ఆదివాసీల ఆత్మబంధువు మహాశ్వేతాదేవి -నివాళి


Mahashwetha with an award

[ఈ ఆర్టికల్ మహాశ్వేతాదేవి చనిపోయిన రోజే రాయబడింది. దరిమిలా మహిళల మాస పత్రిక ‘మాతృక’ లో ప్రచురించబడింది. ఒకసారి -ఎక్కడయినా సరే- ముద్రితం అయినవి మాతృక పత్రిక ప్రచురణకు స్వీకరించని కారణం చేత వారి ప్రచురణ అయే వరకు ఆగవలసి వచ్చింది. బ్లాగ్ పాఠకుల కోసం ఈ రోజు… ]

*********

“నేను చేయవలసింది, రాయవలసింది ఇంకా చాలా ఉండిపోయింది. నేనింకా బతకాలి. ఎల్లకాలం బతికే ఉండాలి” అని కోరుకున్న మహాశ్వేతాదేవికి శరీర అవయవాలు సహకరించకపోవడంతో మరణించక తప్పలేదు. ప్రతిభావంతమైన రచయితలు (మనిష్ ఘటక్ -కవి, రచయిత- ఆమె తండ్రి) సినిమా తయారీదారుల (ఆర్ట్ సినిమాల నిర్మాత రిత్విక్ ఘటక్ ఆమె పినతండ్రి) కుటుంబంలో జన్మించి జీవిత పర్యంతం రచనా సేవలోలోనూ, సామాజిక సేవలోనూ గడిపిన బెంగాల్ రచయిత్రి, కార్యకర్త, జర్నలిస్టు, గిరిజనుల ఆత్మబంధువు మహాశ్వేతాదేవి జులై 28, మధ్యాహ్నం 3 గంటల సమయంలో భౌతిక జీవితం చాలించుకున్నారు. భౌతికంగా “ఎల్లకాలం” బ్రతకలేని మహాశ్వేతా దేవి భారత దేశ అణగారిన వర్గాల జనం మధ్య ఒక వీడని జ్ఞాపకంగా, చైతన్య స్ఫూర్తిగా, ఆత్మ బంధువుగా, నిత్య జ్వలితగా నిలిచి ఉంటారు.

దేశంలో అత్యంత నాగరికత కలిగిన ప్రజలు ఆదివాసీలే అని స్పష్టం చేయగల తెగువ చూపిన మహాశ్వేతాదేవి తన భావాలకు తగ్గట్లుగానే ఆర్ధికంగా అత్యంత వెనుకబడిన ఆదీవాసీల అభివృద్ధి కోసం శ్రమించారు. తన జీవితంలో తారసపడే ప్రతి ఒక్క వ్యక్తినీ, సమూహాన్నీ, సంఘటననూ, మనసుకు హత్తుకునేట్లుగా కధలుగా మలిచి రాయగల, ముఖ్యంగా సాధారణ ప్రజానీకపు జీవన వాస్తవాలను యధాలాపంగా ఎలాంటి తడబాటు లేకుండా పాఠకుల ముందుకు తెచ్చే మహాశ్వేతాదేవికి దేశవ్యాపితంగా అనేక భాషల్లో, ప్రాంతాల్లో, విదేశాల్లో అభిమానులు ఉన్నారు.

తరచుగా మహాశ్వేతాదేవి కధా వస్తువులు, నవలా నాయకులు అత్యంత సాధారణ వ్యక్తులు అయి ఉండడంతో ఆమె పుస్తకాలు ఎవరినైనా ఆకట్టుకుని విడవకుండా చివరికంటా చదివించేలా చేస్తాయి.

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బిర్సా మొండా నేతృత్వంలో తిరగబడ్డ తూర్పు, మధ్య భారతంలోని గిరిజనుల పోరాటాల దగ్గరి నుండి బెంగాల్ లో సాయుధ పోరాటంతో అగ్గి రాజేసిన నక్సలైట్ల పోరాటం వరకు, సమాజంలో అత్యంత హీనంగా చూడబడే సఫాయి కూలీ నుండి రైతాంగ సాయుధ తిరుగుబాట్ల వరకు అధ్యయనం చేసిన మహాశ్వేత ఆ పోరాటాలను తన రచనల్లో సజీవ చిత్రాలుగా ప్రజలకు అందించారు. సమాజంలో చిట్ట చివరి అంచులకు నెట్టివేయబడ్డ అతి సాధారణ వ్యక్తులు ఆమె కధల్లో, నవలల్లో స్ఫూర్తి అందించే పాత్రలుగా, వస్తువులుగా మనకు కనపడతారు.

1940లలో తూర్పు భారతంలో ఉధృతంగా వ్యాపించిన కమ్యూనిస్టు ఉద్యమాలతో ప్రభావితం అయిన మహాశ్వేతాదేవి తన జీవితంలో అత్యధిక భాగం ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడుతూ వచ్చారు. బెంగాల్ కమ్యూనిస్టుల కమ్యూనిస్టు రాహిత్యాన్ని తన విమర్శలతో బట్టబయలు చేసిన మహాశ్వేతాదేవి నక్సలిజానికి మద్దతుగా నిలబడ్డారు. సింగూర్, నందిగ్రామ్, లాల్ ఘర్, జంగల్ మహల్ మొదలైన ప్రజా ఉద్యమ కేంద్రాలలో గిరిజన ప్రజానీకంపై లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం సాగించిన అమానుష అణచివేతను, హత్యలను, ప్రైవేటు గూండాగిరిని వ్యతిరేకించడంలో ఆమె ముందు పీఠిన నిలబడ్డారు. అనంతరం అధికారం లోకి వచ్చిన మమతా బెనర్జీ ప్రభుత్వానికి మద్దతు ఎందుకు ఇచ్చారన్నది శేష ప్రశ్నగా మిగిలింది. బహుశా బెంగాల్ కమ్యూనిస్టులు పెట్టుబడిదారీ-భూస్వామ్య వర్గాలకు తీసిపోకుండా పీడిత ప్రజలపై సాగించిన సంఘటిత-రాజ్యేతర అణచివేతను కళ్ళారా చూసిన తర్వాత మార్క్సిస్టు పార్లమెంటరీ రాజకీయాలను ఛీ కొట్టకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. మార్క్సిస్టు ముసుగులోని ఆధిపత్యగణాన్ని గద్దె దించేది ఎవరైనా ఫర్వాలేదన్నంతగా ఆమె ద్వేషం ప్రయాణం చేసి ఉండవచ్చు.

సామాజిక సేవకు గాను మెగసెసే అవార్డు పొందిన మహాశ్వేతాదేవి చనిపోయే నాటికి 90 సం.ల వయస్కురాలు. నిజానికి మహాశ్వేతాదేవిని వరించని గౌరవం లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సాహితీరంగం ఆమెను వెతుక్కుంటూ రాని అవార్డు అంటూ లేదు. జ్ఞాన్ పీఠ్, బెంగాలి సాహిత్య అకాడమీ, పద్మ శ్రీ, పద్మ విభూషణ్, బంగ విభూషణ్, సాహిత్యబ్రహ్మ… ఇలా ఎన్నో.

సెప్టిసెమియా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వ్యాధులతో జూన్ 22, 2016 తేదీన ఆసుపత్రిలో చేరిన ఆమె అప్పటి నుండి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. చక్కెర వ్యాధి కారణంగా క్రమంగా కీలక అవయవాలు ఒక్కొక్కటీ మొరాయిస్తూ వచ్చాయి. జులై 28 తేదీన భారీ గుండేపోటు సంభవించడంతో ఆమె మరి కోలుకోవడం సాధ్యం కాలేదు.

“ఒక గొప్ప రచయితను ఇండియా కోల్పోయింది. ఒక అద్వితీయమైన తల్లిని బెంగాల్ కోల్పోయింది… ఒక వ్యక్తిగత మార్గదర్శిని నేను కోల్పోయాను. మహాశ్వేతాదేవి శాంతిలో విశ్రమించుగాక!” అంటూ నివాళి పలికిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహాశ్వేత ఆశయాలను తుంగలో తొక్కకుండా ఉంటే అదే పదివేలు.

“ఒక… తల్లి” అని మమతా బెనర్జీ ఎందుకు అన్నారో తెలియదు గానీ, మహాశ్వేతాదేవి అత్యద్భుతమైన రచనల్లో ఒకటి “ఒక తల్లి.” ‘హజార్ చౌరాసీకా మా’ పేరుతో తెరకెక్కిన ఆ రచన 1970ల నాటి నగ్జల్బరీ గర్జనకు గొంతు కలిపిన ఓ నవ యువకుడి ఆశయ చిత్రణ. పనుందంటూ ఇంటినుండి వెళ్ళిన కొడుకు వ్రతి ఎంతకూ తిరిగి రాకపోవడంతో కలతలో మునిగిపోయిన ‘ఒక తల్లి’కి కొద్ది రోజుల తర్వాత కొడుకు శవం తీసుకెళ్లమంటూ పోలీసుల నుండి కబురు వస్తుంది. 1084 నెంబర్ శవానికి తల్లిగా పోలీసులు ఆమెకు ఇచ్చే గుర్తింపే బెంగాలీ నవలకు టైటిల్.

Mahashwetha Devi body in state

ఒక యేడాది పాటు కొడుకు పోయిన దుఃఖంలో గడిపిన ఆ తల్లి, కొడుకు ఎడబాటై ఏడాది ముగిసిన రోజు నాడు వ్రతి చావుకు కారణం ఏమిటో తెలుసుకునేందుకు తన కులీన ఇంటి గడప దాటి బైటికి అడుగు పెడుతుంది. వ్రతి మిత్రులను ఒక్కొక్కరినీ కలుసుకుని విచారించే క్రమంలో తన కొడుకు జ్ఞాపకాలకు మరో అద్వితీయమైన పార్శ్వం ఉన్నట్లు కనుగొని నివ్వెరపోతుంది. వ్రతి గరల్ ఫ్రెండ్ నీ అప్పుడే కలుస్తుంది. వారి ఆశయాలు వారిద్దరిని ఒకరిగా చేశాయన్న గ్రహింపుతో తనకు తెలియని తన కౌడుకుని అప్పుడే కనిపెట్టి మరింతగా ఆక్రోశిస్తుంది. తన అన్వేషణలో ఆ తల్లికి ఎదురైన వ్యక్తులు, ఎదుర్కొన్న అనుభవాలు, మింగవలసి వచ్చిన చేదు నిజాలు ఆమెకు తాను ఒంటరిని కానని తెలిసేలా చేస్తాయి.

పుస్తకం చదువుతున్న పాఠకులు ఆ తల్లితో పాటు వెంట వెళ్ళి ఆమె తిరిగిన గల్లీలు తిరుగుతారు; ఆమెతో పాటు ఆశ్చర్యపోతారు; నిరుత్తరులవుతారు; దుఃఖిస్తారు; కోపోద్రిక్తులవుతారు; సహవాసం చేస్తారు; చివరికి ఒక నిశ్చయానికి, ఆ తల్లికి మల్లేనే, వచ్చేస్తారు. పుస్తకం చదవడం ముగించి చివరి కవరు పేజీ మూసేశాక ‘ఒక తల్లి’, ‘మహాశ్వేతాదేవి’ ఒకరే అన్న భ్రమలో పాఠకుడు మునిగిపోకపోతే ఆశ్చర్యమే. పుస్తకం మొఖం పైన చిత్రించిన తల్లి ముఖం కింద మహాశ్వేతాదేవి పేరును చూశాక ఆమెయే తన స్వంత అనుభవాన్ని, అదృశ్యమైన తన కొడుకు కధని రాసి ఉంటారన్న అనుభూతి కలుగుతుంది పాఠకుడికి.

మహాశ్వేతాదేవి సఫాయి శ్రమపై ఆధారపడి బతికే ప్రజల జీవితాన్ని నవలగా రాయగా దానిని తెలుగులోకి అనువదించి అనేక యేళ్ళ క్రితం, బహుశా పాతికేళ్లు కావచ్చు, చతుర మాస పత్రిక ప్రచురించింది. ఆ కధలో, ఆడపిల్ల అనే కారణంతో పసి వయసులోనే పారవేయబడ్డ ఒక అందమైన బ్రాహ్మణ పాపను ఒక సఫాయి కుటుంబం చేరదీసి పెంచుతుంది. ఆ పాప పెరుగుతున్న క్రమంలో సఫాయి కార్మికుల జీవనాన్ని మహాశ్వేతాదేవి కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. ఒక కధ చెబుతున్నట్లుగా కాకుండా, మనమే అక్కడికక్కడే వాళ్ళ మధ్య బ్రతుకుతున్నట్లుగా. ఆ నవల పూర్తి చేశాక సఫాయి కార్మికులంటూ కొన్ని కులాల్ని సృష్టించిన సమాజంలో, ఆ సమాజాన్ని సహిస్తూ బ్రతుకుతున్నందుకు మన మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఆ జీవితాల వేదనను భరించలేక చదవడం మానేయాలన్న తిరస్కారం, ఆ తిరస్కారం మనపైనే అన్న నిజం గ్రహింపుకు వచ్చి చదవడం కొనసాగించక తప్పని తపన పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

“నా రచనలు చదివాక, పాఠకులు తమ చుట్టూ ఉన్న సమాజంపైన అసహ్యం కలగాలి. ఆ అసహ్యంతో ఆ సమాజాన్ని మార్చుకునేందుకు ఏదో ఒక రూపంలో నడుం బిగించాలి” అని మహాశ్వేతాదేవి మూడు సంవత్సరాల క్రితం జైపూర్ లిట్ ఫెస్ట్ లో చెప్పడం ఎందుకో, ఏ ప్రయోజనాన్ని ఆశించో ఈ నవల మనకు తెలియజేస్తుంది.

ఇటువంటి పుస్తకాలు అనేకం మహాశ్వేతాదేవి కలం నుండి వెలువడ్డాయి.

“మహాశ్వేతాదేవి కలం యొక్క గొప్ప శక్తిని అత్యద్భుతంగా విశదీకరించారు. ఆప్యాయత, సమానత్వం, న్యాయాలకు ఆమె గొంతుక. మనల్ని తీవ్రంగా విచారంలో ముంచుతూ వెళ్ళారామె. శాంతిలో విశ్రమించుగాక” అని ప్రధాని నరేంద్ర మోడి ట్వీట్ చేశారు. బహుశా మహాశ్వేతాదేవి గురించి సరైన సమాచారం ప్రధాన మంత్రికి అంది ఉండకపోవచ్చు.

“నిజ జీవితంలో ఆమెకు తారస పడిన వాళ్ళు మెలమెల్లగా ఆమె కధల్లో, నవలలో స్ధానం సంపాదించారు. తమ అనుభవాలను నేరుగా కధనం లోకి మలచగల సామర్ధ్యం చాలా కొద్దిమంది రచయితలకు మాత్రమే ఉంటుంది. అలాంటి రచయితల్లో మహాశ్వేతాదేవి ఒకరు. తాను చూసిన వాటిని ఆమె చాలా మామూలుగా కధల్లోకి తెచ్చి వివరిస్తారు” అని ప్రముఖ రచయిత్రి, మహాశ్వేతాదేవి సహచరుల్లో ఒకరు అయిన జోయా మిత్ర, మరణానికి కొద్ది రోజుల ముందు చెప్పిన మాటలు మహాశ్వేత రచనా పటిమను వివరిస్తాయి.

సాధారణ మనుషుల కలలు, కోరికలను పరిరక్షించడం చాలా అవసరం అని ఆమె తరచుగా చెప్పే మాట. నిద్ర కోసం పరితపించే వృద్ధ మహిళ, ఎట్టకేలకు పెన్షన్ సంపాదించగలిగిన వృద్ధ పెన్షనర్, అడవుల నుండి గెంటివేయబడ్డ గిరిజనం,  నక్సలైట్లు… ఆమె కధల్లో తరచుగా దర్శనం ఇస్తారు.

సాధారణ జనాలకు చెందిన చిన్న చిన్న విషయాలు, వాళ్ళు కనే చిన్ని చిన్ని కలలు చాలా ప్రాముఖ్యత కలిగినవని ఆమె చెప్పడం మామూలు దృష్టితో కాదు…

“ప్రపంచీకరణను ఎదుర్కోవటానికి ఏకైక మార్గం ఏమిటంటే… ఒక సెంటర్ లో కాసింత భూమిని సంపాదించు; అందులో గడ్డిని పెరగనివ్వు; కనీసం ఒకే ఒక్క చెట్టునన్నా అక్కడ పెరగనివ్వు, కాస్త పెద్ద చెట్టయినా ఫర్వాలేదు; మీ కొడుకు సైకిల్ ని అక్కడ పెట్టుకోనివ్వు; పేద బాలుడు ఆడుకోవడానికి అక్కడికి వస్తే అతన్ని రానివ్వు, ఓ పిట్ట వచ్చి ఆ చెట్టు మీద వాలనివ్వు. చిన్న విషయాలే. చిన్న కలలే ఇవన్నీ” అని మహాశ్వేతాదేవి ఒక సాహిత్య సభలో చెప్పడం గమనిస్తే… చిన్న చిన్న ఆశలు, కలలు నెరవేర్చుకోవటానికి తపించే సాధారణ జనమే ప్రపంచీకరణను ఎదుర్కోగల ఏకైక శక్తి అని చెప్పడం ఆమె ఉద్దేశంగా గ్రహించవచ్చు.

వయసు మీద పడడం గురించి మహాశ్వేతాదేవికి ఎప్పుడూ చింత లేదు. 90 యేళ్ళ వయసులో కూడా మరో జీవితాన్ని గడపడం గురించి ఆమె మాట్లాడతారు. “శక్తి ఉడిగిపోవడం అంటే అదే ఫుల్ స్టాప్ కాదు. ట్రైన్ దిగిపోయే చివరి స్టేషన్ కూడా కాదది. అది కేవలం నెమ్మదించడం మాత్రమే. అది మీ తేజస్సు ‘పాటు’ లోకి మళ్లడం (పాటు తర్వాత పోటు వస్తుందని మహాశ్వేతాదేవి ఉద్దేశం)” అని ఆమె చెబుతారు.

మహాశ్వేతాదేవి తన జీవితంలో అత్యధిక భాగం పీడితులు, బలహీనుల జీవితాలను శ్వాసిస్తూ, రాస్తూ, వాళ్ళ మధ్యనే జీవిస్తూ గడిపారు. ముఖ్యంగా స్త్రీలు, ఆదివాసీలు, అంటరాని దళితులు, వలస కూలీలు, వేశ్యలు బలహీన రైతులు, తిరుగుబాటుదారులు (నక్సల్స్) ఆమెకు ఇష్టులు. తన రచనల ద్వారా, ఉద్యమాల ద్వారా ఆమె వారి పక్షానే నిలబడ్డారు. ముఖ్యంగా ఆదివాసీలు, వారిలోనూ డీ నోటిఫై చేయబడ్డ ఖేరియా షాబోర్, లోధా తెగల హక్కుల కోసం ఆమె పోరాటాలు నడిపారు. వారికోసం స్వచ్ఛంద సంస్థను స్థాపించి నిర్వహించారు. వారి సంక్షేమం కోసం, జీవితాల మెరుగుకోసం విరాళాలు సేకరించారు. చట్టాలతో తలపడ్డారు. గిరిజనుల భాష లోనే బొర్తిక అనే పత్రికను సైతం నడిపారు. గిరిజనులు తమ గురించి మౌఖికంగా తెలియజేసే అంశాలనే ఆ పత్రికలో ప్రచురించి చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు.

మధ్యతరగతి నైతికతను తాను ద్వేషిస్తానని ఆమె నిర్మొహమాటంగా చెబుతారు. “అదొక బూటకం, అక్కడ ప్రతిదీ అణచివేయబడుతుంది” అని ఆమె నిరసించారు. అనేకమంది జీవితాల్లో కనిపించే ద్వంద్వ ప్రమాణాలను ఖండించి తీరాలని ఆమె ఖచ్చితంగా చెప్పారు. పటాటోపానికి పదిమందికి ఒకటి చెబుతూ వ్యక్తిగతంగా విరుద్ధమైన విలువలను పాటించడం నికృష్టం అని ఆమె భావన. “ఢిల్లీలో బస్సులో సామూహిక అత్యాచారానికి గురైన విద్యార్ధిని ఒక దళిత లేదా గిరిజన యువతి అయి ఉంటే ప్రజల్లో ఆనాడు వచ్చినంత తీవ్ర స్ధాయి కోపోద్రేకాలు, నిరసనోద్యమం వచ్చి ఉండేవి కావని ఆమె నిస్సంకోచంగా అంగీకరించారు.

ఆదివాసీలు అత్యంత గొప్ప నాగరికత కలవారన్న మహాశ్వేతాదేవి మాటలు వింటే మన నాగరీకులకు ఆందోళన కలగక మానదు. దేశంలో అడవులు, నదులు, కొండలు ఇప్పటికీ కళగా ఉన్నాయంటే అందుకు కారణం ఆదివాసీలే అని 2012లో హైద్రాబాద్ వచ్చినపుడు ఆమె వివరించారు. “ఆదివాసీ సమాజంలో ఏ ఒక్కరూ, మరే ఒక్కరి కన్నా అధికుడు కాదు, అల్పుడూ కాదు. కట్నం లాంటి సామాజిక వైకల్యాలు వారిలో కనిపించవు. కులాల కుళ్ళు వారి దరి చేరలేదు. ప్రకృతిలో సమతూకం ఏ కాస్తన్నా మిగిలి ఉంటే అది ఆదివాసీల చలవే” అని ఆమె వాస్తవం ఏమిటో వివరించారు.

అడవి బిడ్డలను అడవుల నుండి తరిమివేస్తే, మైదానాల నాగరీకుల భద్ర జీవితాలు పర్యావరణ కాలుష్యంలో అదనపు కాలుష్యంగా కలిసిపోతాయని ఆమె చెప్పడం. “నక్సలైట్లు అడవుల్లో దాక్కోపోతే జన జీవన స్రవంతిలో కలిసి జనాన్ని ఉద్ధరించవచ్చు కదా?” అంటూ మిడి మిడి జ్ఞానంతో ప్రశ్నించే బుద్ధి జీవులకు మహాశ్వేతాదేవి లాంటి రచయిత్రి చెబితే అన్నా నిజం గ్రహింపుకు రావాలి. అడవులు నాగరీకులకు నిలయాలని తెలియాలి.

గ్రీన్ హంట్, సల్వా జుడుం.. ఇత్యాది పేర్లతో ప్రభుత్వాలు ఏరివేస్తున్నది నక్సలైట్లను కాదని, అడవిని ఆవాసంగా చేసుకున్న ఆదివాసీలను తరిమివేసి అక్కడి సంపదలను తవ్వి విదేశీ బహుళజాతి కంపెనీలకు పందేరం పెట్టడమే వారి లక్ష్యమని, తద్వారా ప్రకృతి సమతూకాన్ని దెబ్బ తీసి నగరాల జీవితాన్ని కూడా మొదలంటా పెకలించుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నదని మహాశ్వేతాదేవి చేసిన హెచ్చరికలను ఆలకించాలి. లేదంటే మహాశ్వేతాదేవి కోరుకున్న మరో జీవితం తర్వాత సంగతి, ఉన్న జీవితాలు కూడా అర్ధాంతరంగా ముగించుకోవలసిందే. ఈ నిజం తెలిసి కర్తవ్యోన్ముఖం కావడమే మహాశ్వేతాదేవికి అందించగల ఘన నివాళి.

4 thoughts on “ఆదివాసీల ఆత్మబంధువు మహాశ్వేతాదేవి -నివాళి

  1. రవిబాబు గారు,

    ‘బడు’ ని సాధ్యమైనంతగా ప్రయోగించకుండా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. కానీ ‘రాశాను’ అన్న పదంతో నాకు ఎప్పుడూ సమస్యగా ఉంటోంది. అలా చెప్పడం ‘సెల్ఫ్ ప్రమోషన్’ గా నాకు తోస్తుంది. So I feel shy to write it.

  2. శేఖర్‌ గారు మహాశ్వేతాదేవి వ్యాసం చాలా మంచిగుంది. పెద్దగా ఉంది కదా మళ్లెప్పుడన్న చదువుదం తియ్ అనుకుంటనే మొదలువెట్టిన… అంత చదివేసిన. అరే.. అయిపోయిందే అనుకున్న. వ్యాసమంటే గిట్లుండాలే.

  3. అవునా సత్య గారు, సంతోషం.

    అరమరికలు లేకుండా తెలంగాణ యాసలో మీరు రాసిన అభిప్రాయం బలేగుంది. ‘వ్యాఖ్యంటే గిట్లుండాలే’ అన్నట్లుగా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s