కొత్త నోట్లు: 2011 లోనే నిర్ణయం -అధికారులు


 

సాధారణ పాలనా ప్రక్రియలో భాగంగా తీసుకునే నిర్ణయాలకు మసాలాలు అద్దడం, అబద్ధాలతో హైప్ సృష్టించడం, దేశానికీ ఎదో ఒరగబెట్టేసినట్లు నానా హంగామా చేయడం, పనిలో పనిగా మోడీ చుట్టూ కృత్రిమ ప్రతిష్టను నిర్మించడం, అవేవి వీలు కాకపొతే బాధితుడి పాత్రలోకి వెళ్ళిపోయి కన్నీళ్లు కార్చి సానుభూతి కోసం ప్రయత్నించడం..! 

రు 500 , రు 1000 నోట్లు రద్దు చేయటం వెనుక లక్ష్యం నల్ల డబ్బుని వెలికి తీయడం అని కదా కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి చెబుతున్నది! ఉగ్రవాదం, నక్సలిజం లను పోషిస్తున్న దొంగ నోట్లు పనికి రాకుండా చేయడం కూడా తమ లక్ష్యమే అని ప్రధాని మోడీ మొదటిసారిగా DD ఛానెల్ లో కనబడి చెప్పారు కదా! కానీ అవేవి నిజం కాదని తాజాగా అధికారులు వెల్లడి చేసిన అంశాలు తెలియజేస్తున్నాయి. 

“కరెన్సీ నోట్లను మార్చే ప్రక్రియ ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నది. 2011 నుండి ఆ నిర్ణయం అమలు కాలేదు. NDA ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చర్చలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ మొత్తం ప్రక్రియ నిర్ణయాత్మకంగా ముందుకు కదలడం అన్నది, ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదంతో, గత మే 2016 నెల నుండి మొదలయింది. కొత్త నోట్ల ముద్రణ రెండు నెలల క్రితమే మొదలు పెట్టాము. కొత్త ప్లేట్లకు అనుగుణంగా యంత్రాలను సవరించడం, భద్రతా లక్షణాలను పొదగడం కారణాల వల్ల, నోట్ల పంపిణిలో రేషనింగ్ విధించవలసి వస్తున్నది” అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. (ద హిందూ) 

పాట నోట్లు చలామణి నుండి తొలగించి కొత్త నోట్లు ప్రవేశపెట్టడం, దొంగ నోట్ల నివారణకు సరికొత్త భద్రతా లక్షణాలను ప్రవేశపెట్టడం… ఈ చర్యలన్నీ ప్రతి దేశంలో జరిగేవే. అంతర్జాతీయ కరెన్సీలుగా చలామణిలో ఉన్న కరెన్సీల (డాలర్, పౌండ్ స్టెర్లింగ్, యూరో, యెన్) విషయంలో తప్ప మిగతా అన్ని కరెన్సీల లోను ఈ చర్యలు సాధారణంగా జరిగేవేనని RBI అధికారులు చెప్పడం గమనార్హం. 

ఈ ప్రక్రియలో భాగంగానే తాజాగా నోట్ల రద్దు జరిగింది తప్ప దాని వెనుక మోడీ, బీజేపీ నేతలు చెప్పుకుంటున్న గొప్ప లక్ష్యాలు ఏవి లేవు. కాకపొతే ఈ సాధారణ ప్రక్రియలో భాగంగా తీసుకోవలసిన చర్య ద్వారా రాజకీయ ప్రయోజనం సాధించవచ్చని మోడీ బృందం కనుగొనడంతోనే జనానికి కష్టాలు వచ్చిపడ్డాయి. నల్ల డబ్బుని విదేశాల నుండి వెనక్కి తెప్పిస్తానని మోడీ చేసిన వాగ్దానం నెరవేరని అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు, విమర్శకులు, కొన్ని వార్త సంస్ధలు పదే పదే ఎత్తి చూపుతున్నాయి. ముఖ్యంగా AAP, అరవింద్ కేజ్రీవాల్ లు ముల్లు గర్రతో పొడుస్తున్నాయి. దానితో ప్రధాని, బీజేపీ లకు ఈ బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. తమ సృజనాత్మకతను తామే అభినందించుకుంటూ అతి పెద్ద నాటకానికి తెర లేపారు.  

అయితే సాధారణంగా చేపట్టే పాలనా చర్యతో పటు ఈసారి నోట్ల మార్పిడికి ఒక ప్రత్యేకమైన, ముఖ్యమైన లక్ష్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నది. ఈ లక్ష్యం ఏమిటో ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. ఇండియాలో ఒకటో రెండో పత్రికలు తప్ప ఈ లక్ష్యం పైన దృష్టి పెట్టలేదు. కానీ దాదాపు విదేశీ వాణిజ్య పత్రికలు అన్నీ దానిని హైలైట్ చేస్తూ విశ్లేషణలు ప్రచురించాయి. 

ఆ లక్ష్యం ఏమిటంటే భారత దేశంలో కొనుగోళ్లు, చెల్లింపులను డబ్బు రూపంలో నుండి ఎలక్ట్రానిక్ రూపం లోకి పెద్ద ఎత్తున తరలించడం. బీజేపీ మాజీ నేత, NDA -1 ప్రభుత్వం లో డిజిన్వెస్టుమెంట్ మంత్రిగా పని చేసిన అరుణ్ శౌరి NDTV 24×7 ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా చెప్పారు: “ఇది నల్ల ధనంపై చేసిన సర్జికల్ స్ట్రైక్ కాదు. చెల్లింపులలో 95% వరకు జరుగుతున్న డబ్బు చెల్లింపులపై (cash transactions) చేసిన సర్జికల్ స్ట్రైక్. దీని ద్వారా ఒకే ఒక వ్యక్తి చుట్టూ హైప్ సృష్టించి ఎన్నికల్లో లబ్ది పొందే లక్ష్యం కూడా దీని వెనుక ఉన్నది.”

ఎలక్ట్రానిక్ రూపం అంటే ఏమిటో చెప్పనవసరం లేదు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, రూపే, UPI మొదలైన చెల్లింపు వ్యవస్ధలను ప్రవేశపెట్టినప్పటికీ దేశంలో జనం చాల తక్కువ మంది మాత్రమే అటు వైపు మళ్లారు. ఉద్యోగులు అనేక మంది కూడా ఎటిఎం లలో డబ్బులు డ్రా చేసి చెల్లించేందుకు చూపుతున్న ఆసక్తి మొబైల్, ఇంటర్నెట్ తదితర మాధ్యమాల ద్వారా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లను ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. నిజానికి చదువుకున్న వారికీ కూడా ఎలక్ట్రానిక్ వ్యవస్ధలు పెద్దగా అర్ధం కాలేదు. పాస్ వర్డ్ లు, ఓటీపీ, ఈ మెయిల్ తదితర సామాన్య సౌకర్యాలు కూడా వారికి అలవాటు కాలేదు.

డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగించాలంటే వివిధ భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పాస్ వర్డ్ లు గుర్తు పెట్టుకోవాలి. ఫోన్ నెంబర్లు బ్యాంకులకు ఇవ్వాలి. డేటా బ్యాలన్స్ కోసం డబ్బు చెల్లించాలి. అందు కోసం ప్రత్యేకంగా రిలయన్స్, ఎయిర్ టెల్, టాటా డొకోమో, ఐడియా లాంటి వెండర్ల వద్దకు వెళ్ళాలి. తీరా చెల్లింపులు చేయబోయే సమయానికి పేమెంట్ లు సరిగ్గా ముందుకు సాగక పోవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోతె కష్టపడి జాగ్రత్తగా మొదలు పెట్టిన చెల్లింపుల ప్రక్రియ చివరి నిమిషంలో ఆగిపోతుంది. అక్కడి నుండి బ్రౌజర్ లో వెనక్కి వెళ్లలేము. మళ్ళీ మొదటి నుండి  మొత్తం ప్రక్రియను ప్రారంభించాలి. ఇది ఓ పక్క వినియోగదారుడికి అసహనం కలిగిస్తుండగా కంపెనీల అమ్మకాలు రద్దవుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్లు చివరి నిమిషంలో రద్దయి కొనుగోళ్లు ఆగిపోతున్న కేసులు 20% వరకు ఉన్నాయి. 

అది కాక డబ్బు ఒకరి ఖాతా నుండి వేరొకరి ఖాతాకు మార్చాలంటే ఖాతా సంఖ్యతో పాటు ఇతర వివరాలు (పేరు, IFSC కోడ్, బ్యాంక్ బ్రాంచి కోడ్) కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మొదట అవతలి ఖాతా వివరాలు రిజిస్టర్ చేస్తేనే డబ్బు మార్పిడి జరుగుతుంది. SBI బ్యాంకు ఈ విధంగా వివరాల చేర్పుకు తేలికగా అంగీకరించదు. మొదట ఇంటర్నెట్ లో వివరాలు ఇవ్వాలి. ఆ వివరాలతో ఒక అప్లికేషన్ ఆన్ లైన్ లో జనరేట్ అవుతుంది. దానిపైన సంతకం చేసి దానిని మళ్ళీ బ్రాంచి కార్యాలయానికి వెళ్లి సమర్పించాలి. వాళ్ళు ఆన్ లైన్ లో ఆమోదిస్తేనే ఒక ఖాతాకు మనం మన SBI ఖాతా నుండి ఇతరుల ఖాతాకు డబ్బుని పంపలేము. ఈ వివరాలు చాల మందికి తెలియవు. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. అందులో ఇమిడి ఉండే క్లిష్ట ప్రక్రియలను అనుసరించడం అనేక మందికి ఇష్టం ఉండదు కూడా. అందువల్ల వారికీ డబ్బుతో వ్యవహారమే తేలిక అవుతుంది. 

ఈ నేపధ్యంలో మోడీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ట్రాన్సక్షన్స్ కోసం కొన్ని కొత్త సౌకర్యాలను ప్రవేశపెట్టింది. రూపే (RuPay) పేరుతో అన్ని బ్యాంకులకు పనికి వచ్చే విధంగా ఒక వ్యవస్ధను ఏర్పరిచింది. అలాగే UPI (యూనివర్సల్ పేమెంట్ ఇంటర్ పేస్) పేరుతో అప్లికేషన్ రూపొందించి యాండ్రాయిడ్, యాపిల్ తదితర ఫోన్లకు అందుబాటులోకి తెచ్చారు. ఈ అప్లికేషన్ లక్ష్యం ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ లలోని సంక్లిష్టతలను తొలగించి మరింత సులభతరం చేయటం. బ్యాంకులతో పాటు వివిధ ప్రయివేటు యాప్ డవలపర్లు కూడా అప్లికేషన్లు తయారు చేసి అందుబాటులో ఉంచారు. అయినా గాని ఎలక్ట్రానిక్స్ ట్రాన్సాక్షన్స్ సంఖ్యలో ఏ మాత్రం మెరుగుదల లేదు. 

ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్లు  విదేశీ ఫైనాన్స్ కంపెనీలకు, స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు, ఆన్ లైన్ రిటైల్ కామర్స్ సంస్ధలకు చాలా అవసరం. ఎంత ఎక్కువ మంది ఆన్ లైన్ కార్యకలాపాలకు అలవాటు పడితే వాటికి అమ్మకాలకు అంత ఎక్కువ పెరుగుతాయి; అన్ని లాభాలు పెరుగుతాయి. భారతీయుల చేత ఆన్ లైన్  కొనుగోళ్లు, మార్కెటింగ్ అలవాటు చేయించాలని కార్పొరేట్ కంపెనీలతో పాటు మన ప్రభుత్వాలు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకోసమే వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల్లోనూ, వ్యవస్ధల్లోనూ కంప్యూటరీకరణను పని గట్టుకుని ప్రోత్సహించాయి. వేగవంతం చేయించాయి. 

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు  విదేశీ కంపెనీలకు ఎలా లాభకరం? అనేక విధాలుగా లాభకరం. ముఖ్యమైనది కొనుగోలుదారుల కొనుగోలు అలవాట్లను ట్రాక్ చేసి వాటిని తమకు అనుకూలంగా ప్రభావితం చేయటం. గమనిస్తే గూగుల్, మైక్రో సాఫ్ట్, యాహూ లాంటి బడా ఐటీ కంపెనీలతో పాటు సాధారణ యాండ్రాయిడ్, యాపిల్ అప్లికేషన్ల డవలపర్లు కుడా వినియోగదారుల ఫోన్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు, వారి మిత్రుల ఫోన్ నెంబర్ తదితర వివరాలు, కుటుంబ వివరాలు, లొకేషన్ … లాంటి అనేక వివరాలను సేకరిస్తామని అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. 

అప్లికేషన్ ని వినియోగించుకోవడానికి మనం త్వరపడతాం గనుక మనం వాటన్నింటికీ ఎస్, ప్రొసీడ్, సబ్మిట్ తదితర బటన్లను నొక్కి అనుమతి ఇచ్ఛేస్తాం. ఆ అనుమతితో మొబైల్, ఇంటర్నెట్ వినియోగదారుల సమస్త సమాచారాన్ని సేకరించి నిల్వ చేసుకుంటాయి. మొబైల్, కంప్యూటర్ల లో మనం చేసే సమస్త కార్యకలాపాలను రికార్డు చేస్తాయి. తద్వారా మన కొనుగోళ్ల అలవాట్లు, ఇతర హాబీలు, బ్యాంకు బ్యాలన్స్ లు, మనీ ట్రాన్సాక్షన్లు తదితర వివరాలతో ఒక్కొక్కరికి ప్రొఫైల్స్ తయారు చేసి పెట్టుకుంటాయి. ఆ ప్రొఫైల్స్ లోని వివరాలను బట్టి టార్గెట్ అడ్వర్టైజింగ్ చేస్తాయి. ఈ తరహా అడ్వర్టైసింగ్ కంపెనీలకు మరిన్ని లాభాలు కురిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో భారతీయులకు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు అలవాటు చేయాలని బహుళజాతి కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి. కానీ మన పాలకులు జనాన్ని ఒత్తిడి చేయలేరు కదా. ఈ పరిస్ధితి నుండి మోడీ ప్రభుత్వం ‘బ్లాక్ మనీ, టెర్రరిజం’ లను అడ్డం పెట్టుకుని కరెన్సీలో 86% రద్దు చేసేసారు. ప్రజలకు కలిగే ఇబ్బందుల వల్ల వారిలో వ్యతిరేకత వస్తుంది గనుక ఆ వ్యతిరేకతను ‘బ్లాక్ మనీ రద్దు’ వాదనతో న్యూట్రలైజ్ చేసుకోవచ్చని భావించారు. అందుకే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మంత్రులు తొణకడం లేదు. 

సామాన్యులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మధ్య తరగతి ప్రజలు కొందరు మోడీ చర్యను అభినందించడం బట్టి ఆయన వాదన ఎంతోకొంత పని చేస్తున్నదని భావించవచ్చు. అయితే పైకి అభినందిస్తున్నా డబ్బు నిల్వ పెట్టుకున్నవారు లోలోపల తిట్టుకోవడం లేదని చెప్పలేము.

7 thoughts on “కొత్త నోట్లు: 2011 లోనే నిర్ణయం -అధికారులు

  1. Peculiar, completely baised review . irresponsible presentation. We admit that this is your blog you have enough freedom say what ever you feel like . But this is not expected from people like you.

    Dear Sekhar Garu. Please present the other side of the coin. At least bloggers like you continue you standards. Accept this challenge please present the use of going more cashless economy.

  2. బ్లాక్ మనీలో రెండు రకాలు ఉంటాయి. అవి active black money & static black money. వస్తువులు కొనడానికో, స్థిరాస్తులు కొనడానికో ఖర్చైపోయి మార్కెట్‌లో సర్క్యులేషన్‌లో ఉన్న బ్లాక్ మనీని active black money అంటారు. ఇంటిలోని లాకర్‌లో దాచుకునేది static black money. ఇంటి లాకర్‌లో బ్లాక్ మనీ దాచుకునేంత తెలివి తక్కువవాళ్ళు ఎంత మంది ఉంటారు అనేదే ఇక్కడ సందేహం. Active black moneyని జప్తు చేసే స్థిరాస్తి ధరలు పడిపోతాయి. అప్పుడు స్థలాలు అమ్ముకోవాలనుకునే మధ్యతరగతివాళ్ళు కూడా ఏడుస్తారు. నాకైతే ఆస్తులు అమ్ముకునే ఉద్దేశం లేదు కానీ కొండని తవ్వి ఎలుకని పట్టే నాటకం ఆడుతున్న భాజపా మీద అసహ్యం కలుగుతోంది.

  3. I am not against to the current government’s move on curbing the black money in the economy. In fact i really appreciate our beloved PM’s stance so as to eliminate the parallel economy. But, i have one doubt here. I hope this forum gives me some solution to my question.My question is as follows:
    If the policy is really effective why the government is not able to list out the candidates who possess the unaccounted(non taxable) money till this day? It has been more than two weeks since the policy implementation. Still why no information with regard to the holders of black money.

  4. ఈ వత్తిడి తగ్గాక వినియోగ దారులు మళ్ళీ మామూలైపోతారు కదా.
    డిజిటల్ వాడకం లో మీరు చెప్పిన ఇబ్బందులన్నిటినీ స్వయంగా అనుభవించాను గనుక నేనేనాటికీ కాష్ పద్ధతినే ప్రిఫర్ చేస్తాను, నా వంటి వారే మెజారిటీ జనాలైతే … కార్డులను మునుపటి కంటే ఎక్కువగా వాడరు అనుకుంటున్నాను.
    లేక కాష్ వాడకానికి ఈ లోగానే దారులు మూసేస్తారా మన మోడీ గారు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s