
Theresa May
యూకె లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈయూ నుంచి విడాకులు తీసుకునే కార్యక్రమం బ్రెగ్జిట్ అనుకూల రాజకీయ నాయకుల చేతుల మీదుగా జరగవలసి ఉండగా అది కాస్తా ఇప్పుడు బ్రెగ్జిట్ వ్యతిరేకుల చేతుల మీదుగా జరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. నిజానికి పరిస్ధితి ఏర్పడటం కాదు, అదే జరగబోతోంది కూడా.
బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తన ప్రచారానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈయూ లో బ్రిటన్ కొనసాగటమే మంచిదని తాను భావిస్తున్నందున విడాకుల ప్రక్రియ, బ్రెగ్జిట్ ని కోరుకునే ప్రధాని పాలనలో జరగడమే ఉత్తమం అని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలా అయితేనే ప్రజలు కోరుకుంటున్న విధంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈయు నుండి మెరుగైన ఒప్పందాలు సాధించగలరని, బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రజల ఇచ్ఛానుసారం పరిపూర్తి చేయగలరని ఆయన చెప్పారు.
తన రాజీనామా దరిమిలా తదుపరి ప్రధాన మంత్రిని కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు వచ్చే సెప్టెంబర్ లోపు ఎన్నుకుంటారని కూడా కామెరాన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బ్రిటన్ ఈయూ లోనే కొనసాగాలని భావించిన హోమ్ సెక్రటరీ ధెరెసా మే చేతికి ప్రధాన మంత్రి పగ్గాలు దక్కనున్నాయి. బుధవారం నాడు ఆమె ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత ప్రధాని కామెరాన్ ఖాయం చేసేశారు. పోటీదారుగా ఆమె ఒక్కరే రంగంలో మిగలడంతో బ్రిటన్ ను రెండవ సారి మహిళా ప్రధాన మంత్రి ఏలనున్నారు.
ప్రధాన మంత్రి పదవికి తొలుత అర డజను మంది వరకు పోటీ పడగా వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. బ్రెగ్జిట్ జరిగి తీరాలని హోరా హోరీగా ప్రచారం చేసిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్, రిఫరెండం తీర్పు వెలువడిన వెంటనే అజ్ఞాతం లోకి వెళ్లిపోయాడు. బ్రెగ్జిట్ కే ప్రజలు ఓటు వేస్తే తదుపరి ప్రధాన మంత్రి జాన్సనే అని అంతా భావించారు. కానీ ఫలితాలు వెలువడిన తర్వాత జాన్సన్ ప్రధాని పదవికి పనికిరాడని ఆయన అనుయాయుడుగా పేరు పొందిన మైఖేల్ గొవే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ వెంటనే “నేను పోటీలో లేను” అని జాన్సన్ ప్రకటించడం జరిగిపోయింది.
అనంతరం ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్నట్లుగా అనేక మంది కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు ప్రకటించి రంగం లోకి దిగారు. హోం సెక్రటరీ ధెరెసా మే, ఏ ప్రభుత్వ పదవీ లేని ఆండ్రియా లెడ్సం, ఉపాధి మంత్రి ప్రీతి పటేల్, న్యాయ మంత్రి డొమినిక్ రాబ్, ఇంధన శాఖ మంత్రి ఏంబర్ రడ్, ఆర్థిక మంత్రి జార్జి ఓస్బోర్న్, రక్షణ మంత్రి లియోన్ ఫాక్స్ మొదలైన వారందరూ తాము రంగంలో ఉన్నట్లు ప్రకటించారు. కానీ ఒక్కో రోజు గడిచే కొద్దీ ఒక్కొక్కరూ రంగం నుండి తప్పు కుంటున్నట్లు ప్రకటిస్తూ వచ్చారు. తెర వెనుక సాగిన ప్రయత్నాల ఫలితంగానే వారు తప్పుకుంటున్నారని లోకానికి అర్ధం అయినప్పటికీ తెర వెనుక ఎవరు పని చేశారు అన్నది మాత్రం తెలియలేదు.
చివరికి ధెరెసా మే, ఆండ్రియా లెడ్సం ఇద్దరే పోటీలో మిగిలారని బ్రిటన్ కు రెండవ సారి మహిళా ప్రధాన మంత్రి రానున్నారని పత్రికలు ప్రకటించాయి. రిఫరెండం ప్రచారంలో ‘రిమైన్’ తరపున ఉన్నట్లు ప్రకటించిన ధెరెసా మే తాను ప్రజల అభిప్రాయం మేరకు బ్రెగ్జిట్ సాఫీగా జరిగిపోయేట్లు చూస్తానని మాట్లాడడం మొదలు పెట్టారు. రిఫరెండం ప్రచారంలో ‘లీవ్’ శిబిరం తరపున తీవ్రంగా ప్రచారం చేసిన ఆండ్రియా బ్రెగ్జిట్ కు వ్యతిరేకి అయిన ధెరెసా చేతుల్లో బ్రెగ్జిట్ ప్రక్రియను ఎలా పెడతారని ప్రశ్నిస్తూ తానే అందుకు సరైన వ్యక్తిని అని చెప్పుకున్నారు. పిల్లల్ని సాకిన తల్లిగా కూడా తానే బ్రెగ్జిట్ అభిప్రాయాన్ని సక్రమంగా అమలు చేయగలననీ, పిల్లలు లేని ధెరెసా కు అది సాధ్యం కాదని టి.వి ఇంటర్వ్యూలో చెప్పి పలువురి విమర్శలను కూడా ఆమె ఎదుర్కొన్నారు.
మరోవైపు ఈయూ నేతలు బ్రిటన్ కు హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. సెప్టెంబర్ లోపు కొత్త ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తారని కామెరాన్ ప్రకటించిన నేపధ్యంలో అంతవరకు ఆలస్యం చేస్తే కుదరదని వీలయినంత త్వరగా ‘ఈయూ నుండి విడిపోతున్నట్లు’ నోటిఫికేషన్ ఇవ్వాలని వారు ఒత్తిడి తెచ్చారు. విడాకుల ప్రక్రియ మొదలు కావటం ఆలస్యం అయ్యే కొద్దీ ఈయూ ఆర్ధిక కార్యకలాపాలపై మార్కెట్లకు నమ్మకం ఉండదని, అస్ధిరత నెలకొంటుందని, ఆర్ధిక వృద్ధి కుంటు పడుతుందని హెచ్చరించారు. దానితో కొత్త ప్రధాన మంత్రి ఎంపిక త్వరగా పూర్తి చేయవలసిన అగత్యం యూకే కు వచ్చి పడింది. ఆలస్యం చేస్తే బ్రెగ్జిట్ దరిమిలా కుదుర్చుకోవలసిన ఒప్పందాల విషయంలో ఈయూ కఠిన వైఖరి అవలంబించ వచ్చనీ, విడాకుల అనంతర పంపకంలో నష్టం జరగవచ్చనీ బ్రిటన్ నేతలకు భయం పట్టుకున్నట్లుగా కనిపించింది.
ప్రధాన మంత్రికి ఒకరికి మించి పోటీలో ఉన్నట్లయితే అధికార కన్సర్వేటివ్ పార్టీ అధికారిక సభ్యులు ఎవరు ప్రధాన మంత్రి పదవి చేపట్టాలో ఓటింగ్ ద్వారా నిర్ణయించవలసి ఉంటుంది. అనగా ఎన్నికలు, వాటి కోసం ప్రచారం జరగాలి. ప్రచారానికి తగిన సమయం ఇవ్వాలి. ప్రచారం సందర్భంగా ఒకరి తప్పులు మరొకరు ఎంచాలి. అవతలి పోటీదారుడు ఎంత అసమర్ధులో చెప్పాలి. తాను ఎంత సమర్ధులో కూడా చెప్పుకోవాలి. ఈ ఎన్నికలు పూర్తయేసరికి సెప్టెంబర్ వచ్చేస్తుంది. ఈ వ్యవహారం పరిస్ధితిని మరింతగా గందరగోళ పరుస్తుందనీ, మార్కెట్లకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని రాజకీయ పార్టీలు, నేతలు విశ్లేషకులు హెచ్చరించారు.

Andrea Leadsom
ఇలా ఏ పరిణామం జరగాలన్నా చివరికి వెళ్ళి మార్కెట్ల దగ్గర ఆగిపోతుంది. మార్కెట్లకు ఏది అవసరం అయితే అదే జరగాలన్న దగ్గర చర్చ ముగుస్తుంది. ఆ ప్రకారమే పరిణామాలు జరిగిపోతాయి. బ్రెగ్జిట్ కి బ్రిటిష్ ప్రజలు ఎందుకు ఓటు వేశారు, వారు ఆశించిన ప్రయోజనాలు ఏమిటి, ప్రజాస్వామిక సూత్రాలు… ఇవేవీ చర్చలో ఉండవు. బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే మార్కెట్లకు ఎలాగూ సంతోషమే. బ్రెగ్జిట్ అనుకూల తీర్పు వచ్చినా అది కూడా మార్కెట్ల సంతృప్తికి అనుగుణంగానే జరగాలి.
ఆ విధంగా ఆండ్రియా లెడ్సం అకస్మాత్తుగా ప్లేటు మార్చేశారు. ఆమె టి.వి లో తల్లి పోలిక తేవడం జనం ఎవరికీ నచ్చలేదని, జనం తరపున పశ్చిమ పత్రికలే అభిప్రాయం రాసేశాయి. జనం మెచ్చని వ్యక్తి గనక ఆమె పోటీ నుండి తప్పుకోవటమే మేలని జనానికి ముందే నచ్చ జెప్పడం అన్నమాట! నచ్చజెప్పడం పూర్తయిందని భావించినాక “పోటీ నుండి తప్పుకుంటున్నాను” అని ఆండ్రియా ప్రకటించేశారు. తన అభర్దిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నానని ఆమె ప్రకటించిన కొన్ని గంటల లోపే ప్రధాన మంత్రి కామెరాన్ ప్రకటన వెలువడింది, “బుధవారం (జులై 13) ధెరెసా మే కొత్త ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడతారు” అని.
ఆ ప్రకారం బ్రెగ్జిట్ ప్రక్రియ బ్రెగ్జిట్ వ్యతిరేక నేత చేతుల్లోకి వెళ్తోంది. ప్రజా తీర్పు కాస్తా మార్కెట్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రజాస్వామిక రిఫరెండం ‘మార్కెట్ల కోసం, మార్కెట్ల వలన, మార్కెట్ల చేత’ జరిగిన రిఫరెండంగా మారిపోయింది. బ్రెగ్జిట్ ద్వారా బ్రిటిష్ కార్మికవర్గం, దిగువ మధ్య తరగతి ప్రజలు కోరుకున్న ఫలితాలు మళ్ళీ ఎండమావులే అవుతున్నాయి. బ్రెగ్జిట్ ఉత్సాహం అడవి గాచిన వెన్నెలగా మిగిలిపోనుంది.