ఏప్రిల్ 4, 2016 నాటి ది హిందు సంపాదకీయం ‘Out of depth’ శీర్షికన ప్రచురితం అయిన సంపాదకీయంకు యధాతధ అనువాదం. –విశేఖర్
*********
చమురు మరియు సహజవాయు అన్వేషణ, ముఖ్యంగా లోతైన జలాల్లో (డీప్ వాటర్), ప్రమాదకర వ్యాపారం. అత్యున్నతమైన ఆద్యునిక సాంకేతిక పరిజ్ఞానం దానికి కావాలి; కనుక భారీ మొత్తంలో నిధులూ అవసరమే. తగిన సాంకేతిక పరిజ్ఞానం, సరిపడా నైపుణ్యం తోడు లేకుండా సంపద తవ్వి తీయాలని భావిస్తే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జిఎస్పిసి) తరహాలోనే దాదాపు ఖచ్చితంగా దుఃఖితులుగా మిగులుతారు. కృష్ణా గోదావరి బేసిన్ లో గత ఐదు సంవత్సరాలలో ఈ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ 17,000 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టి కూడా చమురును గానీ సహజ వాయువును ఉత్పత్తి చేయలేకపోయింది. భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ ప్రాజెక్టుకు సరైన ప్రణాళిక లేదనీ, దానితో సమయము, డబ్బూ వృధా అయ్యాయని -సరిగ్గానే- తన నివేదికలో పేర్కొంది.
తమ బ్లాకులో 20 ట్రిలియన్ ఘనపుటడుగుల సహజవాయు నిక్షేపాలు ఉన్నాయని 2005లో గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి సగర్వంగా చాటారు. పక్కనే రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన బ్లాకులో ఉన్నాయని చెప్పిన పరిమాణం (14 ట్రిలియన్ ఘనపుటడుగులు) కంటే కూడా ఇది ఎక్కువ. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకు స్మారకంగా తమ బ్లాకుకు దీన్ దయాళ్ బ్లాకుగా మోడి నామకరణం చేయడంతో గుజరాత్ అన్వేషణ చుట్టూ కోలాహలం మిన్నంటింది. జిఎస్పిసి, రిలయన్స్ ల నిల్వలు రెండూ అతి అంచనాలే అనీ, అది కూడా అందనంత అంచనాలనీ ఇప్పుడు మనకు తెలిసి వచ్చింది. ఉధృతంగా సహజవాయువు ఉత్పత్తి చేసిన రోజుల్లో, రోజుకు 80 మిలియన్ ప్రమాణ ఘనపు మీటర్ల వరకూ ఉన్న రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి ఇప్పుడు ఒంటి అంకెకు పడిపోయింది. జిఎస్పిసి కి సంబంధించినంత వరకు వాస్తవ క్షేత్ర గణాంకాలను పరిశీలించిన అనంతరం ఎగువ స్ధాయి నియంత్రణ సంస్ధ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, నిల్వల మొత్తాన్ని కేవలం 1.8 ట్రిలియన్ ఘనపుటడుగులు మాత్రమే అని తేల్చివేసింది.
సరిహద్దు బేసిన్ లలో అన్వేషణ జరిపేటప్పుడు అతి పెద్ద, మెరుగైన చమురు కంపెనీలు సైతం పొరపాటు లెక్కలు వేస్తాయి; అటువంటి వైఫల్యాలు సాధారణమే – చమురు సహజవాయు నిల్వలు తరచుగా సంక్లిష్ట నిక్షేప వాతావరణాల్లో ఏర్పడతాయి గనక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినప్పటికీ వైఫల్యాలు ఎదురవుతూ ఉంటాయి. జిఎస్పిసి పాల్పడిన పెద్ద తప్పిదం అతిగా అంచనా వేయడం కాదు. అత్యంత సంక్లిష్టమైన డీప్ వాటర్ క్షేత్రాన్ని తాను సొంతగా అభివృద్ధి చేయగలనని అవాస్తవిక అంచనా వేసుకుంది. దశాబ్దాల అనుభవం కలిగిన ఓఎన్జిసి సైతం కేజి బేసిన్ లోని తన బ్లాకును ఎలా అభివృద్ధి చేయాలన్న విషయమై అంతుబట్టక ఉండగా, ఎలాంటి పోల్చదగిన అనుభవమూ లేని జిఎస్పిసి తల సాంతమూ దూర్చుతూ రంగంలోకి లంఘించింది. ఇటువంటి ధోరణి, వినయం అంతా కూడగట్టి చెప్పాలంటే, మా చెడ్డ తప్పుడు లెక్క. మర్యాద పక్కన బెట్టి గట్టిగా చెప్పాలంటే ఒట్టి గర్వపోతుతనం.
అత్యంత తీవ్ర ఉష్ణోగ్రత, తీవ్ర ఒత్తిడిలతో కూడిన కేజి బేసిన్ క్షేత్రం యొక్క క్లిష్ట స్వభావం రీత్యా జిఎస్పిసి, రిలయన్స్ కంపెనీ బిపి (బ్రిటిష్ పెట్రోలియం) ని తెచ్చుకున్నట్లుగా, టెక్నాలజీ కలిగిన భాగస్వామిని తెచ్చుకుని ఉండాల్సింది. కనీసం ఇతర ప్రభుత్వరంగ కంపెనీలైన ఓఎన్జిసి, ఆయిల్ ఇండియాల సహకారం తీసుకునే విషయాన్నైనా పరిగణించి ఉండాల్సింది. అత్యున్నత స్ధాయి సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ స్ధాయి నైపుణ్యం అందుబాటులో ఉన్నప్పటికీ అదే డీప్ వాటర్ క్షేత్రంలో రిలయన్స్ కంపెనీ సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న తర్వాత కూడా తన ధోరణిని సవరించుకోని తప్పిదంలో కూడా జిఎస్పిసి బహుశా దోషి కావచ్చును. ప్రమాద భూయిష్టమైన వ్యాపారంలో సాంకేతిక నైపుణ్యం కొరవడినప్పటికీ స్వతంత్రంగా చమురు, గ్యాస్ లు అందిపుచ్చుకోవాలన్న ఊపు చివరికి కంపెనీకీ, పన్ను చెల్లింపుదారుకూ కూడా ఖరీదైన వ్యవహారంగా పరిణమించింది.
*********
కన్హయ్యా, ఉమర్ ఖలీద్ తదితరుల రాజకీయ, దేశభక్తి భావాల వలన భారతీయ పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృధా అవుతున్నదని యమా బాధపడిపోయిన సో కాల్డ్ హిందూత్వ జాతీయవాదులు 17,000 కోట్లు తీసుకెళ్లి సముద్రంలో పోసిన గుజరాత్/మోడి ప్రభుత్వం దుబారా, తలబిరుసుతనం గురించి ఏమని వగచెదరో ఆసక్తికరం.
2005లో 2008లో కేజి బేసిన్ లో భారీ నిల్వలను గుజరాత్/మోడి ప్రభుత్వ కంపెనీ కనుగొన్నదని పత్రికలు చెప్పినప్పుడు తెలుగు ప్రజలు నిజంగానే చాలా బాధపడ్డారు, ఈర్ష్య పడ్డారు. మోడి చేయకలిగిన పనిని మన ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించుకుని దిగాలు పడ్డారు.
దిగులు, దిగాలు అవసరం లేదని ‘ది హిందూ’ సంపాదకీయం ద్వారా స్పష్టం అవుతోంది.