నోట్ల రద్దు: రాజస్ధాన్ పరిశ్రమలకు 1 లక్ష కోట్లు నష్టం!


que-at-atm

‘పాత నోట్ల రద్దు – కొత్త నోట్లు ఆలస్యం’ వ్యవహారంలో రాజస్ధాన్ పరిశ్రమలకు 1 లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లనున్నదని రాష్ట్రానికి చెందిన పరిశ్రమల సంఘం ప్రకటించింది. ఫెడరేషన్ ఆఫ్ రాజస్ధాన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (Forti) పేర్కొన్నది. రెండు నెలల్లో (నవంబర్, డిసెంబర్) ఈ నష్టం జరుగుతుందని ఫోర్టీ అధ్యక్షుడు అనురాగ్ శర్మ చెప్పారని ద ఎకనమిక్ టైమ్స్ తెలిపింది.

కరెన్సీ సంక్షోభం ప్రతి ఒక్క రంగంలోని పరిశ్రమలనూ దెబ్బ తీసిందని ఫోర్టీ తెలిపింది. రిటైల్ రంగం నుండి నిర్మాణ రంగం వరకూ వివిధ రూపాల్లో లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఫోర్టీ ప్రకటించింది. డిసెంబర్ ఆఖరి లోపు సంక్షోభం సమసిపోతే లక్ష కోట్లకు నష్టం పరిమితం అవుతుంది. మరింత కాలం కొనసాగితే పరిస్ధితి ఏమిటో విశ్లేషకులు ఊహించడానికే భయపడుతున్నారు.

“నల్ల ధనానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానించవలసిందే. కానీ ముందుగా సరైన, తగినన్ని ఏర్పాట్లు చేయకుండానే నిర్ణయం అమలు చేయడం వల్ల పరిశ్రమలు, వాణిజ్యం తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ప్రభుత్వం అనేక చర్యలు ప్రకటించినప్పటికీ అవి ఎంత మాత్రం సరిపోవు. అవసరమైన చర్యలతో పోల్చితే అవి ఏ మూలకూ సరిపోవు” అని పి‌టి‌ఐ తో మాట్లాడుతూ అనురాగ్ శర్మ చెప్పారు.

పరిస్ధితిని మెరుగుపరచడానికి ఏయే చర్యలు తీసుకోవాలో కోరుతూ కొన్ని డిమాండ్లతో తాము ప్రధాన మంత్రికి, రాష్ట్ర గవర్నర్ కళ్యాణ్ సింగ్ ద్వారా వినతి పత్రం ఇచ్చామని ఫోర్టీ అధ్యక్షుడు చెప్పారు. ఆదివారం వినతి పత్రం ఇచ్చామని తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.

మాన్యుఫాక్చరింగ్ రంగం తీవ్రంగా తీవ్రంగా దెబ్బ తిన్నదని ఫోర్టి అధ్యక్షుడు చెప్పడం గమనార్హం. ఈ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతోనే ప్రధాన మంత్రి మేక్ ఇన్ ఇండియా పధకాన్ని ప్రకటించారు. కానీ బ్లాక్ మనీ రద్దు పేరుతో ఆయన తీసుకున్న చర్య ఆ మాన్యుఫాక్చరింగ్ రంగానికే ఎసరు తెస్తున్నది.

“కార్మికులకు, ఇతరులకు చెల్లింపులు చేసేందుకు సరిపోయినంత డబ్బు లేకుండా పోయింది. ఇది ఉత్పత్తి పైన నేరుగా ప్రభావం పడవేస్తున్నది. విత్ డ్రాల్ పరిమితి ఏ మాత్రం సహాయకారిగా లేదు. దాన్ని బాగా పెంచాలి. లేనట్లయితే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పరిశ్రమలు నష్టపోతాయి” అని ఫోర్టి అధ్యక్షుడు చెప్పారు.

పరిస్ధితి ఇలాగే కొనసాగితే దేశ ఆర్ధిక వృద్ధి కూలిపోతుందని వివిధ రేటింగ్ సంస్ధలు ఇప్పటికే ప్రకటించాయి. జి‌డి‌పి వృద్ధి రేటు సగానికి పడిపోతుందని కొన్ని సంస్ధలు చెబుతుంటే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత జి‌డి‌పి విస్తరించడానికి బదులు సంకోచిస్తుందని చెబుతున్నాయి.

ఎలుకలు ఉన్నాయని ఇంటిని తగలబెట్టుకున్నట్లే అవుతుందా అన్నది మునుముందు తెలుస్తుంది. డీమానిటైజేషన్ వల్ల ఏయే ప్రభావాలు కలుగుతాయి అన్న అంశంపై ఇప్పటి వరకు చెబుతున్నవన్నీ అంచనాలు, ఆశలు, ఆందోళనలే తప్ప వాస్తవంగా ఏం జరుగుతున్నదో జనానికి తెలియడం లేదు. బ్యాంకుల ముందు క్యూలు తగ్గిపోయి ఏ‌టి‌ఎం ల ముందు క్యూలు పెరగడం మాత్రం తెలుస్తున్నది.

నవంబర్ 10 తేదీ నుండి 18 తేదీ వరకు బ్యాంకుల్లో 5.44 లక్షల కోట్ల మేర పాత నోట్లు డిపాజిట్ చేశారని ఆర్‌బి‌ఐ అధికారులు ప్రకటించారు. డిపాజిట్లు పెరిగితే వడ్డీ రేట్లు తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వ మంత్రులు, అధికారులు వివిధ సందర్భాల్లో సూచించారు. బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గడమే కాదు, ద్రవ్యోల్బణం కూడా తగ్గి తీరాలి.

14 లక్షల కోట్ల మేరకు ఉన్న పాత 500 మరియు 1000 నోట్లు మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్ అయితే మోడి పధకం ఘోరంగా విఫలం అయినట్లే లెక్క. డిపాజిట్ కి ఇంకా 40 రోజులు మిగిలి ఉన్నాయి. 8 రోజుల్లోనే 5.44 లక్షల కోట్లు డిపాజిట్ అయింది. మిగిలిన 40 రోజుల్లో ఇంకెంత మొత్తం డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మోడి చర్య సాఫల్య వైఫల్యాలను నిర్ధారిస్తుంది.

4 thoughts on “నోట్ల రద్దు: రాజస్ధాన్ పరిశ్రమలకు 1 లక్ష కోట్లు నష్టం!

 1. “14 లక్షల కోట్ల మేరకు ఉన్న పాత 500 మరియు 1000 నోట్లు మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్ అయితే మోడి పధకం ఘోరంగా విఫలం అయినట్లే లెక్క…”

  14 లక్షల కోట్లు డిపాజిట్ అయితే పథకం విఫలం అయినట్టు ఎలా అవుతుంది. డిపజిట్ అయిన మొత్తం డబ్బులో (తెల్ల ధనం లేదా నల్ల ధనం) source చూపించిన ధనం white money అవుతుంది source చూపించలేని ధనం నల్లధనం కింద లెక్కేసి టాక్స్ + 200% penalty లెక్కకట్టీ కేంద్రం ఖజానాలోకి వెల్తుంది కదా..తద్వార కేంద్రానికి పన్నులరూపంలో అధిక ఆదాయం సమకూరి పథకం సక్సెస్స్ అయినట్టే కదా.!
  ఒకవేళ నల్లధనం ఉన్నవారు బ్యాంకుల్లో ఎందుకు వేస్తారు అనుకున్నా, ఆ డబ్బు వారి వద్ధ ఉన్నా కూడా వ్రుదానే కదా.

 2. సతీష్ గారు, నల్ల ధనం డిపాజిట్ చేసి 200% పన్ను కట్టడానికి ఎవరైనా సిద్ధం అవుతారా? 100 కోట్లు నల్ల డబ్బు డిపాజిట్ చేస్తే మరో 200 కోట్లు పెనాల్టీ కట్టాలి. అనగా తెల్ల డబ్బు మరో 200 కోట్లు కట్టాలి. నల్ల డబ్బు కట్టి తెల్ల డబ్బు ని ఎవరు వృధా చేసుకుంటారు? కాబట్టి నల్ల డబ్బు డిపాజిట్ చెయ్యరు.

  మోడి లెక్క ప్రకారం 500/- 1000/- నోట్లలో పెద్ద ఎత్తున నల్ల ధనం ఉందని కదా! పెనాల్టీ భయంతో డిపాజిట్ చెయ్యరు కాబట్టి ఆ నల్ల డబ్బు బ్యాంకులకు రాకూడదు. అయినా బ్యాంకులకు వచ్చింది అంటే అది తెల్ల డబ్బు అని ప్రూవ్ చేసే సాక్షాలు వారి వద్ద ఉన్నట్లే. అప్పుడు మోడి భావించినట్లు 14 లక్షల కోట్ల నోట్ల డబ్బులో నల్ల డబ్బు లేదనీ, ఆ నల్ల డబ్బు ఇంకెక్కడో మరో రూపంలో ఉన్నదనీ అర్ధం. నల్ల డబ్బు ప్రధానంగా రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, బంగారం తదితర లోహాలు, విదేశీ ఖాతాలలో ఉన్నది తప్ప డబ్బు రూపంలో ఉన్నది తక్కువ అని నిపుణులు చెబుతున్నది రుజువు అవుతుంది. నల్ల డబ్బు నోట్ల రూపంలో ఉన్నదని చెప్పిన మోడి లెక్క తప్పు అవుతుంది.

  నల్ల డబ్బు నోట్లను చిత్తుకాగితాలుగా మార్చడం మోడి ప్రకటిత లక్ష్యం. కానీ అదంతా వచ్చి బ్యాంకుల్లో కూర్చొని ‘నేను తెల్ల డబ్బునే’ అని వెక్కిరిస్తే అది మోడి వైఫల్యం అవుతుంది.

 3. పదిహేను రోజులు క్యూలో నిలబడి ఓపిక పడితే భవిష్యత్‌లో ప్రతి భారతీయుని ఖాతాలో పదిహేను లక్షలు పడతాయని నమ్మేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారులే, ఫేస్‌బుక్‌లో.

 4. కార్మికుల్లో చదువురానివాళ్ళకి క్యాషే ఇస్తారు కానీ చెక్కులు ఇవ్వరు. జీతాలు అందలేదని కార్మికులు పని మానేస్తారు, జీతాలు ఇవ్వలేక యజమానులు వాళ్ళని బలవంతం చెయ్యరు. మోదీ వల్ల active labour force ఇంటిలో కూర్చుకుని ఈగలు తోలుకునే పరిస్థితి వచ్చింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s