మోడీ చంచానే, అందుకు గర్విస్తున్నాను -సి‌బి‌ఎఫ్‌సి చైర్మన్


Action, CUT

వ్యక్తి పూజ, పాద పూజ, సైకోఫేన్సీ, గుడ్డి అభిమానం, దురభిమానం మొదలైన లక్షణాలు మూర్తీభవిస్తే (మనిషి రూపం ధరిస్తే) ఆ మనిషి ఎలా ఉంటాడు? మామూలుగా అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం. ఒకవేళ చెప్పినా దానికి ఆ వ్యక్తి నుండి ఆమోదం పొందటం కష్టం.

“అవును. నరేంద్ర మోడీకి చంచానే. మోడీ చంచాగా ఉన్నందుకు గర్వపడుతున్నాను” అని ప్రకటించిన సి‌బి‌ఎఫ్‌సి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) ఛైర్మన్ పహ్లాజ్ నిహలాని ని చూస్తే మనకి ఆ కష్టాలు తప్పి పోయినట్లే.

అథికారం చేపట్టింది లగాయితు, వివిధ జాతీయ ప్రతిష్టాత్మక సంస్థలకు అథిపతులుగా బిజెపి ప్రభుత్వం నియమించిన కాషాయ భక్తులను చూపి కూడా ఈ ప్రశ్న కు సమాథానంగా చెప్పవచ్చు గానీ వారు ఎవరూ ఇంతగా బరీ తెగించి తన చెంచాగిరీ పట్ల గర్వం ప్రకటించుకోలేదు.

పూనె ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ కు నటనలో ఓనమాలు దాటని వ్యక్తిని ఛైర్మన్ గా నియమించి కేంద్రం విమర్శలు ఎదుర్కొంది. మహాభారత్ టీవి సీరియల్ లో ధర్మరాజు గా నటించటం, పదేళ్ళ బట్టి బిజెపి సభ్యుడుగా ఉండటం తప్పించి గజేంద్ర చౌహాన్ కి అర్హతలు ఏమీ లేవని ఇనిస్టిట్యూట్ విద్యార్థులు, సినిమా నటులు, వివిధ రంగాల నిపుణులు నెత్తి నోరు బాదుకున్నా కేంద్రం వినిపించుకోలేదు.

కాషాయ భక్తులను నియమించడం ద్వారా ఆర్ఎస్ఎస్ – బిజెపి పరివారం దేశంలోని ప్రధాన సాహితీ, సాంస్కృతిక, విద్యా విషయక సంస్థలను కాషాయకరణ చేస్తున్నారని అనేకమంది ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలను పరివారం తిరస్కరించింది. అదేమీ లేదని, దుష్ప్రచారం చేస్తున్నారని ఎదురు ఆరోపించింది. 

పరివారం ప్రత్యారోపణలలో పస లేదని సెన్సార్ బోర్డు ఛైర్మన్ పహ్లాజ్ నిహలాని జారీ చేసిన సమర్ధనలు స్పష్టం చేస్తున్నాయి. అనురాగ్ కశ్యప్ సినిమా ‘ఉద్తా పంజాబ్’ కు 89 చోట్ల కత్తిరింపులు నిర్దేశించటం ద్వారా వార్తలకు ఎక్కిన నిహలాని రాజకీయ ప్రేలాపనలతో తాను బిజెపి రాజకీయాల ప్రచారం కోసమే నియమితుడ్ని అయ్యానని రుజువు చేసుకున్నారు.

“అవును. అనురాగ్ కశ్యప్ అన్నట్లు నేను నరేంద్ర మోడీ చంచానే. మోడి చెంచాను అయినందుకు గర్వ పడుతున్నాను కూడాను. మోడీకి కాకుండా ఇటలీ ప్రధాన మంత్రికి చంచాగా ఉండమంటారా మరి?” అని ఎన్.డి.టి.వి ఇంటర్వ్యూ లో ప్రశ్నించాడు నిహలాని.

నిహలాని దృష్టిలో ఆయా ప్రభుత్వ సంస్థల అథిపతులు అంతా ఎవరో ఒకరికి చంచాగా ఉండి తీరాలన్న మాట! ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీ యొక్క రాజకీయాలకు అతీతంగా ఉండాలన్న అవగాహన ఆయన డిక్షనరీలో లేదన్న మాట! నిహలాని అడ్డగోలు వాదన బిజెపి నియామకాల విమర్శకుల ఆరోపణలను ఎటువంటి శషభిషలు లేకుండా నిరూపిస్తున్నది.

నిహలాని అంతటితో ఆగలేదు. “అనురాగ్ కశ్యప్, ఎఎపి పార్టీ నుంచి డబ్బులు తీసుకుని ఉద్తా పంజాబ్ సినిమా తీశాడని విన్నాను” అని కూడా ఆరోపించాడు. ఈ ఆరోపణలకు ఉన్న ఆధారం ఏమిటని ప్రశ్నిస్తే, ఏమీ లేవని చెప్పాడు నిహలాని. నిప్పు లేకపోతే పోయే, కనీసం పొగయినా ఉండాలి కదా. ఎలాంటి పొగ లేకపోయినా చిత్తం వచ్చిన రీతిలో నోటికి వచ్చిన ఆరోపణలు చేయవచ్చని నిహలాని భావిస్తూ ఉండాలి.

ఆయన గారి భావన ఏదయినా తన అడ్డగోలు వాగుడు ద్వారా పంజాబ్ ఎన్నికల నేపథ్యం లోనే తాను కశ్యప్ సినిమాకు 89 కత్తిరింపులు ప్రతిపాదించానని ఏకంగా నిప్పునే బైట పెట్టానని నిహలానికి అర్ధం అయి ఉంటుందా?

వచ్చే సంవత్సరం పంజాబ్ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఎఎపి పార్టీ గణనీయమైన శక్తిగా ఎదిగింది. రానున్న ఎన్నికలలో మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అనేకమంది ఊహిస్తున్నారు.

ఉద్తా పంజాబ్ సినిమాలో ప్రధాన సందేశం మత్తు మందులకు యువత బానిస కావటం గురించినది. పదేళ్ళ బట్టి అధికారంలో ఉన్న బిజెపి – అకాలీ ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ సమస్య బాగా పెరిగింది. పంజాబ్ డ్రగ్స్ అలవాటు నేపథ్యంలో తీసిన కశ్యప్ సినిమా తమ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని అధికార కూటమి భయపడుతున్నది.

ఎఎపి ని వివాదం లోకి లాగి ఆ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని బిజెపి భావిస్తున్నదని నిహలాని మాటలు చెబుతున్నాయి. పంజాబ్ ప్రభుత్వం, తద్వారా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే అనురాగ్ కశ్యప్ సినిమాను నిహలాని అడ్డుకుంటున్నాడని కాంగ్రెస్, ఏ‌ఏ‌పి లు విమర్శించాయి. ఆ విమర్శలు/ఆరోపణలు నిజమే అని నిహలానీ స్పష్టం చేశాడు.

అనురాగ్ కశ్యప్ గమ్మున ఊరుకోలేదు. సి‌బి‌ఎఫ్‌సి ఛైర్మన్ తో లేదా ఖచ్చితంగా చెప్పాలంటే నరేంద్ర మోడి చెంచాతో బహిరంగ యుద్ధానికి దిగాడు. సి‌బి‌ఎఫ్‌సి ని తన నిహలాని తన రాజ్యంగా భావిస్తున్నాడని, రాజ్యాధినేత లాగా వ్యవహరిస్తున్నాడని ట్విట్టర్ లో విమర్శలు గుప్పించాడు. సినిమాలో పంజాబ్ అని వచ్చిన చోటల్లా కత్తిరించాలని ఆదేశించాడని, జాకీ ఛాన్, కేంద్రం, ఎన్నికలు లాంటి పదాలు ఉన్న చోట కూడా కత్తిరింపులు చేశాడని తెలిపాడు.

తన వివాదం లోకి రాజకీయ పార్టీలు, నాయకులు ప్రవేశించవద్దని కూడా అనురాగ్ తెగేసి చెప్పాడు. “ఇది నా ఫైట్. నా హక్కులకుయి, రాజ్యాధినేతగా భావిస్తున్న ఒక నియంతకూ జరుగుతున్న పోరాటం. ఈ పోరాటం నేనే చేస్తాను. దయచేసి ఇందులోకి రాజకీయ నాయకులు రావద్దు” అని కశ్యప్ ప్రకటించాడు. ఈ దెబ్బతో కశ్యప్ ను ఒక పార్టీకి అంటగట్టే అవకాశం బి‌జే‌పి, అకాలీ పార్టీలకు లేకుండా పోయింది.

కాగా బాలీవుడ్ సినిమా పరిశ్రమ అనురాగ్ కశ్యప్ కు మద్దతుగా నిలిచింది. మహేశ్ భట్ లాంటి వారు నిహలానిని సెన్సార్ బోర్డు నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s