హ్యాపీ పాకిస్తాన్ నేషనల్ డే! -మోడి గ్రీటింగ్స్


Modi, Nawaz

“భారత్ మాతా కీ జై’ అనని వారు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు”

బి‌జే‌పితో పాటు ఇతర హిందూత్వ సంస్ధల నేతలకు ఈ చాలా ఇష్టమైన డైలాగ్. ఈ డైలాగ్ చెబితే చాలు వారు అరివీర దేశభక్తులుగా రిజిస్టర్ అయిపోయినట్లే అని వారి ప్రగాఢ నమ్మకం.

పాకిస్తాన్ మన పొరుగు దేశం అనీ, అనేక వేల సంవత్సరాలుగా ఇరు దేశాల ప్రజలు కలిసి మెలిసి నివసించారని వాళ్ళు ఇట్టే మర్చిపోతుంటారు. ప్రాచీన భారత నాగరికతగా చెప్పుకుని మురిసిపోయే హరప్పా, మొహంజొదారో నాగరికతలు ఇప్పుడు భౌగోళికంగా పాకిస్తాన్ లో ఉన్న సంగతి వారి స్పృహలో ఉన్నట్లుగా అసలు కనిపించరు.

ఈ రోజు పాకిస్తాన్ జాతీయ దినం. తెల్ల వారిని గడ గడ లాడించిన వీర కిశోరాలు భగత్సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్ లను బ్రిటిష్ వలస పాలకులు ఉరి తీసిన రోజు కూడా మార్చి ఇరవై మూడే.

అలాంటి ఈ దినాన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పాకిస్తాన్ కు శుభాకాంక్షలు అందజేశారు. రోహిత్ ఆత్మహత్య పైనా, జే‌ఎన్‌యూ విద్యార్ధులపై నమోదైన తప్పుడు కేసుల పైనా, కోర్టుల్లో లాయర్లు విద్యార్ధులు, విలేఖరులపై సాగించిన అసహ్యకరమైన దాడి పైనా, ఇంకా దాద్రి హత్య, ఖల్బుర్గి-గోవింద్ పన్సారే-దభోల్కర్ ల హత్యలు… వీటన్నింటి పైనా ఒక్క ముక్క మాట్లాడడానికి తీరిక లేని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పాకిస్తాన్ జాతీయ దినం రోజున ఉత్సాహంగా అభినందనలు తెలిపారు.

Pak day -Modi tweet

“Greetings to the people of Pakistan on their national day” అని ప్రధాన మంత్రి తన ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు. “జాతీయ దినం సందర్భంగా పాకిస్తాన్ ప్రజలకు శుభా కాంక్షలు” అని ప్రధాని ట్విట్టర్ వేదికగా పాకిస్తాన్ మన మిత్ర దేశం అని చాటారు. కానీ పాకిస్తాన్ మన శత్రు దేశంగా భావిస్తున్న బి‌జే‌పి ఎం‌పిలకూ, ఇతర హిందూత్వ సంస్ధల ఉన్మాదులకూ మోడి ఏమని చెబుతారు?

యూనివర్సిటీ ఆఫ్ హైదారాబాద్ లో రోహిత్ వేముల ఆత్మహత్య, జే‌ఎన్‌యూ విద్యార్ధుల నిరసనలపై చెలరేగిన ‘జాతీయవాద’ చర్చల నేపధ్యంలో… ఇవే శుభాకాంక్షలను ఒక అక్బరుద్దీన్ ఒవైసీ, ఓ జే‌ఎన్‌యూ విద్యార్ధి ఉమర్ ఖలీద్, కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి మొదలైన వారు అందజేసి ఉన్నట్లయితే ఈ పాటికి హిందూత్వ ఉన్మాదుల వీర విహారంతో టి.వి చానెళ్లు నిండి పోయి ఉండేవి.

వాళ్ళ వరకు ఎందుకు! బి‌జే‌పి కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీ సైతం ఈ ఉన్మాదుల తాకిడికి బతికి బట్టకట్టలేకపోయారు. ఆయన ఓ శుభ దినాన పాకిస్తాన్ వెళ్ళి ‘జిన్నా గొప్ప లౌకికవాది’ అని వ్యాఖ్యానించారు. అంతే. హిందూత్వ బ్రహ్మాండం బద్దలై ఆయనపై విరుచుకు పడిపోయింది. చివరికి ఆర్‌ఎస్‌ఎస్ కూడా అద్వానీ వ్యాఖ్యలను వీర ఖడ్గంతో ఖండించి గానీ సంతృప్తి పడలేదు.

ఇప్పుడేమో ప్రధాన మంత్రి మోడి ఎక్కడకో వెళుతూ దారి మార్చుకుని హఠాత్తుగా పాకిస్తాన్ లో దిగిపోయి అక్కడి ప్రధాని నవాజ్ షరీఫ్ తో నవ్వుతూ ఫోటోలు దిగినా అదొక గొప్ప రియల్ పొలిటిక్ గా కనిపిస్తున్నదే గానీ పాక్/ముస్లిం లను దువ్వుతున్నట్లుగా కనిపించడం లేదు. ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలను వీడియోలో చొప్పించి ఉమర్ ఖలీద్, కన్హయ్యలకు అంటగట్టిన అరాచక హైన్యం నిన్నటి ఉదంతమే. “మా మతం విగ్రహారాధనకు వ్యతిరేకం కనుక భారత్ మాతా కీ జై” అనము అన్న ఒవైసీపై పత్రికల్లో, చానెళ్లలో, సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో దూషణల వర్షం కురిపించిన ఉన్మాదం తాజా గానే ఉన్నది.

అయినా గానీ ‘పాకిస్తాన్ జాతీయ దినం’ రోజున పాక్ ప్రజలకు అలవోకగా శుభాకాంక్షలు చెప్పగల తెగువ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎలా వస్తుంది? అదీ దేశంలో సాగుతున్న “జాతీయవాదం” చర్చకు ఒక్క సమాధానం ఇవ్వకుండా!?

ఇంతకీ పాకిస్తాన్ నేషనల్ డే అంటే ఏమిటి? దాని సందర్భం ఏమిటి?

మహమ్మద్ ఆలీ జిన్నా నేతృత్వం లోని ముస్లిం లీగ్ వార్షిక సభలను యేటా లాహోర్ లోని ‘మినార్-ఏ-పాకిస్తాన్’ వద్ద జరుపుకునేది 1940లో మార్చి 22 నుండి 24 వరకు ఈ సభలు జరిగాయి. ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని ఈ సభలోనే మొదటిసారిగా స్పష్టమైన తీర్మానాన్ని ఆమోదించారు. ఇది లాహోర్ తీర్మానంగా ప్రసిద్ధి చెందింది. మార్చి 23, 1940 తేదీన ఈ తీర్మానాన్ని ఆమోదించినందున ఆ తేదీని ‘జాతీయ దినం’గా జరుపుతారు. అక్కడ మార్చి 23 జాతీయ సెలవు దినం.

వాయవ్య భారతం లోని నాలుగు రాష్ట్రాలను విడదీసి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా ఏర్పాటు చేయాలని లాహోర్ తీర్మానం డిమాండ్ చేసింది. ముస్లింలకు ప్రత్యేక భౌగోళిక ప్రాంతాలను ఇవ్వకుండా ఎలాంటి రాజ్యాంగాన్ని ఒప్పుకునేది లేదని లాహోర్ తీర్మానం ఖరాఖండిగా చెప్పింది.

అలాగే పాకిస్తాన్ రిపబ్లిక్ గా ఏర్పడడం కూడా మార్చి 23 తేదీనే జరిగింది. 1956 మార్చి 22 వరకు పాకిస్తాన్ బ్రిటిష్ డోమీనియన్ లో భాగంగా ఉండేది. బ్రిటిష్ రాజు పాకిస్తాన్ కు కూడా రాజుగా ఉండగా 1935 లో బ్రిటిష్ పాలకులు తెచ్చిన భారత రాజ్యాంగమే పాక్ రాజ్యాంగంగా ఉండేది. 1956 మార్చి 23 తేదీన డోమీనియన్ యూనియన్ నుండి విడివడి ఇస్లామిక్ రిపబ్లిక్ గా పాకిస్తాన్ ఏర్పడింది. కనుక మార్చి 23 పాకిస్తాన్ కు రిపబ్లిక్ దినం కూడా.

ఈ రెండు దినాల్లో మొదటి దానికే అధిక ప్రాధాన్యాన్ని పాక్ పాలకులు ఇస్తారు. స్వాతంత్రం వచ్చాక పాకిస్తాన్ రిపబ్లిక్ రాజ్యంగా ఏర్పడడం మామూలుగా జరిగినదే. కనుక రిపబ్లిక్ ఏర్పాటుకు అంత ప్రాధాన్యం అనవసరం. కానీ పాకిస్తాన్ / ప్రత్యేక ముస్లిం రాజ్యం ఉనికిని మొట్టమొదట కాగితం మీద పెట్టి ప్రధాన డిమాండ్ గా ముందుకు తెచ్చినది లాహోర్ తీర్మానం ద్వారానే. కనుక లాహోర్ రిసల్యూషన్ డే కు పాకిస్తాన్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది.

“హిందువులతో ముస్లింలు కలిసి ఉండే ప్రశ్నే లేదు. ముస్లింలు ఎక్కువగా నివసించే పశ్చిమ, తూర్పు ప్రాంతాలను ప్రత్యేక దేశంగా విడగొట్టకుండా ఎలాంటి రాజ్యాంగ రూపకల్పనను అంగీకరించేది లేదు” అని పేర్కొన్న పాకిస్తాన్ జాతీయ దినం రోజున ప్రధాని మోడి పాక్ ప్రజలకు, పాక్ పాలకులకు శుభాకాంక్షలు చెప్పారు.

పాకిస్తాన్ ఏర్పాటుకు సమ్మతించినందుకు వీర సావర్కార్ కుట్రతో నాధూ రామ్ గాడ్సే మోహన్ లాల్ కరంచంద్ గాంధీని హత్య చేశాడు.  ఈ సావర్కార్ వీరుడు హిందూత్వ సంస్ధలకు ఆరాధ్యుడు. పాకిస్తాన్ విభజనను హిందూత్వ ఆరాధ్యుడు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తే, ఈ నాడు ప్రధాని మోడి అదే రోజున పాకిస్తాన్ కు శుభాకాంక్షలు చెప్పడం ఏమిటన్న ప్రశ్న హిందూత్వ శ్రేణులకు రాదా? మోడి చెప్పారు గనక రాకూడదా?

నాధు రామ్ గాడ్సేకు విగ్రహాలు కట్టించడానికి ఉరకలేస్తున్న హిందూత్వ శ్రేణులు ఈ విపరిణామాన్ని ఎలా ఆమోదిస్తున్నట్లు?

దేశంలో మనువాదం నుండి విముక్తి కావాలని నినదిస్తున్న ఉమర్, కన్హయ్య, రామా నాగా తదితరులను జాతీయ వ్యతిరేకులుగా చిత్రీకరించిన హిందూత్వ గణాలు ప్రధాన మంత్రి శుభాకాంక్షలకు అభ్యంతరం చెప్పకుండా ఎలా ఉండగలరు? మీరు చెబితే జాతీయవాదం ఇతరులు చెబితే దేశ వ్యతిరేకమా?

ప్రధాని శుభాకాంక్షలను ఆమోదించినట్లయితే అదే సహృదయత, సంయక్ దృష్టి, సదవగాహన, సంయమనం ఇతర భావాల పట్ల కూడా ఉండాలి. లేదూ, రోహిత్ వేముల, కన్హయ్య, ఉమర్ లది జాతీయ వ్యతిరేకత అని తీర్మానించదలిస్తే అదే దృష్టి ప్రధాని మోడీ శుభాకాంక్షలకు కూడా వర్తించాలి.

ఇది చెప్పడం హిందూత్వ నేతలకు కాదు. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలుసు. తమ ప్రచారం ఎంత హేతు విరుద్ధమో వారికి తెలుసు. అయినా రాజకీయ ప్రయోజనాల కోసం వారు తమ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తారు. (బి‌జే‌పి అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికీ అదే రంధిలో ప్రకటనలు ఇస్తున్నారు.) ఎటొచ్చీ నిజాలు గ్రహించవలసింది హిందూత్వ వెంట ఉన్మాదంతో పరుగులు తీస్తున్న సామాన్య శ్రేణులే.

3 thoughts on “హ్యాపీ పాకిస్తాన్ నేషనల్ డే! -మోడి గ్రీటింగ్స్

  1. సార్.. చారిత్రక పరిజ్ఞానం, లాజికల్ థింకింగ్, మోడి వేషాల్ని అర్థం చేసుకుని వాటిని ప్రశ్నించడం ఇవన్నీ మా డిక్షనరీలో లేని విషయాలు. ఎదో పొద్దున లేచామా, ఖాకీ నిక్కర తొడుక్కుని కర్రసాము చేసుకున్నామా, దేషద్రోహులుగా మా నాయకులు డిక్లేర్ చేసి ఉస్కోమనగానే వారి మీద దాడి చేసి, మా దేశభక్తిని చూపించుకున్నామా, ఇవే మాకు తెలిసిన విషయాలు. కాకపోతే, ఇప్పుడు పెబుత్వం మాదే కాబట్టి, మాకు నచ్చనోళ్ళని, మేమే కాకుండా పోలీసులు, లాయర్లతో కూడా తన్నిస్తాం. అంతే తేడా.

    ఇట్లు
    అపర దేశభక్తుడు.
    భారత్ మాతాకి జై.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s