రష్యా జెట్ ని కూల్చే వాళ్ళమే -జాన్ కెర్రీ


Kaliningrad

Kaliningrad

అమెరికా పాలకుల రష్యా వ్యతిరేక మేనియా (పిచ్చి) కొనసాగుతోంది. రష్యా ఫైటర్ జెట్ ఒకటి తమ యుద్ధ నౌకకు ప్రమాదకర రీతిలో సమీపంగా చక్కర్లు కొట్టి వెళ్లిందని అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఆరోపించాడు. “అమెరికా యుద్ధ నౌక వద్ద రొద పెడుతున్న రష్యా జెట్ విమానాన్ని (కాస్త ఉంటే) కూల్చేసే వాళ్ళమే” అని ఆయన బహిరంగంగానే ఎటువంటి శశభిషలు లేకుండా బెదిరింపు జారీ చేశాడు.

పోలండ్, అమెరికాల మిలట్రీ బలగాలు పోలండ్ తీరంలో విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇరు దేశాలు ప్రతి యేడూ క్రమం తప్పకుండా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తాయి. కానీ పోలండ్ కు రష్యా ఎంతో దూరంలో లేదు. పోలండ్ కూ, రష్యాకూ మధ్య బాల్టిక్ రిపబ్లిక్కులే అడ్డం (మ్యాప్ చూడండి). కనుక అమెరికా యుద్ధ విన్యాసాలు ఎవరికి బెదిరింపుగా ఉద్దేశించాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

“ఇలాంటి ప్రవర్తనను మేము ఖండిస్తున్నాము. ఇది నిర్లక్ష్యం. ఇది రెచ్చగొట్టడమే. ఇది ప్రమాదకరం కూడా. యుద్ధ సూత్రాల ప్రకారం ఆ విమానాన్ని కూల్చేయవచ్చు” అని అమెరికా విదేశీ కార్యదర్శి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) జాన్ కెర్రీ సి‌ఎన్‌ఎన్, మియామి హెరాల్డ్ లకు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు.

“ఇది సీరియస్ బిజినెస్ (తీవ్ర సమస్య) అని జనం అర్ధం చేసుకోవాలి. ఉన్నత జలాల్లో ఇలాంటి బెదిరింపులను అమెరికా ఎంత మాత్రం సహించబోదు… ఇది ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ మేము రష్యాకు సమాచారం పంపుతున్నాము. ఇలాంటిది మళ్ళీ జరగబోదని మేము ఆశిస్తున్నాము” అని కెర్రీ హెచ్చరించాడు.

చిన్నప్పుడు టీచర్లు ఓ కధ చెప్పేవారు. పల్లంలో నీళ్ళు తాగుతున్న మేకని మెరకలో నీళ్ళు తాగుతున్న తోడేలు బెదిరిస్తుంది “నీ వల్ల కలుషితం అవుతున్న నీటిని నేను తాగాల్సి వస్తోంది. గుర్ర్ ర్ర్ ర్ర్…” అని. మేకపైన దాడి చేయడానికి తోడేలు ఆ రకంగా ఓ కారణం సృష్టించుకుంటోంది అని చెబుతూ ‘దుష్టులకు దూరంగా ఉండండి’ అని టీచర్లు బోధించేవారు.

కానీ ఇక్కడ రష్యా, అమెరికాకు దూరంగా ఉండడం కుదరదు. ఎందుకంటే అమెరికాయే వేల మైళ్ళ దూరం నుండి రష్యా తీర జలాల్లోకి వచ్చి తిష్ట వేసింది. అమెరికా యుద్ధ నౌక ‘యూ‌ఎస్‌ఎస్ డొనాల్డ్ కుక్’ బాల్టిక్ జలాల్లో లంగరు వేసి అక్కడి నుండి పోలండ్ రేవు పట్టణం గ్దినియా వద్ద యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది.

ముఖ్యమైన విషయం ఏమిటంటే పోలండ్, లిధుయేనియాల మధ్య రష్యా భూభాగం ఒకటి ఉన్నది. దాని పేరు కలినిన్ గ్రాడ్. కలినిన్ గ్రాడ్ కూ రష్యా ప్రధాన భూభాగానికి మధ్య భూమి సంబంధం లేదు. బాల్టిక్ రిపబ్లిక్ దేశాలతో రైలు, భూ మార్గ ఒప్పందాలు చేసుకోవడం ద్వారా కలినిన్ గ్రాడ్ లోని రష్యన్ లకు రవాణా సౌకర్యాలు కల్పించుకుంది రష్యా.

కలినిన్ గ్రాడ్ లో రష్యాకు భారీ స్ధాయిలో నౌకా స్ధావరం ఉన్నది. ఇక్కడ నుండి రష్యా యుద్ధ విమానాలు రెగ్యులర్ గా బాల్టిక్ సముద్రం పైన గస్తీ తిరుగుతుంటాయి. ఇది సముద్ర తీరం ఉన్న ప్రతి దేశమూ చేసే పనే. శత్రు విమానాలు గానీ, నౌకలు గానీ చొరబడకుండా గస్తీ నౌకలు పహారా కాస్తుంటాయి. వాటికి తోడుగా ఫైటర్ జెట్ లు అందుబాటులో ఉంటాయి. ఇండియాకు కూడా ఇది తప్పనిసరి.

ఎక్కడో 4,150 మైళ్ళ (6,700 కి. మీ) దూరం నుండి అమెరికా యుద్ధ నౌక రష్యా సముద్ర తీరానికి వచ్చి అక్కడ తిష్ట వేయడమే కాకుండా యుద్ధ విన్యాసాలు కూడా చేస్తూ రష్యన్ విమానాలు తన చుట్టూ ‘ప్రమాదకరంగా చక్కర్లు’ కొట్టాయని ఆరోపించడం అంటే ఏమిటి అర్ధం?

ఈ మతి లేని, నిర్లక్ష్య, ఆధిపత్య, దురహంకార ఆరోపణను పశ్చిమ పత్రికలు నెత్తికెత్తుకుని ప్రచారం చేస్తున్నాయి. మిన్ను విరిగి మీద పడినట్లూ, అమెరికా బధ్రత కకావికలం అయినట్లూ, రష్యా దుర్నీతికి అంతే లేనట్లూ కధలు కధలుగా వార్తలు గుప్పిస్తున్నాయి.

యూ‌ఎస్‌ఏ టుడే పత్రిక ఇలా ప్రకటించింది:

రష్యా దాడి విమానాలు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అయిన యూ‌ఎస్‌ఎస్ డొనాల్డ్ కుక్ కు సమీపంలో చక్కర్లు కొట్టాయి. బాల్టిక్ సముద్రంలో ఈ వారం జరుగుతున్న విన్యాసాల సందర్భంగా ఈ ఘటన జరిగింది. రక్షణ అధికారులు బుధవారం ఈ ఘటనను ‘దూకుడుమారి’ చర్య అనీ, ‘దుందుడుకు విమాన విన్యాసాలు’ అనీ అభివర్ణించారు.

డెక్ పైన ఒక హెలికాప్టర్ ఇంధనం నింపుకుంటుండగా, రెండు రష్యన్ SU-24 జెట్ విమానాలు ‘అనేక సార్లు అతి దగ్గరగా, అతి తక్కువ ఎత్తులో అమెరికా యుద్ధ నౌక వద్ద ఎగిరాయని అమెరికా యూరోపియన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.

డొనాల్డ్ కుక్ నాటో మిత్ర దేశం పోలండ్ తో ఉమ్మడి యుద్ధ విన్యాసాల కోసం బాల్టిక్ సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో లంగరు వేసింది. రష్యా విమానాలు నౌకపై దాడి చేసే తరహాలో (simulated attack profile) దగ్గరకు వచ్చాయి. ఆంగ్లంలో, రష్యన్ భాషలో పదే పదే భద్రతా సలహాల కోసం అడిగినా స్పందించలేదు.

బి‌బి‌సి ఇలా పేర్కొంది:

రెండు రష్యన్ విమానాలు యూ‌ఎస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ కు సమీపంలో దాదాపు డజను సార్లు చక్కర్లు కొట్టాయని అమెరికా అధికారులు తెలిపారు.

బాల్టిక్ సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో ఎగిరిన సుఖోయ్ SU-24 విమానంలో ఏమీ ఆయుధాలు ఉన్నట్లుగా కనిపించలేదు. యుద్ధ నౌక ఏ చర్యా తీసుకోలేదు.

సోమవారం మరియు మంగళవారం జరిగిన ఈ ఘటనలను ఒక అధికారి ‘ఇటీవలి జ్ఞాపకాల్లో అత్యంత దూకుడుతో కూడిన చర్యలు’ గా అభివర్ణించాడు.

ఇంకా ఇతర అమెరికా, ఐరోపా పత్రికలన్నీ ఇదే తరహాలో ఈ వార్తను కవర్ చేశాయి.

వాస్తవం ఏమిటంటే అసలు అమెరికా బాల్టిక్ సముద్రంలో యుద్ధ విన్యాసాలు జరుపుతున్నదే ‘కలినిన్ గ్రాడ్’ ను లక్ష్యంగా చేసుకుని. కలినిన్ గ్రాడ్ రష్యా భూభాగం కనుక తన రక్షణ తాను చూసుకుంటుంది. అమెరికాకు అక్కడ ఏం పని? యుద్ధ విన్యాసాలు జరపవలసిన అవసరమే లేదక్కడ. అక్కడ కనీసం అణు మిసైళ్లను కూడా రష్యా మోహరించలేదు.

అమెరికా ప్రమాదకర రీతిలో, ఐరోపాలో బలాబలాలను ఛిద్రం చేస్తూ తూర్పు ఐరోపా రాజ్యాలను నాటో సభ్యులుగా చేర్చుతూ యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధలను ఆ దేశాల్లో మోహరించింది. అందుకు ప్రతిగా కలినిన్ గ్రాడ్ లో అణు వార్ హెడ్ లను మోహరించాలని తలపోసి కూడా ఆ తర్వాత విరమించుకుంది. అయినప్పటికీ అమెరికా రెచ్చగొట్టుడు విన్యాసాలు ఆగకపోగా మరింత విజృంభించాయి.

రష్యా, చైనాలను సైనికంగా చుట్టుముట్టే ఆధిపత్య వ్యూహాన్ని అమెరికా ప్రస్తుతం అవలంబిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో కూడా ఇదే తరహా దుందుడుకు ధోరణిని చైనాకు వ్యతిరేకంగా అవలంబిస్తోంది. ద చై సముద్రంకు సమీపంలోని ఫిలిప్పైన్స్ లో కొద్ది రోజుల క్రితమే అణు బాంబులను మోహరించినట్లు ప్రకటించింది.

ఇండియా అంతర్గత భద్రతా వ్యవహారాలలో తీవ్రంగా లోతుగా జోక్యం చేసుకోవడానికి ఇటీవలే ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని యూ‌పి‌ఏ ప్రభుత్వం దశాబ్దం నుండి తిరస్కరిస్తూ రాగా మోడి నేతృత్వం లోని బి‌జే‌పి ప్రభుత్వం చిటికెలో ఒప్పేసుకుంది.

శ్రీలంకలో ప్రభుత్వ మార్పుకు కృషి చేసి సఫలం అయింది. ప్రాంతీయ స్నేహ, సహకార సంబంధాలలో జోక్యం చేసుకుంటూ దక్షిణాసియా దేశాల సంబంధాలను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇరుగు పొరుగు దేశాల మధ్య పరస్పరం అపనమ్మకం కలిగే ఒప్పందాలు చేస్తూ ఉద్రిక్తతను ప్రోది చేస్తోంది.

ఈ వైఖరి రష్యా, చైనాలకు మాత్రమే కాదు, ఇండియాకు కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా భారత దేశంలోని సామాన్య శ్రామిక, ఉద్యోగ ప్రజానీకం ప్రయోజనాలకు అమెరికా దూకుడు ధోరణి, జోక్యందారీ ధోరణి బద్ధ వ్యతిరేకం. భారత పాలకులు తమ స్వప్రయోజనాల కోసం భారత ప్రజల ప్రయోజనాలను అమెరికా కంపెనీల ప్రయోజనాలకు నేరుగా తాకట్టు పెడుతున్నారు. అమెరికా ప్రత్యక్ష జోక్యందారీ విధానాలు ఈ పరిస్ధితిని మరింత తీవ్రం చేస్తాయి.

అనగా అమెరికా మిలట్రీ బలగాల మోహరింపు పెరిగేకొలదీ ఉద్రిక్తతలు తీవ్రం కావడమే కాకుండా భారత పాలకులు మరింత భయంతో అమెరికా అడుగులకు మడుగులోత్తుతారు. సొంత ప్రజలపై నిర్బంధాలు తీవ్రం చేస్తారు. ఇప్పటికే ఛత్తీస్ ఘర్ లో ఖనిజ వనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడం కోసం బి‌జే‌పి ప్రభుత్వం పౌర హక్కులను దాదాపు రద్దు చేసేసి పోలీసు రాజ్యం సాగిస్తోంది. విలేఖరులు వరుస పెట్టి కిడ్నాప్ లకు, హత్యలకు గురవుతున్నారు. ప్రైవేటు గూండా సంస్ధలను పెంచి పోషిస్తూ ప్రజా సంఘాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు.

సామ్రాజ్యవాద ఒత్తిడి దేశంలో ప్రజలపై నిర్బంధం రూపం లోనూ, ఆర్ధిక వ్యవస్ధపై విధానాల రూపం లోనూ, రాజకీయ వ్యవస్ధపై విచక్షణా రహితంగా ప్రభుత్వాలను కూల్చే రూపం లోనూ మరియు, పాలనా వ్యవస్ధపై నల్ల చట్టాల అమలు రూపం లోనూ, సమాజంపై హిందూత్వ చాందాసవాద విధానాల రూపం లోనూ ప్రతిఫలిస్తున్నది.

ఈ పరిస్ధితిని ప్రజలు తిప్పి కొట్టాలి. బాల్టిక్ సముద్రం, దక్షిణ చైనా సముద్రం, మధ్యధరా సముద్రం, పసిఫిక్ సముద్రాలను సైనిక మాయం చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్న అమెరికా దురాక్రమణ విధానాలను ఓ కంట కనిపెట్టాలి. అమెరికా సామ్రాజ్యవాద విధానాలను దృఢంగా తిరస్కరించాలి.

4 thoughts on “రష్యా జెట్ ని కూల్చే వాళ్ళమే -జాన్ కెర్రీ

 1. సర్,మీ హెచ్చరికను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి.కానీ,మీ హెచ్చరిక చేరవలసినవారికి(ప్రజలకు) చేరుతున్నదా? అన్నదే ఇక్కడ ప్రధానాంశం.ఆ చైతన్యం సామాన్యులలో కలిగిననాడు ఏ చిన్న హెచ్చరికనూ ప్రజలు తేలికగా తీసుకోరుకదా!

 2. అవును చేరవలసిన వారికి అవసరం అయినంతగా చేరని మాట నిజమే. అలాగని చేతులు ముడుచుకుని కూర్చోకూడదు కదా.

  మీకు చేరింది అనుకుంటే మీరు మరి కొంతమందికి చేర్చకుండా ఉంటారా! మీరూ, నేనూ కూడా ప్రజల్లో భాగమే సుమా.

 3. సర్,మీరు-నేనూ ప్రజలలో భాగమే!కానీ, మెజారిటీ వాళ్ళను దృష్టిలో ఉంచుకొని అడిగాను.వాళ్ళకు ఎలా చేరవేయాలో తెలిస్తే అటువైపు అడుగులు వేయడానికి ఎంతోమంది ముందుకువస్తారుకదా!ప్రజలకు చేరవేయడానికి ఉన్న మార్గాలుకంటే,చేరవేయడానికి అవరోదాలుగా ఉన్న మార్గాలు బలంగా ఉన్నాయి.
  ఈ పరిస్తితి దేశంలో అంతర్లీనంగా ఉన్నటువంటి పరిస్తితులవలన వస్తుందా? లేక బయటిదేశాలలో ప్రజ్వలంగా ఉన్నప్పుడు దానిని ప్రేరణగా తీసుకొని అవలంబించడం జరుగుతుందా?
  మన్నించాలి నేనెక్కడో దారితప్పినట్టున్నాను!

 4. మీరూ ఆలోచించండి.

  బైటి దేశాల్లో ప్రజ్వలంగా ఉండాలి అనుకుంటే అది ప్రతి దేశానికి వర్తిస్తుంది కదా. అలాంటప్పుడు ఏ దేశం మొదట అన్న ప్రశ్న రాదా?

  బాహ్య పరిస్ధితుల కంటే అంతర్గత పరిస్ధుతులే మార్పుకు ప్రధాన కారణం. విప్లవాలు ఎగుమతి చేయడం సాధ్యం కాదు. అవి అంతర్గత పరిస్ధితుల నుండే ఉద్భవించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s