘటన చాలా స్వల్పం. ఆ స్వల్ప ప్రతిఘటన కూడా నామ్ కే వాస్తే గా ఎదురవుతున్నదే. వస్తున్న ప్రతిఘటన అంతా సంఘటిత రంగం నుండి కాకుండా అసంఘటిత రంగం నుండే పాలకవర్గాలకు ఎదురవుతున్నది. ఆర్ధిక వృద్ధి సాధించాలంటే దీనిని కూడా నిరోధించాలని సర్వే సూచిస్తోంది. ఇది ఒక కోణం.
ముఖ్యమైన కోణం ఏమిటంటే నీరు, ఖనిజ, భూ, మానవ వనరులను బహుళజాతి కంపెనీలకు అప్పగించడానికి ఆదివాసీల నుండి, రైతుల నుండి, ఇతర అల్పాదాయ వర్గాల నుండి చెప్పుకోదగ్గ ప్రతిఘటన ఎదురు కావడం. మధ్య, తూర్పు భారత ప్రాంతాలలో దట్టంగా అల్లుకుని ఉన్న అటవీ ప్రాంతాలలో బాక్సైట్, ఐరన్ నిక్షేపాలు దండిగా ఉన్నాయి. వాటిని కొల్లగొట్టడానికి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో (పోహాంగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ) గత పదేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గిరిజనుల ప్రతిఘటనతో అది వల్ల కావడం లేదు.

Anti POSCO struggle
అలాగే బ్రిటన్ కంపెనీ వేదాంత కంపెనీ, ఒడిశా, జార్ఘండ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల అడవుల్లో బాక్సైట్ ఖనిజం కోసం కాంట్రాక్టులు పొందింది. నియమగిరి కొండల్లోని గిరిజనులు తీవ్రంగా ప్రతిఘటించారు. సుప్రీం కోర్టు తీర్పు కూడా గిరిజనుల పక్షానే నిలబడింది. చివరికి కాంగ్రెస్ తెచ్చిన భూ సేకరణ చట్టం సైతం లీగల్ అవకాశాల పరంగా కొద్దో గొప్పో గిరిజనులకే ఉపయోగపడింది.
ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి అడవుల్లో 1212 ఎకరాల మేర బాక్సిట్ ఖనిజం తవ్వకాలకు టెండర్లు పిలవాలని 2015 లోనే చద్రబాబు నాయుడు ప్రభుత్వం జిఓ జారీ చేసింది. ఈ ఖనిజం కోసమే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వాకపల్లి గ్రామంలో గిరిజన మహిళలపై పోలీసుల చేత మూకుమ్మడి అత్యాచారాలు చేయించాడు. ఆ ఘోరంపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేయడానికి బాధిత మహిళలు హైదారాబాద్ వస్తే వాళ్ళని కలవడానికి కూడా నిరాకరించాడు కసాయి రాజశేఖర్ రెడ్డి. తద్వారా వైజాగ్ ఎనజ్సీ గిరిజనుల భయభ్రాంతులకు గురి చేసి అడవుల నుండి తరిమేసేందుకు కుట్ర పన్నాడు. కానీ గిరిజనులు స్ధిరంగా నిలబడి ఎదుర్కొన్నారు. ఇటీవల (ఆగస్టు 2017) అరకు సందర్శించిన చంద్రబాబు విశాఖలో బాక్సైట్ లేదని ప్రకటించాడు గానీ కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు మాత్రం చెప్పలేదు.
ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త రాజధానిగా ప్రకటించిన అమరావతి కోసం అత్యంత నాణ్యమైన భూములను చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా లాక్కుంటోంది. తెలుగు ప్రింట్, విజువల్ మీడియా అంతా కట్టగట్టుకుని రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నప్పటికీ వివిధ ప్రజా సంఘాల నేతృత్వంలో రైతులు దృఢంగా నిలబడి ప్రతిఘటించారు. భూసేకరణ చట్టం తనకు అక్కరకు రాకపోవడంతో చంద్రబాబు మోసపూరితంగా భూ సమీకరణ అంటూ కొత్త ప్రక్రియ చేపట్టి రైతులపై నానా విధాలుగా ఒత్తిడి పెంచి, తప్పుడు హామీలు ఇచ్చి, బ్లాక్ మెయిల్ చేసి కొందరి నుండి భూములు రాబట్టారు. ఇతర రైతులు విధిలేని పరిస్ధితుల్లో భూములు ఇచ్చే పరిస్ధితి కల్పించాడు.
అక్కడి కృష్ణా నదీ జలాలను అమరావతికి రాబోయే విదేశీ ఎంటర్ టైన్ మెంట్, హాస్పిటాలిటీ, గ్యాంబ్లింగ్, సేవల కంపెనీలకు అప్పగించబోతున్నారు. ఆ విధంగా సంవత్సరానికి మూడు నుండి ఐదు పంటలు పండే నాణ్యమైన భూములు సింగపూర్ తరహా నగరం పేరిట కాంక్రీటు అరణ్యంగా మారిపోతున్నది. ప్రజలకు ఆహార భద్రత కల్పించే ఆహార భద్రతా చట్టం, భూముల నుండి వెళ్లగొట్టడం నుండి రక్షణ కల్పించే భూ సేకరణ చట్టం, గిరిజనుల భూములను కాపాడే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం… ఇలా చట్టాలన్నీ, ఆ చట్టాలు చేసిన పాలకుల చేతనే పరిహాసం అవుతున్నాయి. కృష్ణా జలాలు ప్రజలకు దూరం కాబోతున్నాయి. కృష్ణా నదీ ఎడమ, కుడి కాలవలు ఎండిపోనున్నాయి. కృష్ణానది పరీవాహక ప్రాంతం నీటి చుక్క కోసం అల్లాడవలసిన పరిస్ధితులు ఏర్పడనున్నాయి. వరి లాంటి ఆహార పంటతో పాటు కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్లు పండించి కోస్తా గుంటూరు, కృష్ణాలకు కల్పతరువుగా భాసిల్లిన పచ్చని పొలాలు సిమెంటు ఎడారిగా మారనుంది.
చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చట్ట సభల ఆమోదం లేకుండా అమలు చేసిన భూ సమీకరణ ప్రక్రియ ఇప్పుడు పలు రాష్ట్రాలకు ఆదర్శం అయింది. ఈ ప్రక్రియ ఆదర్శంగా కేంద్రం చట్టం చేయాలని కూడా ఇతర పార్టీల నేతలు కోరుతున్నారు. యూపిఏ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని సవరించి విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పగించేందుకు వీలుగా చేయడానికి ఆదిలోనే మోడి ప్రభుత్వం తలపెట్టింది. సవరణలను ఆర్డినెన్స్ రూపంలో తెచ్చింది. పాలకవర్గ రాజకీయాల వల్ల పార్లమెంటులో చట్టం తేలేకపోయింది. ప్రజల నుండి వ్యతిరేకత తీవ్రం కావడంతో చివరికి సవరణల సంగతి పక్కనబెట్టింది. ఈ సవరణలను ఇబ్బందులను అధిగమించి చట్టంగా చేయాలని సర్వే సూచిస్తోంది. తక్కువ ఉత్పాదకత నుండి ఎక్కువ ఉత్పాదకతకు వనరులను తరలించడం లో ఇబ్బందులు అంటే కనీస జీవనం కోసం ప్రజలు సాగిస్తున్న ప్రతిఘటన, చట్టాలు చేసేందుకు ఆటంకం అవుతున్న ఓట్లు రాజకీయాలు అని సర్వే పరోక్ష అర్ధం.
ప్రపంచ బ్యాంకు నిర్దేశంతో పాలకవర్గాలు 1990 నుండి వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌పిజి (సరళీకరణ, ప్రయివేటీకరణ, గ్లోబలీకరణ) విధానాల ద్వారా దేశీయ వనరులను విదేశీ బహుళజాతి కంపెనీల దోపిడీకి అనుగుణంగా సిద్ధం చేయడమే ఈ సర్దుబాటు లక్ష్యం. దీనినే ఆర్ధిక సర్వే వ్యవస్ధాగత పరివర్తనగా చెప్పింది. ఎల్‌పిజి విధానాల అమలుకు ఎదురవుతున్న వ్యతిరేకత, ప్రతిఘటనలను అణచివేయాలని మర్యాద పూరిత పదాలతో కేంద్ర ప్రభుత్వానికి చెబుతోంది.
3. మూడవ గండం టెక్నాలజీ-తీవ్ర రంగం డిమాండ్లకు అనుగుణంగా మానవ పెట్టుబడిని (human capital) ని ఉన్నతీకరించడంలో సవాళ్ళు. మ్యానుఫాక్చరింగ్ రంగంతో పాటు బహుశా వ్యవసాయ రంగంలోనూ ఆటోమేషన్, కంప్యూటరైజేషన్ లను విస్తృతంగా ప్రవేశపెట్టాలని సర్వే సూచిస్తోంది. ఇటీవల కాలంలో సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగావర్గాన్ని భయపెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇందులో కలిసి ఉన్నది. మాన్యుఫాక్చరింగ్ లో రోబోట్ల నియామకం మొదలు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్న సూచనా ఇందులో ఉన్నది.
నిజానికి మానవ పెట్టుబడిని ఉన్నతీకరించడం అంటే అత్యున్నత విద్యావకాశాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం అయి ఉండాలి. సర్వే దృష్టిలో కూడా ఈ అంశం ఉండవచ్చు. కానీ అది రోబోట్లను తయారు చేసి నడిపించడంలోనూ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ను నడిపించడం లోనూ నిష్ణాతులుగా యువత తయారు కావాలన్న లక్ష్యం మాత్రమే ఇందులో ఇమిడి ఉన్నది. బ్రిటిష్ వలస పాలనకు సేవలు చేసే గుమస్తాలను తయారు చేయాలని ఆనాటి మెకాలే లక్ష్యం అయినట్లే అభివృద్ధి చెందిన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విదేశీ కంపెనీల రోబోట్ టెక్నాలజీ, ఏఐ లకు అవసరమైన నిష్ణాతులను అతి చౌకగా ఇండియా ఉత్పత్తి చేయాలని సర్వే ఉద్దేశంగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు విదేశీ బహుళజాతి కంపెనీలకు కావలసింది వారే.

Waiters replaced by Robots in India
ఆ రోబోట్ టెక్నాలజీ, ఏఐ లు ఇండియాయే స్వయంగా తయారు చేసుకుని, అభివృద్ధి చేసి, విదేశాలకు పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే అది భారత ప్రజలకు, ఉపాధికి ఉపయోగం అనడంలో సందేహం లేదు. అయితే అది సుదీర్ఘ ప్రక్రియ. అందుకు పాలకులకు నిబద్ధత ఉండాలి. ముఖ్యంగా దేశ ప్రయోజనాలకు కట్టుబడి ఉండే నిబద్ధత కావాలి. ఆ క్రమంలో విదేశీ బహుళజాతి కంపెనీల నుండి ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొని నిలబడే సాహసం కావాలి. ఇరాన్, సిరియా, రష్యా తరహాలో అమెరికా, ఐరోపా దేశాలు విధించే ఆంక్షలను ఎదుర్కొనే సత్తా కావాలి. ఎందుకంటే సొంతగా అభివృద్ధి కావడానికి పూనుకుంటే అమెరికా, ఐరోపాలు చూస్తూ ఊరుకోవు. బెదిరిస్తాయి, హెచ్చరిస్తాయి. ఫైనాన్స్ వనరులు నిలిపేస్తాయి. అప్పు పుట్టనివ్వవు. ఎగుమతులకు అవకాశాలు రద్దు చేస్తాయి. దిగుమతులు ఆపేస్తాయి. ఇరాన్, ఉత్తర కొరియా అణు పరిశ్రమల్లో పాల్పడినట్లు విధ్వంసం (sabotage) చర్యలకు పాల్పడతాయి. హ్యాకింగ్ ద్వారా ఆదిలోనే నాశనం చేసేందుకు ప్రయత్నిస్తాయి. ఇవన్నీ ఎదుర్కొని నిలిచే శక్తి కానీ, సంకల్పం గానీ, భౌతిక అవసరం గానీ భారత పాలకులకు వారి వెనుక ఉన్న భారతీయ బడా కంపెనీలకు లేవు. అందుకే వారి లక్ష్యం ఎప్పుడూ విదేశీ కంపెనీల అవసరాలు తీర్చడం గానే ఉంటుంది.
ఆటోమేషన్, కంప్యూటరైజేషన్ వల్ల ఇప్పుడు ఉన్న ఉపాధి కూడా ఉండదు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉన్న రిక్రూట్ మెంట్ కూడా ఉండబోదు. ప్రాధమిక, మాధ్యమిక, కాలేజీ విద్యారంగం లో పెట్టుబడులు సున్నాకు దగ్గర అవుతాయి. విద్యారంగం అంటే ఇక ఐఐటి, ఐఐఎం లు మాత్రమే అవుతాయి. మిగిలినదంతా పూర్తిగా ప్రైవేటు రంగంలోనే ఉంటుంది. అనగా ఉన్నత విద్యావకాశాలు మృగ్యం అవుతాయి. పేదలతో పాటు మధ్యతరగతి సైతం ఉన్నత విద్యకు దూరం అవుతుంది. కనుక అనివార్యంగా ఆందోళన, అలజడి పెరుగుతుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లోనూ ఇటీవల సంఘాలు ఏర్పడడం ఈ అలజడిలో భాగమే. కంపెనీల యాజమాన్యాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఈ సంఘాలు ఏర్పడడం గమనార్హం. ఈ అలజడి, ఆందోళనలను కాచుకోవాలని సర్వే సూచిస్తోంది.
4. వాతావరణ మార్పు వల్ల ఎదురయ్యే వ్యవసాయ ఒత్తిళ్లను ఎదుర్కోవాలన్న సూచనలోనే మోసం ఉన్నది. ఎందుకంటే వ్యవసాయ రంగంలో రైతులకు ఎదురవుతున్న ఒత్తిడి వాతావరణం వల్ల రావడం లేదు; ప్రభుత్వ విధానాల వల్ల వస్తున్నది. రైతులను ఆహార పంటల నుండి వాణిజ్య పంటలకు తరలించడం, జిఎం (జెనెటికల్లీ మోడిఫైడ్) విత్తనాలను, పంటలను బలవంతంగా రైతులపై రుద్దడం, గిట్టుబాటు/మద్దతు ధర విధానానికి స్వస్తి పలకడం, ఇంటర్నెట్ ద్వారా సత్వర సేవలు అని మభ్యపెడుతూ రైతుల ఉత్పత్తులను అంతర్జాతీయ ధరల ఒడిదుడుకులకు బందీలుగా మార్చడం… ఇవే ప్రభుత్వాల విధానాలు.
ఇవి దేశీయ విత్తన రంగాన్ని ప్రభుత్వాలు సర్వనాశనం చేసేస్తున్నాయి. జిఎం పంటలను కాపాడుకోవడానికి ఎరువులపైనా, రసాయనాలపైనా విపరీతంగా ఆధారపడవలసిన దుర్గతిని రైతులపై రుద్దబడింది. అసలు ఇంటర్నెట్ టెక్నాలజీ వినియోగమే రైతులకు తెలియదు. అందులో కూడా పల్లెల్లో ఏ మాత్రం కనెక్టివిటీ లేని మొబైల్-ఇంటర్నెట్ రంగం ఏ విధంగానూ అక్కరకు రాని పరిస్ధితి. ఈ నేపధ్యంలో గిట్టుబాటు ధరలు దక్కని రైతాంగం వివిధ రూపాల్లో నిరసనలకు దిగుతున్నారు. కొందరు ఆత్మహత్యల ద్వారా, కొందరు పంటలు పారబోయడం-తగలబెట్టడం-ఉచితంగా పంచడం ద్వారా నిరసిస్తున్నారు. కొందరు అప్పటికప్పుడు ఆందోళనలకు దిగుతున్నారు.
వాతావరణ మార్పులు ఎలా జరుగుతున్నాయన్నది ఒక అంతుబట్టని విషయం. నిన్న మొన్నటి వరకూ ఓజోన్ పొరకు పెద్ద రంధ్రం పడిందని, ఏదో ఉపద్రవం ముంచుకొస్తోందని ఊదరగొట్టారు. తీరా చూస్తే ఇప్పుడా రంధ్రం లేదు. భూ వాతావరణం తనకు తానే ఆ రంధ్రాన్ని క్రమంగా పూడ్చేసుకుంది. ఆర్కిటిక్ మంచు కరిగి పోతున్నదని ఇకా అంతా మునకే అనీ అన్నారు. తీరా చూస్తే ఆర్కిటిక్ మంచు ఇప్పటికే గణనీయ మొత్తంలో కరిగిపోయినా జరిగిన నష్టం ఏమీ లేదు. పైగా ఆర్కిటిక్ కరగడంతో అక్కడి ఖనిజ, మత్స్య, చమురు వనరులను సొంతం చేసుకోవడానికి సామ్రాజ్యవాద దేశాలు పోటీ పడుతున్నాయి.
అకాల వర్షాలు, విపరీత వేడిమి నెలకొంటున్న సంగతి నిజమే. కానీ ఈ మార్పులకు ప్రధాన కారణం పశ్చిమ బహుళజాతి కంపెనీలు వాతావరణంపై చేస్తున్న ప్రయోగాలే అని వాదిస్తున్న శాస్త్రవేత్తలు కూడా గణనీయంగానే ఉన్నారు. జియో-ఇంజనీరింగ్ గా పిలవబడుతున్న ఈ ప్రక్రియలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించడానికి సామ్రాజ్యవాద కంపెనీలు రహస్యంగా ప్రయోగాలు చేస్తూ వాతావరణం అసమతుల్యం కావడానికి దోహదం చేస్తున్నాయని వారు చెబుతున్నారు. చంద్ర మండలం పైనా, అంగారక గ్రహం పైనా కూడా కొంత ప్రదేశాన్ని కొనే కొనుగోలు చేసే ప్రబుద్ధులు ఉన్న పశ్చిమ దేశాల ఆధిపత్య వర్గాలు, తమ వ్యాపార ప్రయోజనాల కోసం అణ్వాయుధాలతో నగరాలకు నగరాలనే నేలమట్టం చేసే పశ్చిమ రాజ్యాలు ఎంతకైనా తెగించగలవు.
కాబట్టి భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఒత్తిడికి ప్రధాన కారణం పశ్చిమ బహుళజాతి వ్యవసాయ కంపెనీల ప్రయోజనం కోసం భారత పాలకులు అమలు చేస్తున్న దళారీ విధానాలు తప్ప వాతావరణ మార్పు కాదు. అకాల వర్షాల వల్ల ఒక్కోసారి రైతులు నష్టపోవడం నిజమే గానీ, అది ఎప్పటి నుండో ఉంటున్నదే. ఆ పరిస్ధితులలో రైతులకు అండగా ఎలా ఉండాలని ప్రభుత్వాలు, ఆర్ధిక నిపుణులు ఆలోచించాలి గానీ వాతావరణ మార్పు పేరుతో రైతుల కష్టాలకు నెపాన్ని వాతావరణంపై నెట్టివేయడం పరిష్కారం కాదు.
అకాల వర్షాలు, విపరీత వేడిమి నెలకొంటున్న సంగతి నిజమే. కానీ ఈ మార్పులకు ప్రధాన కారణం పశ్చిమ బహుళజాతి కంపెనీలు వాతావరణంపై చేస్తున్న ప్రయోగాలే అని వాదిస్తున్న శాస్త్రవేత్తలు కూడా గణనీయంగానే ఉన్నారు.
నిజమే కావచ్చు! అందుకే తమ ప్రయోజనాలనిమిత్తమే ట్రంప్ నేతృత్వంలో పెట్టుబడిదారులు కాప్ ఒప్పందం నుండి బయటకు వచ్చేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా గ్లోబల్ వరమినింగ్ నమ్మదగ్గ అంశం కాదని అన్నాడు.