2016 బడ్జెట్: రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా… -1


MGNREGA works

MGNREGA works

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక విచిత్రమైన బడ్జెట్ ప్రతిపాదించారు. దాదాపు ఎవరికీ ఏమీ అర్ధం కాకుండా పోయిన బడ్జెట్ ఇది. సారాంశాన్ని ఒక ముక్కలో చెప్పడానికి సాధారణ పరిశీలకులకు ఎవరికీ అవకాశం ఇవ్వకుండా బడ్జెట్ ప్రతిపాదించబడింది. చివరికి స్టాక్ మార్కెట్లు కూడా మొదట 600 పాయింట్లు పైగా పడిపోయి మళ్ళీ లేచి 153 పాయింట్ల నష్టంతో సర్దుకుంది. అనగా ధనిక పారిశ్రామిక వర్గాలకు కూడా బడ్జెట్ తనకు అనుకూలమో, ప్రతికూలమో ఒక పట్టాన అర్ధమై చావలేదు. అర్ధం అయ్యాక స్టాక్ మార్కెట్లు అమాంతం పుంజుకోవడం గమనార్హం.

పేదల అనుకూల, రైతుల అనుకూల, గ్రామాల అనుకూల బడ్జెట్ గా ప్రధాని నరేంద్ర మోడి తమ బడ్జెట్ ను అభివర్ణించారు. బడ్జెట్ మీద అన్యమనస్కంగా, తప్పనిసరై పొగడ్తలు కురిపిస్తున్నవారు కూడా అదే చెబుతున్నారు. ఒక్క చిదంబరం తప్ప కాంగ్రెస్ పార్టీ నేతల నుండి గట్టి విమర్శలు లేవు. “నా కోరిక మన్నించి బ్రెయిలీ కాగితాల దిగుమతిపై సుంకం తగ్గించినందుకు ధన్యవాదాలు” అంటూ రాహుల్ గాంధీ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. “ఇది బడ్జెట్ లాగా లేదు. ప్రజల్లోని పెద్ద సెక్షన్ తీవ్ర అసంతృప్తికి గురి చేసే బడ్జెట్” అని చిదంబరం కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారు. వామ పక్షాల నుండి సైతం చెదురు ముదురు విమర్శలే తప్ప వాడి కలిగిన నిర్దిష్ట విమర్శలు లేవు. బహుశా గ్రామాలపైనా, రైతుల పైనా ప్రేమ చూపుతూ బడ్జెట్ లో ప్రకటించిన భారీ అంకెలు చాలా మంది విమర్శకులకు మాటలు మిగల్చకపోయి ఉండవచ్చు.

అయితే బడ్జెట్ లో అంకెలు ప్రాధాన్యత కోల్పోయి చాలా కాలమే అవుతోంది. బడ్జెట్ లో అట్టహాసంగా కేటాయింపులు చేయడం ఆచరణలోకి వచ్చేసరికి కేటాయింపుల మొత్తంలో కోత పెట్టడం, ఇతర ఖర్చులకు తరలించి వేయడం, ఇష్టం లేని కేటాయింపుల నిధుల్ని మురగబెట్టడం… ఇత్యాది చర్యలు ఇప్పటికే ఒక అలవాటుగా మారిపోయాయి. మోడి-జైట్లీ ప్రకటించిన బడ్జెట్ లోని అంకెలు ఎంత మాత్రం ఆచరణలోకి వస్తాయో అనుమానాస్పదం. ముఖ్యంగా ఆ భారీ అంకెల వల్లనే అనుమానం ఇంకా పెరిగింది. బ్యాంకులు కూలబడిపోయి, వ్యవసాయ రాబడి పడిపోయి, ఎగుమతులు క్షీణించి.. ప్రభుత్వం చేయూత కోసం కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్న తరుణంలో ఉన్నట్లుండి గ్రామాల జపం చేయడం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. పరిశ్రమల వర్గాలు కూడా బడ్జెట్ ప్రకటించే తాయిలాల కోసం వేచి చూసి నిరాశపడ్డారు. కార్పొరేట్ పన్నుల తగ్గింపు (1 శాతం) చిన్న పరిశ్రమలకు మాత్రమే వర్తింప జేయడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇది అరుణ్ జైట్లీ బడ్జెట్ కాదు, మోడి బడ్జెట్! అని కొందరు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి అదే సరైన పరిశీలన. అరుణ్ జైట్లీ ఆర్ధిక మంత్రి కనుక ఆయన దృష్టి ప్రధానంగా ఆర్ధిక వృద్ధి, కోశాగార స్ధిరీకరణ లేదా కోశాగార వివేకత్వం (fiscal consolidation or fiscal prudence) పైనే కేంద్రీకృతమై ఉంటుంది. సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ పాలకవర్గాలు దానినే డిమాండ్ చేస్తాయి. కోశాగార క్రమశిక్షణ మాటున రైతులు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు తదితర శ్రామిక వర్గాలకు సబ్సిడీ మద్దతును సాధ్యమైనంత భారీగా తగ్గించి ఆ మొత్తాన్ని తమకు కట్టబెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. పాలకుల బడ్జెట్ లు కూడా వారి కోర్కెలను వివిధ పాపులర్ నినాదాల మాటున నెరవేర్చిపెడతాయి. ఈసారి అలా జరగలేదని కార్పొరేట్ వర్గాలు ఆరంభంలో ఆరోపించాయి. 2016, 2017 లలో జరగనున్న ఎన్నికలే లక్ష్యంగా బి‌జే‌పి రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ కింద ఉన్న గ్రామీణ ఓట్లపై బడ్జెట్-2016 కన్ను వేసింది. జైట్లీ కాదు, మోడీ బడ్జెట్ అనడంలో ఉద్దేశం ఇదే. అయితే నిజంగానే బడ్జెట్ గ్రామాలు, రైతులకు అనుకూలమా?

రైతులు, గ్రామాలే లక్ష్యం?!

గ్రామాలకు, రైతులకు భారీ మొత్తంలో అంకెలని జైట్లీ బడ్జెట్ ప్రకటించింది. గ్రామీణ భారతంలోని వ్యవసాయ రంగమే దేశానికి పట్టుగొమ్మ అని బడ్జెట్ లో పేర్కొన్నారు. 2022 సం. నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని జైట్లీ ప్రకటించారు. నిజానికి బడ్జెట్ కి ముందే ప్రధాని మోడి ‘2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేస్తామ’న్నారు. బడ్జెట్ లో చేయనున్న ప్రకటనను బడ్జెట్ కు ముందే తాను చేయడం ద్వారా బడ్జెట్ కేటాయింపులు తన నిర్దేశం మేరకే జరిగాయని మోడి చెప్పదలిచారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనా పగ్గాలు, బడ్జెట్ తో సహా, తన వద్దే కేంద్రం అయ్యాయని మోడీ చాటారు. చుట్టూ ఉన్న నేతలను జీరో చేసి తనను తాను ‘వన్’ గా చాటుకోవడం మోడీ మార్కు రాజకీయం.

రైతులకు 9 లక్షల కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా బడ్జెట్ ప్రకటించింది. గత సం. ఈ లక్ష్యం 8.5 లక్షల కోట్లు. దాదాపు 6 శాతం పెరుగుదల! ఇలా వ్యవసాయ రుణాలకు పెద్ద అంకెలను కేటాయించే ఒరవడిని యూ‌పి‌ఏ ప్రభుత్వం మొదలు పెట్టింది. ఆ ఒరవడిలో రైతుల రుణాలు రైతులకు దక్కవు. వారి పేరుతో ధనిక, మోతుబరి వర్గాలకు దక్కుతాయి. అసలు రైతు రుణాలు పొందడానికి రైతులే కానవసరం లేదు. రైతుల కోసం ప్రకటించిన లక్ష్యంలో పావు వంతైనా రైతులకు అందితే గొప్ప. ప్రభుత్వాలు, పట్టణ పెట్టుబడిదారులు, గ్రామాల మోతుబరులు కుమ్మక్కై రైతుల రుణాన్ని వివిధ రూట్లలో తరలించుకుపోతున్నారు. ఏయే మార్గాల్లో రైతుల రుణాలను కాజేస్తున్నారో పరిశీలించడం సముచితం కాగలదు.

గ్రామీణ`సహకార బ్యాంకులను బొంద పెట్టి వాణిజ్య బ్యాంకులకు ప్రాధాన్యం ఇవ్వడం ఒక పద్ధతి. సరళీకరణ విధానాల ఆరంభం అయిన 1990లలో 13,665 మంది గ్రామీణులకి ఒక గ్రామీణ బ్యాంకు శాఖ ఉండేది. 1990 – 2004 మధ్య ఎన్‌డి‌ఏ –1 పాలనలో 922 గ్రామీణ బ్యాంకులను మూసేశారు. 1990తో పోల్చితే  2004లో యూ‌పి‌ఏ-1 ప్రభుత్వం వ్యవసాయ రుణాలను రెట్టింపు చేసింది. అలాగే 2005-2012 మధ్య కాలంలో గ్రామాల్లో కొత్తగా 5,710 వాణిజ్య బ్యాంకు శాఖలను కొత్తగా తెరిచింది. కానీ 2012లో 15,000 మంది గ్రామ జనాభాకు ఒక బ్యాంకు శాఖ మాత్రమే ఉన్నట్లు తేలింది. గ్రామీణ సహకార బ్యాంకుల కంటే వాణిజ్య బ్యాంకులకే కేంద్రం ప్రాదాన్యత ఇవ్వడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమంలో భాగంగా సంక్షేమ రాజ్యం వాసనలు కలిగిన వ్యవస్ధలన్నింటిని ప్రభుత్వాలు బలహీనపరుస్తూ వచ్చాయి. సహకార బ్యాంకులకు ప్రాధాన్యం, నిధులు తగ్గించడం అందులో భాగమే. దానితో బడ్జెట్ లో గొప్పగా చాటే రైతు ఋణ లక్ష్యంలో రైతులకు చేరే మొత్తం పడిపోయింది. ఋణ పంపిణీపై వాణిజ్య బ్యాంకుల పెత్తనం పెరిగిపోయింది. అవి రుణం ఎవరికి ఇస్తే వాళ్ళే రైతులు. బ్యాంకు అధికారులు రైతు రుణాల పంపిణీ, డిపాజిట్లు, రికవరీ సూత్రాలను ఇష్టానుసారం బోర్డు రూముల్లో రూపొందించడం ద్వారా కాగితాలపై లక్ష్యం సాధించినట్లు చూపుతున్నారు. లక్ష్యాన్ని మించి రైతు ఋణ పంపిణీ చేసినట్లు చూపి బ్యాంకులు ప్రశంసలు పొందిన ఉదాహరణలు అనేకం.

రైతులకు ఇచ్చే రుణాలను ప్రత్యక్ష (డైరెక్ట్), పరోక్ష (ఇన్-డైరెక్ట్) రుణాలుగా వర్గీకరించడం ద్వారా రుణాలను తరలించడం ఒక పద్ధతి. రైతులకు నేరుగా రుణాలు అందిస్తే ప్రత్యక్ష రుణాలు. వ్యవసాయ అనుబంధిత రంగాలకు రుణం ఇస్తే అవి పరోక్ష వ్యవసాయ రుణాలు. ఈ వర్గీకరణలో లొసుగులు చొప్పించి రైతులకు కేటాయించిన రుణాలను పట్టణాల్లో పరిశ్రమల వర్గాలు భోంచేసే అవకాశం ఇచ్చేశారు.

ముంబై లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నివేదిక ప్రకారం మొత్తం సాగుదారుల్లో నాలుగింట మూడు వంతుల మంది చేతుల్లో చిన్న చిన్న భూ కమతాలు మాత్రమే ఉన్నాయి. ఈ కారణం వల్ల 2 లక్షల కంటే తక్కువ రుణం పొందిన చిన్న రైతుల రుణం మొత్తం 1990లతో పోల్చితే సగానికి తగ్గిపోయింది. చిన్న మొత్తంలో (2 లక్షల కంటే తక్కువ) రుణం పొందిన రైతుల సంఖ్య కూడా సగానికి పడిపోయింది. రైతులకు రుణాల లభ్యత తగ్గుతూ రాగా 25 కోట్ల కంటే ఎక్కువ రుణాలు పొందే బడా కార్పొరేట్ల రుణాల మొత్తం పెరుగుతూ పోయింది. 1990లో ఈ బడా కార్పొరేట్లకు పందేరం పెట్టిన పరోక్ష వ్యవసాయ రుణాల మొత్తం, వ్యవసాయ ఋణ కేటాయింపుల్లో 5.7 శాతం ఉంటే 2011లో అది 17.7 శాతానికి పెరిగింది. 2010లో చండీఘర్, ఢిల్లీ నగరాల్లో పంచిన వ్యవసాయ రుణాల మొత్తం ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఘండ్ రాష్ట్రాల రైతులకు ఇచ్చిన రుణాల కంటే మించి పోయింది. అనగా రైతులకు ఇవ్వాల్సిన రుణాలను పరోక్ష రుణాల పేరుతో కార్పొరేట్లకు తరలిస్తున్నారని అర్ధం అవుతోంది.

మోతుబరి రైతులకు, పెత్తందారీ భూస్వామ్య వర్గాలకు ఒకటికి మించి రుణాలు ఇవ్వడం మరో పద్ధతి. పలుకుబడి కలిగిన మోతుబరి రైతులకే మళ్ళీ మళ్ళీ రుణాలు ఇస్తూ చిన్న, సన్నకారు రైతులకు రుణాలు ఇచ్చినట్లు చూపుతున్నారు. ఉదాహరణకి ఓ రైతుకీ 15 ఎకరాల భూమి ఉందనుకుందాం. రు. లక్ష ల రుణం పొందడానికి రైతు 2 ఎకరాలను సెక్యూరిటీగా చూపితే చాలు. బ్యాంకులు ఆ రైతు నుండి 2 ఎకరాలకు పత్రాలు తీసుకుని ఋణ పంపిణీ చేసి ఒక సన్నకారు రైతుకు (2.50 ఎకరాల కంటే తక్కువ భూమి కల రైతులు) రుణం ఇచ్చినట్లు నమోదు చేస్తాయి. అదే రైతు మరో బ్యాంకుకు వెళ్ళి మరో 2 ఎకరాలకు పత్రాలు చూపి మరో లక్ష రుణం పొందుతాడు. మొత్తం మీద 7 లక్షల రుణం ఆ రైతు పొందగలడు. బ్యాంకు రికార్డుల్లో 7గురు సన్నకారు రైతులకు రుణ పంపిణీ చేసినట్లు బ్యాంకులు చూపిస్తాయి. ప్రభుత్వాలు ‘పేదలను కలుపుకుని పోయే ఆర్ధిక వృద్ధి’ సాధిస్తున్నట్లు జబ్బలు చరుచుకునేందుకు ఈ రికార్డులే ఆధారం. రాజకీయ పలుకుబడి కలిగిన అగ్రకులాల ఉద్యోగులు కూడా అనేకమంది తమ భూములకు ఇలాగే ఒకటికి మించి రుణాలు సంపాదిస్తున్నారు. ఎప్పుడైనా ఎన్నికల వరాల్లో భాగంగా ఋణ మాఫీ జరిగితే లబ్ది పొందేదీ ఇలాంటి ‘సన్నకారు’ రైతులే. ఈ రికార్డులు ఉన్నవి ఉన్నట్లు నమ్మితే రైతులు గ్రామాలకు బదులు పట్టణాల్లో సేద్యం చేస్తున్నట్లు నమ్మాల్సి రావచ్చు. తమిళనాడులో ప్రత్యక్ష వ్యవసాయ ఋణ పంపిణీలో 29 శాతం పట్టణాలు, మెట్రోపాలిటన్ నగరాల్లో జరిగింది. మహారాష్ట్రలో అది 41 శాతంగా కాగా బెంగాల్ లో ఐ‌టి‌సి లాంటి కంపెనీలకు 53 శాతం వ్యవసాయ ఋణ పంపిణీ చేశాయి. ఇంకా ఘోరం ఏమిటంటే వాణిజ్య బ్యాంకులు తాము ఇవ్వవలసిన వ్యవసాయ రుణాల్లో 46 శాతం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇవ్వడం. అందులోనూ 50 శాతం మార్చి నెలలోనే ఇస్తాయి. రైతులకు మార్చిలో రుణాలు తీసుకునే అవసరం వస్తుందా?

బ్యాంకులు విధించే సవాలక్షా షరతుల వల్ల వాస్తవ రైతులకు రుణాలు దక్కవు. రు. లక్ష రుణం కోసం ఆరంభం లోనే పత్రాల కోసం 3,000 ఖర్చు చేయాలి. ఇది రుణంలో 3 శాతం. రుణం చేతుల్లో పడకముందే ఋణ గ్రహీత నుండి 3 శాతం బ్యాంకులు కొట్టేస్తున్నాయి. రుణం మంజూరయ్యాక రైతు మరిన్ని పత్రాలు, సాక్షాలు, గ్యారంటీలు సమర్పించాలి. ఈ ఖర్చులు పోను 5 నుండి 10 శాతం వరకు బ్యాంకర్ల చేతులు తడపాలి. అదీ కాక రైతులలో పెద్ద మొత్తం కౌలుదారులే, సొంతదారులు కాదు. వారికి రుణాలు, ఋణ మాఫీలు దుర్లభం. ఇన్ని ఆటంకాల మధ్య అసలు రైతులకు లక్ష్యిత రుణాలు చేరే దారులు కుచించుకుపోయాయి. ఫలితంగా అనివార్యంగా ప్రైవేటు రుణాలపై ఆధారపడుతున్నారు. ఆలిండియా డెట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సర్వే ఫలితాల ప్రకారం ప్రైవేటు రుణాలతో బ్యాంకుల రుణాల నిష్పత్తి సగానికి పడిపోయింది.

అయితే బడ్జెట్ లక్ష్యం అయిన 9 లక్షల కోట్లు ఆదాయం నుండి తీసి రైతులకు ఇస్తారా? బడ్జెట్ లో వ్యవసాయం-రైతు సంక్షేమం కింద కేటాయించిన మొత్తమే రు. 44,469 కోట్లు కాగా 9 లక్షల కోట్ల కొత్త రుణాలు ఇవ్వడం ఎలా సాధ్యం? నిజానికి సాధ్యం కాదు. ఇదొక అంకెల గారడీ. ఈ రుణాల్లో సో-కాల్డ్ స్వతంత్రానికి ముందు ఇచ్చిన రుణాలు కలిసి ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న రుణాలు, కొత్తగా ఇవ్వబోయే రుణాలు అన్నీ కలిపి 9 లక్షల కోట్లు. అంతే తప్ప కొత్త రుణాలే 9 కోట్లు కాదు. ఉదాహరణకి ఓ రైతు రుణార్హత రు. ఒక లక్ష అనుకుందాం. ఆ మొత్తం గత యేడు తీసేసుకున్నాడు. ఈ యేడు మళ్ళీ రుణం ఇచ్చేలోపు అసలులో రు 20,000 తిరిగి చెల్లించాడు. అతను పాత బాకీ పోను మిగిలింది పొందడానికి మాత్రమే ఈ సం.ము అర్హుడు. బ్యాంకులు ఈ యేడు నికర రుణం ఇస్తూ కొత్తగా రు లక్ష ఇచ్చినట్లు చూపిస్తాయి. ఇలా పుస్తకాల్లో చూపించే మొత్తాన్ని బడ్జెట్ లో లక్ష్యంగా పాలకులు చెబుతున్నారు.

తగ్గిన వాస్తవ కేటాయింపులు

బడ్జెట్ లో వివిధ హెడ్ లను కలిపి వేయడం ద్వారా గ్రామాలు, పేదల సంక్షేమానికి భారీ కేటాయింపులు చేసినట్లు బడ్జెట్ చూపింది. ఉదాహరణకి వ్యవసాయం-సహకారం-రైతు సంక్షేమం (Agriculture, Coopertion and Farmers’ Welfare – ACFW) రంగానికి 2016-17 కోసం రు 35,984 కోట్లు ప్రకటించారు. గత సం. ఈ హెడ్ కింద 15,810 కోట్లు ఖర్చు పెట్టారు. అనగా 128 శాతం పెంపు చూపారు. కానీ 2016-17 అంకెల్లో రైతుల స్వల్పకాలిక రుణాలపై వడ్డీ సబ్సిడీని కూడా కలిపేశారు. ఇది నిజానికి గతంలో ఆర్ధిక శాఖ ఇచ్చే గ్రాంటుల డిమాండ్ కింద చూపేవారు. 2016-17 లో ఈ గ్రాంటు మొత్తం 15,000 కోట్లు (ఇది నిజంగా రైతులకు ఇచ్చేది కాదు. సబ్సిడీ ఇచ్చినట్లు ఖాతాల్లో చూపేది మాత్రమే). అనగా ACFW హెడ్ కింద 2016-17 వాస్తవ కేటాయింపులు 20,984 కోట్లు మాత్రమే. ఇది గత యేడు కంటే 33 శాతం పెరుగుదల. చేతికి ఇవ్వని, వేరే హెడ్ కింద ఉన్న మొత్తాన్ని కలిపేసి దానిని 128 శాతం పెంపుదలగా కృత్రిమంగా చూపారు.

గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద 38,500 కోట్లు ప్రకటించారు. ఈ పధకానికి గతంలో ఎప్పుడూ ఇంత కేటాయింపు జరగలేదని జైట్లీ చెప్పారు. అది నిజం కాదు. యూ‌పి‌ఏ-2 ప్రభుత్వం 2010-11లో అత్యధికంగా రు. 40,100 కోట్లు కేటాయించారు. 2011-12లో కేటాయింపులు రు.40,000 కోట్లు. గత సం. ఎన్‌డి‌ఏ-2 కేటాయించింది 34,699 కోట్లు. రు 3801 కోట్లు పెంచినట్లు మోడి బడ్జెట్ చెబుతోంది. కానీ ఇవి కూడా అంకెల గారడీలే. కేటాయించిన మొత్తాలను యూ‌పి‌ఏ, ఎన్‌డి‌ఏలు ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. ఉదా కి 2010-11లో రు. 15,000 కోట్లు, 2011-12లో రు.17,000 కోట్లు ఉపాధి హామీ నిధులు మురగబెట్టారు. 2013-14లో కేటాయింపుల్లో 67 శాతం (24848 కోట్లు) మాత్రమే ఖర్చు చేశారు. ఆ తర్వాత ఈ మిగులు చూపిస్తూ కేటాయింపులు కూడా తగ్గించేశారు. అయితే యూ‌పి‌ఏ కాలంలో ఈ తగ్గింపుల్లో కొంత భాగాన్ని ఇతర సామాజిక పధకాలు సర్వ శిక్ష అభియాన్, మధ్యాహ్న భోజనం, రూరల్ హెల్త్ మిషన్ లాంటి విద్య, ఆరోగ్య పధకాలకు తరలించినట్లు చూపించారు. ఎన్‌డి‌ఏ అది కూడా చేయలేదు. పైగా విద్య, ఆరోగ్యాలకు సైతం కోత పెట్టింది. ఎన్‌జి‌ఓ నేత అరుణా రాయ్ ప్రకారం ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకుంటే 2015-16 లోనే 61,445 కోట్లు కేటాయించి ఉండాలి. ప్రస్తుత 5.69 శాతం ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుంటే ఈ యేడు కేటాయింపులు 65,000 కోట్ల వరకూ ఉండాలి. పెరుగుతున్న జనాభాలో కూలీల సంఖ్య పెరగలేదని భావిస్తేనే ఈ లెక్క సరిపోతుంది. కానీ మోడి బడ్జెట్ కేటాయించింది అందులో 60 శాతం కంటే తక్కువ. కనుక ఉపాధి పధకానికి కేటాయించిన నిధులు నిజ లెక్కల్లో తగ్గాయి తప్ప పెరగలేదు.

మిథ్యగా మారుతున్న గ్రామీణ ఉపాధి

గ్రామీణ ఉపాధి హామీ పధకం కేటాయింపులు, వాస్తవ ఖర్చులు పడిపోవడంతో పాటు లబ్ది పొందే కుటుంబాలు కూడా బాగా తగ్గిపోతున్నాయి. పధకం వల్ల 2006-07లో 2.1 కోట్ల కుటుంబాలు లబ్ది పొందగా 2010-11 లో 5.49 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత సం.ల్లో ఇది 5.06 (11-12), 4.98 (12-13), 3.81 (13-14) కోట్లకు పడిపోయింది. ఆరంభంలో పధకం వల్ల ఎస్‌సి, ఎస్‌టిలు ఎక్కువగా ఆదాయం పొందగా వారి సంఖ్య క్రమంగా పడిపోయింది. 2006-07 లో పధకం లబ్దిదారుల్లో 61 శాతం ఎస్‌సి, ఎస్‌టి లే. 2013-14 లో అది 39 శాతంకి పడిపోయింది. 2006-07 లో ఎస్‌సి, ఎస్‌టి యేతర లబ్దిదారులు 38 శాతం ఉంటే 2013-14 లో 61 శాతానికి పెరిగారు. లక్ష్యిత లబ్దిదారులకు బదులుగా యంత్రాలతో పని చేయించి కాంట్రాక్టర్లు నిధుల్ని భోంచేస్తున్న ఉదాహరణలను పత్రికలే అనేకసార్లు వెల్లడి చేశాయి. ప్రభుత్వం నిర్వహించే MGNREGA వెబ్ సైట్ ప్రకారం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 2015 నాటికి 624 కోట్ల నిధులు దారి మళ్లాయని సోషల్ ఆడిట్ లో తేలింది. దేశం మొత్తం మీద దారి మళ్లిన నిధుల మొత్తం ఎంతో ఎవరికి వారు ఊహించుకోవచ్చు.

అధికారంలోకి రావడంతోనే పధకం అమలుకు అనేక షరతులు విధించిన మోడి అది తమ ప్రాధామ్యం కాదని సంకేతాలు పంపారు. దానితో మోడి అధికారం చేపట్టాక గ్రామీణ ఉపాధి హామీ పధకం పనితనం బాగా పడిపోయింది. 2014-15లో నిధుల వ్యయం, లబ్దిదారులు, పనిరోజులు తగ్గిపోయారు. పధకం లక్ష్యం ప్రతి గ్రామీణ కూలీకి కనీసం 100 పని దినాలు కల్పించడం. యూ‌పి‌ఏ హయాంలోనే 2009-10లో అత్యధిక సగటు 54 పని దినాలు కల్పించగా 2013-14 నాటికి 40కి పడిపోయింది. మోడి హయాంలో ఇది 39కి పడిపోయింది. 2006లో పధకం ఆరంభం అయ్యాక అత్యంత ఘోరంగా అమలైంది 2014-15 లోనే. పని దినాలు తగ్గడంతో పాటు చేసిన పనికి చెల్లింపులు సైతం సకాలంలో జరగలేదు. అనేక రాష్ట్రాలకు నిధులు విడుదల చేయలేదని కాగ్ నివేదిక కూడా విమర్శించింది. కేంద్రం నుండి నిధులు రాలేదని అనేక చోట్ల చెల్లింపులు ఎగవేశారు. బీహార్ ఎన్నికల్లో బి‌జే‌పి చావు దెబ్బ తినడానికి ఇది కూడా ఒక కారణంగా పని చేసిందని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో మోడి ప్రభుత్వం ఈ పధకం అమలులో సీరియస్ గా ఉన్నట్లు కనిపించడంపై శ్రద్ధ పెట్టింది. అప్పటి వరకు కార్పొరేట్లను సంతృప్తి పరచడంపై దృష్టి పెట్టిన మోడి పేదల గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. 2016 ఫిబ్రవరిలో పధకం దశాబ్ద వార్షిక దినోత్సవం సైతం నిర్వహించారు.

లోక్ సభలో మెజారిటీ చూసుకుని మిడిసిపడ్డ మోడి అప్పటిదాకా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు విచ్చలవిడిగా విధాన మద్దతు ప్రకటిస్తూ వచ్చాడు. ఢిల్లీ, బీహార్ లలో ఓటమి మోడిని పాపులిస్టు విధానాలకు మళ్లేలా ఒత్తిడి చేసింది. కాంగ్రెస్ వలె పైకి పేదలకు అనుకూలంగా ఉన్నట్లు చెప్పడం మొదలు పెట్టారు. మారు మనసుతో పేదల జపం చేస్తూ ఉపాధి హామీ పధకంపై పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజా బడ్జెట్ లో నామమాత్రంగానైనా కేటాయింపులు పెంచారు. ఇది బి‌జే‌పి ఎన్నికల అవసరమే తప్ప పేదలను ఉద్ధరించేందుకు కాదు. కావున నిధుల పెంచినంత మాత్రాన ఖర్చు చేస్తారని భావించనవసరం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s