గౌనులు ధరించొద్దు -విదేశీ టూరిస్టులకు మంత్రి సలహా


 
ఈ సారి ఏకంగా కేంద్ర మంత్రివర్యులు సాంస్కృతిక పరిరక్షక సేనాధిపతి అవతారం ఎత్తారు. కేంద్ర మంత్రిని గనుక విదేశీయులకు కూడా సాంస్కృతిక పాఠాలు చెప్పే అర్హత, అధికారం తనకు ఉంటుంది అనుకున్నారో ఏమో గాని విదేశీ టూరిస్టులకు వస్త్ర దారుణ విషయమై హెచ్చరికలు చేసేందుకు సిద్ధపడ్డారు. భారత దేశంలోని యాత్రా స్ధలాలను చూసేందుకు వచ్చే విదేశీ మహిళలు గౌనులు ధరించడం మానుకోవాలని ఉపదేశం దేశారు.
భారత దేశ పౌరులకు సంస్కృతీ పాఠాలు నేర్పే కర్తవ్యాన్ని హిందుత్వ మూకలకు అప్పజెప్పి విదేశీ టూరిస్టులకు పాఠాలు నేర్పే కర్తవ్యాన్ని కేంద్ర మంత్రి తన భుజం పైన వేసుకున్నారన్నమాట! ఇంతకీ ఆయన ఉపదేశానికి కారణం ఏమిటి అంటే ఇటీవలి కాలంలో విదేశీ మహిళా టూరిస్టుల పైన వరస పెట్టి అత్యాచారాలు జరగడం. ఈ అత్యాచారాల పైన పోలీసులు విచారణ పూర్తి చేయడం, ఒకటి రెండు కేసుల్లో కోర్టులు శిక్షలు వేయడమూ జరిగింది.
కేంద్ర టూరిజం శాఖ మంత్రి మహేష్ శర్మ తాజా సంస్కృతీ పరిరక్షణ లో పాలు పంచుకున్నారు. “విదేశీ మహిళా టూరిస్టులు స్కర్టులు ఇతర పొట్టి డ్రస్సులు ధరించ కూడదు. ఆగ్రా లాంటి చోట్ల రాత్రి పూట పొట్టి డ్రస్ లు వేయరాదు. రాత్రి వేళల్లో ఒంటరిగా బైట తిరగడం మానుకోవాలి” అని ఆయన ఆదివారం విదేశీ టూరిస్టులకు హిత బోధ చేశారు. 
తన హిత బోధ విదేశీ మహిళల మేలు కోసమేనని కేంద్ర మంత్రి నమ్మబలికారు. “నేను చెబుతున్నది వారి మేలు కోసమే. వారి భద్రత కోసమే విదేశీ మహిళా టూరిస్టులు రాత్రి వేళా స్కర్టులు, పొట్టి డ్రస్సులు వేయొద్దని సూచిస్తున్నాను” అని ఆగ్రాలో జరిగిన విలేఖరుల సమావేశంలో తనను మల్లి వివరించమని అడిగిన విలేఖరులకు సమాధానం ఇస్తూ  చెప్పారు. 
మంత్రి గారి మాటల్లో రహస్యాలు ఏమి లేవు. ఆయన హెచ్చరికల సారాంశం ఆ పాత చింత కాయ పచ్చడే. 
 

“మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వాటికి పాల్పడే పురుషుల వల్ల జరిగేవి కావు. ఆడవాళ్లు తమ సంస్కృతీ ఏమిటో మర్చిపోయి గౌనులు, స్కర్టులు, ఇతర పొట్టి డ్రస్ లు వేసుకుని రాత్రి వేళల్లో విధుల్లోకి రావడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయి. విదేశీ మహిళలకి పొట్టి డ్రస్ లు వేసుకోవడం అలవాటు. ఆ అలవాటేమో ఇండియాలో లేదాయె. దానితో భారత పురుషులు ఆవేశపడిపోయి, తట్టుకోలేక విదేశీ మహిళల పైన అత్యాచారాలు చేసేస్తున్నారు. అసలు అక్కడి వరకు రానివ్వడం ఎందుకు? ఆడవాళ్లే ముందు జాగ్రత్తగా శరీరం అంతా కప్పుకుని బైటికి వస్తే సరిపోతుంది. అత్యాచారాల నుండి తప్పించుకోవచ్చూ; ఆనక ఫిర్యాదులు, విచారణ గట్రా బాధలు తప్పించుకోవచ్చు.” 

కాస్త అటు ఇటుగా మంత్రిగారి చెప్పదలుచుకున్నది ఇదే. 
మంత్రి గారు ఎదో యధాలాపంగా, నోరు జారి, గతంలో జరిగిన గొడవలు తెలియక ఈ మాటలు అని ఉంటారని ఎవరైనా భావిస్తే వారు తప్పులో కాలేసినట్లే. ఆయన ఒక అవగాహన తోనే ఈ మాటలు చెప్పారు. తన మాటల్ని ప్రభుత్వ తరపున ఒక అడ్వైజరీ రూపంలో జారి చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు.
“టూరిస్టులు వఛ్చినపుడు విమానాశ్రయంలో వారికి ఒక ‘వెల్కమ్ కిట్’ ఇస్తాం. ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదో తెలిపే సూచనలతో కూడిన కార్డు  అందులో ఉంటుంది. భారతీయ సంస్కృతికి, పశ్చిమ దేశాల సంస్కృతికి తేడాలు ఉన్నాయి. పశ్చిమ సంస్కృతితో పోల్చితే భారతీయ సంస్కృతి విభిన్నం కనుక ప్రభుత్వం తరపున అడ్వైజరీ ఇస్తున్నాం” అని మంత్రి మహేష్ శర్మ ప్రకటించారు.
పశ్చిమ సంస్కృతీ చెడ్డదని తన ఉద్దేశం కాదని కూడా మహేష్ శర్మ వివరణ ఇచ్చుకున్నారు. “పశ్చిమ సంస్కృతిని చెడ్డదని నేను చెప్పడం లేదు. రెండు సంస్కృతుల మధ్యా తేడా చెబుతున్నానంతే” అని శర్మ గారు వివరించారు. మంత్రిగారి ఉద్దేశంలో భారతీయ మహిళలు, అమ్మాయిలూ, యువతులు ఎవరూ స్కర్ట్ లు, గౌనులు, ఇతర పొట్టి డ్రస్ లు వేయరన్న మాట! మనవాళ్ళు వేసేది పొట్టి డ్రస్ లు కాకపొతే ఇంకేవి పొట్టి డ్రస్ లు అవుతాయో మరి! ఆ వైపు ఆలోచించడానికే వణుకు పుడుతొంది.
విదేశీయులు ధరించే పొట్టి డ్రస్ ల వల్ల మన పుణ్య స్ధలాలు ఏమై పోతాయో అన్న ఆందోళన కూడా మంత్రిగారిని పట్టుకుంది. దేవాలయాలతో నిండిన టూరిస్టు నగరాలలో పవిత్ర వాతావరణం పొట్టి డ్రస్ ల వల్ల కలుషితం అవుతుందని ఆయన భయం వ్యక్తం చేశారు. “ఆగ్రా, మధుర, బృందావన్ మొదలైన ఆలయ నగరాలకు సంబంధించిన సున్నితత్వాల గురించి విదేశీ టూరిస్టులు తెలుసుకుని మసలుకోవాలి… ఇండియా ఒక సాంస్కృతిక దేశం. దేవాలయాల్లో మాకు విభిన్నమైన డ్రస్ కోడ్ ఉంటుంది. దయ చేసి దానిని దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా దుస్తులు ధరించండి” అని ఆయన ఆదేశపూరిత సలహా పడేశారు.
ఈ తరహా సలహాలు ఇవ్వడం, వ్యాఖ్యలు చేయడం మంత్రి మహేష్ శర్మ గారికి కొత్త కాదు. పోయిన సంవత్సరం ఆయన “రాత్రిళ్ళు బైటకి వఛ్చి ఎంజాయ్ చేయాలని భావించే మహిళలకు ఇండియాలో స్ధానం లేదు” అని ప్రకటించి వివాదంలో చిక్కుకున్నారు. ఆ వివాదం ఆయనకి ఏ మాత్రం పాఠం నేర్పలేదని తాజా వ్యాఖ్యలు చెబుతున్నాయి.
విదేశీ మహిళలపై అత్యారాచారాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి కేంద్ర టూరిజం శాఖ ఏ చర్యలు తీసుకుంటున్నది అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు మంత్రి గారు ఇంతా చెప్పారు.
నిజానికి ఇవన్నీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావు. తప్పించుకునేందుకు చెబుతున్న మాటలు. నేరాన్ని బాధితుల పైకే నెట్టివేసే మనస్తత్వం. మహిళల పట్ల ఈ సో కాల్డ్ భారతీయ సంస్కృతీ పరిరక్షకులకు ఉన్న తిరస్కార, ఆధిపత్య పూరిత, పురుషాధిక్య స్వభావాన్ని మహేష్ శర్మ మరోసారి ధ్రువపరిచారు.
ఏమి చర్యలు తీసుకుంటున్నారు అని అడిగినప్పుడు ఎవరైనా కనీసం ఏమి సమాధానం ఆశిస్తారు? పోలీసుల సంఖ్యను పెంచుతున్నాం అనో, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫలానా ఆదేశాలు ఇస్తున్నాం అనో లేదా ఏవో కొన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామనో చెబుతారని ఆశిస్తారు. కానీ కేంద్ర మంత్రి అలాంటి మాట ఒక్కటి చెప్పకపోవడం బట్టే అత్యాచారాలపై వారికి ఉన్న వెనుకబాటు అవగాహన ఏమిటో అర్ధం అవుతొంది.
మంత్రి గారి వ్యాఖ్యలను పలువురు విమర్శించారు. ట్విట్టర్ లాంటి సైట్లలో అనేక మంది నిరసన, ఆగ్రహాలు ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు మంత్రి వ్యాఖ్యలను తూర్పారబట్టారు. దానితో ఆయన తన ఉద్దేశం అది కాదని, ఇది అంటూ మళ్ళీ అదే తరహా సలహాలు ఇచ్చారు.
విచిత్రం ఏమిటంటే ఒళ్ళంతా కప్పుకునే ముస్లిం మహిళలని  కూడా ఈ సంస్కృతీ పరిరక్షకులు తప్పు పట్టడం. కాలేజీల్లో హిజాబ్, బురఖా ధరించే ముస్లిం యువతులు, అమ్మాయిలని తమ డ్రస్ మార్చుకోవాలని హెచ్చరిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఇండియాలోనూ పెరిగాయి. మాములుగా ఇలాంటివి పశ్చిమ దేశాల్లో జరిగేవి, ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండియాలో కూడా ఇవి జరుగుతున్నాయి. ఎలక తోక పట్టి గోదారి ఈదినా నలుపు నలుపే గాని తెలుపు అగునా అని పెద్దలు ఊరికే అన్నారా?
ఒళ్ళంతా కప్పుకోవడం మహిళలకు గౌరవనీయం అయ్యే పనైతే వీళ్ళు ముస్లిం మహిళల పట్ల గౌరవం ప్రకటించాలి. దానికి బదులు వారిని కూడా తప్పు పట్టడం, బురఖా వేస్తె సస్పెండ్ చేయడం ఎలా అర్ధం చేసుకోవాలి? ఈ సంస్కృతీ కాపలాదారులకు కావలసింది సంస్కృతీ కాదు, మహిళల గౌరవము కాదు. ఎదో ఒక పేరుతొ ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడమే వారికి కావాలి. అవతలి మతం వాళ్ళు తప్పని, మన మతం వాళ్ళు ఉన్నతులని అవసరం లేని భావోద్వేగాలను సృష్టించాలి. అవి భంగం అవుతున్నాయని జనాన్ని రెచ్చగొట్టాలి. తద్వారా తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలి. 

4 thoughts on “గౌనులు ధరించొద్దు -విదేశీ టూరిస్టులకు మంత్రి సలహా

  1. వీళ్ళ ఆగడాలుచూస్తూంటే దేవాలయాలపైనున్న బూతుబొమ్మలనూ,అజంతా,ఎల్లోరా వంటి ఎంతో ప్రసిద్ధిగాంచిన శిల్పకళనుకూడా వదిలేటట్టులేరు!

  2. మా తమ్ముడు కొంత కాలం ఫిన్లాండ్‌లో ఉన్నాడు. అక్కడ రోడ్ మీద ఒకరిద్దరు పోలీసులు మాత్రమే కనిపిస్తారు. అయినా అక్కడ నేరాల సంఖ్య చాలా తక్కువ. మన దేశంలో రోడ్ మీద రక్షక్ వాహనాలు కనిపించినా, విదేశీ పర్యాటకులపై కూడా రేప్‌లు జరుగుతున్నాయంటే దాని అర్థం ఏమిటి? పోలీసులకి లక్ష రూపాయలు ఇస్తే మర్డర్ కేసు, యాబహి వేలు ఇస్తే రేప్ కేసు మాఫీ అయిపోతాయనే కదా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s