ఎవరు రెచ్చగొడితే… -తెలంగాణ బిడ్డ ఆవేదన!


[ఎర్రవెల్లి మండలం కొండపాక (మల్లన్న సాగర్ ప్రాజెక్టు) లో పోలీసుల లాఠీచార్జినీ, తెలంగాణ ప్రజలపై కే‌సి‌ఆర్ కుటుంబం చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మిత్రుడు ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్య ఇది. తెలంగాణ ప్రజలకు కావలసింది దొరల తెలంగాణ కాదని, జన తెలంగాణ అని ఆనాడే ప్రజా సంఘాలు చేసిన డిమాండు ఎంత సంబద్ధమో ఈ వ్యాఖ్య, ఫోటోలు చెబుతున్నాయి.]

*********

–గంగాధర్ మాకం

ఎవరు రెచ్చగొడితే తెలంగాణ‌ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడినమో… ఎవరు రెచ్చగొడితే మా పిల్లలు తెలంగాణ‌ కోసం ప్రాణాలు ఇచ్చిన్రో… ఛెప్పున్రి సారూ!

మీరు పెట్రోల్ మీదపోసుకొని అంటుపెట్టుకుంట‌ అని నడిబజార్లో హడావుడి చేసినప్పుడు ఆవేశ‌పడ్దది మేమే కదా !

మిమ్ములను చూసే, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా పిల్లలు చచ్చిపోయిన్రని మేమెప్పుడైనా అన్నమా?

పోలీసు అధికారుల మీద మీరు, మీ బావ ఎగిరెగిరి దుంకినప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టిందెవరని మేమెవరమైనా అడిగినమా?

మీరు పిలుపు ఇస్తే రోడ్లమీదికొచ్చినం, మీరు ఆదేశ‌మిస్తే జైల్లకు పోయినం, దెబ్బలు తిన్నం. అప్పుడు మమ్ములను రెచ్చగొట్టింది ఎవరో కొంచెం చెప్పండి సారూ!

మీకు ఆకలయినప్పుడే మాకు ఆకలి కావాలె. మీరు జై అంటేనే మేము జై అనాలె. మీరు ఉష్కో అంటే ఉరుకాలె. మీరు కండ్లుఎర్రజేస్తే మీకాళ్ళదగ్గర పడుండాలె. బాంచన్ దొరా మీకాల్మొక్తం అని బతకాలె.

మాకు ఆకలేసినా మీరు పెడితేనే తినాలె. లేదంటే సావాలె. మీరు భూములడిగితే పువ్వుల్లో పెట్టి ఇయ్యాలె. మీ పోలీసులు తంతే పడాలె. దుంఖం వచ్చినా మీరు ఆఙ ఇస్తేనే ఏడువాలె.

ఆంధ్ర దొరలతో మేం కొట్లాడినప్పుడు మీరు కూడా మాతో నిలబడ్డరు. వాల్లు పోయి మీ సర్కార్ రాంగనే ఇగ మావోల్లే సర్కార్ లకు వచ్చిన్రని సంబరపడ్డం.

క్షమించండి దొరా! మీరు దొరలనే విషయం మర్చిపోయినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలె. మీ చేతలతో ఈ విషయం గుర్తు చేసినందుకు కృతఙతలు!

జై తెలంగాణ!

వ్యాఖ్యానించండి