బ్రెగ్జిట్ అద్భుతం: ఈ‌యూతో విడాకులకే బ్రిటిష్ ఓటు (విశ్లేషణ)


Leave -Brexit

బ్రిటన్ ప్రజలు అనూహ్య ఫలితాన్ని ప్రపంచం ముందు ఉంచారు. యూరోపియన్ యూనియన్ తో విడిపోవటానికే మా ఓటు అని చాటి చెప్పారు. జూన్ 23 తేదీన గురువారం జరిగిన రిఫరెండంలో మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్ కే ఓటు వేశారు. 51.9 శాతం మంది బ్రెగ్జిట్ (లీవ్ ఈ‌యూ) కు ఓటు వేయగా 48.1 శాతం మంది ఈ‌యూలో కొనసాగాలని (రిమైన్) ఓటు వేశారు. 3.8 శాతం మెజారిటీతో బ్రెగ్జిట్ పక్షాన నిలిచారు. తద్వారా దశాబ్దాలుగా అమెరికా తమపై రుద్దిన సుప్రా-నేషనల్ ప్రభుత్వానికి తమకు సమ్మతం లేదని చాటి చెప్పారు. తమ రోజు వచ్చినపుడు తమకు ఏది కావాలో అదే చేస్తామని స్పష్టం చేసి చెప్పారు.

బ్రెగ్జిట్ ఓటమి ఖాయం అని ప్రపంచం అంతా భావిస్తుండగా బ్రిటిష్ ప్రజలు అందుకు విరుద్ధమైన అభిప్రాయాన్ని బ్యాలట్ బాక్సుల్లో నింపటంతో ప్రపంచ ద్రవ్య సామ్రాజ్యాలు, ముఖ్యంగా అమెరికన్ బహుళజాతి ఫైనాన్స్ కంపెనీలు ప్రస్తుతం నిరుత్తరులుగా మిగిలాయి. బ్రెగ్జిట్ ఓటు మిన్ను విరిగి మీద పడే పరిణామం కాకపోయినప్పటికీ వివిధ పెట్టుబడిదారీ కూటములు, సామ్రాజ్యవాద గ్రూపులు తమ ఎత్తుగడలను గణనీయంగా మార్చుకునేందుకు దారి తీసే పరిణామం అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది అమెరికా ద్రవ్య సామ్రాజ్యాధీసులకు లేదా వాల్ స్ట్రీట్ కంపెనీలకు వ్యతిరేక పరిణామం కాగా ‘ద సిటీ’ (లండన్ ఫైనాన్స్ కేంద్రం) ప్రయోజనాలకు దీర్ఘ కాలికంగా లబ్ది చేకూర్చగలది.

గురువారం ఓటింగు ముగిశాక కూడా పలు సర్వేలు ‘రిమైన్’ శిబిరమే విజయం సాధించనున్నదని అంచనా వేశాయి. చివరికి ‘లీవ్’ శిబిరం నాయకుడు నిగేల్ ఫరాజ్ సైతం ‘రిమైన్’ శిబిరమే విజయం సాధిస్తుందని, తమ శిబిరం ఒడి పోతుందని ప్రకటించాడు. అయితే శుక్రవారం ఉదయం ఒకే ఒక్క సర్వే బ్రెగ్జిట్ శిబిరానికే మెజారిటీ బ్రిటిష్ ప్రజలు ఓటు వేశారని చెప్పటంతో నిగెల్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. మొదటి ఓటు ఫలితం (సందర్ లాండ్) లీవ్ కు భారీ మెజారిటీ కట్టబెడుతుటూ వెలువడడంతో ఒక్కసారిగా కలకలం బయలుదేరింది. స్టాక్ మార్కెట్లలో తొక్కిడి మొదలయింది. ఒక్కో ఫలితం వెలువడే కొలదీ లీవ్ శిబిరం స్ధిరంగా మెజారిటీ నిలుపుకుంటున్నట్లు అర్ధం అవుతూ వచ్చింది. దానితో స్టాక్ మార్కెట్లు దభేల్ మని కూలిపోయాయి. బ్రిటన్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ 9 శాతం పైగా పడిపోయి 31 సంవత్సరాల కనిష్ట స్ధాయికి చేరింది. బ్రిటన్ లో మరోసారి ‘బ్లాక్ ఫ్రైడే’ నమోదైందని పశ్చిమ పత్రికలు హాహాకారాలు చేశాయి.

బ్రెగ్జిట్ ప్రభావం వెనువంటనే భారతీయ స్టాక్ మార్కెట్ల పైనా పడిపోయింది. ఆసియా వ్యాపితంగా షేర్ మార్కెట్లు కుప్ప కూలాయి. బోంబే స్టాక్ ఎక్ఛేంజీ (సెన్సెక్స్) నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ (నిఫ్టీ) లు మూడున్నర శాతం పైగా పడిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1100 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 300 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 3 గంటల సమాయానికి సెన్సెక్స్ కాస్త కోలుకుని నష్టాన్ని 700 పాయింట్లకు తగ్గించుకోగా నిఫ్టీ 230 పాయింట్లకు నష్టాన్ని తగ్గించుకుంది. జపాన్ ప్రధాన షేర్ సూచీ అత్యధికంగా 1500 పాయింట్ల వరకు కోల్పోయి 10 శాతం నష్టం నమోదు చేసింది. అనంతరం 1300 పాయింట్లకు లేదా 8 శాతం కు నష్టాన్ని తగ్గించుకుంది. హాంగ్ కాంగ్ షేర్ సూచీ హాంగ్ షెంగ్ 600 పైగా పాయింట్లు నష్టపోయింది.  చమురు ధరలు 3.9 శాతం తగ్గిపోయాయి. అమెరికన్ షేర్ మార్కెట్ల స్పందన వాటిని తెరిస్తే గాని తెలియదు.

ఐరోపా మార్కెట్ లలో తొక్కిసలాట జరుగుతోంది. లండన్ కు చెందిన ఎఫ్‌టి‌ఎస్‌ఈ షేర్ సూచీ 6 శాతం పడిపోయింది. జర్మనీ షేర్ సూచీ డి‌ఏ‌ఎక్స్ 7 శాతం ఫ్రాన్స్ సూచీ సి‌ఏ‌సి 8.5 శాతం కూలిపోయాయి. ఐరోపా షేర్ సూచీలలో ఈ మూడింటినీ ప్రధాన సూచికలుగా పరిశీలకులు పరిగణిస్తారు. బ్రిటిష్ బహుళజాతి బ్యాంకులు మొత్తం మీద 130 బిలియన్ డాలర్ల మార్కెట్ కేపిటల్ నష్టపోయాయని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. లాయిడ్స్, బార్క్లేస్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకుల షేర్ విలువలు ఘోరంగా 30 శాతం పైగా నష్టపోయాయి. మదుపుదారులు షేర్లను అమ్మేసి భద్రమైన ఆస్తులుగా పరిగణించే సార్వభౌమ ఋణ పత్రాలలోకి తమ సొమ్మును తరలించటంతో జర్మనీ, అమెరికా సావరిన్ బాండ్ ల యీల్డ్ లు భారీగా పడిపోయాయి. (బాండ్ లపై చెల్లించే వడ్డీని యీల్డ్ అంటారు. బాండ్లకు గిరాకీ ఎంత ఎక్కువ పెరిగితే యీల్డ్ అంత తక్కువగా ఉంటుంది.)

ఈ‌యూ లో కొనసాగటానికే ఓటు వేయాలని కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేసిన బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ‘లీవ్’ శిబిరం నెగ్గటంతో ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ లోపు తాను రాజీనామా చేస్తానని ఈ లోపు కొత్త ప్రధాన మంత్రిని ఎన్నుకోవాలని తన పార్టీని కోరాడు. ఈ‌యూ నుండి బైటికి రావాలన్న బ్రిటిష్ ప్రజల కోరికను తప్పనిసరిగా గౌరవించాలని ఫలితాల అనంతరం చేసిన ప్రసంగంలో పేర్కొన్నాడు. అధికార కన్సర్వేటివ్ పార్టీ లోని ‘లీవ్’ శిబిరం నేతలు కామెరాన్ ను ప్రధాన మంత్రిగా కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. అయితే కామెరాన్ అందుకు నిరాకరించాడు. బ్రిటన్ కు కొత్త నాయకత్వం అవసరమని స్పష్టం చేశాడు. ఈ‌యూలో కొనసాగితే బ్రిటన్ బలంగా ఉంటుందని భావించానని బ్రిటిష్ ప్రజలు అందుకు విరుద్ధంగా భావించారని చెబుతూ ఓటమిని అంగీకరించాడు.

ముందస్తు అంచనాలు ‘రిమైన్’ వైపు

ఎన్నికల ముందు రోజు వరకు, నిజానికి ఎన్నికల రోజు కూడా అనేక సర్వేలు ‘రిమైన్’ ను బ్రిటిష్ ప్రజలు గెలిపిస్తారని అంచనా వేశాయి. వివిధ విశ్లేషణలు ప్రచురించాయి. వయసుల వారీగా, ప్రాంతాల వారీగా విశ్లేషణలు ప్రచురించాయి. ఉదాహరణకు వయసు మీద పడిన పౌరులు అత్యధికంగా లీవ్ శిబిరంలో ఉండగా, యువకులు, వలస వచ్చి స్ధిరపడినవాళ్ళు ఎక్కువగా రిమైన్ శిబిరంలో ఉన్నారని విశ్లేషణలు తెలిపాయి. రిఫరెండం ఓటింగ్ లో పాల్గొనేవారి సంఖ్యను బట్టి కూడా ఫలితాలు ఉంటాయని విశ్లేషణలు పేర్కొన్నాయి. పెద్ద సంఖ్యలో ఓటింగ్ జరిగితే రిమైన్ నెగ్గుతుందని, తక్కువగా ఓటింగ్ జరిగితే లీవ్ శిబిరం నెగ్గుతుందని అంచనా వేశారు. ఓటింగ్ లో తక్కువ హాజరు నమోదు కావటం అంటే అర్ధం ఓటర్లలో పెద్దగా ఆసక్తి లేదని. అనాసక్త వాతావరణంలో ఒక నిబద్ధత ఉన్నవారే పోలింగ్ బూత్ లకు వస్తారని, అటువంటి ఓపిక, నిబద్ధతలు పెద్దవారికే ఉంటాయని విశ్లేషణలు అంచనా వేశాయి.

అలాగే ప్రాంతీయ విశ్లేషణలు సైతం వెలువడ్డాయి. స్కాట్లండ్, ఉత్తర ఐర్లాండ్ (పశ్చిమ ఐర్లాండ్ భాగం,  ‘ఐర్లాండ్’ గా ప్రత్యేక దేశంగా విడిపోయింది) ప్రజలు రిమైన్ పక్షానే ఉన్నారని మధ్య ఇంగ్లండ్ ప్రాంత ప్రజలు లీవ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారని నిపుణులు భావించారు. లండన్ నగరం అనేక దేశాల నుండి వచ్చినవారికి నిలయం. ఈ‌యూ సభ్య దేశాలతో లండన్ వాసులకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కనుక లండన్ మెజారిటీ ‘రిమైన్’ పక్షం లోనే ఉంటుందని అంచనా వేశారు. మైనారిటీలు, దక్షిణాసియా నుండి వచ్చి స్ధిరపడిన వాళ్ళు మొత్తంగా ‘రిమైన్’ పక్షంలో ఉన్నారని, పురుషుల కంటే మహిళలు ఎక్కువగా రిమైన్ శిబిరంలో ఉన్నారని అంచనా కట్టారు.

చివరికి వాతావరణాన్ని కూడా విశ్లేషణల్లోకి లాక్కు వచ్చారు. వాతావరణం రిఫరెండం లో ఒక పాత్ర పోషించనుందనీ, జూన్ 23 తేదీన బ్రిటన్ లో తుఫాను వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది కనుక ఎక్కువ మంది పోలింగ్ బూత్ లకు రాకపోవచ్చనీ, అప్పుడు లీవ్ శిబిరానికి ఎక్కువ గెలుపు  అవకాశం ఉంటుందని అంచనాలు వేశారు. మీడియా సంస్ధలు కూడా రెండు శిబిరాలుగా చీలి ఉన్నాయని ది హిందు లాంటి పత్రికలు తెలిపాయి. ద టైమ్స్, గార్డియన్, సండే అబ్జర్వర్, మెయిల్ ఆన్ సండే, సండే టెలిగ్రాఫ్ పత్రికలు రిమైన్ శిబిరంలో ఉండగా డెయిలీ టెలిగ్రాఫ్, డెయిలీ మెయిల్, సన్ సంస్ధలు లీవ్ శిబిరంలో ఉన్నాయని ది హిందు తెలిపింది.

ఈ విశ్లేషణలు అధికభాగం ఈ‌యూ కు అనుకూల ఫలితాలు రావాలని పరోక్షంగా కోరుకున్నవే. ఒపీనియన్ పోలింగు, సర్వేలు, విశ్లేషణలు… ఇత్యాది పేరిట ప్రజాభిప్రాయాన్ని తమకు కావలసిన విధంగా మలుచుకోవటాన్ని పశ్చిమ పత్రికలు ఒక వ్యవస్ధగా అభివృద్ధి చేసుకున్నాయి. అయితే ఈ‌యూలో కొనసాగాలన్న శిబిరంతో పాటు విడిపోవాలన్న శిబిరంలోనూ శక్తివంతమైన ఫైనాన్స్ కంపెనీలు ఉండడంతో ‘లీవ్’ అనుకూల సర్వేలు కూడా దండిగానే వెలువడ్డాయి. రాజకీయంగా ‘రిమైన్’ శిబిరానికి అధిక బలం ఉండడంతో ప్రచారంలో ఎక్కువ భాగం రిమైన్ వైపు మొగ్గు చూపింది.

టర్కీ మీదుగా సిరియా శరణార్ధుల పేరుతో ఆఫ్రికా, ఆసియాల నుండి లక్షలాది శరణార్ధులు ఐరోపా దేశాలకు తరలి రావటం, ప్రతి ఈ‌యూ సభ్య దేశమూ తప్పనిసరిగా శరణార్ధులను స్వీకరించాలని జర్మనీ-ఈ‌యూ నిర్దేశించడము, లోతైన పెట్టుబడిదారీ సంక్షోభం కొనసాగుతున్న ఫలితంగా ఉద్యోగాలు తగ్గిపోయి దరిద్రం, పేదరికం నెలకొన్న నేపధ్యంలో వలస శరణార్ధులు తమ అవకాశాలను కాజేస్తారని బ్రిటిష్ ప్రజలు క్రమంగా భావించటంతో చివరికి ‘లీవ్’ శిబిరం పైచేయి సాధించింది.

ఇటీవల కాలంలో ఆర్ధిక సంస్కరణలకు షరతులు లేని మద్దతు ఇస్తున్న ది హిందుతో సహా భారత కార్పొరేట్ పత్రికలు యావత్తూ యూ‌కే, ఈ‌యూ లో ఉండాలని కోరాయి. “ఓ బ్రిటన్, బైటికి వెళ్ళొద్దు ప్లీజ్” అంటూ ఆర్టికల్స్ ను సైతం ఇవి ప్రచురించాయి. పెట్టుబడిదారీ విష పుత్రికల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది గనక?

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జానేట్ యెల్లెన్ బ్రెగ్జిట్ ఓటును ప్రభావితం చేయటానికి ప్రకటనలు జారీ చేసింది. “28 సభ్య దేశాల యూరోపియన్ యూనియన్ నుండి విడిపోవటానికి బ్రిటన్ నిర్ణయిస్తే గణనీయమైన ఆర్ధిక పరిణామాలు సంభవిస్తాయి. ద్రవ్య మార్కెట్ పై బ్రెగ్జిట్ వల్ల కలిగే ప్రభావాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి ఆటంకాలుగా మారతాయి” అని అమెరికా ఫెడరల్ రిజర్వ్ (సెంట్రల్ బ్యాంక్) ఛైర్మన్ జానెట్ యెల్లెన్ ప్రకటించటంతో అమెరికా ఫైనాన్స్ సంస్ధలు బ్రెగ్జిట్ ఓటుపైన అత్యున్నత స్ధాయిలో కేంద్రీకరించాయని తెలిసింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా స్వయంగా బ్రిటన్ పర్యటించి ఈ‌యూను వీడొద్దు అని ప్రచారం చేసిపోయాడు. జార్జి సోరోస్ లాంటి అమెరికన్ బిలియనీర్లు “లీవ్ శిబిరం నెగ్గితే పౌండ్ స్టెర్లింగ్ విలువ ఖచ్చితంగా తీవ్రంగా క్షీణిస్తుంది. సెప్టెంబర్ 1992 లో జరిగిన 15 శాతం క్షీణత  కంటే ఈసారి క్షీణత బాగా ఎక్కువగా ఉంటుంది” అని బెదిరింపులు జారీ చేశాడు. ఈ‌యూ నుండి విడిపోతే ఎంత నష్టమో చెబుతూ ఐ‌ఎం‌ఎఫ్ క్రమం తప్పకుండా నివేదికలు విడుదల చేసింది.

ఈ విధంగా బ్రెగ్జిట్ ను నివారించటానికి అమెరికా సర్వశక్తులూ ఒడ్డటానికి కారణం ఏమిటి?

బ్రెగ్జిట్ అమెరికా ప్రయోజనాలకు విరుద్ధం

యూరోపియన్ యూనియన్ ఉనికితో అమెరికా ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇది నలుపు-తెలుపు లాగా అంత తేలికగా, స్పష్టంగా కనిపించేది కాదు. అత్యంత సంక్లిష్ట పద్ధతుల్లో అమెరికా ప్రయోజనాలు ఈ‌యూలో ఇమిడి ఉంటాయి. అందువలన ఈ‌యూ-అమెరికా సంబంధాలలో జరిగే పరిణామాలు ఒక్కోసారి అయోమయాన్ని కలుగజేస్తాయి. తప్పు ఒప్పు గానూ ఒప్పు తప్పు గానూ కనిపించే అవకాశం ఉంటుంది. అమెరికా ఒకవైపు ఈ‌యూ ఉనికికి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు టర్కీ మీదుగా శరణార్ధులను పనిగట్టుకుని పెద్ద ఎత్తున తరలిస్తూ ఈ‌యూ విచ్ఛిన్నానికి పాటు పడుతున్నట్లు కనిపిస్తుంది.

గతితార్కిక వైరుధ్య సూత్రాల వెలుగులో పరిశీలించినపుడు ఈ అయోమయం తేలిపోతుంది. అమెరికాకు యూరోపియన్ యూనియన్ ఒక పెద్ద వినియోగ మార్కెట్. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దోపిడీ  కొనసాగించడానికి దన్నుగా నిలబడే అనుచరుడు. తన ఆధిపత్యాన్ని సవాలు చేసే శత్రు శిబిరాలను ఎదుర్కొనేందుకు కలిసి వచ్చే మిత్రుడు. కానీ ఆ మిత్రుడు, అనుచరుడు, తన అదుపాజ్ఞలకు లోబడి ఉండాలి తప్ప తనను మించకూడదు. “కార్యేషు దాసి, కరణేషు మంత్రి” తరహా అన్నమాట. శత్రువులను నిర్మూలించేందుకు సలహాలు ఇచ్చి దన్నుగా నిలబడే మంత్రిగా ఉండాలి. అదే సమయంలో తన ప్రయోజనాలను నెరవేర్చే దాసిగా ఉండాలి.

ఈ ప్రయోజనం కోసం అమెరికాయే యూరోపియన్ యూనియన్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసేంది అంటే ఆశ్చర్యపోకూడదు. సోషలిస్టు రష్యా, చైనాల ఉనికి వలన ప్రపంచ వ్యాపితంగా ప్రజా పోరాటాలు, జాతీయ పోరాటాలు చెలరేగుతూ ప్రమాదకరంగా మారటంతో ఐరోపా రాజ్యాలు సోషలిస్టు శిబిరం లోకి వెళ్లకుండా అడ్డుకోవటానికి తానే నిధులు సమకూర్చి జపాన్, ఐరోపాల పెట్టుబడిదారీ అభివృద్ధికి అమెరికా కృషి చేసింది. అందులో భాగంగా ఐరోపా రాజ్యాలను ఉమ్మడి మార్కెట్ గా మార్చేందుకు కూడా అమెరికా కృషి చేసింది. సి‌ఐ‌ఏ నేతృత్వంలో ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ లు ఈ‌యూ ఆవిర్భావానికి 1950ల నుండే కృషి ప్రారంభించి అమలు చేశాయి.

ACEU (అమెరికన్ కమిటీ ఫర్ యూరోపియన్ యూనియన్) ద్వారా ఈ‌యూ పేరుతో ఉమ్మడి, విస్తారమైన మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అమెరికా నిధులు అందజేసింది. అయితే ఈ కృషి ఒకటి రెండు సంవత్సరాలలో జరిగింది కాదు. అనుమానాలను నివృత్తి చేస్తూ, ఒత్తిడి చేస్తూ, అవసరమైనప్పుడు బెదిరిస్తూ తాను తెర వెనుక నిలబడి అనేక సంవత్సరాల తరబడి పని చేసి ప్రాధమిక వ్యవస్ధలను అభివృద్ధి చేసింది. బ్రిటిష్ స్కాలర్ల పరిశోధనలో ఈ అంశాలు వెల్లడి అయ్యాయి.

గతంలో రహస్యంగా ఉన్న పత్రాలను నిర్దిష్ట కాలం ముగిశాక అమెరికా బహిరంగం కావిస్తుంది. 1950లు 60ల కాలం నాటి అలాంటి పత్రాలపై ఆధారపడి నాటింగ్ హామ్ యూనివర్సిటీ (ఇంగ్లండ్) స్కాలర్ రిచర్డ్ ఆల్ద్రిచ్ రూపొందించిన పరిశోధనా పత్రం ఇలా తెలియజేసింది:

“ఐరోపా యూనిటీని నిర్దిష్ట స్ధాయికి ప్రమోట్ చేయటానికి రహస్యంగా నిధులు సమకూర్చే ప్రక్రియ చాలా తక్కువ మంది స్కాలర్ల దృష్టిని ఆకర్షించింది. దీనిని అర్ధం చేసుకున్నవారు కూడా చాలా తక్కువ…. సార్వభౌమ అధికారాలతో యూరోపియన్ డిఫెన్స్ కమ్యూనిటీ, యూరోపియన్ అసెంబ్లీ లను ఏర్పాటు చేయ తలపెట్టిన షూమాన్ పధకానికి అమెరికా ప్రభుత్వం 1949-1960 కాలంలో సమకూర్చిన 3 మిలియన్ డాలర్ల నిధులు ప్రధానంగా ఉపకరించాయి. ఈ రహస్య నిధులు యూరోపియన్ మూవ్మెంట్ బడ్జెట్ లో సగం కంటే ఎప్పుడూ మించలేదు… అదే సమయంలో అటువంటి ఫెడరలిస్టు ఐడియాలను గట్టిగా ప్రతిఘటించిన బ్రిటిష్ లేబర్ ప్రభుత్వం దృష్టి నుండి అవి -రహస్య నిధులు మరియు ఉద్యమం-  తప్పించుకోవడంలో సఫలం ఐనాయి… ప్రత్యేకంగా కొట్టొచ్చినట్లు కనపడే అంశం ఏమిటంటే 1950లలో ఆవిర్భవించిన అత్యంత ముఖ్యమైన మూడు ట్రాన్స్ నేషనల్ ఎలైట్ గ్రూపులకు -యూరోపియన్ మూవ్మెంట్, బిల్డర్ బర్గ్ గ్రూప్, యాక్షన్ కమిటీ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరోప్ (ACUE)- మద్దతు ఇవ్వటంలో అదే కొద్ది మంది అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు కేంద్ర పాత్ర పోషించటం. చివరిగా కొంతమంది బ్రిటిష్ ఫెడరలిస్టు వ్యతిరేకులు అమెరికాతో “ప్రత్యేక సంబంధం” కలిగి ఉండటాన్ని ‘యూరోపియన్ ఫెడరిలిజం’ కు ప్రత్యామ్నాయంగా పరిగణిస్తుండగా యూరోపియన్ ఫెడరలిజం వైపుగా జరిగిన చొరవలను స్ధిరంగా కొనసాగించటానికి అమెరికాయే మద్దతు సమకూర్చవలసి రావటం హాస్యాస్పదమైన విషయం.”

[CIA and European Unity: The American Committee on United Europe, 1948-60 పేరుతో రిచర్డ్ ఆల్ద్రిక్ వెలువరించిన పరిశోధన పత్రం నుండి పై భాగం స్వీకరించబడింది. అప్పటి రహస్య పత్రాలు ఆన్ లైన్ లో నిర్దిష్ట ధరకు అందుబాటులో ఉన్నవి.]

పై ఉటంకన ద్వారా యూరోపియన్ మూవ్మెంట్ ను ఉనికిలోకి తెచ్చి ప్రోత్సహించింది అమెరికా గూఢచార సంస్ధలే అని మనకు తెలుస్తున్నది. ఫెడరల్ తరహా ఐరోపాను నిర్మించటానికి బ్రిటన్ గట్టిగా అభ్యంతరం చెప్పిందని, వారికి తెలియకుండా ఉండటానికి రహస్యంగా నిధులు ఇచ్చారని తెలుస్తున్నది.

యూ‌కే జర్నలిస్టు ఆంబ్రోస్ ఇవాన్స్-ప్రిచర్డ్ కూడా ఈ చరిత్రపై కధనాలు వెలువరించారు. 2000 లో ఒకసారి 2007 లో ఒకసారి ఆయన ఈ‌యూ స్ధాపన వెనుక అమెరికా పాత్ర గురించిన వాస్తవాలను పరిశోధించి వెలువరించారు. సదరు కధానాల్లో ఆయన ఇలా తెలిపారు:

“యూరోపియన్  రాజ్యంలోకి బ్రిటన్ ను నెట్టడానికి తెరవెనుక అమెరికా దూకుడుగా ప్రయత్నాలు చేస్తున్నదన్న అనుమానాలను ఈ పత్రాలు ధృవీకరించాయి. 1950లలో సంతకాల బల్ల దగ్గరికి ఫ్రాన్స్ ను అమెరికా తన్నుకుంటూ, ఈడ్చుకుంటూ వచ్చిందన్న సంగతి మరువకూడదు. బెర్లిన్ తో సహకరించకపోతే మార్షల్ ప్లాన్ ద్వారా అందిస్తున్న నిధులను నిలిపివేస్తానని ఆనాటి అధ్యక్షుడు ఐసన్ హోవర్ ఫ్రాన్స్ ను హెచ్చరించాడు. ఈ‌యూ కు మాస్టర్ మైండ్ గా, ఫౌండింగ్ ఫాదర్ గా చెప్పుకునే ఫ్రాన్స్ మంత్రి జీన్ మానెట్ ను ఆనాడు అమెరికా ఏజెంటుగా చూశారు. అది నిజం కూడా. యుద్ధ కాలంలో ఐరోపాలో రూజ్ వెల్ట్ తరపున పరిష్కర్తగా జీన్ పని చేశాడు. చార్లెస్ డి గల్లే ఫ్రాన్స్ అధ్యక్షుడు కాకుండా ఉండటానికి అమెరికా చేసిన విఫల ప్రయత్నాని అమలు చేసిందీ ఆయనే…

“యూరోపియన్ మూవ్మెంట్ నాయకులు -రెటింగర్, రాబర్ట్ షూమన్, బెల్జియం మాజీ ప్రధాని పాల్-హెన్రీ స్పాక్- వీరంతా అమెరికా నియమించిన ఉద్యోగుల్లాగే చూడబడ్డారు. అమెరికా పాత్ర రహస్య ఆపరేషన్ గా ఉంటూ వచ్చింది. ACUE కి నిధులు ప్రధానంగా ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ లు అందించాయి. అమెరికా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యాపార సంస్ధలు కూడా నిధులు ఇచ్చాయి….

“ఫోర్డ్ ఫౌండేషన్ అధిపతి పాల్ హాఫ్మన్ 1950లలో ఆఫీస్ ఆఫ్ స్పెషల్ సర్వీసెస్ (సి‌ఐ‌ఏ పూర్వనామం)  అధికారిగా కూడా పని చేశాడు. రెండు పదవులు నిర్వహించాడు. మానిటరీ యూనియన్ ను రహస్యంగా ఉంచాలని ఆనాటి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (ఈ‌యూ పూర్వనామం) ఉపాధ్యక్షుడు రాబర్ట్ మర్జోలిన్ కు అమెరికా నుండి వచ్చిన మెమో (జూన్ 11, 1965) ఒకటి ఆదేశించిన సంగతి గమనార్హం…

“అటువంటి (మానిటరీ యూనియన్ లాంటి) ప్రతిపాదనలను అమలు చేయటం తప్ప మరో దారి లేని పరిస్ధితి వచ్చే వరకూ చర్చలను అణచిపెట్టి ఉంచాలని ఆ మేమో నిర్దేశించింది… ట్రీటీ ఆఫ్ రోమ్ (యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ ఏర్పాటుకు దారి తీసిన ఒప్పందం) అమలులోకి వచ్చిన 50 సం.ల తర్వాత యుద్ధానంతర అమెరికా విధాన నిర్ణేతలు -వారిప్పుడు బ్రతికి ఉంటే- తమ కృషి ఫలితం చూసి ఎంతో సంతోషపడి ఉండేవారు.”

(Euro-Federalists financed by US spy chiefs, The Daily Telegraph, 19 Sept 2000)

వ్యవస్ధలను సృష్టించాక ఎంతలేదన్నా అవి సొంత నడకను నేర్చుకుంటాయి. స్వతంత్ర నడకకు ప్రయత్నిస్తాయి. ఆ విధంగా జర్మనీ నేతృత్వంలో యూరోపియన్ యూనియన్ అమెరికా కు పోటీ ఇవ్వటానికి ప్రయత్నాలు చేసింది. కానీ అది నామమాత్రమే. అమెరికా ఎప్పటికప్పుడు తన విద్యలను ప్రయోగిస్తూ ఈ‌యూను అదుపాజ్ఞలలో ఉంచుకోవటంలో -సాధారణ దృక్పధంలో- సఫలం అయింది. అదే సమయంలో బ్రిటన్ కు ప్రత్యర్ధి శక్తిగా అమెరికా, జర్మనీని నిలబెడుతూ వచ్చింది. జర్మనీ-ఫ్రాన్స్ ల ద్వారా బ్రిటన్ ను అదుపు చేస్తూ వచ్చింది.

శతాబ్దాల వలస పాలనలను నిర్వహించిన బ్రిటన్, అమెరికా ఆదేశాల పరిధిలోకి పూర్తిగా వెళ్లకుండా ప్రతిఘటించిందని తాజా రిఫరెండం కూడా అందులో భాగమే అని ఇప్పుడు మనం తేలికగా అర్ధం చేసుకోవచ్చు. తన ఫైనాన్స్ ప్రయోజనాల కోసమే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ లో పూర్తి స్ధాయిలో చేరకుండా తన స్వతంత్రతను అండినంత మేరకు కాపాడుకుంటూ వచ్చింది. ముఖ్యంగా తన ఫైనాన్స్ బలాన్ని పరిరక్షించుకుంటూ వచ్చింది. యూరోపియన్ యూనియన్ లో పూర్తి స్ధాయి సభ్య దేశంగా (యూరో కరెన్సీని స్వీకరించటంతో సహా) బ్రిటన్ మారేందుకు అమెరికా వివిధ రకాలుగా ఒత్తిడిలు తెచ్చినప్పటికీ యూ‌కే ప్రతిఘటించి నిలబడింది. అమెరికా-యూ‌కే ల మధ్య గల ఈ వైరుధ్యపూరిత సంబంధాన్ని ‘ప్రత్యేక సంబంధం’ (special relationship) గా బ్రిటన్ పైకి చెప్పుకుంటుంది.  తద్వారా తమ మధ్య వైరుధ్యాలున్న సంగతిని కప్పి ఉంచుతుంది. ఈ ‘ప్రత్యేక సంబంధం’ ను గుర్తించినట్లుగా అమెరికా కనపడింది చాలా తక్కువ.

ఈ‌యూ తదుపరి లక్ష్యం?

బ్రిటన్ వ్యవహారం కాసేపు పక్కన పెట్టి ఈ‌యూ ఏర్పాటు లక్ష్యాన్ని కాస్త పరిశీలించాలి. సమీప భవిష్యత్తులో తాను ఏమి సాధించదలిచింది తెలియజేస్తూ 2015 అక్టోబర్ లో ఈ‌యూ ఒక అధికారిక నివేదికను విడుదల చేసింది. ఐదు సంస్ధల (ఈ‌యూ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, యూరోపియన్ కమిషన్, యూరో గ్రూప్, యూరో సమ్మిట్) కు చెందిన ఐదుగురు పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. నివేదిక శీర్షిక, “ఐదుగురు అధ్యక్షుల నివేదిక: యూరోప్ ఆర్ధిక మరియు ద్రవ్య యూనియన్ పరిపూర్తి” (The Five Presidents’ Report: Completing Europe’s Economic and Monetary Union). నివేదిక ఇలా పేర్కొన్నది:

“యూరో ఏరియాలో 18 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారి పరిస్ధితి మెరుగుపరచటానికి ఆర్ధిక విధానాలను మరింతగా మెరుగు పరచ వలసి ఉన్నది. ఈ రోజు యూరోప్ యొక్క ఎకనామిక్ అండ్ మానిటరీ యూనియన్ (EMU) అంటే దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్నప్పటికీ ఇంకా పూర్తి కాని ఇల్లు లాంటిది. తుఫాను తాకినపుడు దాని గోడలు, పై కప్పును త్వర త్వరగా బలీయం కావించి నిలకడగా ఉండేట్లు చేయాలి. దాని పునాదులను బలీయం కావించి EMU ను దేనికైతే ఉద్దేశించారో ఆ లక్ష్యాన్ని చేరుకునేలా మార్చటానికి ఇది సరైన సమయం… EMU ని పూర్తి చేయటానికి మరిన్ని చర్యలను మనం తీసుకోవాలి.”

గత ఎనిమిదేళ్లుగా ఈ‌సి‌బి, ఐ‌ఎం‌ఎఫ్, ఈ‌యూ, ఈ‌సి ల పధక రచయితలు అమలు చేసిన విధానాల ఫలితంగా ఈ‌యూ రాజ్యాల ప్రజలు అనేక సమస్యలతో  అల్లాడుతున్నారు. ఆ విధానాలే బ్యాంకు సంక్షోభాలకు, మార్కెట్ బుడగలకు కారణం అయ్యాయి. నిరుద్యోగం ప్రబలి పోయింది. ముఖ్యంగా యువజనుల్లో సగం మంది నిరుద్యోగులుగా మారారు. గ్రీసు, స్పెయిన్, పోర్చుగల్, ఐర్లాండ్, ఇటలీ దేశాలు ఋణ సంక్షోభంలో కూరుకు పోయాయి. సామ్రాజ్యవాద విధానాల ఫలితంగా ముస్లిం దేశాల నుండి ఆఫ్రికా దేశాల నుండి ప్రజలు మెరుగైన జీవనం కోసం ఆశిస్తూ ఐరోపా దేశాలకు తరలి వస్తున్నారు. ఈ సమస్యలకు కారణం తమ విధానాలే అన్న సంగతిని ఐరోపా సంస్ధల నేతలు చూసేందుకు నిరాకరిస్తున్నారు. ఆ నిరాకరణ నుండి అవే విధానాలను మరింత తీవ్రంగా అమలు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. మరింత తీవ్రంగా అమలు చేయటం ద్వారా EMU నిర్మాణాన్ని పరిపూర్తి చేయాలని ప్రతిపాదిస్తున్నారు.

EMU నిర్మాణం పరిపూర్తి చేయటం అంటే ఐరోపా రాజ్యాల సరిహద్దులు చెరిపేయటం, సార్వభౌమ సరిహద్దులను అదృశ్యం చేయటం, సభ్య దేశాల ప్రాదేశిక-సార్వభౌమ అధికారాలను పూర్తిగా మాయం చేయటం. ఆయా దేశాల ప్రభుత్వాల అధికారాలను నామమాత్రం చేసి చివరికి  రద్దు చేయటం, సభ్య రాజ్యాలన్నింటిని కలిపి ఒకే ఒక్క దేశంగా మార్చటం, కేంద్రీకృత యూరోపియన్ గవర్నమెంట్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఏకీకృత మానిటరీ పాలసీ (విత్త విధానం) అమలు చేయటం, ఫైనాన్స్ సంస్ధలు, బ్యాంకులతో సహా సంస్ధలన్నింటి పైనా కేంద్రీకృత నియంత్రణలను అమలు చేయటం. ఇదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్.

ఇది చివారికంటా ఆచరణలోకి తేగలరా లేదా అన్న అనుమానాలు సహజంగా రావాలి. ఈ పధకంలో చాలా వరకు సఫలం అయిన సంగతి మన కళ్ల ముందు ఉన్నదే. కనుక ‘పరిపూర్తి’ చేసే లక్ష్యం సాధించటం సంగతి ఎలా ఉన్నా ఆ వైపుగా తీవ్ర కృషి జరుగుతుంది అనడంలో సందేహం అనవసరం. అనేక దశాబ్దాల పాటు చాప కింద నీరులా పని చేసి యూరోపియన్ ఉమ్మడి మార్కెట్ ను సాకారం చేసుకున్నారు. ఈ క్రమంలో అనేక తప్పులు చేసినా ఎప్పుడూ వెనుదిరగ లేదు. వివిధ కుంభకోణాలు వెల్లడి అయినా నెట్టుకుని వచ్చారు.

ఒక్క బ్రిటన్ మాత్రమే యూరో జోన్ బైట ఉనికి కొనసాగిస్తూ ఉమ్మడి మానిటరీ యూనియన్ లో చేరేందుకు వచ్చిన ఒత్తిడిలను ప్రతిఘటిస్తూ వచ్చింది. కేంద్రీకృత వ్యవస్ధలకు ఆటంకంగా పరిణమించింది. ఇది అమెరికా-బ్రిటన్ సామ్రాజ్యవాద శక్తుల మధ్య వైరుధ్యం. అయితే బ్రిటిష్ పాలకవర్గాలలో ఒక సెక్షన్ ను అమెరికా మాలిమి చేసుకోవటంతో వారిలో అంతర్గతంగా కూడా వైరుధ్యాలు రగులుతున్నాయి. బ్రిటన్ పాలకవర్గాల లోని ఒక సెక్షన్,  ‘ద సిటీ’ అనే ఫైనాన్స్ కేంద్రం ప్రయోజనాలను కాపాడుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తుండగా మరో సెక్షన్ అమెరికా నీడలో ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. లేదా కేవలం అమెరికా ప్రయోజనాల కోసమే పని చేస్తోంది. ఈ వైరుధ్యాన్ని రాజకీయ కోణంలో పరిష్కరించుకునే ప్రయత్నమే “బ్రెగ్జిట్ రిఫరెండం” గా వ్యక్తం అయింది.

ఈ‌యూ సభ్యత్వం అవసరమా?

ఒక్క మాటలో చెప్పాలంటే అవసరం లేనే లేదు. ముఖ్యంగా కార్మికవర్గ దృక్పధంతో చూసినపుడు ఈ‌యూ లేదా యూరో జోన్ సభ్యత్వం అసలే అవసరం లేదు. పెట్టుబడిదారీ బూర్జువా వర్గ దృక్పధంతో చూసినా అవసరం లేదు. జపాన్ ఏ కూటమిలో లేకుండానే స్వతంత్ర శక్తిగా, ఆర్ధిక శక్తిగా అవతరించలేదా? నార్వే అతి చిన్న దేశం. ఈ‌యూ లో చేరాలా వద్దా అన్న అంశం పై ఆ దేశం 1995 లోనే రిఫరెండం నిర్వహించింది. దాదాపు రాజకీయ పార్టీలన్నీ ఈ‌యూ లో చేరుదామని ప్రచారం చేశాయి. బడా వ్యాపార సంస్ధలు, సెంట్రల్ బ్యాంకులు, మీడియా సంస్ధలు ఈ‌యూ సభ్యత్వానికి అనుకూలంగా ప్రచారం చేశాయి. టి.వి చానెళ్లలో పండితులంతా చెరీ ‘యెస్’ కు ఓటు వేయాలని బోధించారు. రకరకాల బెదిరింపులు జారీ చేశారు. ఆశలు చూపారు. అయినా నార్వే ప్రజలు ఈ‌యూ సభ్యత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఈ‌యూ సభ్యత్వం లేకపోయినా నార్వే పెట్టుబడిదారీ అభివృద్ధి సాధించింది. దేశీయ ఉత్పాదక శక్తులను తగినంతగా అభివృద్ధి చేసుకుంటే ఈ‌యూ సభ్యత్వం అవసరం లేదని నార్వే చూపింది. స్విట్జర్లాండ్ కూడా ఐరోపా సంస్ధల్లో సభ్య దేశం కాదు. ఈ‌యూ, అమెరికాలతో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాల ద్వారా  తన ఉనికిని ఆ దేశం దివ్యంగా కొనసాగిస్తోంది.

ఈ‌యూ, యూరో జోన్ (ఈ‌ఎం‌యూ) లు అధికారం కేంద్రీకృతం చేయటానికి ఉద్దేశించిన సంస్ధలు తప్ప ప్రజల అభివృద్ధికి ఉద్దేశించినవి కావు. సంపదలు కొద్ది సంఖ్యలోని బహుళజాతి ద్రవ్య, ఆర్ధిక, మాన్యుఫాక్చరింగ్ కంపెనీల చేతుల్లో కేంద్రీకృతం అయ్యే కొద్దీ వాటిని నిలబెట్టుకుని నిర్వహించుకోవటానికి కేంద్రీకృత రాజకీయ, ఆర్ధిక సంస్ధలు ఆ కంపెనీలకు అవసరం అవుతున్నాయి. సో-కాల్డ్ ప్రజా స్వామిక ఎన్నికలు, సార్వభౌమత్వం, ప్రాదేశిక సరిహద్దులు, వాణిజ్య నియంత్రణలు, నిబంధనలు ఇవన్నీ ఆటంకంగా మారాయని బహుళజాతి సామ్రాజ్యవాద కంపెనీలు భావిస్తున్నాయి. గ్రీసులో ఎన్నికలు జరిగి సిరిజా కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఈ‌సి‌బి, ఐ‌ఎం‌ఎఫ్, ఈ‌సి (యూరోపియన్ ట్రొయికా) లు నిర్దేశించిన విధానాలలో సడలింపులను డిమాండ్ చేస్తే ట్రొయికా ఇచ్చిన సమాధానం గుర్తున్నదా? “ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఒప్పందాలు మారవు” అని దులపరించేసింది. ఎన్నికల ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుని దాని ద్వారా పాత ప్రభుత్వం చేసిన ఒప్పందాలను రద్దు చేయించుకునే అవకాశం గ్రీసు ప్రజలకు లేకుండా పోయిందన్నమాట. ఎన్నికలు జరిగితేనే పరిస్ధితి ఇలా ఉంటే అసలు ఎన్నికలే లేకుండా చేశాక పరిస్ధితి ఏమవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఆటంకాలు ఉండకూడదని బడా కంపెనీలు భావిస్తున్నాయి. అమెరికా సామ్రాజ్యవాద శక్తిని అందుకు సాధనంగా ప్రయోగిస్తున్నాయి.

కానీ సామ్రాజ్యవాద శక్తుల వైరుధ్యాలు ఎల్లకాలం ఐక్యతతో ఉండవు. వారి మధ్య వైరుధ్యాలు అనివార్యంగా తీవ్ర రూపం దాల్చుతాయి. వారి వైరుధ్యాల స్వభావమే అంత. మార్కెట్ల పంపకంలో తలెత్తే అసంతృప్తి ఒకరిపై ఒకరు కత్తులు దూసే వరకు దారి తీస్తాయి. అమెరికా, బ్రిటన్ ల వైరుధ్యాలు ఆ మార్గంలోనే నడుస్తున్నాయి. వాల్ స్ట్రీట్, ద సిటీ అనే రెండు ఫైనాన్స్ మత్త గజాల మధ్య వైరుధ్యం క్రమంగా తీవ్రం అవుతున్నది. ఒకప్పటి శత్రు దేశం జర్మనీ అమెరికా నీడలో కొనసాగుతుండగా, ఒకప్పటి మిత్ర దేశం బ్రిటన్ ఆ నీడ లోనుండి బైటపడేందుకు తద్వారా తన సొంత ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఓ వైపు ఈ‌సి‌బి ఆయుధంగా చేపట్టిన జర్మనీతోనూ మరోవైపు అమెరికాతోనూ బ్రిటన్ సామ్రాజ్యవాదం తలపడుతోందని పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఈ ఘర్షణలో దన్ను కోసం బ్రిటన్ చైనాకు దగ్గర అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సూచనలు ప్రస్ఫుటం అయ్యే కొద్దీ బ్రిటన్ పై అమెరికా మరింత ఒత్తిడి పెంచుతోంది.

బ్రెగ్జిట్ లో గమనించవలసిన మరో ముఖ్యమైన అంశం బ్రిటిష్ పెట్టుబడిదారీ, కార్మికవర్గం ప్రయోజనాల వైరుధ్యాలు. పెట్టుబడిదారీ వ్యవస్ధలో మౌలిక వైరుధ్యం అయిన పెట్టుబడిదారీ – కార్మిక వైరుధ్యం ఒక చర్యగా -అది ఓట్ల ద్వారానే అయినా- వ్యక్తం కావటం బ్రెగ్జిట్ లోని ప్రత్యేకత. పేదలు, కార్మికులు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో బ్రెగ్జిట్ కు మెజారిటీ రాగా సంపన్నులు నివసించే ప్రాంతాల్లో ‘రిమైన్’ కు మెజారిటీ ఓట్లు పడ్డాయి. ఈ‌సి‌బి, ఐ‌ఎం‌ఎఫ్, ఈ‌సి తదితర ‘ప్రత్యక్షంగా ఎన్నుకోబడని సంస్ధలు’ కేంద్రీకృతంగా నిర్దేశించి అమలు చేసిన పొదుపు విధానాల పట్ల శ్రామికులు తీవ్ర అసంతృప్తి చెందటం వల్లనే వారు బ్రెగ్జిట్ వైపు మొగ్గు చూపారు. ‘పాపులిస్టు, తీవ్రవాద విధానాలు’ బ్రెగ్జిట్ ను కోరుకున్నాయని, “అభివృద్ధి విధానాలు” రిమైన్ ను కోరుకున్నాయనీ పశ్చిమ పత్రికలు విశ్లేషిస్తున్నది ఈ నేపధ్యంలోనే. ప్రజలకు ఉపాధి పెంచి, సామాజిక సౌకర్యాలు కల్పించటం కంపెనీల దృష్టిలో ‘పాపులిస్టు’ విధానం. పెద్దవారు బ్రెగ్జిట్ కి ఓటు వేశారని, యువకులు ‘రిమైన్’ కు ఓటు వేశారని పశ్చిమ పత్రికలు చెబుతున్నాయి. తద్వారా బ్రెగ్జిట్ ఓటును పెద్దవారి చాదస్తంగా కొట్టివేసేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. కానీ అందుకు నమ్మదగిన ఆధారాలు ఏమిటో అవి చూపలేదు. ఓటింగ్ ముగిశాక ఏయే ప్రాంతంలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయో తెలుస్తుంది గానీ వయసుల వారీగా ఎలా తెలుస్తుంది?

ఈ నేపధ్యంలో బ్రెగ్జిట్ తీర్పు అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలకు శరాఘాతం లాంటిది. బ్రిటన్ ప్రజల తీర్పుతో రిఫరెండంల కోసం మరిన్ని పిలుపులు అప్పుడే వినపడుతున్నాయి. హాలండ్ ప్రభుత్వం కూడా ఇదే అంశం పై రిఫరెండం నిర్వహించాలని డిమాండ్లు తాజాగా తలెత్తాయి. బ్రిటన్ నుండి విడిపోయెందుకు మరోసారి రిఫరెండం నిర్వహిస్తామని స్కాటిష్ పార్టీలు ప్రకటించాయి. స్కాటిష్ బెదిరింపుల నేపధ్యంలో బ్రెగ్జిట్ తీర్పును నిజంగా అమలు చేస్తారా లేక తాత్సారం చేసి ఆనక తీర్పును తిరగదొడతారా అన్నది వేచి చూడవలసి ఉన్నది. ఎందుకంటే బ్రిటన్ ప్రజల తీర్పు అంతిమం కాకుండా ఉండే విధంగా యూరోపియన్ యూనియన్ చట్టాలలో తగిన ఏర్పాట్లను ముందే చేసి పెట్టుకున్నారు. బ్రిటన్ ప్రజల నిర్ణయాన్ని బ్రిటిష్ పార్లమెంటు, యూరోపియన్ పార్లమెంటు ఆమోదిస్తేనే విడాకులు పరిపూర్తి అవుతాయి. రిఫరెండం ఫలితం అమలు కావటానికి 2 సంవత్సరాల సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ లోపు తీర్పును న్యూట్రలైజ్ చేసే (చంపేసే) ఎత్తులకు అమెరికా పాల్పడకుండా ఉంటుందా?

3 thoughts on “బ్రెగ్జిట్ అద్భుతం: ఈ‌యూతో విడాకులకే బ్రిటిష్ ఓటు (విశ్లేషణ)

  1. నేను ఫ్రాన్సులో ఉన్నపుడు ఒక విషయం గమనించాను. మనం గ్లోబలైజేషన్ అనేదానిని వారు అమెరికనైజేషన్ అనేవారు ఒక వ్యతిరిక్త స్వరంతో. ఇందులో జాతీయాభిమానం కనిపంచేదికాదు . బలవంతంగా రుద్దబడుతున్న ఒక ఆర్ధిక వ్యవస్థపై జనంలో వ్యతిరిక్తతగా కనిపించేది. వారి స్వంత ఆర్ధిక వ్యవస్థ ఎటువంటిదైనా అది ఒక పరిణామక్రమానికి చెందినది.అది ఫ్రెంచి జాతీయుల, దేశస్తుల ప్రజలు తయారుచేసుకున్నది. అందులో లోపాలుంటే వారే సరిదిద్దుకోగలిగి ఉండేవారు. కాని అమెరికా కేంద్రిత ఆర్ధిక విధానం తప్ప మరో మార్గం లేదని అక్కడి రాజకీయ నాయకత్వాన్ని నమ్మింపజేయగలిగారు కాని సాధారణ జనాన్ని కాదని నేను అర్ధంచేసుకున్నాను.. చిత్రమైన సంగతి ఏమిటంటే ఈయూ ఏర్పాటు అమెరికన్ రాజకీయ పెత్తందారీతనానికి వ్యతిరిక్తమనే భావన, వ్యాపార కూటముల మధ్య పోటీతనంతో ఏర్పడిందన్న భావన నాకు కలిగేది. అది నాకు చాలా కన్విన్సింగ్ గా అనిపించేది. ఈ పరిణామం జగన్నాటకంలో కలిగిన కూటముల లాభాల కోసమా ప్రజాసమూహాల దీర్ఘకాలిక ప్రయోజనాలకోసమా అన్నది నేనింకా ఆలోచించుకోవలసిఉంది.

  2. “చిత్రమైన సంగతి ఏమిటంటే ఈయూ ఏర్పాటు అమెరికన్ రాజకీయ పెత్తందారీతనానికి వ్యతిరిక్తమనే భావన, వ్యాపార కూటముల మధ్య పోటీతనంతో ఏర్పడిందన్న భావన నాకు కలిగేది.”

    వివిన మూర్తి గారు,

    మీకు కలిగిన భావన నిజానికి చిత్రమైనది ఏమీ కాదు. మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీలు దాదాపు ఇలాంటి అవగాహననే కలిగి ఉన్నాయి. ప్రపంచ భౌగోళిక రాజకీయ రంగంలో కోల్డ్ వార్ ముగిసే వరకు అమెరికా, రష్యాలు రెండు అగ్రరాజ్యాలు గా ఉన్నాయన్నది ఎం‌ఎల్ అవగాహన. అనంతరం సోవియట్ రష్యా పతనంతో ప్రపంచం ఏక ధృవ ప్రపంచం అయిందని, అమెరికాకు పోటీగా జపాన్, ఈ‌యూ లు అభివృద్ధి అవుతున్న నేపధ్యంలో 2008 ఆర్ధిక సంక్షోభం దరిమిలా ప్రపంచం బహుళ ధృవ ప్రపంచం వైపు ప్రయాణం చేస్తోందని ఎం‌ఎల్ పార్టీల అవగాహన.

    ఇప్పటివరకు మనకు తెలియని విషయం ఒక్కటే: అది, ఈ‌యూ అభివృద్ధిలో అమెరికా పాత్ర ఉండటం. అమెరికా ప్రయోజనాల కోసమే అయినా, ఫ్రాన్స్ బలవంతంగా సంతకం చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ దేశాలు ఈ‌యూ కు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని, బైటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని అర్ధం చేసుకోవటానికి వీలు లేదు. అమెరికా రహస్య ప్రోత్సాహంతో ఏర్పడిన ఈ‌యూ ద్వారా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు కూడా లబ్ది పొందాయి. ఆ లబ్ది పొందుతూ అమెరికా పెత్తనానికి ప్రతిఘటన ఇవ్వటం కూడా వాస్తవమే. ఈ రెండింటిలో ఏది ప్రధానం అన్నది చర్చాంశం. యూ‌ఎస్, ఈ‌యూ లు తమ వైరుధ్యాలను పరిష్కరించుకుంటూ ఐక్యత ప్రధాన అంశంగా ఇన్నాళ్లూ కలిసి పని చేశాయని, సంక్షోభ పరిస్ధితుల వలన ఘర్షణ వైఖరి పాదుకుంటోందని పనామా పేపర్స్, బ్రెగ్జిట్, ఏ‌ఐ‌ఐ‌బి ఘటనలు మనకు చెబుతున్నాయి.

    ఈ‌యూ-అమెరికా సంబంధాన్ని, బ్రిటన్-అమెరికా సంబంధాన్ని వేరు వేరుగా చూడగలిగితే confusion తొలగవచ్చు. ప్రస్తుతానికి అమెరికా-ఈ‌యూ (జర్మనీ & ఫ్రాన్స్) ల మధ్య ఉన్న ఐక్యత అమెరికా-బ్రిటిష్ మధ్య లేదు. అలాగని ఈ తేడా గుణాత్మకమైనది కూడా కాదు. పరిమాణాత్మక తేడాలుగా ఉన్న ఇవి గుణాత్మక తేడా వైపు జరుగుతున్నాయి. వైరుధ్యాల తీవ్రత మరింత స్పష్టం కానంత వరకు మనకు ఈ అంచనాల జంఝాటం తప్పకపోవచ్చు.

  3. శేఖర్ గారూ, మీరన్నది ఆలోచంచవలసిందే. అమెరికా రహస్యప్రోత్సాహం అన్న విషయం ఇప్పుడే తెలిసింది.

    అలాగే బ్రిటన్ అమెరికాల (తొలి ప్రత్యక్ష కాలనీ వ్యవస్థ ద్వారా బలిసిన బ్రిటన్, మలి పరోక్ష కాలనీ వ్యవస్థ ద్వారా ప్రపంచాన్ని గుప్పిటలో పెట్టుకున్న అమెరికా) మధ్య రాజకీయ ఐక్యత, వ్యాపార ఘర్షణ తప్పదన్న ఆలోచన నాది.

    1944-46 మధ్య రెండవప్రపంచయుద్ధంలో దెబ్బతిన్న యూరప్ దేశాలు, దెబ్బతినని అమెరికా ఆధ్వర్యంలో నాడు వారు ఏర్పరచుకున్న గాట్, ఐబిఆర్డీ, ఐఎమ్మెఫ్ కూటమి బ్రెటన్ వుడ్ సమావేశం ఫలితంగా ఏర్పడ్డాయి. ఫిక్యెడ్ డాలర్ సిస్టమ్ ద్వారా మరింత బలిసిన అమెరికా ఇతరదేశాలపట్ల బాధ్యతలేని పెత్తనం కోసం డాలర్ ఆధిపత్యరూపాన్ని మార్చింది. ఫ్లోటింగ్ డాలర్ సిస్టమ్ ఆరంభమయాక క్రమంగా యీయూ వంటి సంస్థలు ప్రపంచంలో ఆప్రికా సంస్థ, సార్క్, ఎడిబి వంటివి ఇటీవల చైనా బాంకు ఇవన్నీ పుట్టుకురావటం ఏం సూచిస్తోంది? వ్యాపారుల మధ్య ఘర్షణ అనివార్యమన్న కమ్యూనిస్టు అంచనాయా లేక జాతుల మధ్య పెత్తనం కోసం ఘర్షణయా (రాజకీయం లేదా ఎమోషనల్ సమస్యలు)? జాతుల సమస్య పరిష్కరించలేక కూలిన తూర్పు యూరప్, రష్యా కమ్యూనిస్టు ప్రయత్నాలు మన దేశంలో కుల సమస్య పరిష్కరించటంలో కమ్యూనిస్టుల వైఫల్యాలు కలిసి చూస్తే వ్యాపారుల మధ్య ఘర్షణ కన్న జాతుల మధ్య ఘర్షణ ప్రస్తుత ప్రపంచంలో బలంగా వుందని నాకు అనిపిస్తోంది.

    బ్రిక్సిట్ లో పాతతరం వారు గెటోట్ కి నిలబడటం కొత్తతరం రిమైన్ కి నిలబడటం గురించి రూరల్ అర్బన్ విభజన గురించి ప్రపంచవ్యాప్త వ్యవసాయ సంక్షోభం గురించి మనం ఇంకా లోతుగా అర్ధం చేసుకోవాలి. అంతిమంగా ఆర్థిక సంబంధాలే కాని వ్యాపార కూటములు జాతి సమస్యను ఉపయోగించుకోగలవు గాని పరిష్కరించలేవని నాకు అనిపించి సంతోషంగానే ఉంది. ఏమైనా గ్రెక్యిట్ తరవాత ఏం జరిగింది? మనం ఈ పరిణామాలను ఇంకా అధ్యయనం చెయ్యవలసేఉంది. pigs దేశాలు(portugal, italy, greece, spain ) ఈ కేపిటలిస్టు సిస్టం డబ్బుపోసి కూడా బ్రతికించలేని దేశాలన్న వాదన కూడా ఉంది( ఇవన్నీ యూరప్ చరిత్రజ్ఞుల ప్రకారం ప్రపంచ రాజకీయ అధికారం- ఆదునికయుగంలో -కొంతకాలం అనుభవించిన దేశాలు) అసలు తప్పులు చేసి ప్రశ్చాత్తాప ప్రకటన(confession economics) ద్వారా సొమ్ము చేసుకునే ప్రపంచ పేరాశ కేంద్రం అమెరికా ప్రచారంలో ఈయూ వారి సృష్టే అయినా ఆశ్చర్యం లేదు వారి వైఫల్యానికి కొత్త తొడుగు వేసుకున్నా ఆశ్చర్యం లేదు. దీనిగురించి ఇంకా మనం జాగ్రత్తగా గమనించాలనే నాకు అనిపిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s