ఇప్పుడు నాకొక పాట కావాలి –గేయమైన గాయం


బాధితులనే దొషులుగా నిలబెడుతున్న హిందూత్వ కుటిల పాలనలో నరకబడ్డ అఖ్లక్ లపైనే చార్జి షీట్లు నమోదవుతున్నాయి.

హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత ప్రజ్వలనంలో తనను తాను ఆహుతి చేసుకున్న రోహిత్ వేముల ఈ దేశ దళితోద్ధారక చట్టాల సాక్షిగా దళితుడు కాడని రుజువు చేయబడ్డాడు.

ఎన్నికల కోసం చేసే దళిత వివక్ష నిర్మూలనా శపధాలను హైందవ కపట నీతి దళితతనం నిర్మూలనతో నెరవేర్చుతున్నది.

దళిత పుట్టుకనే నిరాకరించడం ద్వారా దళిత అణచివేత సమస్యను కృత్రిమంగా మాయం చేసేస్తున్న పీడాకాలం కొనసాగుతున్న నేపధ్యంలో దళిత గాయాల గేయాలు మందుగుండై పేలడం అనివార్యం!

ఫేస్ బుక్ లో Indus Martin టైమ్ లైన్ నుండి సంగ్రహించిన ఈ కవితా గానాన్ని వినండి. మీ హృదయం ఆర్తనాదమై ద్రవించకపోతే ఒట్టు!

8 thoughts on “ఇప్పుడు నాకొక పాట కావాలి –గేయమైన గాయం

  1. వాడికి అవమానపరచడానికి, అహాంకారాణ్ణి తృప్తి పరుచుకోవడానికి దళితత్వం కావాలి. హక్కులు కావలస్తే అసలు దలిత అనే పేరే ఉనికిలో లేదు. అణిగి మనిగి ఉండటమే దళిత త్వం వాడి దృష్టిలో. !

  2. దలితుడు అనే పదాన్ని ప్రతీ చోట విసిరి విసిరి మిమ్మల్ని మీరు తక్కువ అనే భావనను పెంచుకుంటున్నారు.. అడుగు పడేదెప్పుడు!

  3. ఆ మధ్య రాహుల్ గాంధీ ఓ మాటన్నారు. “Poverty is a state of mind” అని. దరిద్రం వాస్తవంగా లేకుండానే తాము దరిద్రులం అని మానసికంగా భావిస్తూ ముందుకు వెళ్లలేకపోతున్నారని ఆయన భావం.

    ఇది ట్విస్టెడ్ లాజిక్ తప్ప మరొకటి కాదు.

    జీవితంలో ఏనాడూ దరిద్రం అనుభవించి ఎరగని రాహుల్ గాంధీ ఆ దరిద్రం అనుభవిస్తున్న నేరాన్ని కూడా చాలా తేలికగా దరిద్రుల మీదకే నెట్టేసే సాహసం చేయగలడు. ఎందుకంటే దరిద్రాన్ని జీవితంలో అనుభవించడం ఏమిటో ఆయనకి తెలియదు మరి.

    మీరు చెబుతున్నదీ అదే.

    కారంచేడు నిందితులకి శిక్ష పడలేదు. చుండూరు కేసులో నిందితులు అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. మొన్నటికి మొన్న బి‌సి అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన ఇలవరసన్, కుల శక్తుల జోక్యంతో ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది. నిన్నటికి నిన్న ఉడుములై పెట్టైలో పై కులపు అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన ఇంజనీర్ శంకర్ ని పట్టపగలు తిర్పూరులో (తమిళనాడు) నరికి చంపారు. గుజరాత్ లో చనిపోయిన ఆవు చర్మం ఒలిచినందుకు నలుగురిని ఊరేగిస్తూ కొట్టారు. అందుకు నిరసనగా జంతువుల చర్మం ఒలిచేందుకు నిరాకరించారని అనేక కుటుంబాల యువకులను కట్టేసి కొడుతున్నారు. దళితులకి రిజర్వేషన్ లు రద్దయినా చేయండి లేదా మాకూ రిజర్వేషన్లు ఇవ్వండి అని గుజరాత్ పటేళ్ళు ఉద్యమం చేస్తున్నారు. మహారాష్ట్ర మరాఠాలు, హర్యానా జాట్ లు కూడా వారిని అనుసరిస్తున్నారు.

    కోర్టుల్లో కులం ప్రసక్తి లేకుండా కేసులు నడవ్వు. కుల ప్రసక్తి లేకుండానే ఎన్నికలు జరుగుతున్నాయా? కులం ప్రసక్తి లేకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయా? కులాలవారీగా హాస్టళ్లు, ధర్మ సత్రాలు, వెల్ఫేర్ సంఘాలు నడవడం లేదా?

    ఇవేవీ జరక్కుండానే జరుగుతున్నాయని దళితులు ఫీల్ అవుతున్నారా? జరగనివి జరిగినట్లు భావిస్తూ తమను తాము తక్కువ చేసుకుంటున్నారా?

    వాస్తవాలు చూసేందుకు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ దేశంలో కొన్ని కులాల ప్రజలు అనాదిగా అణచివేతకు గురయ్యారు. సమస్త వనరులకు దూరంగా ఉంచబడ్డారు. అది నేటికీ కొనసాగుతున్నది. కాకపోతే ఆధునిక రూపాలు ధరించింది. గ్రామాల్లో మొరటుగా కొనసాగుతుంటే పట్నాలు, నగరాల్లో నాజూకుగా అణచివేత అమలవుతోంది. ఈ కులాల ప్రజలను గాంధీ హరిజనులు అన్నాడు. రాజ్యాంగం ‘షెడ్యూల్డ్ కులాలు’ (ఎస్‌సి) అన్నది. ఆ కులాల ప్రజలు తమను తాము ‘దళితులు’ అని చెప్పుకుంటున్నారు. పేరు ఏదైతేనేమి? వారి అణచివేత వాస్తవమా కాదా అన్నది చూడాలి గాని.

    ‘దళిత’ పద ప్రయోగం కేవలం అలంకార ప్రాయం కాదు. అది ఒక అణచివేత పరిస్ధితిని తెలియజేసే పదం. దానిని ప్రయోగిస్తే తమను తాము తక్కువ చేసుకోవడం కాదు, తమ రాజకీయ-సామాజిక-ఆర్ధిక నిస్సహాయ పరిస్ధితిని, సమాజం నుండి మద్దతు అందని పరిస్ధితిని, ప్రభుత్వాలు ఏమీ చేయని పరిస్ధితిని తెలియజేప్పేందుకు ఉపయోగించేదే ‘దళితులు’ అన్న పదం.

    వాళ్ళు ‘దళితులు’ అని ప్రతీ చోట విసిరినా విసరక పోయినా, వారి పైన వివక్ష కొనసాగుతున్న మాట వాస్తవం. దాని అర్ధం ప్రతి పై కులస్ధుడూ వివక్ష దృక్పధంతో ఉన్నాడని కాదు. సామాజిక వ్యవహారాలు, రాజకీయార్ధిక ప్రయోజనాలు సమస్తం కుల వివక్ష లేకుండా జరగడం లేదు అని మాత్రమే అర్ధం. దళిత ప్రజలు పేదరికంలో మగ్గడానికి, రాజకీయ-సామాజిక-ఆర్ధిక అణచివేతకు గురి కావటానికీ, సంపదల సృష్టికి అవసరమైన వనరుల (భూములు, పరిశ్రమలు) నుండి దూరంగా ఉంచబడటానికి ఇది చాలు.

    ఈ వాస్తవం అర్ధం కావాలంటే, ఆ వాస్తవాన్ని గుర్తించాలంటే అణచివేత జరుగుతున్నట్లు తెలియాలంటే రోజుకో కారంచేడు, చుండూరు జరగాలా? ప్రతి రోజూ ఇళవరసన్, శంకర్ లు చస్తూ ఉండాలా? మను స్మృతిని అధికారికంగా చట్టాలు చేసి గుర్తించాలా?

    ఒక్క రోజన్నా దరిద్రం అనుభవిస్తే రాహుల్ గాంధీ ఆ మాట అని ఉండేవాడు కాదని అనేక మంది వ్యాఖ్యానించారు. ‘దళితుడు’ గా సమాజంలో బతికితే తప్ప ఆ అణచివేతను గుర్తించలేరు అని చెప్పవలసిన అగత్యం ఏర్పడితే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండగలదా?

వ్యాఖ్యానించండి