బ్రెగ్జిట్: ఎగువ సభలో ధెరెసా పాక్షిక ఓటమి -విశ్లేషణ


Britain's Prime Minister Theresa May

Britain’s Prime Minister Theresa May

బ్రిటిష్ ప్రధాని ధెరెసా ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్) లో పాక్షిక ఓటమిని ఎదుర్కొన్నారు. ప్రధాని ప్రతిపాదించిన బ్రెగ్జిట్ బిల్లు దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) లో యధాతధంగా ఆమోదం పొందగా ఎగువ సభలో ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన సవరణతో ఆమోదం పొందింది. బ్రెగ్జిట్ తీర్పు అమలు చేసే విషయంలో ఆమె రచించిన పధకానికి ఈ ఓటమి వల్ల ఆటంకాలు ఎదురుకానున్నాయి. బ్రెగ్జిట్ ప్రక్రియ ప్రారంభం ఆలస్యం కావచ్చు.

లార్డ్స్ సభలో బ్రెగ్జిట్ బిల్లుపై ఓటింగ్ జరిగింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ చేర్చిన సవరణతో బిల్లు 358-256 ఓట్ల తేడాతో నెగ్గింది. బిల్లు యధాతధంగా ఆమోదం పొందితేనే పాలక పార్టీకి నిఖార్సయిన గెలుపు అవుతుంది. ప్రతిపక్షం ప్రవేశపెట్టిన సవరణతో ఆమోదం పొందడం అంటే పాలక పార్టీ బిల్లు ఓటమి చెందినట్లే లెక్క. అయితే బిల్లును పూర్తిగా ఓడించి దిగువ సభకు తిప్పి పంపలేదు గనుక ఆ మేరకు పాలక కన్సర్వేటివ్ పార్టీ బైటపడినట్లే.

కానీ ప్రధాని ధెరెసా మే అలా భావించడం లేదు. ప్రతిపక్షం ప్రవేశపెట్టిన సవరణ ఆమెకు ఇష్టం లేదు మరి. భారత పార్లమెంటులో మల్లేనే బ్రిటన్ లో కూడా ఎగువ సభలో పాలక పార్టీకి మెజారిటీ లేదు. లేబర్ పార్టీ సహకరిస్తే తప్ప అక్కడ బిల్లులు ఆమోదం పొందలేవు.

ఏమిటి సవరణ?

ప్రతిపక్ష పార్టీ ప్రవేశపెట్టిన సవరణ ప్రకారం ఆర్టికల్ 50 కింద యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బైటకు వచ్చే ప్రక్రియను ప్రధాని ప్రారంభించడానికి ముందే యూ‌కే లో నివశిస్తున్న యూరోపియన్ యూనియన్ (ఈ‌యూ) పౌరులకు బ్రిటిష్ పౌరులతో సమానంగా హక్కులు ఉంటాయని ఆమె హామీ ఇవ్వాలి. అందుకు తగిన ఏర్పాటు బిల్లులో ఉండే విధంగా ప్రతిపక్షం సవరణ ప్రవేశపెట్టింది.

అనగా, సవరణ ప్రకారం యూ‌కే లో నివశిస్తున్న ఈ‌యూ పౌరుల హక్కులకు గ్యారంటీ ఇస్తేనే ప్రధాన మంత్రి ఆర్టికల్ 50  కింద బ్రెగ్జిట్ ప్రక్రియ మొదలు పెట్టాలని ఈ‌యూను కోరలేరు. ఇది ప్రధాని ధెరెసా మే తలపెట్టిన పధకానికి గట్టి దెబ్బ. యూ‌కే లోని ఈ‌యూ పౌరుల హక్కులకు సంబంధించి ఆమె మదిలో వేరే పధకాలు ఉన్నాయి. ఆ పధకం ఏమిటో లేబర్ పార్టీ ప్రతినిధి కీర్ స్టార్మర్ చేసిన ప్రకటనలో తెలుస్తుంది.

“ఈ‌యూ జాతీయులు (యూ‌కే యేతర ఈ‌యూ దేశాల పౌరులు) బ్రెగ్జిట్ చర్చలలో బేరసారాల పరికరం (బార్గెయినింగ్ చిప్) ఉపయోగించరాదని లేబర్ పార్టీ నమ్ముతున్నది” అని కీర్ స్టార్మర్ తమ సవరణకు వివరణ ఇస్తూ చెప్పారు.

ఆఫ్ కోర్స్! ఈ ఎత్తుగడ తనకు ఉన్నట్లుగా ప్రధాని మే కూడా చెప్పారు. “ఈ‌యూ పౌరుల హక్కులు గ్యారంటీ చేయడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ఇతర ఈ‌యూ దేశాలు తదనుగుణమైన ఒప్పందానికి అంగీకరించకుండా నేను అందుకు తయారుగా లేను” అని ప్రధాని స్పష్టం చేశారు.

ప్రజల కోసం బెంగా? 

అయితే లేబర్ పార్టీ గానీ, కన్సర్వేటివ్ పార్టీ గానీ తాము చెబుతున్నట్లుగా ఒకరు ఈ‌యూ పౌరుల హక్కుల గురించీ, మరొకరు ఈ‌యూ లోని యూ‌కే పౌరుల గురుంచీ అంతగా బెంగ పెట్టుకున్నారా?

అబ్బే, అదేం లేదు. వారు పైకి ‘పౌరులు’ అని చెబుతున్నారు గానీ వారి అసలు లక్ష్యం ఆయా పక్షాల లోని ధనిక వర్గాలు మరియు కంపెనీలే. ఈ‌యూ లోని వివిధ సభ్య దేశాలకు యూ‌కేలో అనేక వ్యాపార, ద్రవ్య, ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఫైనాన్షియల్ సెంటర్ (ద్రవ్య కార్యకలాపాల కేంద్రం) గా వెలుగొందుతున్న లండన్ తో ఈ‌యూ సభ్య దేశాల ప్రయోజనాలు అమితంగా ముడిపడి ఉన్నాయి. ఆ ప్రయోజనాలకు గ్యారంటీ ఉండాలని మాత్రమే లేబర్ పార్టీ కోరుతున్నది. అంతే తప్ప యూ‌కే లోని ఈ‌యూ దేశాల పౌరుల భవిష్యత్తు పట్ల ఆ పార్టీకి ఎలాంటి బెంగా ఉండదు.

అలాగే అధికార కన్సర్వేటివ్ పార్టీ కూడా. దాని ప్రధాన లక్ష్యం యూ‌కే సంపన్న వర్గాల, కంపెనీల, ద్రవ్య సంస్ధల ప్రయోజనాలను చెక్కు చెదరకుండా ఉండేలా చూడడం. ఈ‌యూ నుండి విడాకులు తీసుకున్న తర్వాత రోజుల్లో ప్రపంచ ద్రవ్య కేంద్ర స్ధానానికి వివిధ ఈ‌యూ దేశాల నగరాలు పోటీ పడుతున్నాయి. ఫ్రాంక్ ఫర్ట్ (జర్మనీ), ప్యారిస్ (ఫ్రాన్స్), బ్రసెల్స్ (బెల్జియం),  మిలన్ (ఇటలీ) లతో పాటు ఇతర నగరాలు లండన్ స్ధానాన్ని ఆక్రమించడానికి ఎదురు చూస్తున్నాయి.

ఇతర ఈ‌యూ దేశాల నగరాలు లండన్ స్ధానాన్ని ఆక్రమించడం అంటే విడాకుల అనంతరం లండన్ ని అమాంతం కూలదొయాలని ఈ‌యూ సభ్య దేశాలు భావిస్తున్నట్లే కదా. ఇది ఇంత మాత్రం బ్రిటన్/యూ‌కే కు ఇష్టం లేదు. ఈ‌యూ ఏర్పడటానికి ఎంతో కాలం ముందు నుండే లండన్ ప్రపంచ ద్రవ్య-వ్యాపార కేంద్రంగా ఉంటూ వచ్చింది. అలాంటిది ఈ‌యూ నుండి బ్రిటన్ వెళ్ళిపోయినంత మాత్రాన లండన్ తన ప్రభను ఇతర నగరాలకు ధారపోయాల్సిన అగత్యం ఎందుకు వస్తుందన్నది బ్రిటన్ సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల ప్రశ్న. ఈ బ్రిటన్ కంపెనీలకు కన్సర్వేటివ్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నది.

ఇలా బ్రిటన్ పాలక ప్రతిపక్ష పార్టీలు యూ‌కే మరియు ఈ‌యూ కంపెనీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పైకి మాత్రం ప్రజలను అడ్డం తెచ్చుకుంటున్నాయి. ఈ మర్మాన్ని గ్రహించకుండా బ్రిటన్ ప్రధాని మే, లేబర్ పార్టీ నేతల మాటల్ని యధాతధంగా అర్ధం చేసుకుంటే మనం పప్పులో కాలు/కాళ్ళు వేసేస్తాము.

అంతర్గత వైరుధ్యం

ఈ విశ్లేషణలో లేబర్ పార్టీ బ్రిటన్ సంపన్నుల/కంపెనీల ప్రయోజనాలకు వ్యతిరేకంగానూ, ఈ‌యూ దేశాల సంపన్నుల / కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగానూ పని చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. సరిగ్గా గీత గీసినట్లుగా అర్ధం చేసుకోకూడదు. లేబర్ పార్టీ కూడా బ్రిటిష్ ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు కట్టుబడి ఉంటుంది. కానీ ఆ పార్టీ వెనుక ఉన్న బడా వర్గాలకు ఇతర ఈ‌యూ దేశాల కంపెనీలతో గానీ, అమెరికా కంపెనీలతో గానీ విరోధం పెట్టుకోవడం ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఘర్షణ పడటం ఇష్టం లేదు. వారితో ఘర్షణ పడటం కంటే రాజీ పడితేనే లండన్ ప్రయోజనాలు భద్రంగా ఉంటాయని లేబర్ పార్టీ వెనుక ఉన్న సామ్రాజ్యవాద కంపెనీల అవగాహన.

కన్సర్వేటివ్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న / ఆ పార్టీని పోషిస్తున్న బడా వర్గాలు మాత్రం ఈ‌యూ, అమెరికా లతో రాజీ ధోరణితో ఉంటే పుట్టి మునగడం ఖాయం అని భావిస్తున్నాయి. లండన్ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ ఈ‌యూ, అమెరికాలతో ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వాణిజ్య ప్రయోజనాలను స్వతంత్రత ప్రాతిపదికన పరిరక్షించుకోవచ్చని వారి నమ్మకం. ఈ‌యూ కలిసి అడుగులు వేస్తే ఋణ సంక్షోభం బారిన పడతామనీ, శక్తివంతమైన ద్రవ్య కేంద్రంగా అవతరించాలని భావిస్తున్న అమెరికాతో రాజీ పడితే మొదలుకే మోసం అనీ భావిస్తున్నాయి.

ఇదొక వైరుధ్యం. బ్రిటన్ పాలక వర్గాల మధ్య తల ఎత్తిన వైరుధ్యం. బ్రెగ్జిట్ ఓటింగ్ ఫలితంగా బహిరంగంగా, స్పష్టంగా ముందుకు వచ్చిన వైరుధ్యం. ఈ రెండు వర్గాల లక్ష్యమూ బ్రిటిష్/లండన్ ప్రాభవం క్షీణించకూడదు అన్నదే. కానీ అందుకు ఏది దారి అన్న ప్రశ్నకు సమాధానం లోనే వారి మధ్య వైరుధ్యం తలెత్తింది. ఇది కొత్తగా పుట్టిన వైరుధ్యం కాదు. ఇన్నాళ్ళు నివురు గప్పిన నిప్పులా ఉన్న వైరుధ్యమే ఈ రోజు బహిరంగం అయింది. అమెరికా, జర్మనీలు కూడా తమ వంతు పాత్ర పోషించి వైరుధ్యం తీవ్రం కావడానికి దోహదం చేశాయి.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s