ఆయన జర్మనీ దేశస్ధుడే. వయసు 58 యేళ్ళు, ఉద్యోగం ఇమిగ్రేషన్ ఆఫీస్ లో. తన ఉద్యోగం ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను ఒక (పేరు వెల్లడి కాని) భారత ప్రభుత్వ గూఢచార సంస్ధ కోసం గూఢచర్యం చేస్తూ పట్టుబడిపోయాడు.
విదేశీ గూఢచార సంస్ధల తరపున లేదా ఆ సంస్ధల కోసం గూఢచర్యం చేయడం జర్మనీలో నేరం. ఒక్క జర్మనీలోనే కాదు, ఏ దేశంలోనైనా అది నేరమే. జర్మనీలో అలాంటి వారికి కనీసం 10 యేళ్ళు జైలు శిక్ష వేస్తారు. ఇప్పుడాయనకు జైలు శిక్ష కోసం రిమాండ్ ఖైదీగా ఎదురు చూడటమే మిగిలింది.
ఆయన పేరుని, జర్మనీ చట్టాల ప్రకారం, పూర్తిగా వెల్లడి చేయలేదు. పొడి అక్షరాలలో టిఎస్‌పి అని మాత్రమే గుర్తించారు. ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ లో కూర్చొని జర్మనీలోని సిక్కుల వివరాలను భారత గూఢచార సంస్ధకు అందించే పనిలో ఉండగా జర్మనీ అధికారులకు దొరికిపోయాడు.
ఒకే సారి ఒకే మొత్తంలో వివరాలు అందించడం కాదు. కొంత కాలంగా ఆయన అదే పనిలో ఉన్నాడు. “గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతూ 45 కేసుల్లో ఉద్యోగ రహస్యాలను కాపాడే సూత్రాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడ్డాడు” అని స్ధానిక రాష్ట్ర (నార్త్ రైన్-వెస్ట్ ఫాలియా) పోలీసులు నేరారోపణ చేశారు.
అనగా కనీసం 45 మంది సిక్కుల వివరాలను ఆయన భారత గూఢచార సంస్ధకు అందించాడని భావించవచ్చు. జర్మనీకి వచ్చి పోయే విదేశీయుల వివరాలను ఇమిగ్రేషన్ ఆఫీసులు నమోదు చేస్తాయి. అందులో భాగంగా జర్మనీ వచ్చి పోయే సిక్కుల వివరాలు కూడా నమోదు చేసింది.
టిఎస్‌పి అనే వ్యక్తి తాను పని చేసే కార్యాలయంలో ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని ఇమిగ్రేషన్ రికార్డులకు ప్రవేశం సంపాదించి సిక్కుల వివరాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆ సిక్కులు తీవ్రవాదులు అనీ, సిక్కు మతంలో ప్రతిపక్ష గ్రూపులకు చెందిన సభ్యులు అనీ అనుమానంతో భారత గూఢచార సంస్ధ వారి వివరాలను చట్ట విరుద్ధంగా సంపాదించడానికి పూనుకుంది.
టిఎస్‌పి ని గత ఫిబ్రవరి 17 తేదీన అరెస్టు చేశారు. అప్పటి నుండీ ఆయన ఖైదులోనే ఉన్నాడు. సెప్టెంబర్ 7 తేదీన మాత్రమే ప్రాసిక్యూటర్లు ఆయనపైన అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. దానికి సంబంధించిన ప్రకటనను మాత్రం ఈ రోజే విడుదల చేశారు.
విదేశాల్లో గూఢచర్యం జరిపించడం ఏ దేశమైనా చేసే పనే. ఆ గూఢచర్యం తన రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల కోసం చేస్తే ఒక అందం. కానీ భారత గూఢచార సంస్ధ విదేశాల్లోని భారతీయులపైన గూఢచర్యం చేయాలని విదేశీ ఉద్యోగులను మాట్లాడు కోవడమే పరమ కంపరంగా ఉన్నది.
ఇండియాకు సంబంధించిన ఏ గూఢచార సంస్ధ ఈ చర్యకు పాల్పడిందీ జర్మనీ వెల్లడి చేయకపోవడం కొంతలో కొంత నయం. ఆ మేరకు, అవసరం అయితే ఇండియాను సాధించేందుకు ఒక అవకాశాన్ని జర్మనీ అట్టి పెట్టుకుంది. విదేశీ గూఢచర్యానికి సాధారణంగా రా (Research & Analysis Wing) యే పాల్పడుతుంది. అయితే అది మిలట్రీ గూఢచార సంస్ధ. ఇలాంటి పనులకు వేరే ఏదన్నా సంస్ధ ఉన్నదేమో తెలియాల్సి ఉంది.
RAW is the only Indian intelligence agency which deals with external affairs. Internal affairs (such as Maoists) are dealt by NIA.