వీడియో మార్ఫింగ్ స్మృతి సలహాదారు పని?


Shilpi Tiwari -From Twitter

Shilpi Tiwari -From Twitter

జే‌ఎన్‌యూ విద్యార్ధుల ఆందోళన, అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమం లకు సంబంధించి ఇంటర్నెట్ లోనూ, టి.వి న్యూస్ ఛానెల్స్ తదితర ప్రసార మాధ్యమాల్లోనూ ప్రచారంలో ఉన్న 7 వీడియోల్లో మూడు వీడియోలలో ఉద్దేశ్యపూర్వకంగా మార్పులు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన మెజిస్టీరియల్ విచారణలో తేలిన సంగతి విదితమే.

మార్పులు చేసిన మూడు వీడియోల్లో ఒక వీడియోను ఎడిట్ చేయగా, రెండు వీడియోలు కావలసిన అర్ధం వచ్చే విధంగా, కోరుకున్న ప్రభావం కలిగే విధంగా ఉద్దేశ్యపూర్వకంగా మార్ఫింగ్ చేశారని (నివేదిక ఉపయోగించిన పదం డాక్టర్డ్) నివేదిక వెల్లడి చేసింది.

నివేదిక వివరాలు తెలియని వారికి- కొన్ని ముఖ్య అంశాలు:

  • జే‌ఎన్‌యూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పాలనా ప్రాంతంలో ఉన్నది కనుక ఢిల్లీ ప్రభుత్వం జాతీయ-వ్యతిరేక నినాదాలు ఇచ్చిన ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.
  • విచారణలో భాగంగా ఏడు వీడియోలను విచారణ కమిటీ హైదారాబాద్ లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ‘ట్రూత్ ల్యాబ్స్’ కు పంపించింది. లేబొరేటరీ నివేదికతో పాటు కమిటీ జే‌ఎన్‌యూ అధ్యాపకులను, వైస్ ఛాన్సలర్ ను, ఫిబ్రవరి 9 నాటి కార్యక్రమం సందర్భంగా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులను విచారించింది. ఢిల్లీ పోలీసుల ఎఫ్‌ఐ‌ఆర్ ను కూడా పరిగణనలోకి తీసుకుంది.
  • లేబొరేటరీ నివేదిక ప్రకారం ఏడు వీడియోల్లో మూడు నమ్మదగినవి కాదు. ఒక వీడియోను ఎడిట్ చేశారు. మరొక వీడియోలో ఆ వీడియోకు చెందిన ఆడియో కాకుండా వేరే ఆడియో చొప్పించారు. మూడో వీడియోలో చొప్పించడాలు జరగలేదు గానీ పెద్ద ఎత్తున splice చేశారు. అనగా వీడియో-ఆడియోలను యధాతధంగా ఉంచకుండా కత్తిరించడం, మళ్ళీ అతికించడం, కావలసిన మాటలు, కావలసిన దృశ్యాలు మాత్రమే కనపడేలా చేయడం చేశారు. వీడియో దృశ్యాల్లోని వ్యక్తుల పెదాల కలయికకు, వినిపిస్తున్న ఆడియోకు సంబంధం లేదు. ఉదాహరణకి కన్హైయా కనిపిస్తుంటాడు. అతని స్వరమే వినిపిస్తుంటుంది. కానీ పెదాల కలయికకు మాటలకు సంబంధం (lip sync) ఉండదు.  అతని మాటల్ని కూర్చి అతికించినట్లు తెలుస్తుంది. ఒకేసారి రికార్డు చేసినట్లుగా కనిపించేందుకు జాగ్రత్తగా శ్రమించారు. ఈ వీడియోను ఇంటర్నెట్ లో మొదట పోస్ట్ చేసిన వ్యక్తి శిల్పి తివారీ.
  • ఫిబ్రవరి 9 కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేసినవారు ఉన్నారు. కానీ వారు మొఖాలకు ముసుగులు వేసుకుని ఉన్నారు. వారిలో ఇద్దరిని గుర్తించినట్లు జే‌ఎన్‌యూ పాలకవర్గం చెబుతోంది. ఇతరులు ఎవరో ఇంకా గుర్తించలేదు.
  • దేశవ్యతిరేక నినాదాలు చేస్తున్నవారిని వారి ఐ‌డిలు చూపమని కన్హైయా కోరుతున్నట్లు తెలుస్తోంది.
  • ఫిబ్రవరి 9 కార్యక్రమం ఐడియా ఉమర్ ఖలీద్ దే. అనిర్బన్ భట్టాచార్య తదితరులు నిర్వాహకులు. కానీ వారు కూడా దేశ వ్యతిరేక నినాదాలు ఇవ్వలేదు. కాశ్మీరీల పోరాటానికి మద్దతు ఇచ్చే నినాదాలు చేశారు. అఫ్జల్ గురు హత్యను ఖండిస్తూ నినాదాలు ఇచ్చారు. ఈ మేరకు సెక్యూరిటీ గార్డులు సాక్షం ఇచ్చారు.
  • అసలు వీడియోలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు లేవు. ఆ నినాదాన్ని తర్వాత చేర్చారు. అలాగే కన్హైయా కుమార్ మాటల్లో గన్ అనే మాట చొప్పించబడింది. 
  • ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐ‌ఆర్ కు ఆధారంగా ఈ వీడియోలనే పేర్కొన్నారు. జీ చానెల్ ను అడిగి వీడియో తెప్పించారు.

ఈ అంశాల్లో ఈ ఆర్టికల్ కు కావలసింది నాలుగవ అంశం.

ఢిల్లీ ప్రభుత్వం నియమించిన మెజిస్టీరియల్ కమిటీ మూడో వీడియోను శిల్పి తివారీ ట్విట్టర్ ఖాతా నుండి సేకరించింది. జే‌ఎన్‌యూ వీడియోలను ఇంటర్నెట్ వ్యాపితంగా ప్రచారం చేయడంలో ఆమె గత కొన్ని రోజులుగా నిమగ్నమై ఉన్నారని పత్రికల ద్వారా తెలుస్తోంది. ట్విట్టర్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ లలో ఫేక్ వీడియోలను ఆమె గత వారం రోజులుగా ప్రచారం చేస్తున్నారని ఇండియా టుడే, ద న్యూస్ మినిట్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ తదితర పత్రికలు, చానెళ్లు తెలిపాయి.

ఎవరీ శిల్పి తివారీ?

ఆమె కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ గారి సన్నిహితురాలు. మే 2014 సాధారణ ఎన్నికల్లో స్మృతి ఇరానీ ప్రచార కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు. ఆమె ప్రతిభకు మెచ్చి తగిన అర్హతలు లేకపోయినప్పటికీ మంత్రి ఇరానీ పట్టుబట్టి తన అధికారిక సలహాదారుగా నియమించుకున్నారు. ఆమెను సలహాదారుగా నియమించుకోవడానికి నియమ నిబంధనలను మంత్రి ఉల్లంఘించారు. కేంద్ర ప్రభుత్వం ఆమె ఉల్లంఘనను ఆమోదించి నియమబద్ధం కావించింది.

ఉల్లంఘన ఏమిటంటే కేంద్ర మంత్రి సలహాదారు పదవికి తగిన విద్యార్హతలు ఆమెకు లేవు. అయినప్పటికీ ఆమె కోసం ప్రత్యేకంగా నిబంధనలను సడలించి రు 35,000 ల నెలసరి వేతనంతో సలహాదారుగా నియమించారని ‘ద క్వింట్’ అనే వెబ్ పత్రిక వెల్లడి చేసింది. సంబంధిత పత్రాలను కూడా ఆ వెబ్ సైట్ ప్రచురించింది. సదరు పత్రాల ఫోటో కాపీలను కింద చూడవచ్చు. సైకత్ దత్తా అనే పేరుగల ట్విట్టర్ పేజీలో ఈ పత్రాలు పోస్ట్ చేయబడ్డాయి.

 

ఆ విధంగా M Tech లేదా MSc లేదా సంబంధిత సబ్జెక్ట్ లో పి‌జి డిగ్రీ అర్హతగా ఉన్న పోస్ట్ లోకి B Arch అర్హత ఉన్న శిల్పి తివారీ నియమితురాలయ్యారు. ఆమెకు సోషల్ నెట్ వర్క్ లో దూకుడుగా బి‌జే‌పి అనుకూల ప్రచారం చేయడమే పని అని వివిధ పత్రికలు తెలిపాయి. బి‌జే‌పి కి ప్రచారం చేయడం నేరం కానే కాదు. దూకుడుగా ప్రచారం చేయడమూ నేరమూ కాదు. ఇలా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించే విధంగా తయారు చేసిన వీడియోలను వ్యాప్తి చేయడం మాత్రం నిస్సందేహంగా ఖండనార్హం.

ఇలా తయారు చేసిన వీడియోల ఆధారంగానే ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, కన్హైయా కుమార్, అశుతోష్, రామా నాగా తదితర జే‌ఎన్‌యూ విద్యార్ధులపై దేశద్రోహం కేసులను కేంద్ర ప్రభుత్వం మోపి అరెస్టు చేసింది. ఈ వీడియోల ఆధారంగానే ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేశారు.

అసలు మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతల పైనే కోర్టులో కేసు నడుస్తోంది. (తదుపరి హియరింగ్ మార్చి 16, 2016.) ఆమెకు కేంద్ర మంత్రి పదవికి తగిన విద్యార్హతలు లేవు అని ఎవరూ అనలేదు. ఆమె పోటీ చేసిన మూడు ఎన్నికల్లో మూడు రకాల విద్యార్హతలు పేర్కొన్నారని మాత్రమే ఆరోపించారు. అనగా విద్యార్హతలపై అబద్ధం చెప్పారన్నది ఆరోపణ.

మంత్రి గారు తన సలహాదారు విద్యార్హతలను కూడా సవరించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సవరణ కేవలం శిల్పి తివారీ గారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఆదేశించినట్లు పైన పత్రాలను బట్టి తెలుస్తున్నది. కేంద్ర మంత్రులకు ఈ విధంగా తమకు ఇష్టులైన ఒకే ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే వర్తించే విధంగా నియమ నిబంధనలను సవరించడం ఏ నీతి?

శిల్పి తివారీ డాక్టర్డ్ వీడియోలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడం గురించి మానవ వనరుల శాఖ మంత్రి గారు ఇంతవరకు ఒక్క ప్రకటనా చేయలేదు. జే‌ఎన్‌యూ దళిత విద్యార్ధి సంఘాల మానసిక భ్రష్టత్వం పైన ఆవేదన, ఆగ్రహం, ఆవేశం, ఆక్రోశం వెళ్లగక్కిన స్మృతి ఇరానీ తమ సలహాదారు ఈ విధంగా యూనివర్సిటీ విద్యార్ధులకు వ్యతిరేకంగా డాక్టర్డ్ వీడియోను ప్రచారం చేసే మానసిక భ్రష్టత్వానికి పాల్పడడాన్ని ప్రశ్నిస్తారా? ఆమెను ఆ పదవి నుండి తొలగిస్తారా? లేక పదవిలో కొనసాగనిచ్చి మరింత మానసిక భ్రష్టత్వ చర్యలకు పాల్పడేందుకు ఆ ప్రభావం ఈ దేశ ప్రజలపై ప్రతికూలంగా పడే అవకాశం కొనసాగేందుకు అనుమతిస్తారా?

ఢిల్లీ మెజిస్టీరియల్ కమిటీ నివేదిక ప్రకారం డాక్టర్డ్ వీడియోల్లో ఒకటి (spliced video) మొట్ట మొదట పోస్ట్ అయింది శిల్పి తివారీ ట్విట్టర్ ఖాతా లోనే. దీనితో వీడియోను అవసరమైన విధంగా మార్చే దురాగతానికి పాల్పడింది ఆమెయేనా అన్న అనుమానం కలుగుతోంది.

ఢిల్లీ ప్రభుత్వ కమిటీ నివేదిక వెలువడ్డాక తివారీ పైన సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దానితో ఆమె తన ట్విట్టర్ ఖాతాను డీ-యాక్టివేట్ చేశారు. మళ్ళీ ఏమి ఆదేశాలు వచ్చాయో ఆమె ఖాతా తిరిగి యాక్టివేట్ అయింది. కానీ అప్పటి నుండి ఆమె కూయడం (ట్వీట్) లేదు.

వీడియో మార్ఫింగ్ పని చేసింది ఆమె కాకపోతే ఆ వీడియో తనకు ఎక్కడ లభించిందీ చెప్పాలని మంత్రి గారు కోరాలి. శిల్ప గారు తనకు తానే చెబితే మరింత సంతోషం. ఆమె చెప్పలేదు కనుక ఆమెతో చెప్పించే బాధ్యత మానవ వనరుల మంత్రి పైన ఆ బాధ్యత ఉన్నది.

ఎందుకంటే ఆమె తన సలహాదారు. తాను ఏరి కోరి నియమించుకున్న సలహాదారు. ప్రభుత్వ నియమ నిబంధనలను ఎవరూ సాహసించని రీతిలో ఒక్క వ్యక్తికి మాత్రమే వర్తించేలా సవరించి నియమించుకున్న సలహాదారు. పైగా మానవ వనరుల శాఖకు సంబంధించిన వెబ్ సైట్ డిజైన్, కంటెంట్ ను అభివృద్ధి చేసేందుకు ఆమెను నియమించారు. సోషల్ మీడియా, ఇతర కమ్యూనికేషన్ లలో కంటెంట్ ను అభివృద్ధి చేయడం కూడా ఆమె విధుల్లో ఒకటి.

ఈ విధమైన ఫేక్ కంటెంట్ ను ‘అభివృద్ధి’ చేస్తున్నందుకు శిల్పి తివారీపై చర్యలు తీసుకోవాలని ఆశించడం తప్పు కాబోదు. లేక అలాంటి కంటెంట్ ను అభివృద్ధి చేయడానికే శిల్పి తివారీ నియమించబడ్డారా?

3 thoughts on “వీడియో మార్ఫింగ్ స్మృతి సలహాదారు పని?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s