‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అంటుంటారు పెద్దలు. ఈ సిద్ధాంతాన్ని అమలు చేయటంలో అమెరికాని మించిన వారు ఉండబోరు. “ఇండియా అంతకంతకూ అమెరికాకు నమ్మకమైన భాగస్వామిగా మారుతోంది” అని వివిధ వేదికల పైన చెబుతున్న అమెరికా కోడిగుడ్ల వాణిజ్యం విషయంలో ఇండియాపై పగబట్టి వ్యవహరిస్తోంది.
అమెరికా నుండి వచ్చే కోడి గుడ్లు, కోడి మాంసం, పందుల దిగుమతులపై ఇండియా ఎప్పటి నుండో పలు ఆంక్షలు విధించింది. పౌల్ట్రీ దిగుమతుల ద్వారా అమెరికా నుండి బర్డ్ ఫ్లూ ప్రమాదం ఇండియాకు దిగుమతి అయ్యే అవకాశం ఉందని చెబుతూ ఆ ఆంక్షలను ఇండియా విధిస్తోంది.
తమ పౌల్ట్రీ ఉత్పత్తుల వల్ల ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తి చెందవచ్చన్న ఇండియా ఆరోపణలకు సాక్షాలు లేవని, ఆరోపణలకు శాస్త్రీయ ఆధారాలు చూపాలని అమెరికా కోరింది.
తమ పౌల్ట్రీ వాణిజ్యంపై ఇండియా విధించిన ఆంక్షలు వివక్షాపూరితంగా ఉన్నాయని ఆరోపిస్తూ అమెరికా డబల్యూటిఓ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును విచారించిన WTO గత సంవత్సరం జూన్ నెలలో అమెరికాకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అమెరికా పౌల్ట్రీ దిగుమతులపై విధించిన ఆంక్షలు తొలగించాలని ఆదేశించింది.
వివాదాలను విచారించిన అనంతరం WTO ఇచ్చే తీర్పులను అమలు చేసేందుకు సంవత్సరం గడువు విధిస్తారు. ఆ సంవత్సరం గడిచాక తీర్పును అమలు చేయాలి. ఈ లోపు తీర్పు అమలుకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటారని గడువు ఇస్తారు. ఈ యేడు జూన్ తో WTO తీర్పును అమలు చేయాల్సిన గడువు తీరిపోయింది.
అమెరికా పౌల్ట్రీ రంగం ఉత్పాదక శక్తి ఇండియా కంటే ఎక్కువ. మెరుగైన టెక్నాలజీని వినియోగించడం కావచ్చు ఇతర పద్ధతులను అనుసరించటం వల్ల కావచ్చు ఉత్పాదక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. అనగా ఇండియా కంటే సరసమైన ధరలకు పౌల్ట్రీ ఉత్పత్తులను అమెరికా సరఫరా చేయగలుగుతుంది.
అంటే, అమెరికా పౌల్ట్రీ దిగుమతులను అనుమతీస్తే ఇండియా పౌల్ట్రీ రంగం దివాళా తీస్తుంది. అమెరికా WTO వాణిజ్య ప్రతినిధి ప్రకారం ఇండియా ఆంక్షలు ఎత్తివేస్తే వెంటనే సంవత్సరానికి 300 మిలియన్ డాలర్ల (రు 1980 కోట్లు) ఎగుమతులు అమెరికా చేయగలుగుతుంది. అంతే కాకుండా భవిష్యత్తులో ఈ ఎగుమతులు భారీగా వృద్ధి చెందుతాయి.
2012 లో అమెరికా, WTO కు ఫిర్యాదు చేయగా 2015 లో తీర్పు వెలువడింది. ఈ తీర్పుపైన ఇండియా అప్పీలుకు వెళ్లింది. అప్పీలు పైన ఏ నిర్ణయం వెలువడక ముందే ఇండియాపై వాణిజ్య ఆంక్షలు విధించాలని అమెరికా ఇప్పుడు డిమాండ్ చేస్తోంది.
WTO రూల్స్ ప్రకారం జులై 19 తేదీన సమావేశం ఏర్పాటు చేయాలని అమెరికా కోరిందని డబల్యూటిఓ ప్రకటించింది. ఈ సమావేశంలో అమెరికా నష్టపరిహారం డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
WTO రూల్స్ పాటించాలని దేశాలకు హితబోధ చేసే అమెరికా అదే WTO వేదికపై వ్యవసాయ రంగానికి సంబంధించి ఇండియా, చైనా లాంటి దేశాలు ఒక్కటై అమెరికా ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేయాలని డిమాండ్ చేసేసరికి యేళ్ళ తరబడి WTO చర్చలను బొంద పెట్టింది.
అక్కడితో ఆగకుండా WTO తో సంబంధం లేకుండా అమెరికా ఐరోపా లు తాము సొంతగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ట్రాన్స్ పసిఫిక్ ఒప్పందం అనీ, ట్రాన్స్ అట్లాంటిక్ ఒప్పందం అనీ… పలు ఒప్పందాలు చేసుకునేందుకు రహస్య చర్చలు సాగిస్తోంది.
ఈ నేపధ్యంలో ఇండియా లాంటి దేశాలకు తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవటానికి వివిధ చర్యలు తీసుకోవటం తప్పనిసరి. లేదంటే భారత వాణిజ్య ప్రయోజనాలు పూర్తిగా పశ్చిమ బహుళజాతి కంపెనీల పరం అవుతాయి.
వ్యవసాయ వాణిజ్య చర్చలలో ఇప్పటికే అమెరికా ఒత్తిడులకు జో హుకుం అన్న భారత పాలకులు పౌల్ట్రీ వివాదంలో తదుపరి ఏం చర్య తీసుకుంటారో చూడవలసి ఉన్నది.
I am expecting an aticle on essar tapes from you ,did u aware of that such tapes are exist . And also want to know why indian communist are dumb about it.