ఓ పక్క ప్రధాన మంత్రి వృధా ఖర్చు చేయొద్దని బోధిస్తారు. డీమానిటైజేషన్ ద్వారా నల్ల డబ్బు నిరోధించానని చెప్పుకుంటారు. అట్టహాసంగా జరిగే పెళ్లిళ్ల ఖర్చులపై పరిమితి విధించేందుకు కాంగ్రెస్ ఎంపి ప్రతిపాదించిన బిల్లును బిజేపి ప్రభుత్వ కేబినెట్ తానే స్వయంగా ఆమోదించి సభలో పెడుతుంది. మరో పక్క ఆ బిజేపి ఎంపిలే నల్ల డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అంగరంగ వైభోగంగా పెళ్లిళ్లు కానిచ్చేస్తుంటారు. ‘కోటలు దాటే మాటలు, గడప దాటని చేతలు’ సామెతకు అచ్చమైన ప్రతినిధులు పాలక పార్టీ నేతలు!
డీమానిటైజేషన్ సంరంభం మొదలైన రోజుల్లోనే కర్ణాటక బిజేపి ఎంఎల్‌ఏ గాలి జనార్ధన రెడ్డి తన కూతురు బ్రహ్మణి పెళ్లి కోసం రు 500 కోట్లు ఖర్చు పెట్టారని పత్రికలు కోడై కూశాయి. నల్ల డబ్బుపై యుద్ధం ప్రకటించిన నరేంద్ర మోడి గారు తన పార్టీ ఎంఎల్‌ఏ వ్యవహారంపై ఒక్క ముక్కా మాట్లాడింది లేదు. పోనీ ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ‘అదేమిటని’ ఖండించింది లేదు. ఆ తర్వాత ఎప్పటికో ఇంకమ్ టాక్స్ అధికారులు గాలి ఇంటిపై తూతూ మంత్రంగా దాడి చేసి ‘వీరులమే’ అని చాటుకోవడం తప్పించి విచారణా లేదు, కేసూ లేదు.
ఇప్పుడు అదే తరహాలో మాహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సైతం తన కుమారుడి పెళ్ళి అట్టహాసంగా నిర్వహించి డీమానిటైజేషన్ తన వెంట్రుకను కూడా తాకలేదని చాటి చెప్పాడు. తన పార్టీ ఆధ్వర్యం లోని కేంద్ర ప్రభుత్వం వచ్చే సమావేశాలలోనే విచ్చలవిడి పెళ్లి ఖర్చుల నిరోధానికై బిల్లు ప్రైవేశపెట్టనున్నా, అదేమీ తనకు లెక్క కాదనీ చాటాడు.
రావు సాహెబ్ దవే మహారాష్ట్ర బిజేపి చీఫ్ కాగా ఆయన కుమారుడు సంతోష్. ఆయన ప్రముఖ మరాఠీ సంగీతకారుడు రాజేష్ సర్కాతే కుమార్తె రేణును పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్ళి ఆహ్వానానికి సంతోష్ ఒక వీడియోయే తయారు చేశాడు. ఆ వీడియోలో కాబోయే దంపతులిద్దరూ జాన్ న్యూమన్ పాడిన ‘లవ్ మీ ఎగైన్’ పాటకి రొమాన్స్ డాన్స్ చేస్తూ కనిపిస్తారు. వీడియోని ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేశార్ట. సదరు వీడీయోని 44,000 సార్లు చూశారట.
సంతోష్, రేణు పెళ్లి కోసం ఔరంగాబాద్ లోని జబిందా ఎస్టేట్ పచ్చిక భూములలో ఓ పేద్ద సెటింగ్ వేసారు. మధ్య యుగాల కాలం నాటి విలాస భవనాన్ని పోలిన ఈ సెటింగ్ నిర్మాణానికి భారీగా ఖర్చు పెట్టారు. సెట్టింగ్ నిర్మాణానానికి ఆర్ట్ డైరెక్టర్ల బృందాన్ని నియమించారు. కళా దర్శకులన్నమాట. వీరు సినిమా సెట్టింగ్ లు వేయడానికి పని చేస్తుంటారు. నిర్మాతల జేబు తుప్పు వదిలించడంలో వారు దిట్ట. కళా దర్శకులు బృందంగా ఏర్పడి వేసిన సెట్టింగుకు ఎంత ఖర్చు అయి ఉంటుందో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.
పెళ్లి భోజనానికి ఏయే వంటకాలు చేసి ఉంటారు? ఈ ప్రశ్నకు అచ్చమైన సమాధానం చెప్పాలంటే చాలా చాలా పేజీలు కావాలి. ఎందుకంటే భారత దేశంలో ఎన్నెన్ని రకాల, సంప్రదాయాల వంటకాలు ఉన్నాయో అవన్నీ సంతోష్, రేణు పెళ్ళికి తయారు చేశారు. భారతీయ వంటకాలతో పాటు చైనీస్ వంటకాలు కూడా వండి వడ్డించారు.
సంతోష్, రేణు పెళ్ళికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బంధు మిత్ర సపరివార సమేతంగా హాజరయ్యారు. సపరివారం అంటే ఆయన వ్యక్తిగత కుటుంబం అనుకునేరు. ఆయన ప్రభుత్వ కుటుంబం కూడా ఆయనతో పాటు పెద్ద పెద్ద కాన్వాయ్ లలో విచ్చేసి మోడి గారి డీమానిటైజేషన్ యజ్ఞం అంటే తమకు ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో చాటుకున్నారు. మంత్రులు, ఎంఎల్‌ఏలు, ప్రతిపక్ష నేతలు అందరూ హాజరై సంతోష్ పెళ్లి ఆర్భాటాన్ని రెట్టింపు చేసి తరించారు.
- Marriage setting
- After marriage
- Raosaheb, Fadnavis with new couple
- Video invite
- Setting and visitors
- Gadkari daughter’s marriage
మహారాష్ట్ర బిజేపి అధ్యక్షుడు రావు సాహెబ్ దన్వే కుమారుడు సంతోష్ ఎంఎల్‌ఏ కూడా. మరాఠ్వాడా ప్రాంతం లోని భోకార్దన్ నియోజకవర్గానికి ఆయన ప్రతినిధి. ఈ ప్రాంతం గత రెండు సంవత్సరాలుగా వర్షాలు లేక తీవ్ర కరువు ఎదుర్కుంటోంది. మరాఠ్వాడా కరువు రావు సాహెబ్ గారి కుటుంబాన్ని ఏ విధంగానూ తాకలేదని వేరే చెప్పాలా?
సంతోష్, రేణు పెళ్లి కోసం ఔరంగాబాద్ లో ఒక పెద్ద బిజీ రోడ్డుని మొత్తంగా మూసేశారు. రాకపోకలన్నింటినీ బంద్ చేసేశారు. ఈ బందులో రాష్ట్ర పోలీసులు పూర్తిస్ధాయిలో సన్నద్ధమై పాల్గొని విజయవంతం చేశారు. డ్రోన్ విమానాలను కూడా వినియోగించి రోడ్డు రోకోని పర్యవేక్షించారు. చీమ కూడా చొరకుండా కాపలా కాశారు.
బిజేపి మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ కూడా తన కూతురు పెళ్లిని నాగపూర్ లో ఇంతే ఘనంగా నిర్వహించాడు. డీమానిటైజేషన్ వల్ల ఓ పక్క జనానికి కరెన్సీ నోటు ముక్క దక్కని కరువు రోజుల్లోనే డిసెంబర్ 3 తేదీన జరిగిన ఈ పెళ్ళికి 10,000 మండి వివిఐపి అతిధులు హాజరయ్యారు. వారిని పెళ్ళికి తెచ్చి తిరిగి వెనక్కి తీసుకెళ్లేందుకు 50 ప్రైవేటు చార్టర్డ్ విమానాల్ని వినియోగించారు. కేంద్ర కేబినెట్ తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ అతిరధ మహారధులు, అంబానీ, టాటా, బిర్లా లాంటి పారిశ్రామికవేత్తలు హాజరై నల్ల డబ్బు యజ్ఞంలో పాల్గొని తరించారు.
గడ్కారీ కూతురు పెళ్లి వల్ల డిసెంబర్ 3, 4 తేదీల్లో నాగపూర్ వెళ్ళే ఏ విమానం లోనూ సీట్లు ఖాళీగా మిగల్లేదు. ముందే బుక్ అవడం వల్ల ఆ రెండు రోజుల్లో ప్రయాణం పెట్టుకున్న ఇతర ప్రయాణీకులకు ప్రయాణ యోగం దక్కలేదు. ఎంత జరిగినా ప్రధాని మోడీ నోరు తెరిచి ఒక్క ఖండన జారీ చేయలేకపోయారు.
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ వేలాది కోట్ల వ్యాపం కుంభకోణంలో పీకల లోతు కూరుకుపోయి మీడియా నిండా నిండిపోయిన రోజుల్లో కూడా “నా ప్రభుత్వంలో ఒక్క అవినీతి కుంభకోణం చూపండి” అంటూ నిస్సిగ్గుగా డంబాలు పలికిన ప్రధాన మంత్రి తన పార్టీ మాహారాష్ట్ర అధ్యక్షుడి నల్ల డబ్బు విలాసం, కుమారుడి పెళ్లి ఆర్భాటాల గురించి మాట్లాడతారని ఆశించడం ఒట్టి దండగ!
ఈ నల్ల కుబేరులకు డబ్బు రవరిచ్చారు అంటే దేవుడు ఇచ్చాడు. లేక దేవుడు సంపాదించేలా ఆదుకున్నాడు.అవి కష్టపడి చెమటోడ్చి నవి. ఎవరు? అనిమాత్రం అడగకూడదు. ఎంతచెమటొడిస్తే వచ్చిన ఆడబ్బు బలశాలులు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టకపోతే ఎలా? గౌరవసనికి భంగము కాదు?
ఇలా ఇబ్బడి ముబ్బడి గా ఖర్చు పెట్టి తమ తాహతు తెలియజేసే ఫ్యూడల్ మనస్తత్వాలు, అదే గొప్ప మాంత్రిక శక్తి ఉందను కొనే ప్రజల మనస్తత్వాలు మారక పోతే! ? ఇవే సంగతులు!
ఆధిపత్యవర్గాల భావజాలంలో సామాన్య జనం ఏవిధంగా బంధిఖాన అయ్యారో తెలియజేయడానికి పెళ్ళివేడుకలు పెద్ద ఉదాహరణ.
ఈ పెళ్ళిలోనే వారి సామాజిక వెనుకబాటుతనం,ఆర్ధిక దోపిడీ,మతదురాచారాలు ఆనీ ప్రస్పుటంగా కనిపిస్తుంటాయి.
పెళ్ళి అనే ఇద్దరి వ్యక్తుల,రెండు కుంటుంబాల సమ్మేళణం నుండి పెళ్ళి అనే క్రతువను(తతంగాన్ని) వేరేగా చూడవలసి వస్తుంది.
సరిగ్గా చెప్పారు, మూల గారు. Factual observation.
తిరుపాలు గారూ, అవును. మార్పు కోసమే జనం ప్రయత్నించాలి.