నోట్ల రద్దు: టమాటో పంటను పశువులకు మేపుతున్న రైతులు


img_0493

పెద్ద నోట్ల రద్దు వలన గట్టి దెబ్బ తిన్నవారిలో రైతులు ముఖ్యమైన వారు. ‘దేశానికి అన్నం పెట్టె రైతన్న’ అనీ, ‘దేశానికి వెన్నెముక’ అనీ ‘జై జవాన్, జై కిసాన్’ అనీ సవాలక్ష అలంకారాలతో రైతులను నెత్తిన పెట్టుకున్నట్లు కనిపించే ప్రభుత్వాలు ఆచరణలోకి వచ్చేసరికి రైతాంగాన్ని చావు దెబ్బ తీసే విధానాలను అమలు చేయటానికి ఎంత మాత్రం వెనకడుగు వేయరు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల అటు ఖరీఫ్ రైతులు, ఇటు రబీ రైతులు ఇరువురూ తీవ్రంగా నష్టపోతారని కనీసం పట్టించుకోకుండా తానూ ఆ తానులో ముక్కనేనని, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాలకే తాను కట్టుబడి ఉన్నాననీ ప్రధాని నరేంద్ర మోడీ చాటి చెప్పారు. 

మోడీ నిర్లక్ష్యానికి, రైతుల పట్ల ఆయనకు ఉన్న సవతి తల్లి ప్రేమకు మహా రాష్ట్ర రైతుల దీన పరిస్ధితి ప్రబల ఉదాహరణ. కూరగాయల పంటలకు ఇండియాకు కేంద్రంగా భావించే నాసిక్ ప్రాంతంలో రైతులు నోట్ల రద్దు వల్ల తీవ్రంగా నష్టపోయారు; నష్టపోతున్నారు. 20 కేజీలు బరువు తూగే తట్ట టమోటాకు గతంలో రు. 300 నుండి రు 750 వరకు ధర పలికితే ఈ ఏడు కన్నా కష్టంగా తట్టకు రు 10 నుండి రు 40 వరకు మాత్రమే పలుకుతోంది. ఫలితంగా రైతులకు పెట్టుబడి ఖర్చులు అలా ఉంచి, మండికి తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చులు కూడా గిట్టటం లేదు. దానితో మండికి (మార్కెట్ కి) తరలించిన వారేమో రోడ్లపై పారబోస్తుండగా, కోతలు కోయనివారు నిండైన పంటను పశువులకు మేపుతున్నారు. 

ఓ పక్క ముంబైలో శివాజీ విగ్రహానికి రు 3600 కేటాయించామని ప్రధాని మోడీ ప్రకటిస్తున్న క్రిస్టమస్ పండగ రోజునే నాసిక్ ప్రాంతంలో రైతులు తమ పొలం లోని టమాటో పంటల్ని పీకేయడం, నిండు పంటని తగలబెట్టడం, పశువులను దింపి మేతకు పెట్టడం చర్యలకు పాల్పడడం బట్టి ఈ దేశం పాలకుల ప్రాధామ్యాలకు, ప్రజల అవసరాలకు ఎంత లోతైన అంతరం ఏర్పడి ఉన్నదో తెలియజేస్తుంది. 

img_0492

“గత నెల రోజుల నుండి టమాటో ధరలు భారీగా కూలిపోయాయి. పండిన పంటను అట్టాగే పొలంలో కొనసాగించడం కూడా మాకు ఆర్ధికంగా భారంగా మారిపోయింది. అందువల్ల ఇలా పంటను పీకి వేయక తప్పడం లేదు” అని ఆదివాసీ రైతు జంట యశ్వంత్, హిరాబాయ్ బెందుకులే చెప్పారని ప్రసిద్ధి చెందిన వెబ్ పత్రిక స్క్రోల్ తెలిపింది. టమాటో పంటను పీకి వేసాక గోధుమ పంటను వేయాలని వారు భావిస్తున్నారు. అయితే గోధుమ వల్ల లాభం వస్తుందన్న ఆశ కూడా వారికి లేదు. కాకపొతే గోధుమ తినడానికైనా పనికి వస్తుందని వారి ఆలోచన. “గోధుమ వేస్తే వేసవిలో తినటానికి కనీసం ఆహారం అయినా మిగులుతుంది” అని రైతులు నిట్టూర్చుతున్నారు. 

యశ్వంత్ కుటుంబం నాశనం చేస్తున్న టమాటో పంట దిగుబడి తక్కువగా వచ్చిందా అంటే అదేమీ లేదు. నిజానికి ఈ ఏడు నాసిక్ ప్రాంతంలో టమాటో విరగ కాసింది. వర్షాలు గట్టిగా కురవడంతో రైతులు ఏంటో ఉత్సాహంగా టమాటో పంట వేశారు. ఇండియాకు అవసరమైన టమాటో అవసరాల్లో నాలుగో వంతు నాసిక్ ప్రాంత రైతులే తీరుస్తారు. గత రెండు మూడు ఏళ్లుగా, ముఖ్యంగా గత సం టమాటోకు మంచి ధర పలికింది. ఈసారి కూడా అదే ధర వస్తుందని రైతులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. 

వారి ఆశలకు తగ్గట్టుగా పంట కూడా విపరీతంగా పండింది. ఉత్పత్తి ఎక్కువ అయినందున గత సంవత్సరం వచ్చిన ధర కాకపోయినా కాస్తో కూస్తో లాభాలు గిడతాయనీ, అప్పులు కొంతవరకైనా తీర్చుకోవచ్చని రైతులు గంపెడు ఆశ పెట్టుకున్నారు. అక్టోబర్ నెలలో పంట దిగుబడి సీజన్ ప్రారంభమై అమ్మకాలు ఊపు అందుకుంటున్న తరుణంలో ప్రధాన మంత్రి మోడీ అనుకోని తడవుగా, ఉరమని ఉరుములాగా పెద్ద నోట్ల డీమానిటైజేషన్  ప్రకటించి నాసిక్ రైతుల నడ్డి విరిచేశారు. ఆ షాక్ నుండి తేరుకునే సరికి వారికి వారాలు పట్టింది. ప్రధాని విధించిన 50 రోజుల గడువు పూర్తయ్యాక కూడా వారి పరిస్ధితి మెరుగు కాలేదు. కొందరు గడువుకు ముందే వాస్తవంలోకి వచ్చి పంటను పీకివేయడమో, పశువులకు పెట్టడమో చేస్తే ఆలస్యంగా కళ్ళు తెరిచినా వారు ఇక గట్టెక్కే పరిస్ధితి లేదని గ్రహించి తోటి రైతులను అనుసరిస్తున్నారు.

img_0491

డీమానిటైజేషన్ ప్రకటించేనాటికే, అధిక దిగుబడి వలన టమాటో ధరలు గత ఏడు కంటే తక్కువ పలుకుతోంది. నోట్ల రద్దు ప్రకటనతో అవి పూర్తిగా నేలను తాకాయి. ఉదాహరణకి నాసిక్ దగ్గర లోని గిర్నారే మండిలో కిలో తమతో ధర 50 పైసల నుండి రు 2 వరకు మాత్రమే పలుకుతోంది. ఇది ఎంత తక్కువ అంటే ఈ ధరలో రైతుకు రవాణా ఖర్చులు కూడా మిగలవు. రిటైల్ ధర మాత్రం కిలోకు రు 6 నుండి రు 10 వరకు పలుకుతుంది. ఈ తేడా దళారుల పరం అవుతోందని వేరే చెప్పనవసరం లేదు. ఫలితంగా నాసిక్ ప్రాంతం అంతటా రైతులు టమాటోలను రోడ్లపై పారబోశారు; ఉచితంగా పంచారు; పశువుల్ని పొలాల్లో వదిలారు. ఇలా పారబోసిన పంటను పండించటానికి రైతులు ఎకరానికి రు 30000 నుండి లక్ష యాభై వేల వరకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. 

గత ఏడు 20 కిలోలు తూగే టమాటో తట్ట రు 300 నుండి రు 750 వరకు పలికింది. ఈ ధర టమాటో పట్ల రైతులకు ఆసక్తిని పెంచింది. వర్షాలు కూడా బాగా కురిసాయి. ఇక రైతులు రెట్టించిన ఉత్సాహంతో టమాటో వేశారు. వాతావరణం కలిసి వచ్చింది. కీటకాలు కూడా పెద్దగా పట్టలేదు. ఈ నేపథ్యంలో దసరా నాటికి ధరలు లాభకరంగా ఉన్నాయనీ, దీపావళి నాటికి ధర కాస్త తగ్గినా అనుకూలంగానే ఉన్నాయని రైతులు చెప్పారు. తక్కువలో తక్కువ తట్టకు రు 130 కు పలికిందని ఈ ధర నిలబడినా కనీస పెట్టుబడి దక్కి ఉండేదనీ రైతులు చెప్పారు. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత లిక్విడిటీ అందుబాటులో లేకపోవడంతో కొనుగోళ్లు రద్దయిపోయాయి. 

“నవంబరు 11 న కూలిపోయిన ధరలు మళ్ళీ కోలుకోలేదు” అని గిర్నారే రైతులు చెప్పారు. ఆ రోజున ధరలు ఒక్క ఉదుటున తట్టకు రు 10 నుండి రు 40 వరకు మాత్రమే పలికింది. ఇక అక్కడి నుండి తగ్గడమే గానీ పెరిగింది లేదు. గ్రామీణ వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధ మొత్తం డబ్బు ఆధారంగానే జరుగుతుంది. రైతుల మధ్య మార్పిడి జరిగినా, రైతులు – వ్యాపారుల మధ్య జరిగినా, రవాణాదారులు, రిటైలర్లు … ఇలా అందరూ డబ్బుతోనే ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఆ డబ్బు లేకుండా పోవడంతో సరుకు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అది కదిలే మార్గం లేకుండా పోయింది. వ్యాపారులైతే తమ వ్యాపారాన్ని వాయిదా వేసుకోగలరు. ఒక సీజన్ వ్యాపారం లేకపోయినా భరించగలరు. కానీ రైతుల పరిస్ధితి అది కాదు. పంట అమ్మితేనే ఆదాయం వచ్చేది, అప్పులు తీరేది, అవసరాలు గడిచేది. చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు ఇలాంటి నష్టాన్ని భరించడం చాలా కష్టం.  

రైతుల పరిస్ధితి ఇలా ఉన్నా అధికారులు ఉదాసీనంగా ఉండిపోయారు. మార్కెట్ సూత్రాలు వల్లిస్తున్నారు. “ఇది ఫ్రీ మార్కెట్. ప్రతి రోజూ మార్కెట్ వ్యవహారాల్ని ప్రతి రోజూ కనిపెట్టుకుని ఉండలేము” అని నాసిక్ జిల్లా కలెక్టర్ రాధా కృష్ణన్ వ్యాఖ్యానించారు. “పంటల ధరలు అచ్చంగా మార్కెట్ లు నిర్ణయించవలసిందే” అని ఆ కలెక్టర్ చెప్పేసాడు.

రైతుల పరిస్ధితి ఇలా ఉన్నా అధికారులు ఉదాసీనంగా ఉండిపోయారు. మార్కెట్ సూత్రాలు వల్లిస్తున్నారు. “ఇది ఫ్రీ మార్కెట్. ప్రతి రోజూ మార్కెట్ వ్యవహారాల్ని ప్రతి రోజూ కనిపెట్టుకుని ఉండలేము” అని నాసిక్ జిల్లా కలెక్టర్ రాధా కృష్ణన్ వ్యాఖ్యానించారు. “పంటల ధరలు అచ్చంగా మార్కెట్ లు నిర్ణయించవలసిందే” అని ఆ కలెక్టర్ చెప్పేసాడు. 

జిల్లా అధికారే ఇలా చేతులు ఎత్తేస్తే రైతుల్ని ఎవరు ఆదుకోవాలి? “నాకున్న రెండు ఎకరాల్లో రెండు లక్షలు ఖర్చు చేశాను. ఇప్పటి వరకు కేవలం రు 30 వేలు మాత్రమే వచ్చింది” అని ఓ రైతు చెబితే, “నేను ఇప్పటి వరకు 2000 తట్టలు అమ్మాను. అదంతా నష్టానికి అమ్మవలసి వచ్చింది” అని మరో రైతు చెప్పాడు. ఈ రైతులకు పాలకులు జవాబుదారీ వహించరా? 

“ఇదంతా కేవలం నోట్ల వ్యవహారం వల్లనే జరిగింది. కాస్తో కూస్తో డబ్బు చేసుకుందామని అనుకుంటున్న దశలో మోడీ మమ్మల్ని తీవ్రంగా దెబ్బ కొట్టాడు” అని రైతులు ముక్త కంఠంతో చెబుతున్నారు. నష్టాలు రైతులకు కొత్త కాకపోయినా, ఇంత భారీ మొత్తంలో టమాటో పంటను పీకవలసి రావడం, పశువులకు మేపడం, కొట్టివేయడం మాత్రం ఇదే మొదటిసారని రైతులు చెప్పారు. 

రైతుల ఉత్పత్తి ఖర్చు ఒక బుట్టకు రు 90 లు. ఇపుడు వారికీ ముడుతున్నది (మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మితే) బుట్టకు/తట్టకు రు 15 నుండి రు 40 మాత్రమే. దీనిని బట్టి రైతులు ఎదుర్కొంటున్న నష్టం ఏ స్ధాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. 

వాస్తవాలు ఇలా ఉండగా జీడీపీ పడిపోయే సమస్యే లేదని ఆర్ధిక మంత్రి జైట్లీ ఇప్పటికీ చెబుతున్నారు. పన్నుల ఆదాయం అంత పెరిగింది, ఇంత పెరిగింది అని లెక్క చెబుతున్నారు. విచిత్రం ఏమిటి అంటే వ్యవసాయ ఉత్పత్తి అయితే పెరిగింది. లెక్క ప్రకారం ఇది జీడీపీ పెరుగుదలగా నమోదు కావాలి. కానీ డీమానిటైజేషన్ వల్ల వ్యవసాయ ఉత్పత్తి జీడీపీ లెక్కల్లోకి చేరటానికి బదులు రోడ్ల మీదికి చేరుతోంది. ఉత్పత్తి పెరిగినా జీడీపీ లో కలవకుండా ఆటంకపరిచిన ఘనత మొదటిసరిగా నరేంద్ర మోడీ దక్కించుకున్నారు.   

టమాటో గానీ ఇతర పంటలు గానీ అమ్మకం జరిగిన చోట వ్యాపారాలు డబ్బుకు బదులు చెక్కులు ఇస్తున్నారు. ఈ చెక్కులు బ్యాంకుల్లో వేసుకోవలసిందే. బ్యాంకులో వేసాక పెద్ద పెద్ద  క్యూలలో నిలబడి డబ్బు విత్ డ్రా చేసుకోవాలి. అంతసేపు నిలబడినా మొన్నటి వరకు ఇచ్చింది రెండు వేలే. రు 500 నోటు కొత్తది తక్కువే దొరకడంతో ఏది కొనాలన్నా సాధ్యపడలేదు. మరిన్ని సరుకులు కొంటే తప్ప 2000 నోటు మారదు. పెట్రోలు కొందామన్నా కనీసం రు 300 అయినా కొనకుండా నోట్లు మారలేదు. “ఆ పెట్రోల్ తీసుకు రండి. అది తాగి కడుపు నింపుకుందాం” అని ఇంట్లో భార్యలు విరసంగా వ్యాఖ్యానిస్తన్నారని కొందరు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారని స్క్రోల్ పత్రిక తెలిపింది. 

img_0495

ఖరీఫ్ వ్యవసాయం దిగుబడి అమ్మకాలు నష్టపోయాయి. రబి విట్టుబడి పూర్తి కాలేదు. మైక్రో, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల రంగంలో ౬౦ శాతం ఉపాధి రద్దయింది. పనులకు పట్టణాలకు, నగరాలకు వలస వెళ్లిన కార్మికులు, కూలీలు, నిర్మాణ కార్మికులు గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. పెద్ద పరిశ్రమలకు కూడా సరఫరాలు చేసే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడటమో, సిబ్బంది తగ్గించుకోవడమో జరగడం వల్ల ఉత్పత్తి అన్ని చోట్లా తగ్గిపోయింది. ఇంత జరుగుతున్నా వాస్తవాలను చూసేందుకు ప్రధాని, ఆర్ధిక మంత్రి నిరాకరిస్తున్నారు. ‘డీమానిటైజేషన్ విజయవంతం అయింది’ అని సిగ్గు లేకుండా ప్రకటించుకుంటూ తమ భుజాలు తామే చరుచుకుంటున్నారు. 

ఇలాంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుంది? స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాలను నెరవేర్చే సంపన్న వర్గాల ప్రభుత్వం అవుతుంది గాని! 

One thought on “నోట్ల రద్దు: టమాటో పంటను పశువులకు మేపుతున్న రైతులు

  1. ఈ మధ్యనే జాతీయ నేరపరిశోధన విభాగం వారు రైతుల ఆత్మ హత్యలపై నివేదికను విడుదల చేశారు. దాని ప్రకారం రైతులకు సరైన విధంగా రుణాలు లభించక ఎక్కువమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలుస్తుంది.
    మోదీ,నగదును రద్దుచేయడంకూడా పైకోవకే వస్తుంది గనుక ఈ యేడు రైతుల ఆత్మహత్యలకు ప్రధానకారకుడు మోదీనే అవుతాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s