తదుపరి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య మొదటి చర్చ అమెరికాలో ప్రారంభం అయింది. అమెరికా ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగబోయే లోపు అధ్యక్ష పదవికి పోటీ లో ఉన్న అభ్యర్థులు బహిరంగ చర్చ (డిబేట్) లో మూడు సార్లు పాల్గొనవలసి ఉంటుంది.
ఈ చర్చలలో అభ్యర్థులు తమ ఆర్ధిక, రాజకీయ, విదేశాంగ విధానాలతో పాటు దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తాము ఎలా పరిష్కరిస్తామో ప్రజలకు వివరించి చెప్పవలసి ఉంటుంది. మూడు ప్రసంగాలలో అభ్యర్థుల ప్రదర్శనను బట్టి ఓటర్లు, ముఖ్యంగా ఎవరికీ ఓటు వేయాలో ఇంకా నిర్ధారించుకొని ఓటర్లు ఒక నిర్ణయానికి రావటంతో లేదా అనేక మంది ఓటర్లు తమ ఎంపికను మార్చుకోవడంలో జరుగుతూ ఉంటుంది.
అధ్యక్ష ఎన్నికలకు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుండి రష్యా పట్ల స్నేహ భావాన్ని ప్రకటిస్తున్న డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు కొద్దీ సేపటి క్రితం ప్రారంభం అయిన డిబేట్ లో పాల్గొంటూ మరోసారి రష్యాతో సంబంధాలు మెరుగు పరుచుకుంటానని హామీ ఇచ్చాడు. అంతే కాకుండా అమెరికా ఇక ఎంతమాత్రం ప్రపంచ పోలీసుగా పని చేయడం సాధ్యం సాధ్యం కాదని స్పష్టం చేసాడు.
లాంగ్ ఐల్యాండ్ లోని హాఫ్స్టర్ యూనివర్సిటీలో జరుగుతున్న డిబేట్ ను మొదట ట్రంప్ ప్రారంభించినట్లు తెలుస్తున్నది. “మనం ఇక ప్రపంచ పోలీసుగా ఎంత మాత్రం వ్యవహరించ లేము” అని ట్రంప్ డిబేట్ ప్రారంభిస్తూ అన్నాడని పత్రికలు తెలిపాయి.
గత ఏప్రిల్ నెలలో సైతం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థి ఇవే తరహా వ్యాఖ్యలు చేసాడు. “రష్యాతో తగవు పడటం అమెరికాకు ఇక ఎంత మాత్రం క్షేమకరం కాదు. రష్యాతో సంబంధాలు మెరుగుపరిచేందుకు గట్టి కృషి చేస్తాను” అని పలు మార్లు వ్యాఖ్యానించాడు. తాజా డిబేట్ లో కూడా ఆయన ఆ మాటలను పునరుల్లేఖించాడు.