అమెరికా ఒత్తిడి: మోడి వినాశకర ఉ.కొ విధానం


ICBM test photo supplied by North Korea Govt.

విదేశీ విధానంలో వరుస తప్పిదాలకు పాల్పడుతున్న మోడి ప్రభుత్వం ఉత్తర కొరియా విషయంలోనూ అదే ధోరణిలో వెళుతోంది. మోడి అనుసరిస్తున్న ఉత్తర కొరియా విధానంలో అమెరికా ఒత్తిడి ప్రధాన పాత్ర పోషించడం గమనించవలసిన సంగతి. అనగా అమెరికా ఒత్తిడితోనే మోడి నేతృత్వం లోని భారత పాలకవర్గాలు తమ అలీన ముసుగును చించేసుకుని పచ్చిగా బలహీన-వర్ధమాన దేశాలకు వ్యతిరేకంగా విదేశీ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాయి. ఇది ప్రపంచం లోని శ్రామిక ప్రజలతో పాటు భారత దేశ శ్రామిక ప్రజలకు కూడా చేటు చేసే విధానం.

ఉత్తర కొరియాతో భారత దేశం మొదటి నుండి సత్సంబంధాలను నెరుపుతోంది. విస్తృతమైన దౌత్య సంబంధాలు ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నాయి. చాలా దేశాలలో లేనంతమంది దౌత్య అధికారులను ఉత్తర కొరియా, ఇండియాలో కలిగి ఉన్నది. గత కొద్ది వారాలుగా అమెరికా తెస్తున్న తీవ్ర ఒత్తిడి ఫలితంగా భారత ప్రభుత్వం ఉత్తర కొరియా స్నేహ విధానాలను తిరగదోడుతున్నది. ఆ దేశంతో శత్రు వైఖరి అవలంబించేవైపుగా చర్యలు తీసుకుంటున్నది.

ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా మిలట్రీ చర్యలు తీవ్రం చేస్తున్న అమెరికా అందుకు అనుగుణంగా దౌత్యరంగం లోనూ సమానాంతర చర్యలు చేపడుతోంది. ఉత్తర కొరియాను ఒంటరిని చేసేందుకు, తద్వారా చైనా సరిహద్దు మరియు సముద్ర జలాల భద్రతను బలహీనం చేసేందుకు ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తున్నది. ఓ వైపు ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు చైనాపై ఒత్తిడి తెస్తూ మరోవైపు వివాదంతో సంబంధం లేని ఇతర దేశాలను కూడా రొంపి లోకి లాగుతున్నది. ఈ రొంపి లోకి దిగడానికి మోడి ప్రభుత్వం సై అంటూ తదనుగుణంగా చర్యలు చేపడుతోంది.

గత వారం భారత మరియు అమెరికా దేశాల విదేశాంగ శాఖల అధికారుల మధ్య చర్చలు జరిగాయి. జూన్ నెలలో  భారత ప్రధాని మోడి అమెరికా సందర్శించినపుడు జరిగిన చర్చల కొనసాగింపుగా ఈ దౌత్య చర్చలు చోటు చేసుకున్నాయి. భారత దేశంలో గణనీయ మొత్తంలో ఉత్తర కొరియా దౌత్య అధికారులు, కార్యాలయాలు ఉన్న అంశాన్ని అమెరికా లేవనెత్తింది. ఇంత స్ధాయిలో ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలు నెరపడం తమకు సమ్మతం కాదని, ఆ దేశ దౌత్యవేత్తల సంఖ్యను బాగా తగ్గించుకోవాలని డిమాండ్ చేసింది. అమెరికా డిమాండ్ కు ఇండియా అబ్యంతరం చెప్పకపోగా దానికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు ఉద్యుక్తం అవుతోంది.

మోడి అమెరికా సందర్శన అనంతరమే భారత్ ఉత్తర కొరియా విధానంలో మార్పులు జరుగుతుండడం గమనార్హం. ఆయన అమెరికాలో ఉండగానే అమెరికా అద్యక్షుడితో కలిసి ఉత్తర కొరియా చర్యలను ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన జారీ చేశాడు. ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణులను ప్రయోగించడమే ట్రంప్, మోడీలకు వచ్చిన అభ్యంతరం. ఉత్తర కొరియా ఐ‌సి‌బి‌ఎం లను తయారు చేసి పరీక్షిస్తే ప్రపంచ భద్రతకు ప్రమాదం వచ్చిపడిందని ఈ ఇద్దరు మిత్రులు చెబుతున్నారు.

ఆ మాటకొస్తే ఇండియా కూడా ఖండాంతర క్షిపణులను అనేకమార్లు పరీక్షించింది. ఇండియా అనేక సార్లు పరీక్షించిన అగ్ని – V, అగ్ని – VI, సూర్య క్షిపణులు ఖండాంతర క్షిపణులే, వేల మైళ్ళ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్ధ్యం కలిగినవే. ఇక అమెరికా ఆయుధాగారంలో ఉన్న ఐ‌సి‌బి‌ఎం లకు లెక్కే లేదు. ప్రపపంచం లోని నలుమూలలలోని లక్ష్యాలను ఛేదించగల సామర్ధ్యం అమెరికా ఐ‌సి‌బి‌ఎం లు కలిగి ఉన్నాయి. మొత్తం భూమండలాన్ని అనేక మార్లు భస్మీ పటలం చేయగల క్షిపణులు అమెరికా అమ్ముల పొదిలో ఉన్నాయి. అమెరికా, ఇండియాతో పాటు రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాల వద్ద కూడా ఐ‌సి‌బి‌ఎం లు ఉన్నాయి. ఈ దేశాల ఐ‌సి‌బి‌ఎం ల వల్ల ప్రపంచానికి రాని ప్రమాదం ఒక్క ఉత్తర కొరియా ఐ‌సి‌బి‌ఎం ల వల్లనే వస్తుందని చెప్పడమే ఓ పెద్ద అబద్ధం మరియు హిపోక్రసీ.

“ఉత్తర కొరియా కలిగి ఉన్న సామూహిక విధ్వంసక మారణాయుధాల కార్యక్రమాన్ని ఖండించేందుకు, ప్రతిఘటించేందుకు ఇరు దేశాలు ఉమ్మడి కృషి సాగిస్తాయి” అని అమెరికా సందర్శన సందర్భంగా (జూన్ 27) డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడి లు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇంతకంటే హాస్యపూరిత ప్రకటన మరొకటి ఉండగలదా?

చిన్న నలుసంత దేశమైన ఉత్తర కొరియా మదపు టేనుగుల్లాంటి అగ్ర దేశాల నుండి నిత్యం ఎదుర్కొంటున్న బెదిరింపుల నుండి తనను తాను కాపాడుకునేందుకు సొంతగా అణ్వస్త్ర సామర్ధ్యాన్ని సంపాదించుకుంది. పొరుగునే ఉన్న దక్షిణ కొరియాలో అమెరికా నిలవ ఉంచిన 40 కి పైగా అణ్వాయుధాల నుండి నిత్య అబధ్రతను ఉత్తర కొరియా ఎదుర్కొంటోంది. అమెరికా బాంబర్లు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు ప్రతి రోజూ ఉత్తర కొరియా చుట్టూ పహారా కాస్తుంటాయి. ఉత్తర కొరియా గగనతలంపై అమెరికా గూఢచార విమానాలు ఎగరని రోజంటూ ఉండదు. ఇన్ని భయాలు, బెదిరింపుల మధ్య క్షణం క్షణం భయాందోళనలతో బ్రతికే ఉత్తర కొరియా సొంత రక్షణ కోసం ఎటువంటి ఆయుధాలనైనా అభివృద్ధి చేసుకునేందుకు సార్వభౌమ హక్కు కలిగి ఉందనడంలో ఎలాంటి అనుమానం ఉండరాదు.

ఇటీవలి వరకూ ఇండియా ఈ హక్కుకు గట్టి మద్దతుదారుగా ఉండేది. అణ్వాయుధాలను తయారు చేసుకున్నందుకు ఇండియాయే స్వయంగా అనేక దశాబ్దాల పాటు అమెరికా మరియు పశ్చిమ దేశాల నుండి అణు బహిష్కరణకు, అణు ఒంటరితనానికి గురయింది. ఇండియాకు అణు పరికరాలు, అణు ఇంధనం, అణు టెక్నాలజీ అందకుండా అమెరికా, పశ్చిమ దేశాలు అనేక యేళ్ళు నిషేధం విధించాయి. 2008లో ఇండియా-అమెరికాలు ‘పౌర అణు ఒప్పందం’ కుదిరే వరకూ ఈ పరిస్ధితి కొనసాగింది. అణు ఒప్పందంలో భారత అణు కర్మాగారాలను తనిఖీ చేసేందుకు అనుమతి ఇచ్చే క్లాజులు చేర్చిన తర్వాతనే ఈ అణు ఒప్పందం కుదరడం మరువరాదు. అనగా అమెరికా తనిఖీలకు, డిమాండ్లకు, ఒత్తిడికి కాంగ్రెస్ (యూ‌పి‌ఏ 2) ప్రభుత్వం  తల ఒగ్గిన తర్వాతనే అణు ఒప్పందం సాధ్యపడింది. అది కూడా అనేక ఇతర షరతులతోనే.

అటువంటి ఇండియా ఇప్పుడుమోడి-బి‌జే‌పి-ఎన్‌డి‌ఏ నేతృత్వంలో  తగుదునమ్మా అంటూ మరో చిన్న బలహీన దేశాన్ని బెదిరించేందుకు, ఒంటరిని చేసేందుకు, బహిష్కరణకు గురిచేసేందుకు, ఆంక్షలు విధించేందుకు అమెరికాతో కలిసి కృషి చేయడం అనైతికమే కాకుండా అత్యంత వినాశకర విధానం. అందునా 1950 ల నుండి స్నేహ సంబంధాలు కలిగి ఉన్న ఉత్తర కొరియాతో శత్రు వైఖరికి సిద్ధపడడం వల్ల ప్రపంచ దేశాల్లో ఇండియా ప్రతిష్ట పెరగకపోగా స్వవినాశనానికే దారి తీస్తుంది.

ఉత్తర కొరియాను ఖండించేందుకు భారత పాలకులు పాకిస్తాన్ ను సాకుగా చూపడం పరిపాటి అయింది. పాకిస్తాన్ సహాయంతోనే ఉత్తర కొరియా 1990 ల నుండి అణ్వస్త్ర సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసుకుంది. ఒకప్పటి భారత ఉపఖండంలో భాగమైన పాకిస్తాన్ తో శత్రువైఖరి అవలంబించడమే హ్రస్వ దృష్టితో కూడిన విధానం. అలాంటిది పాకిస్తాన్ సహాయం చేసింది కాబట్టి ఉత్తర కొరియా అణ్వస్త్ర సామర్ధ్యాన్ని వ్యతిరేకించాలని వాదించడం కుంటి సాకు మాత్రమే. అదీ కాక పాక్, ఉత్తర కొరియాల  అసలు విషయం ఏమిటంటే ఇండియా తన స్వంత సార్వభౌమ అవసరాల వల్ల కాకుండా అమెరికా భౌగోళిక-రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చడం కోసం, అమెరికా అనుచరుడుగా, అమెరికా దళారీగా ఉత్తర కొరియా వ్యతిరేక వైఖరిని చేపట్టడం. ఇది ఇండియా సార్వభౌమత్వానికి ఎంతటి చేటు తెస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా పత్రికల్లో కనిపించే వార్తలన్నీ అమెరికా, పశ్చిమ దేశాల కార్పొరేట్ మీడియా కంపెనీల సృష్టి మాత్రమే. ఈ కంపెనీలు అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలకు అనుగుణంగా ఎంతటి అబద్ధాలనైనా సృష్టించి నిజాలుగా ప్రచారం చేయగలవు. ఈ ప్రచారాలనే భారత పత్రికలు నెత్తిన వేసుకుని మోస్తున్నాయి. దానితో భారత ప్రజలకు ఉత్తర కొరియాకు సంబంధించిన నిజాలు తెలియకుండా పోతున్నాయి.

ప్రజాస్వామ్యం గురించి, మీడియా (పత్రికా) స్వేచ్ఛ గురించి గొంతు చించుకుంటూ, స్వేచ్ఛా వ్యవస్ధలకు తామే ఛాంపియన్ లు గా చెప్పుకునే పశ్చిమ రాజ్యాలు ఉత్తర కొరియా, ఇరాన్, సిరియా మీడియా సంస్ధలను మాత్రం తమ దేశాల్లో నిషేధం విధిస్తాయి. ఇటీవల రష్యన్ మీడియా పైన కూడా అమెరికా పాక్షిక ఆంక్షలు అమలు చేయడం ప్రారంభించింది. ఈ దేశాల మీడియా భారత దేశంలో అందుబాటులో ఉన్నట్లయితే అమెరికా, పశ్చిమ దేశాల విద్వేష ప్రచారం గురించిన నిజాలను కొంతయినా తెలుసుకునే అవకాశం ఉంటుంది. “అమెరికాతో చర్చల ద్వారా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మాకు అభ్యంతరం లేదు” అని ఇండియాలో ఉత్తర కొరియా రాయబారి కొద్ది వారాల క్రితం ప్రకటించడం బట్టి ఉత్తర కొరియా అసలు వైఖరి ఏమిటో ఇట్టే తెలుసుకోవచ్చు.

ఒక్క ఇండియాలోనే కాకుండా భారత ఉపఖండం మొత్తంలో ఉత్తర కొరియా దౌత్య సంబంధాల పైనా, చర్యల పైనా నిఘా పెట్టి పరిమితి విధించాలని, తదనుగుణంగా దౌత్య, నిఘా చర్యలను చేపట్టాలని ఇండియాను అమెరికా డిమాండ్ చేసినట్లు పత్రికల ద్వారా తెలుస్తున్నది. దీనికి మోడి ప్రభుత్వం తలూపడం భారత ప్రయోజనాలకు నష్టకరం. తనకు సంబంధం లేని వివాదాల్లో అమెరికా తరపున తలదూర్చడం ఇండియా కు తగని విషయం. మోడి ఉత్తర కొరియా విధానాన్ని భారత ప్రజలు గట్టిగా తిరస్కరించాలి.

8 thoughts on “అమెరికా ఒత్తిడి: మోడి వినాశకర ఉ.కొ విధానం

  1. Oh, Yeah! And this is a typical prejudicial and blind-sighted observation! You don’t need facts. You just adore those narratives that satisfy your prejudicial outlook which necessarily denies facts and objective analysis. No wonder.

    But, if you are for fact based discussion, you are most welcome.

  2. మీ అభిప్రాయంతో ఏకీభవించను… మారుతున్న ప్రాపంచిక అవసరాల దృష్ట్యా మన విదేశీ విధానాల్లో కూడా మార్పులు రావాల్సి ఉంది. “ఉత్తర కొరియాతో శత్రు వైఖరికి సిద్ధపడడం వల్ల ప్రపంచ దేశాల్లో ఇండియా ప్రతిష్ట పెరగకపోగా స్వవినాశనానికే దారి తీస్తుంది.” అన్నారు అది ఎలాగో కాస్త విపులంగా చెపుతారా ?

  3. ఇండియా బ్రిక్స్ సభ్య దేశం. ఉ.కొ తో సంబంధాలు తెంచుకుంటే (నామమాత్రం చేసుకున్నా) అది ఇతర బ్రిక్స్ దేశాలకు దూరం కావటమే. అమెరికా కౌగిలి దృత రాష్ట్ర కౌగిలి. కౌగిలించుకున్న వాడిని పీల్చి పిప్పిచేసి గాని వదలదు. కానీ చైనా-రష్యాలతో స్నేహం వల్ల భారత పాలకులకు (ప్రజలకు అని నా అర్ధం కాదు.) అటు పెట్టుబడులు, ఇటు చమురు, గ్యాస్, టెక్నాలజీ లాంటి వనరులూ ‘సమాన భాగస్వామి’ ప్రాతిపదికన లభిస్తాయి. చైనా కంపెనీలు బోలెడు పెట్టుబడి అందించగలవు. రష్యా నుండి ఆయుధాలు, గ్యాస్ వనరులు చౌక ధరకు దిగుమతి చేసుకోవచ్చు. ఇరాన్ చమురు కూడా పెద్ద అసెట్ అవుతుంది.

    అమెరికాతో స్నేహం అంటే దాని ఆధిపత్యాన్ని అంగీకరించడమే. దాని యుద్ధాలు మనమూ చేయాలి. రష్యా, చైనా, ఇరాన్ లతో దాని వైరం వల్ల ఆ మూడింటిపై విధించే ఆంక్షలు మనమూ పాటించాలి. అంటే ఆ దేశాలతో ట్రేడ్ ను తెంచుకోవాలి. లేదా మినిమైజ్ చేసుకోవాలి. ప్రపంచ దేశాల మధ్య రాజకీయ ప్రతిష్ట పోగొట్టుకుంటుంది. రష్యాపై ఆంక్షల వల్ల ఐరోపా దేశాలు నష్టపోతున్నాయి. దానితో ఈ‌యూ కూడా అమెరికాపై ప్రతి చర్యలకు యోచిస్తోంది. ఆ ప్రతి చర్యలు మన పీక మీదికి వస్తాయి.

    చైనాను నిలువరించే అమెరికా వ్యూహం ఆ దేశంతో ఘర్షణ వరకు వెళుతోంది. ఇది ఇండియా-చైనా ఘర్షణ వరకూ వస్తుంది. మనకు నష్టం వచ్చి మన అవసరాల కోసం చైనాతో ఘర్షణ పడితే అది వేరు. కానీ అమెరికా-చైనా ఘర్షణ వల్ల మనం చైనాతో ఘర్షణ పడడం వల్ల మనకు నష్టం. సిక్కిం వద్ద డోక్లాం ఏరియాలో భారత్-చైనాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభన అమెరికా పుణ్యమే. అమెరికాతో కలిసి చైనా తల పెట్టిన బెల్ట్ & రోడ్ ఇనీషియేటివ్ (బి‌ఆర్‌ఐ) కు వ్యతిరేకంగా ఇండియా పని చేస్తున్నది. నిజానికి ఆ అవసరం మనకు లేదు. పైగా బి‌ఆర్‌ఐ వల్ల మనం వాణిజ్యపరంగా బాగా లబ్ది పొందవచ్చు. (ఇక్కడ మనం అంటే మన పాలకులు అని. అందులో భారత ప్రజలు కలిసి ఉండనవసరం లేదు.)

    ఇవి కొన్ని ఉదాహరణలు.

    మీరు చెప్పిన ‘మారుతున్న ప్రాపంచిక అవసరాలు’ నిజానికి మనవి కావు. అమెరికావి. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే మన అవసరాలు పక్కనబెట్టి దాని అవసరాలు మన నెత్తిమీద రుద్దించుకోవటమే.

  4. మిత్రులు, శేఖర్ గారి ఇతర వ్యాసాలు చదివి రష్యా-చైనా ల అనుకూలుడేమో వ్యాఖ్యానించొచ్చు. చైనా విధానాలని విశ్లేషించాడు..విమర్శించాడు కూడా.

వ్యాఖ్యానించండి