ఐనోళ్ళకు పూలు, కానోళ్లకు రాళ్ళు! -కార్టూన్


Phool aur Pattar

అవినీతికి తర తమ బేధాలు ఉంటాయి! అలాగని బి‌జే‌పి అధ్యక్షులు అమిత్ షా చెప్పదలిచారు.

లేకపోతే ఓ వంక యెడ్యూరప్పను మళ్ళీ కర్ణాటక బి‌జే‌పి అధ్యక్షుడిని చేస్తూ మరో వంక తమిళనాడు ప్రభుత్వాన్ని అత్యంత అవినీతి ప్రభుత్వంగా తిట్టిపోయడం ఎలా సాధ్యపడుతుంది?

యెడ్యూరప్ప వ్యవహారం తెలియనిదేమీ కాదు. అవినీతి ఆరోపణలతో ఆయనను తప్పించినందుకు పార్టీని చీల్చి వేరే పార్టీ పెట్టుకున్నారాయన. బి‌జే‌పి ఓట్ల చీలికతో, అనంతరం కాంగ్రెస్ అధికారం చేపట్టింది.

ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం, అధికారం కోసం యెడ్యూరప్పను పార్టీలో చేర్చుకుని రాష్ట్ర బి‌జే‌పి పగ్గాలను సైతం అప్పజెప్పారు. అనగా తదుపరి ఎన్నికల్లో నెగ్గితే మళ్ళీ అవినీతి యెడ్యూరప్ప గారు బి‌జే‌పి ముఖ్యమంత్రి అవుతారు.

అలాంటి బి‌జే‌పి జయలలిత అవినీతి గురించి గంభీర ప్రకటనలు ఇవ్వడం గురివింద సామెతను గుర్తుకు తెస్తోంది. మధ్య ప్రదేశ్ వ్యాపం కుంభకోణం, మహారాష్ట్ర మాతంగ సంక్షేమ కుంభకోణం, ఢిల్లీ (జైట్లీ) క్రికెట్ కుంభకోణం (డి‌డి‌సి‌ఏ స్కాం), లలిత్ గేట్… ఇవన్నీ బి‌జే‌పి అవినీతి తట్టలో కొన్ని మాత్రమే.

విదేశాల నుండి నల్లధనం వెనక్కి తెస్తానని ఆర్భాటంగా చాటిన మోడి ప్రభుత్వం ఇప్పుడేమో నల్లడబ్బు దాచిన వాళ్ళ పేర్లు సరికదా, ఆ నల్ల డబ్బు ఎంతో వెల్లడి చేయడానికి కూడా ఇష్టం లేదని సుప్రీం కోర్టుకు చెబుతోంది.

ఇంత చేస్తూ కూడా మోడి ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం అని అమిత్ షా డప్పు కొడుతున్నారు. అవినీతి జయలలిత, అవినీత్ కాంగ్రెస్, అవినీతి డి‌ఎం‌కే లను కాదని నీతిమంతమైన బి‌జే‌పికి ఓట్లు వేయమని ఆయన తమిళనాడు ప్రజలను కోరుతున్నారు.

నవ్విపోదురు గాక!

 

వ్యాఖ్యానించండి