రేప్డ్ వుమెన్ తో సల్మాన్ పోలిక ఎందుకు తప్పు?


Sultan 01

సల్మాన్ ఖాన్ మరో వివాదానికి తెర తీశాడు. సుల్తాన్ సినిమా చిత్రీకరణ సందర్భంగా తాను ఎదుర్కొన్న నెప్పి, బాధ, అలసట, హూనం… ఇత్యాది భౌతిక అనుభవాలను అభివర్ణించటానికి అనూహ్యమైన, ఖండనార్హమైన పోలికను తెచ్చాడు.

దానితో మరో సారి దేశవ్యాపితంగా సల్మాన్ కు వ్యతిరేకంగా, అనుకూలంగా వాద ప్రతి వాదాలు చెలరేగాయి. పత్రికలకు మరో హాట్ టాపిక్ లభించింది. చానెళ్లకు మరొక ప్రైమ్ టైమ్ చర్చాంశం అంది వచ్చింది. చర్చల మెదళ్ళకు, టి.వి యాంకర్లకు మేత దొరికింది.

ట్విట్టర్ లో సరికొత్త ట్రెండింగ్ టాపిక్ లు బయలుదేరాయి. ట్విట్టర్ గణాలు చెరోవైపూ చేరి తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి.

మొదట ఈ టాపిక్ గురించి రాయనవసరం లేదని భావించాను. సల్మాన్ తండ్రి సారీ చెప్పాడని విన్నాను. మాటల సందర్భంలో సల్మాన్ అన్నాడని చదివి సారీ చెప్పి ఉంటాడులే అని గమ్మున ఉన్నాను. (నిజానికి తాను అన్న మాట అని ఉండ కూడదని అన్న వెంటనే సల్మాన్ అన్నాడట కూడా.)

కానీ భోజనం చేస్తూ ఎన్‌డి‌టి‌వి, ఇండియా టుడే చానెళ్లను చూస్తుండగా దాదాపు షాక్ లాంటి అనుభవం కలిగింది. సల్మాన్ వ్యాఖ్యలకు సమర్ధనగా పేరు పొందిన ఫెమినిస్టులు, హీరోయిన్లు వాదనలు చేయడం నా షాక్ కి కారణం.

ఎన్‌డి‌టి‌వి లో సల్మాన్ అన్నదానిలో తప్పేం ఉందని మాజీ హీరోయిన్ నగ్మా వాదించగా, ఇండియా టుడే చానెల్ లో కండల బలుడి తరుపున పేరు పొందిన ఫెమినిస్టు కార్యకర్త మధు కీశ్వర్ వకాల్తా పుచ్చుకున్నారు.

When I used to walk out of that ring, it used to be actually like a raped woman walking out….I don’t think I should have (pauses). It feels like the most difficult….I couldn’t take steps. I couldn’t take steps.

ఆ (రెజ్లింగ్) రింగు నుండి బయటకు వస్తున్నపుడు అత్యాచారానికి గురైన మహిళ నడిచి వస్తున్నట్లుగా ఉండేవాడ్ని… I don’t think I should have… చాలా కష్టంగా అనిపించేది… నేను ఏ మాత్రం అడుగులు వేయలేకపోయేవాడిని…

పై మాటల్లో ఆంగ్ల భాగం అనువాదానికి తగిన విధంగా లేకపోవడం గమనించ వచ్చు. ఈ వాక్యంలో కర్త, క్రియ ఉన్నాయి గానీ కర్మ ఏమిటో తెలియటం లేదు. దానిని తెలుగులో అనువాదం చేయగల సంపూర్ణ వాక్యంగా లేదు. ఏదో ఫలానాది చేసి ఉండ కూడదు అనో, చెప్పి ఉండకూడదు అనో అంటున్నట్లుగా ఉంది గానీ అదేమిటి అన్నది స్పష్టంగా లేదు. సల్మాన్ మద్దతు దారులు దీనిని చూపిస్తూ ఆయన తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడని చెబుతున్నారు. ఈ విషయంలో సల్మాన్ తప్ప మరొకరు స్పష్టత ఇవ్వలేరు.

కనుక ‘తాను అన్న మాట అని ఉండకూడదని సల్మాన్ ఖానే, అన్న వెంటనే, చెప్పాడు’ అంటున్న సల్మాన్ మద్దతుదారుల వాదన ఆధారపడ్డ తగ్గది కాదు. అయితే ఆయన తండ్రి, బాలీవుడ్ రచయిత సలీం ఖాన్ స్వయంగా తన కుమారుడి తరపున, కుటుంబం తరపున సారీ చెప్పాడు.

కానీ సల్మాన్ సారీ చెప్పకుండా ఆయన తరపున ఎంతమంది సారీ చెప్పినా ఏం లాభం? సల్మాన్ తరపున ఎంత మంది సారీ చెప్పినా అది సల్మాన్ చెప్పినట్లు కాదు. “సల్మాన్ ఏదో అన్నాడని నన్నెందుకు వివరణ అడుగుతున్నారు? అదేదో అతనినే అడగొచ్చు కదా” అని సల్మాన్ తమ్ముడు సర్ఫాజ్ (ఇండియా టుడే చానెల్ లో) ప్రశ్నించటం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

కానీ చూడబోతే సమస్య సల్మాన్ వల్ల వచ్చినట్లుగా లేదు. ఆయన మద్దతుదారులు వినిపిస్తున్న కుంటి వాదనలే అసలు సమస్య అవుతున్నాయి. సల్మాన్ వంది మాగధ గణం ఆయన తప్పేమీ లేదని బల్లలు గుద్దడమే ఒక విచిత్రం కాగా ఆ గణాల్లో మోడి మద్దతుదారులు ఉండటం ఒక విశేషం.

ఆయన అన్న మాటల్లో తప్పేం ఉందని ఒకావిడా, ఆయన ఉద్దేశం తప్పు కాదని ఒకాయనా, “అలాంటి మాటల్ని అందరూ అంటూ ఉంటారు, స్త్రీలు, పురుషులు అందరూ అనేవే, నిన్న గాక మొన్న అందరూ సమర్ధించిన ఉద్తా పంజాబ్ సినిమాలో అనేక దూషణలు (తిట్లు) ఉన్నాయి. అక్కడ లేని తప్పు సల్మాన్ మాటల్లో ఎందుకు ఉంటుంది?” అని మరొక కార్యకర్తా ఛానెల్స్ చర్చల్లో వాదించారు.

ఎన్.డి.టి.వి చర్చలో పాల్గొంటూ సినీ నటి నగ్మా “సల్మాన్ ఖాన్ ఉద్దేశాన్ని మీరు చూడాలి. ఆయనకు దురుద్దేశం అంటగట్టడం సరికాదు. ఆయన మాటల అంతరార్థం (intention) లో తప్పు లేదు” అని వాదించారు.

వీర ఫెమినిస్టు గా ప్రసిద్ధి చెందిన కార్యకర్త (activist) మధు కీశ్వర్ అందజేసిన సమర్ధన ఇంకా తీవ్రంగా ఉన్నది. ఇండియా టుడే ఛానెల్ చర్చలో పాల్గొంటూ ఆమె, “సల్మాన్ మాటల్లో తప్పు ఏమిటో నాకు బోధపడడం లేదు. ఆయన నిజానికి మహిళలకు అనుకూలంగా వ్యాఖ్యానించారు. అత్యాచారానికి గురైన మహిళల బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో తన అనుభవంతో పోల్చి చెప్పారు. అందులో తప్పేమిటి?” అని ప్రశ్నించారు.

మరొకరో మరొకరో ఈ విధంగా వ్యాఖ్యానిస్తే ఇంతగా మాట్లాడుకోవలసిన అవసరం ఉండకపోవును. మధు కీశ్వర్ ఇలా అనటమే ఆశ్చర్యకరం, ఆందోళనకరం. ఎందుకంటే, తొలి తరం భారత ఫెమినిస్టులలో మధు కీశ్వర్ ఒకరు. తొలి తరం ఫెమినిస్టు పత్రికల్లో ఒకటైన ‘మానుషి’ కి ఆమె ఎడిటర్ కూడా.

manushi

ఇటీవలి వరకూ సాపేక్షికంగా మంచి రచనలతో వెలువడిన మానుషి ఇటీవల హఠాత్తుగా రూటు మార్చుకుంది. ముఖ్యంగా నరేంద్ర మోడి ఎదుగుదల దాదాపు ఖాయం అయినప్పటి నుంచి -కనీసం 2012-13 నుండి- మధు కీశ్వర్ తో పాటు, మానుషి కూడా మోడీ భజన మొదలు పెట్టింది. మోడీ భజన అంటే అనివార్యంగా హిందూత్వ భజన కాక తప్పదు.

ఆ భజన ఎంత వరకు వెళ్లింది అంటే, 2001 గుజరాత్ మారణహోమం లో ముఖ్యమంత్రి ఏం చేయగలడని ప్రశ్నిస్తూ మోడీ బాధ్యత ఏమీ లేదని సర్టిఫికెట్ ఇచ్చేంత వరకూ. చివరికి ఆమె మోడి నామా పేరుతో మానుషి పత్రికలో సిరీస్ గా ఒక వ్యాస పరంపర ప్రచురించారు. ఆ వ్యాసాలను పుస్తకంగానూ తెచ్చి చంద్రుడికో నూలు పోగు తరహాలో మోడి భజన బృందంలో చేరి తరించారు.

ముఖ్యమంత్రిగా మోడి సాధించిన విజయాలను ఆమె ఆ పుస్తకంలో ఏకరువు పెట్టారు. ఫలితంగా విదేశీ నిధులతో నడిచే ఎన్.జి.ఒ లపై మోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొరడా జళిపించినపుడు మధు నడిపే ఎన్.జి.ఓ పైన ఈగ కూడా వాలలేదు.

Madhu Kishwar

మోడి భజన బృందంలో చేరటం మధు కీశ్వర్ ఎంపిక (ఛాయిస్), అది ఆమె ఇష్టం. కానీ ఆమె రాజకీయ విధేయత మారినంత మాత్రాన ఇన్నాళ్లూ తాను మోసిన సామాజిక భావజాలం, జీవిత కాల కృషి, ఫెమినిస్టు తపో శక్తి అన్నింటినీ గడ్డి పోచ లెక్కన పరిత్యాగం చేయాలా? భావజాలం ముఖ్యం అనుకుంటే, తమ భావజాలం పట్ల నిబద్ధత ఉన్నట్లయితే, ఇలాంటి పరిత్యాగాలు జరగవు.

నగ్మా గానీ, మధు కీశ్వర్ గానీ చెప్పదలిచింది ఏమిటంటే…

“భారతీయ సినిమాలలో నటించే హీరోలు అనేక విధాలుగా అష్ట కష్టాలు పడి సినిమాల్లో నటించి వాటిని హిట్ చేస్తారు. పాటల్లో డ్యాన్స్ లు వేసినా, విలన్ లతో కలిసి కిందా మీదా పొర్లాడుతూ, గాల్లో హై జంప్ లూ లాంగ్ జంప్ లూ చేసుకుంటూ పోరాటాలు చేస్తూ శారీరకంగా తీవ్ర నెప్పి, బాధ ఎదుర్కొంటారు.

అత్యాచారానికి గురైన స్త్రీ ఏ విధంగా శారీరకంగా బాధకు గురవుతుందో, అదే తరహా బాధకు సినిమా హీరోలు షూటింగ్ సమయాల్లో ఎదుర్కొంటున్నారు. కాబట్టి అటువంటి కష్టాన్ని బయిటకు చెప్పుకుంటున్న సల్మాన్ మాటల్లో తప్పు లేదు. తప్పు లేకపోగా నిజానికి ఎవరూ గుర్తించని విధంగా అత్యాచారానికి గురయిన మహిళ బాధను సల్మాన్ ఖాన్ గుర్తించాడు.

ఒక్క గుర్తించడంతో పాటే ఆయన సరిపెట్టుకోలేదు. ఆమె బాధను తన బాధగా మలుచుకుని తాను షూటింగ్ లలో భరిస్తున్న బాధతో పోల్చాడు. తద్వారా సల్మాన్ ఖాన్ అత్యాచార బాధిత మహిళ యొక్క వాస్తవ బాధను సల్మాన్ సరైన పోలికతో వ్యక్తీకరించాడు.”

ఈ మాటలను ఉన్నది ఉన్నట్లుగా నగ్మా, మధు కీశ్వర్ లు అనలేదు. కానీ వారి మాటల సారాంశం మటుకు ఇదే. ఈ మాటల్లో అత్యాచార బాధిత మహిళ బాధను గుర్తించటం ఉన్నదా లేక తేలిక చేయటం ఉన్నదా?

సల్మాన్ ఖాన్ మాటలు రికార్డు అయిన టేపులను న్యూస్ ఛానెళ్లు ప్రసారం చేసి వినిపించాయి. అనేక వారాలుగా సుల్తాన్ షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నాడట. మల్ల యుద్ధం లేదా కుస్తీ పోటీలు ప్రధాన అంశంగా ఉన్న సినిమా షూటింగ్ లో మహాకాయులు అయిన ప్రత్యర్ధులను రెండు చేతుల్లో ఎత్తి కుదేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. వాటిని కూడా చానెళ్లు ప్రసారం చేశాయి.

Sultan 02

అలా ఎత్తి కుదేయటంలో తాను చాలా కష్ట పడ్డానని సల్మాన్ చెప్పుకున్నాడు. 6 గంటల పాటు షూటింగ్ జరిగేదని ఆ సమయం అంతా తాను ఒకరిని ఎత్తి కుదేయడమో, మరొకరు తనను ఎత్తి కుదేయడమో సాగేదనీ చెప్పుకున్నాడు. వాస్తవంగా జరిగే మల్ల యుద్ధాల్లో ఇలా అనేకసార్లు గంటల తరబడి ప్రత్యర్ధులను ఎత్తి కుదేయటాలు ఉండవనీ, కానీ షూటింగ్ లో ఒక్కో షాట్ ఐదు, పది టేకులు తీసుకోవటం వల్ల ఒకటికి పది సార్లు ఎత్తి కుదేయటం జరిగిందని దానితో ఒళ్ళు హూనం అయిందని చెబుతూ “షూటింగ్ ముగిసే సరికి నా పరిస్ధితి అత్యాచారానికి గురయిన స్త్రీ పరిస్ధితిలా ఉండేది” అని చెప్పాడు సల్మాన్ ఖాన్.

ఆయన ఆ మాట అనగానే చుట్టూ ఉన్న విలేఖరులు అందరూ పక పకా నవ్వటం (ఆడా, మగా అందరూ) మనకు టేపుల్లో వినిపిస్తుంది. ఆ నవ్వుల తర్వాత “I don’t think I should have..” అని సల్మాన్ ఆగాక మళ్ళీ నవ్వులు వినిపించాయి.

మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. సుల్తాన్ సినిమా మల్ల యుద్ధం గురించినది. హీరో ఒక మల్ల యోధుడు. హీరో కనుక ప్రత్యర్ధులను ఎత్తి కుదేయక తప్పదు. ఒకటి రెండు సార్లు విలన్లు కూడా ఆయన్ని ఎత్తి కుదేయటమో పిడి గుద్దులు గుద్దడమో చేయక తప్పదు. వాస్తవంగా గుద్దక పోయినా గుద్దిన ఫలితం రావాలంటే హీరో గారు కిందా మీదా పడాల్సిందే. ఇవే అత్యంత కష్టంగా ఉన్నాయని సల్మాన్ చెప్పాడు. సుల్తాన్ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను అని సల్మాన్ చెప్పుకోదలిచాడు. అందులో తప్పు లేదు. “ఆయన ఉద్దేశంలో తప్పు లేదు” అని నగ్మా, సర్ఫాజ్ ఖాన్ లు అనటం ఈ కోణం నుండే.

తప్పు లేదు సరే. అసలు దానిని ఎవరూ తప్పు పట్టటం లేదు కూడాను. తప్పు పడుతున్నదల్లా తన హీరోయిజం షూటింగ్ బాధను అత్యాచార బాధితురాలి బాధతో పోల్చడాన్ని మాత్రమే కదా! ఆ సంగతి నగ్మా, మధు కీశ్వర్ లకు అర్ధం కాలేదా? అర్ధం అయ్యీ అర్ధం కానట్లు నటిస్తున్నారా?

షూటింగ్ కోసం ఒక హీరో కష్ట పడతున్నాడంటే అతన్ని అలా కష్ట పడమని ఎవరు బలవంతం చేస్తున్నారు? ఆ కష్టానికి అతను సిద్ధం అయ్యే కదా షూటింగ్ లోకి వెళ్లింది! ఆ కష్టం పడినందుకు హీరోకు కోట్ల రూపాయల సొమ్ము ముడుతుంది. అభిమానుల అభిమానం దక్కుతుంది. నిజంగానే విలన్లను చీల్చి చెండాడినంత హీరో ఆరాధన లభిస్తుంది.

ఒక్క హీరోలే ఏం ఖర్మ! హీరోకు ముట్టే కోట్లాది సొమ్ములో వందో వంతు కూడా చెల్లింపుకు నోచుకోని విలన్లు, సైడ్ విలన్లు, ఎగస్ట్రా విలన్లు అందరూ షూటింగుల్లో కష్టాలు పడతారు. ఒలింపిక్స్ లో బాక్సింగ్ లాంటి క్రీడల్లో దేశానికి మెడల్స్ తెస్తున్న ఆటగాళ్ళు కూడా సంవత్సరం అంతా కష్ట పడుతూనే ఉంటారు. పరుగు పందెం, క్రికెట్, హాకీ, ఫుట్ బాల్ ఇలా వివిధ క్రీడల్లో కృషి చేస్తున్న ఆట గాళ్ళు కూడా దైనందిన జీవితాలకు భిన్నంగా కష్టం చేస్తూనే ఉంటారు. (సల్మాన్ కి కోట్లయినా వస్తాయి, ఆట గాళ్లకు మెడల్స్, ఒకటి రెండు ఎండార్స్ మెంట్లు తప్ప ఏమీ ముట్టవు.)

పైన చెప్పిన వారంతా తమ తమ రంగాలలో ఉన్నత స్ధాయికి చేరుకోవటానికీ, మెడల్స్ సంపాదించటానికీ, కీర్తి ప్రతిష్టలు సంపాదించటానికీ, ముఖ్యంగా డబ్బు సంపాదించటానికి ఆయా కష్టాలకు సిద్ధ పడి రంగంలోకి దిగుతారు.

కానీ మహిళపై జరిగే అత్యాచారం అలాంటిది కాదు కదా! నిర్భయనే తీసుకుంటే ఆమె తన స్నేహితునితో కలిసి ఫస్ట్ షో సినిమాకు వెళ్ళి వస్తోంది. ఇంటికి వెళ్ళటానికి బస్సు ఎక్కటానికి అందరి లాగానే బస్టాండ్ లో నిలబడింది. మగ కొవ్వు ఎక్కిన దుండగుల కళ్ళు ఆమె మీద పడ్డాయి. వాళ్ళే ఎక్కడికి వెళ్లాలని అడిగి తమ బస్సు అక్కడికి వెళ్తుందని అబద్ధం చెప్పి మరీ బస్సులో ఎక్కించుకున్నారు.

ఇంతవరకు చూస్తే జరగబోయే అఘాయిత్యం గురించి నిర్భయకు తెలిసి ఉన్నట్లా? అందుకు ఆమె సిద్ధ పడి ఉన్నట్లా? కాదు కదా! కాకపోగా తాను క్షేమంగా ఇంటికి వెళ్తానన్న నమ్మకంతో బస్సు ఎక్కిందామే. పితృస్వామ్యం అందించిన హక్కుని చేతబట్టి ఆ పశువులు (పశువులకు క్షమాపణలతో) నిర్భయను కబళించారు. ఆమెకు తీరని బాధను కలిగించారు. మూడు వారాల పాటు మృత్యు పోరాటం చేయవలసిన పరిస్ధితి కల్పించారు. చివరికి ప్రాణం పోయే దుర్మార్గానికి పాల్పడ్డారు.

ఈ బాధనీ, సల్మాన్ ఎదుర్కొన్న కష్టాన్ని పోల్చి చెప్పవచ్చా? డబ్బు కోసం కష్టానికి సిద్ధపడ్డ వ్యక్తి కష్టమూ, అమాయకంగా బస్సు ఎక్కి మగ పశు వాంఛకు బలైన నిర్భయ కష్టమూ ఒకటేనా? అసలు వినడానికే ఎంత ఘోరంగా, ఒళ్ళు జలదరించేట్లు ఉన్న ఈ పోలికను అంత క్యాజువల్ గా ఎలా చెప్పగలరు? ఈ పోలిక తేవటమే అసహ్యంగా, రోతగా, దుర్మార్గంగా అనిపించటం లేదా?

నిర్భయ బాధ మగ స్వామ్య వ్యవస్ధ రుద్దిన బాధ. ఒళ్ళు బలిసి పశు వాంఛ నిండిన మృగం బలవంతంగా రుద్దిన బాధ. తనది కానీ శరీరాన్ని బలవంతంగా సొంతం చేసుకునేందుకు బరితెగిస్తే కలిగిన బాధ. ఆడ పిల్ల చీకటి పడితే గడప దాటి కాలు బైటికి పెట్టకూడదని నమ్మిన భూస్వామ్య దురహంకార భావజాలం బల ప్రయోగంతో రుద్దిన బాధ. తమ మగాధిపత్య నమ్మకానికి విరుద్ధంగా గడప దాటిన అమ్మాయికి ఒక గుణపాఠం నేర్పాలని తలపెట్టి దురహంకార పంజాతో లేడి కూన శరీరాన్ని నిలువునా చీల్చి హింస పెట్టిన బాధ. ఆ బాధలో గొప్ప చేసి చెప్పుకునేది ఏమీ లేదు.

సల్మాన్ బాధ ఇష్టంతో సిద్ధ పడ్డ బాధ. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పై కన్నేసిన బాధ. సినిమా హిట్ అయితే స్వర్గ లోకాల నుండి దేవతలు పూల వాన కురిపించినట్లుగా తనపై కురియనున్న హర్షాతిరేకాల పైనా అభిమాన గణాల ఆనంద సందోహాల పైనా దృష్టి పెట్టిన బాధ. ఆ బాధను ఎంత తీవ్రంగా అనుభవిస్తే అంత గొప్ప. దాని గురించి పత్రికలకు ఎంత బాగా చెప్పుకుంటే అంత కీర్తి ప్రతిష్టలు దక్కే బాధ.

ఒక్క నిర్భయ మాత్రమే కాదు. దేశంలో అనేక చోట్ల… పని స్ధలాల్లో, ఆఫీసుల్లో, కార్ఖానాల్లో, పొలాల్లో, చివరికి ఇళ్ళల్లో కూడా ఇదే తరహా బాధను అత్యాచార బాధిత మహిళలు, యువతులు, బాలికలు ఎదుర్కొంటున్నారు. ఈ బాధ ఆయా మహిళలకు రెమ్యూనరేషన్ ఏమీ ఇవ్వదు. జీవితకాలం పాటు అనుభవించాల్సిన భయంకరమైన వేదనను, యాతనను మాత్రమే మిగుల్చుతుంది. ఆ బాధను గొప్ప చేసి చెప్పుకోగల నటన బాధతో పోల్చి వాపోవటం పరమ అభ్యంతరకరం. అత్యంత జుగుప్సను కలిగించే పోలిక ఇది.

ఇలాంటి జుగుప్సకు మధు కీశ్వర్ లాంటి వారు మద్దతు ఇవ్వటం, కారణంగా నిలవటం మరింత జుగుప్స కలిగిస్తోంది. సల్మాన్ వ్యాఖ్యను తప్పు పడుతున్నవాళ్లు సైకియాట్రిస్ట్ ను కలవాలని సూచించే స్ధాయికి దిగజారిన మధు కీశ్వర్ ను ఇక పట్టించుకోనవసరం లేదు. సల్మాన్ కి సినిమా రెమ్యూనరేషన్ ఎంత అవసరమో మధు కీశ్వర్ కి మోడి చలవతో విదేశాల నుండే వచ్చే నిధులు అంత అవసరం.

బహుశా హిందూత్వలోకి దిగాక ఇలాంటి జుగుప్సలకి దిగడం క్యాజువల్ అయిపోతుందేమో పరిశీలించాల్సి ఉంది. లేకపోతే మహిళా హక్కుల ఉద్యమంలో తనకంటూ ఒక స్ధానం సృష్టించుకున్న వ్యక్తి ఇంతగా దిగజారి అసంబద్ధ పోలికకు మద్దతుగా రావటం ఎలా సాధ్యం?

 

8 thoughts on “రేప్డ్ వుమెన్ తో సల్మాన్ పోలిక ఎందుకు తప్పు?

 1. గోపీ నాధ్ గారూ
  మధు కీశ్వర్ అభిప్రాయాలు గతంలో ప్రగతిశీలంగా (ప్రోగ్రెసివ్) ఉండేవి. ఆర్టికల్ లో చెప్పినట్లుగా మహిళా హక్కుల ఛాంపియన్ గా ఉండేవారు. ఆమె మోడి మద్దతుదారుగా మారినప్పటినుండి రిగ్రెసివ్ అభిప్రాయాలు వ్యక్తం చేయటం మొదలు పెట్టారు. భావజాలాన్ని మార్చుకున్నాక అందుకు తగినట్లుగానే ఆమె అభిప్రాయాలూ మారాయి.

  బేషరతుగా మోడిని ఆరాధించటం నుండి బైటపడి మోడి విధానాలు, చర్యల ఫలితాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలిగితే (అర్ధం చేసుకుంటే) మీరు ఎత్తి చూపిన సంబంధం అర్ధం చేసుకోగలరు. మీకు బాధ కలిగినా వాస్తవాలు మాట్లాడుకోక తప్పదు.

  నేను మోడిని ఒక వ్యక్తిగా చూడటం లేదు. ఆయన ఒక భావజాలానికి ప్రతీక. దూకుడుతనం, ఆధిపత్య ధోరణి, నిరంకుశ వైఖరి మోడికి అలంకారాలు. విదేశీ కంపెనీలకు అవే కావాలి.

  విదేశీ పాలకులు చేదు అయినప్పుడు విదేశీ కంపెనీలు ముద్దు అవుతాయా? (విదేశీ పాలన వచ్చిందే విదేశీ కంపెనీల కోసం కదా) స్వతంత్ర పోరాటం చేసి తరిమి కొట్టామని చెబుతున్న విదేశీ కంపెనీలను ఇప్పుడు బొట్టు పెట్టి పిలవటం దేశభక్తి కాగలదా?

  హిందూత్వ చెప్పే జాతీయత ఒట్టి ఖాళీది. మొన్నటి వరకు స్వదేశీ నినాదం ఇచ్చిన హిందూత్వ ఇప్పుడు ఎఫ్‌డి‌ఐలకు మద్దతు ఎలా ఇస్తుంది? ఈ వైరుధ్యాలను మీలాంటి వారు నిజాయితీగా పరిశీలించాలి. వ్యక్తిగత ఆరాధనను పక్కన పెట్టి పరిశీలించాలి. అప్పుడు మాత్రమే నేను చెప్పే సంబంధాలను మీరు చూడగలరు. లేనట్లయితే మీరు ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ వేస్తుంటారని నా అభిప్రాయం.

 2. Making mountains out of molehill. that’s all I can say ! ఇంతకన్నా ఎమన్నా ఉందాండీ ఇందులో ? సల్మాన్ ఖాన్ మాటలు అంత తీవ్రమైనవి కావు. గాలికి పోయే మాటలు అవి. కానీ, సల్మాన్ ఖాన్ ను అతని అనుచరులను తప్పు పట్టడానికి కారణం వారి రాజకీయ నేపధ్యమే. వారు కాస్త బీ.జే.పీకి అనుకూలురు కాబట్టి, చిన్న విషయాన్ని కూడా బూతద్దములో వేసి మరీ చూపిస్తున్నారు. మధు కిశ్వార్ ఇప్పటి కూడా ప్రగతిశీల కరమైన పనులే చేస్తున్నారు. అందుకే ఆమె సల్మాన్ను సమర్ధించారు కూడా. కమ్యూనిష్టుల్లా కోడిగుడ్డు మీద ఈకలు పీకేవారు కాదు ఆవిడ.. దీనికి మహిళ, నిర్భయ అంటు మీరు ఎంత మసి పూసి మారేడు కాయ చేయాలని ప్రయత్నించినా అవి పేలవంగానూ హాస్యాస్పదంగానే ఉంటాయి. నిజానికి భారత దేశములోని కమ్యూనిష్టులకు, ఫెమినిస్టులకు ఇంతకన్నా వేరే పనేం లేదా అనిపించేలా చేసేవి ఇలాంటి చేష్టలే !

 3. This is what Salman’s father said:

  “Undoubtedly what Salman said is wrong, the simili, example and the context.The intention was not wrong. Nevertheless I apologise on behalf of his family his fans & his friends. Forgiveness is to pardon the unpardonable or it is no virtue at all. To err is human to forgive divine.”

  This is what National Commission for Women chairperson Smt Kumaramangalam said:

  “The commission has taken suo motu cognisance. We have sent him a letter asking for explanation in seven days. It’s not only a wrong statement, it’s irresponsible and callous for a man whose fame and wealth is based on the adoration of his female fans… He has extrapolated patriarchal mindset.”

  Maharashtra State Women Commission also issued summons to Salman Khan to appear before it.

  Smt Kumaramangalam is appointed by the BJP govt. Maharashtra is under BJP govt.

  Not being able to see the hill as it is, is also a problem, you know!

 4. సినిమా నటుడు ఒక్క సారి కష్టపడితే అతనికి కోటి రూపాయలు వస్తాయి. దానికి రేప్‌తో పోలిక ఏమిటి? రేప్ వల్ల స్త్రీకి ఏమైనా లాభం ఉంటుందా? పల్లెటూర్లలో రేప్ జరిగితే, అది చేసినవాళ్ళ చేత స్త్రీకి ముప్పై వేలో,యాభై వేలో ఇప్పించి, దాన్ని మాఫీ చేసే గ్రామ పెద్దలు ఉంటారు. అయినప్పటికీ కావాలని డబ్బు కోసం చేసే పనితో రేప్‌కి పోలిక ఉండదు.

 5. ramaa sundari gaaru chaalaa kaalaanni anavasaramaina gurtimpukoasam vRdhaa cheastunnaaru. induloa meeru kaanee mimmalni choosi meamandaram spandinchaDam ivannee kooDaa Suddha danDuga vyavahaaraalea.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s