జయలలిత: ఇంకా …లేదు; కానీ పరిస్ధితి క్లిష్టం!


jayalalitha-critical

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయారన్న వార్తలు చెన్నైలో ఉద్రిక్త పరిస్ధితులను సృష్టించాయి. మరణించిన ముఖ్యమంత్రి పట్ల గౌరవ సూచకంగా ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే కేంద్ర కార్యాలయంలో జెండాను అర్ధ అవనతం (half mast) కూడా చేసేశారు. దానితో ఆమె చనిపోయారనే చాలా మంది నిర్ధారించుకున్నారు.

కానీ ఇంతలోనే అపోలో ఆసుపత్రి మరణ వార్తను నిరాకరిస్తూ ప్రకటన జారీ చేసింది. “ముఖ్యమంత్రి లైఫ్ సపోర్ట్ లో కొనసాగుతున్నారు” అని అపోలో డాక్టర్లు ట్వీట్ చేశారు. “అపోలో మరియు ఏమ్స్ లకు చెందిన డాక్టర్ల బృందం పెద్ద సంఖ్యలో ఆమెకు జీవాన్ని సంరక్షించే చర్యలు చేపట్టడంలో నిమగ్నం అయి ఉన్నారు” అని అపోలో హాస్పిటల్స్ పేరుతో గల ట్విట్టర్ పేజీ పేర్కొంది.

అపోలో ప్రకటన అనంతరం ఆమె చనిపోయారని ప్రకటించిన వార్తా చానెళ్లు తమ ప్రకటనను ఉపసంహరించు కుంటున్నట్లు తెలిపాయి. ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే పార్టీ కార్యాలయం తమ జెండాను మళ్ళీ పైకి తీసుకెళ్లి (full mast) ఆగరేశారు. కానీ మరణవార్తను వారికి చేరవేసింది ఎవరు? ఎలాంటి నిర్ధారణ లేకుండానే పార్టీ కార్యాలయం జెండాను దించరు కదా?

ఈ అనుమానాల వల్ల ముఖ్యమంత్రి జయలలిత చనిపోయారన్న వార్తను పలువురు ఖాయం చేస్తున్నారు. నిజానికి ఆమె కొన్ని గంటల క్రితమే చనిపోయారని, ఆమె అభిమానులు హింసకు పాల్పడతారన్న భయంతో మరణవార్తను ప్రకటించలేకపోతున్నారని కొందరు చెబుతున్నారు.

ఒకటి రెండు రోజుల నుండి డి‌ఎం‌కే తదితర పార్టీల నేతల ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్దా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల పారా మిలటరీ బలగాలను సిద్ధం చేశారు. చెన్నైలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను సిద్ధంగా ఉంచారు. అవసరం అయితే అదనపు బలగాలను రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ ఒక అనివార్య పరిస్ధితిని ఎదుర్కోవడానికి జరుగుతున్న ఏర్పాట్లుగా తేలికగానే అర్ధం చేసుకోవచ్చు.

ఏమిటా అనివార్య పరిస్ధితి? అదేమిటన్నదాని పైన లండన్ నుండి వచ్చి జయలలితకు చికిత్స అందజేసిన డాక్టర్ రిచర్డ్ బీలే జారీ చేసిన ప్రకటన కాస్త స్పష్టత ఇస్తున్నది.

“ఆమె ప్రగతి సాధించినప్పటికీ ఆమె అంతర్గత ఆరోగ్య పరిస్ధితి అనివార్యంగా చెప్పేదేమిటంటే మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎప్పుడూ ఉన్నదని” అని రిచర్డ్ ప్రకటన పేర్కొంది. అంటే ఇన్నాళ్లూ చెప్పినట్లుగా లేదా ఈ రోజు ఉదయం ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే పార్టీ ప్రకటించినట్లుగా ఆమె పూర్తిగా కాకపోయినా, తగినంతగా అయినా కోలుకోలేదు. ఐ‌సి‌యూ నుండి స్పెషల్ వార్డ్ లోకి మార్చారన్న వార్త ఎంతవరకు నిజమో తెలియదు గానీ నిన్న సంభవించిన తీవ్ర గుండెపోటు ఆమె ఆరోగ్యం అత్యంత బలహీనంగానే కొనసాగిందని తెలియజేసింది.

రిచర్డ్ ప్రకటన ఇలా తెలిపింది: “నిన్న ఆదివారం మేడం ముఖ్యమంత్రి అకస్మాత్తుగా గుండె పోటుకు గురయ్యారన్న వార్త విని చాలా విచారిస్తున్నాను. అపోలోలో ఆమె పరిస్ధితిని నేను దగ్గరి నుండి పరిశీలిస్తున్నాను. ఇతరులకు మల్లేనే ఆమె కోలుకుంటున్న విధానం పట్ల సంతోషించాను.

“దురదృష్టవశాత్తూ ఆమె సాధించిన ప్రగతి ఏమైనప్పటికీ ఆమె అంతర్గత ఆరోగ్య పరిస్ధితి అనివార్యంగా చెప్పేదేమిటంటే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఎప్పుడూ ఉన్నదని. పరిస్ధితి చాలా తీవ్రంగా (extremely grave) ఉన్నది. అయితే ఈ దిగ్భ్రాంతికర పరిస్ధితి నుండి బ్రతికి బైటపడేందుకు అందుబాటులో ఉన్న అత్యంత మెరుగైన వైద్యం ఆమెకు అనుతున్నదని నేను నిర్ధారించగలను.

“బహుళ శాఖలకు చెందిన అత్యున్నత స్ధాయి నిపుణుల బృందం  ఆమెకు చికిత్స అందిస్తోంది. ఆమె ప్రస్తుతం ఎక్స్ట్రాకార్పోరియల్ లైఫ్ సపోర్ట్ కింద ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత అధునాతమైన మద్దతు ఇదే. అంతర్జాతీయంగా అత్యంత మెరుగైన వైద్య కేంద్రాలు కూడా ఈ పరిస్ధితిలో ఇదే మద్దతును అందిస్తాయి. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం చెన్నై అపోలోలో అందుబాటులో ఉండడాన్ని బట్టి ఈ కేంద్రం ఎంత అత్యున్నత ప్రమాణాలను సాధించిందో తెలియజేస్తుంది. అపోలో మరియు ఏమ్స్ బృందాల నుండి మేడం అత్యున్నత స్ధాయి చికిత్స అందుకుంటున్నారు. ప్రపంచంలో ఏ మెరుగైన కేంద్రంతో పోల్చినా ఇది సమానమే.”

అపోలో, ఎయిమ్స్ నైపుణ్యం సంగతి అలా ఉంచితే ఈ పరిస్ధితిలో ఇంతకు మించి అధునాతన చికిత్స/ మద్దతు లేదని రిచర్డ్ ప్రకటన చెప్పడం ముఖ్యమైన విషయం. ఆయన ప్రకటనలోని ‘ఎక్స్ట్రాకార్పోరియల్ లైఫ్ సపోర్ట్’ అన్నది మరో ముఖ్యాంశం. దీనిని వాస్తవంగా ఎక్స్ట్రాకార్పొరేయల్ మెంబ్రేన్ ఆక్సిజనైజేషన్ (ECMO) అంటారు.

ఎక్స్ట్రాకార్పోరియల్ అంటే శరీరం బైటినుండి అని అర్ధం. ఆక్సిజనైజేషన్ అంటే శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు తాము నిర్వహించవలసిన నిర్వహించలేని పరిస్ధితిని సూచిస్తుంది. గుండె, ఊపిరితిత్తులు చేసే పనులను ECMO పరికరం శరీరం బైటినుండి చేస్తున్నది. ఈ పరికరం శరీరం లోని రక్తాన్ని తొలగించి బైటినుండి రక్తాన్ని సరఫరా (పంపింగ్) చేస్తున్నది. పంపింగ్ కి ముంది ఎర్ర రక్త కణాల్లోకి ఆక్సిజన్ చొప్పించి, కార్బన్ డై ఆక్సైడ్ ను తొలగించి శరీరంలోకి పంపింగ్ చేస్తుంది.

ఇలా ఎందుకంటే ఊపిరితిత్తులు పని చేయడం ఆగిపోయినందున రక్త కణాలకు ఆక్సిజన్ అందదు. గుండె పంపింగ్ ఆగిపోయింది కనుక చెడు రక్తం బైటికి పంపి మంచి రక్తం అవయవాలకు సరఫరా చేసే వ్యవస్ధ ఆగిపోతుంది.  ఈ రెండు పనుల్ని ఇప్పుడు ఈ‌సి‌ఎం‌ఓ చేసిపెడుతోంది.

కానీ ఇన్నాళ్లూ ఆమె ఐ‌సి‌యూలో ఉండగా వివిధ లైఫ్ సపోర్టింగ్ వ్యవస్ధల మీద పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా ఆధారపడుతూ వచ్చారు (గతంలో వచ్చిన వార్తలను బట్టి ఇది చెప్పడం). ఈ ప్రక్రియలో శరీరం లోని అవయవాలు బలహీనపడటం సహజంగా జరుగుతుందని డాక్టర్లు చెబుతారు. అవయవాలు బలహీనపడటం నుండి మరిన్ని కాంప్లికేషన్స్ ఉత్పన్నం అవుతాయి. డాక్టర్ రిచర్డ్ ప్రకటన ఈ సంగతినే చెప్పింది.

ఇప్పుడు పూర్తిగా బైటి పరికరం మీదనే ఆమె ఆధారపడి ఉన్నారు. ఈ‌సి‌ఎం‌ఓ వల్ల 50 నుండి 70 శాతం వరకు రోగి తిరిగి కోలుకొనే అవకాశం ఉన్నదని చికిత్స అనుభవం ద్వారా డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఆమె అవయవాలు ఈ‌సి‌ఎం‌ఓ కు ముందు వరకే బలహీనపడి ఉన్నందున (గుండె పోటు రావడం అందుకే) ఈ‌సి‌ఎం‌ఓ వల్ల కొత్త శక్తిని పుంజుకోవడం అనుమానంగానే కనిపిస్తున్నదని కొందరు డాక్టర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఆమె చనిపోయి ఉంటారని ఈ బ్లాగర్ సంప్రదించిన డాక్టర్లు భావిస్తున్నారు. ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే కార్యాలయం జెండా అర్ధ అవనతం, చానెళ్ల ప్రకటన పరిణామాలు జరగడం, హింస చెలరేగడంతో ‘అబ్బే అదేం లేదు’ అని ఆసుపత్రి ప్రకటించడం బట్టి డాక్టర్ల భావనకు బలం చేకూరుతోంది.

కానీ ఒక వ్యక్తిని కనీసం వివాద రహితంగా, ప్రశాంతంగా చనిపోనివ్వని అభిమానం నిజంగా అభిమానమేనా అని!!!

One thought on “జయలలిత: ఇంకా …లేదు; కానీ పరిస్ధితి క్లిష్టం!

  1. Jayalalitha – One of the Toughest and Beautiful soul ever lived in the past century.
    She has experienced a very wide spectrum of experiences – indigence, Riches, fame, defame, dependent, independent, love, breakups, humiliation, retaliation, position, opposition, Castle, Prison and many more. This is very unusual for anybody, especially for a woman.
    She experienced almost all the emotions that may emanate in human life, in fullest form, both in her reel life and real life.
    Throughout her life she surfed between Himalayan peak and Pacific abyss relentlessly.
    Hope this was her last life, and may her soul unite in paramathma.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s