జే‌ఎన్‌యూ విద్యార్ధుల పోరాటం: సమగ్రంగా -2


JNU students Umar Khalid Anirban Bhattacharya surrender

JNU students Umar Khalid Anirban Bhattacharya surrender

మొదటి భాగం తరువాత……

ఫిబ్రవరి 17 తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలు ఏవీ అమలు జరగలేదు. అదే లాయర్లు మళ్ళీ దాడికి దిగారు. రాళ్లు రువ్వారు. కన్హైయా చుట్టూ డజన్ల మంది పోలీసులు వలయంగా ఏర్పడి లోపలికి తీసుకెళ్లినా లాయర్లు దాడి చేసి కొట్టారు. కోర్టు లోపలికి వెళ్ళాక కూడా మెజిస్ట్రేటు ముందే కన్హైయాను ఓ లాయర్ కొట్టాడు. పక్కనే పోలీసులు ఉన్నా నిరోధించలేదు. ఆ లాయర్ బైటికి వచ్చి ‘మా పని చేసేశాం’ అని విలేఖరుల ముందు గొప్పలు చెప్పుకుంటుంటే అంతా మ్రాన్పడిపోవడమే మిగిలింది. దాడి వార్త సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీం ధర్మాసనం ఆదేశాల మేరకు పోలీస్ కమిషనర్ సుప్రీం కోర్టు హాజరై కన్హైయా తదితరుల రక్షణకు పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పాడు. అయినా “మేజిస్ట్రేట్ తో సహా కన్హైయా, ఆయన లాయర్లు కోర్టు గదిలో, లాయర్ల దాడి నుండి కాపాడుకోవడం కోసం, లోపల నుండి తలుపు వేసుకున్నార”ని కబురు వచ్చింది. “ఇక మేము మాత్రం ఏం చేయగలం” అంటూ ధర్మాసనం సభ్యులు నిస్సహాయత ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో అతున్నత న్యాయస్థానం పరిస్ధితి ఇదీ. కేంద్రం అండ ఉండగా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు తమకు లెక్క కాదని ఢిల్లీ పోలీసులు తమ నిష్క్రియ ద్వారా స్పష్టంగా చాటారు. ఢిల్లీ పోలీసుల ధోరణికి కేంద్ర ప్రభుత్వమే అండగా నిలిచింది. ప్రభుత్వం నుండి నిర్దిష్ట ఆదేశాలు అందడం వల్లనే పోలీసులు లాయర్ల దాడిని చూస్తూ ఊరుకున్నారు. ఇంత జరిగినా లాయర్లకు నాయకత్వం వహించిన ముగ్గురు గూండా లాయర్లపై చర్య తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వలేకపోయింది. సుప్రీం కోర్టు ధర్మాసనం సైతం హిందూత్వ కేంద్ర ప్రభుత్వం జేబులో ఉన్నట్లా లేక వాళ్ళు కూడా భయాందోళనలో ఉన్నారా?

సుప్రీం ఆదేశాల మేరకు కన్హైయా బెయిల్ పిటిషన్ విచారించాల్సిన ఢిల్లీ హై కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతోంది. ఇప్పుడిక కన్హైయా, ఉమర్ ఖలీద్, భట్టాచార్యల విడుదల సమస్య కాదు. ఈ సందర్భంగా హిందూత్వ దళాలు -ఏ‌బి‌వి‌పి విద్యార్ధులు, పోలీసులు, లాయర్లు, మంత్రులు, ఎం‌ఎల్‌ఏలు- ఏ మాత్రం సిగ్గు పడకుండా ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రకటనలు చేయడానికి తెగించడమే అసలు సమస్య. అశుతోష్ గుప్తా చెప్పినట్లు ఇవన్నీ ఏదో యథాలాపంగా సంఘటన తర్వాత సంఘటన జరుగుతున్నవి కాదు. ఒక ప్రత్యేక లక్ష్యంతో, ఒక పధకం ప్రకారం జరుగుతున్నవి.

సబర్మతి ఎక్స్ ప్రెస్ దహనం అనంతరం గుజరాత్ లో ముస్లిం ప్రజలపై సాగిన హత్యాకాండలను అక్కడి పోలీసులు చూస్తూ ఊరుకున్న సంగతి ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. మంత్రులు స్వయంగా పోలీస్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని అక్కడికి వచ్చే ఫిర్యాదులకు పోలీసులు స్పందించకుండా నిరోధించారు. అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడి స్వయంగా అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరగబోయే సంఘటనలను చూసీ చూడనట్లు ఊరుకోవాలని, హిందువులు తమ కసి తీర్చుకోనివ్వాలని ఆదేశించారని ఆ సమావేశంలో పాల్గొన్న ఐ‌పి‌ఎస్ అధికారి వెల్లడించడం గుర్తు చేసుకోవాలి. ఆయన ఆ సమావేశానికే హాజరు కాలేదని వాదిస్తూ ఆయన సాక్షాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సిట్ నేత రాఘవన్ కొట్టిపారేశాడు. అల్లర్ల అనంతరం దహనకాండలకు, లూటీలకు, అత్యాచారాలకు, హత్యలకు పాల్పడిన హిందూత్వ మూకలపై చర్యలు తీసుకోకుండా గుజరాత్ ప్రభుత్వ నేత నరేంద్ర మోడి అనేక యేళ్లు నిరోధించగలిగారు. చివరికి ఒక స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో తీస్తా సెతల్వాద్, సొంత పిటిషన్లతో సంజీవ్ భట్ మొ.న వారు అలుపు లేని పోరాటం చేయడం వల్లనే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కొందరికైనా శిక్షలు పడ్డాయి. అందుకు ప్రతీకారాన్ని కూడా తీస్తా, సంజీవ్ భట్ లు ఎదుర్కొన్నారు. విదేశీ నిధుల్ని దుర్వినియోగం చేశారని కేసుల వెంట కేసులతో తీస్తా వెంటపడి వేధించగా, సిట్ ముందు విచారణకు హాజరైన రోజులను అనధికారిక గైర్హాజరుగా పరిగణిస్తూ సంజీవ్ భట్ ను గత సం.మే విధుల నుండి తొలగించారు. ఆయన కోర్టు నియమించిన కమిటీ (సిట్) ముందు హాజరు కావాలంటే విధులకు గైర్హాజరు కాక తప్పదు. ఒకే సమయంలో రెండు చోట్ల ఉండడం ఎవరికీ సాధ్యపడదు గనుక. దానిని కూడా కక్ష సాధింపుకు వినియోగించడం రాక్షసానందం అంటే చిన్నమాటే అవుతుంది.

ఇవన్నీ నరేంద్ర మోడి తత్వాన్ని పట్టిస్తాయి. హిందూత్వ ఫాసిస్టు భూస్వామ్య భావజాలానికి నరేంద్ర మోడి సరైన ప్రతినిధిగా లభించారు. గుజరాత్ లో మోడి నిరంకుశంగా అమలు చేసిన సంస్కరణ విధానాల దరిమిలా ఆయన్ను స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులు, భూస్వామ్య వర్గాలు తమ అవసరాలకు సరైన పాలకుడిని మోడీలో చూసుకున్నారు. తత్ఫలితంగా ఆయనని గెలిపించుకోవడానికి వాల్ స్ట్రీట్ కంపెనీల సలహాదారులు దిగిపోయి ఆహరహం కృషి చేశారు. ఈనాటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ కుమారినికి/కుమార్తెకు అత్యంత చౌక ధరలకు వందల ఎకరాల భూములను అప్పటి మోడి ప్రభుత్వం కట్టబెట్టిన సంగతులు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విధంగా హిందూత్వ అండతో నరేంద్ర మోడి అమలు చేసిన నిరంకుశ సంస్కరణలు విదేశీ పెట్టుబడిదారులకు, స్వదేశీ దళారులకు, భూస్వామ్య వర్గాలకు మాత్రమే లాభించాయి తప్ప హిందూ ప్రజలకు ఎర్ర ఏగానీ ముట్టింది లేదు.

రోహిత్ వేముల, జే‌ఎన్‌యూ నిరసన ఘటనలపై కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న నిరంకుశ అణచివేత ఈ వెలుగులోనే చూడాల్సి ఉంటుంది. రెండేళ్ల పదవీ కాలంలో మోడి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో దారుణంగా విఫలం అయిన పరిస్ధితి దేశ ప్రజల ముందు కనిపిస్తోంది. మరి కొన్ని నెలల్లో అస్సాం, బెంగాల్, కేరళ, త్రిపుర.. ఈ నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏ రోజైనా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. ఇప్పటికే బీహార్, ఢిల్లీల్లో చావు దెబ్బలు తిన్న మోడి, బి‌జే‌పిలు మరిన్ని ఎదురు దెబ్బలు తినేందుకు సిద్ధంగా లేరు. వారి వైఫల్యాలను ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. హంగూ ఆర్భాటాలతో అధికారం చేపట్టిన నరేంద్ర మోడి ఆచరణలో ఎవరికీ ప్రయోజనం చేకూర్చలేదు. ఎన్ని సంస్కరణలు చేసినా విదేశీ కంపెనీలు సంతృప్తిగా లేవు. (ఉండవు కూడా.) ఇటు దేశంలో రైతులు, కార్మికుల పరిస్ధితి మరింత దిగజారుతోంది. హామీ ఇచ్చినట్లు ఉపాధి కూడా పెరగలేదు. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపధ్యంలో జే‌ఎన్‌యూ రగడ ద్వారా మోడి ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు సాధించదలుచుకున్నది. అవి:

ఒకటి: మోడి విఫల వాగ్దానాలు చర్చలోకి రాకుండా ప్రజల దృష్టిని మళ్లించడం.

*స్టాక్ మార్కెట్లు మోడి అధికారంలో వచ్చిన నాటికంటే తక్కువ స్ధాయికి పడిపోయాయి. మోడి అధికారం చేపట్టేనాటికి 25,000 పాయింట్లకు దగ్గరలో ఉన్న సెన్సెక్స్ సూచీ ఒక దశలో 29,000 పాయింట్ల వరకు పెరిగింది. ఈ పెరుగుదల మోడీ చలవే అంటూ మంత్రులు, ఎం‌పిలు కీర్తనలు పాడుకున్నారు. మోడి కూడా అది తన చలవే అని దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఇంతలోనే మార్కెట్లు దభేల్ మని కూలిపోయాయి. ఈ కూలిపోత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం బి‌ఎస్‌ఈ సెన్సెక్స్ 23,000 కంటే దిగువకు పడిపోయి బిక్కు బిక్కు మంటోంది. బహుశా కొద్ది నెలల్లో 20,000 దిగువకు పడిపోవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఈ కూలుడు ఎవరి చలవో చెప్పుకోలేని పరిస్ధితిలో మోడి ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది.

*విదేశీ కంపెనీల కోసం మోడి తెస్తానన్న సంస్కరణలు దరి చేరే దారి కానరావడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ సహాయ నిరాకరణ వల్ల జి‌ఎస్‌టి బిల్లు మూలబడింది. పశ్చిమ పెట్టుబడిదారులకు నమ్మకంగా వాగ్దానాలు ఇచ్చిన మోడి తన వాగ్దానాలు గట్టు దాటించే బలం రాజ్యసభలో లేకపోవడంతో గొంతు పెగలకుండా పోయింది. జి‌ఎస్‌టి బిల్లు రూపొందించింది కాంగ్రెస్ పార్టీయే అయినా బిల్లు ఆమోదానికి ఆ పార్టీ సహకరించడం లేదని బి‌జే‌పి శాపనార్ధాలు పెడుతోంది. కాంగ్రెస్ ప్రతిపాదించిన ఈ బిల్లును అప్పట్లో బి‌జే‌పి వ్యతిరేకించింది. తమకు దక్కని క్రెడిట్ బి‌జే‌పికి ఎందుకు దక్కాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆర్ధిక మంత్రి జైట్లీ వ్యాఖ్యానించారు.

*గ్యాస్ సబ్సిడీ తగ్గించేశారు. రేషన్ కార్డులు తగ్గించే చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. సీజన్ కూరగాయల ధరలు కూడా విపరీత స్ధాయిలో ఉంటున్నాయి. పప్పులు, ఉల్లి లాంటి నిత్యావసరాల ధరలు అందుబాటులో లేని పరిస్ధితి. అవి ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు కూలుతాయో పాలకులకు కూడా తెలియని పరిస్ధితి.

*జి‌డి‌పి వృద్ధి రేటును ఆకాశ వీధిలో విహరింపజేస్తాననీ మోడీ హామీ ఇచ్చాడు. ఏం చేసినా చెయ్యకపోయినా జి‌డి‌పి అంకెల్ని పెరిగేలా చేస్తే ఆ అభివృద్ధి ఆటోమేటిక్ గా ప్రజలకు చేరుతుందని అరచేతిలో స్వర్గం చూపారు. అసలు ఇప్పటికే జి‌డి‌పి వృద్ధి రేటు మేఘాలపై ప్రయాణం చేస్తోందనీ, చైనాను మించిపోయిందని, ప్రపంచం అంతా మాంద్యం ఎదుర్కుంటుంటే ఇండియా మాత్రమే అతి వేగంగా వృద్ధి చెందుతోందని మోడి చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉన్నది. జి‌డి‌పి వృద్ధి రేటును కృత్రిమంగా పెంచుకుని అది తమ ఘనకార్యంగా చెప్పుకోవడాన్ని రాయిటర్స్ లాంటి పశ్చిమ పత్రికలు కూడా విమర్శించాయి. నిజానికి ఇలాంటి సాహసానికి ఏ పాలకులూ పూనుకోరు. కానీ ప్రధాని మోడీ పూనుకున్నారు. ఈ ఘనత మాత్రం ఆయనకు దక్కవలసిందే. జి‌డి‌పి వృద్ధి శాతాన్ని కొలిచే ఆధార సంవత్సరాన్ని 1990 ల ధరల నుండి 2000 సం. ధరలకు ముందుకు జరపడంతో జి‌డి‌పి వృద్ధి రేటు అమాంతం కృత్రిమంగా పెరుగుదల నమోదు చేసింది. దానివల్ల జి‌డి‌పి నిజంగా పెరగకుండానే కాగితాలపై 2 నుండి 3 పాయింట్ల వరకు పెంచి చూపే అవకాశం దక్కింది. కాంగ్రెస్ ఏలుబడిలో 5 శాతం ఉన్న వృద్ధి రేటు ఇప్పుడు 7 శాతం వద్ద ఉండడానికి కారణం ఇదే. వాస్తవానికి ఇండియా ఆర్ధిక వ్యవస్ధ రిసెషన్ (ఆర్ధిక మాంద్యం)లో జారిపోయిందని పశ్చిమ ఆర్ధిక పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

*అమెరికా, ఐరోపా రాజ్యాలలో ఆర్ధిక సంక్షోభం ఏ మాత్రం తెరిపిడి పడకపోవడం వల్ల అక్కడకు వెళ్ళే ఇండియా ఎగుమతులకు మార్కెట్ బాగా పడిపోయింది. దానితో ఇండియా ఉత్పత్తి సైతం పడిపోతోంది. అనగా జి‌డి‌పి క్షీణిస్తోంది. క్షీణిస్తున్న జి‌డి‌పిని ఎలాగో తిప్పలు పడి పెరుగుతున్నట్లు చూపుతున్నారు. అంత చేస్తున్నా విదేశాల్లోని పరిస్ధితుల వలన అది కూడా చాలడం లేదు.

*స్వచ్ఛ భారత్ నినాదాన్ని ఇప్పుడు తలచుకున్నవారు లేరు. ఫోటో సెషన్ల వరకే పరిమితం అయిన ఈ నినాదం ఒట్టి ఖాళీ నినాదమేనన్న సంగతి జనానికి అర్ధం అయింది.

*ఎన్నికల్లో మోడీ ఇచ్చిన వాగ్దానాల్లో ముఖ్యమైనది ఉపాధి. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కోట్లు కాదు కదా వేలల్లో అయినా కొత్తగా ఉపాధి దక్కుతున్నదా అన్నది అనుమానమే. పాత ఒరవడిలో ఉపాధి దక్కడం వేరు, మోడి విధానాల వల్ల సరికొత్త ఉపాధి ప్రజలకు చేరువ కావడం వేరు. పైగా గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని దాదాపు అటక ఎక్కించారు. పధకానికి నిధులు పెంచుతున్నట్లు చెప్పినప్పటికీ వాస్తవంలో అవి కూలీలకు చేరింది లేదు. పధకంలో అనేక పరిమితులు, ఆంక్షలు పెట్టడంతో నిధులు ఖర్చు చేసే అవసరం ప్రభుత్వాలకు తప్పిపోయింది. ఫలితంగా గ్రామాలలోనూ పట్టణ పేదలలోనూ అసంతృప్తి పెరుకుపోతున్నది. బీహార్, ఢిల్లీ లలో బి‌జే‌పికి వ్యతిరేకంగా పని చేసిన కారణాల్లో ఇది ఒకటి.

*మేక్ ఇన్ ఇండియా కు స్పందన లేదు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అనడమే గానీ వచ్చిన దాఖలాలు లేవు. కార్మిక చట్టాల్ని కాలరాసినా ఎఫ్‌డి‌ఐలు కనికరం చూపడం లేదు. స్టార్టప్ ల కోసం 10,000 కోట్లు తీసి పక్కన పెడుతున్నామని చెప్పినా విదేశీ ఔత్సాహికులు ఆ వైపు చూడడం లేదు. బెంగుళూరులో భారతీయ ఔత్సాహికుల స్టార్టప్ లు కొత్తవి కాదు. మోడి స్టార్టప్ పధకానికి ముందు నుండీ అవి ఉన్నవే. ఈ మధ్య ముంబైలో జరిపిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం రసాభాసగా ముగిసిపోయింది.

ఫ్రీడం 251 పేరుతో 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ తెస్తున్నామని సో కాల్డ్ ఔత్సాహికులు ఊదరగొట్టారు. ఇది మోడి తలపెట్టిన మేక్-ఇన్-ఇండియా పధకాన్ని కృతకృత్యం చేయడానికే అని కూడా కంపెనీ యజమానులు చాటారు. కోట్ల మంది బుక్ చేసుకున్నారని చెప్పారు. కానీ బుక్ చేయడానికి వెళ్ళినవారికి వారి వెబ్ సైట్ అసలు స్పందించలేదు. బుకింగు కోసం క్లిక్ చేసిన వారికి ఏవేవో సందేశాలు కనిపించాయి. ఆ తర్వాత బుకింగులు ముగిశాయని బోర్డు తగిలిచారు. ఇప్పుడేమో మొదటి 50 లక్షల ఫోన్లను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటామని కంపెనీ చెబుతోంది. మేక్-ఇన్-ఇండియాలో భాగం అంటూ విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం ఏమిటో చెప్పేవారు లేరు. అసలు తాము తయారు చేసే ఫోన్ ఇదీ అని వాళ్ళు చూపించిన ఫోన్ కూడా వేరే కంపెనీది అని వెల్లడి అయింది. ఇతర కంపెనీ లోగోను తొలగించి తమ ఫోన్ గా చూపిన సంగతి కనిపెట్టడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. చివరికి ఏప్రిల్ లోగా ఫోన్ లు వినియోగదారులకు చేరకపోతే చర్య తీసుకుంటామని ప్రభుత్వమే ప్రకటించాల్సి వచ్చింది. మోడి ముందుకు తెచ్చిన అభివృద్ధి చర్యలన్నీ ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ తరహాలోనే వెలుగొందుతున్నాయి.

రెండు: హిందూత్వ జాతీయవాదం సారాంశంగా కలిగిన అతి-మితవాదం (Right Extremism) నుండి తొలగిపోలేదని రుజువు చేసుకోవడం.

యూనివర్సిటీలో కన్హైయా ప్రభృతులు అందులో పాక్ అనుకూల, ఇండియా వ్యతిరేక నినాదాలు ఇచ్చారని రాజ్ నాధ్ సింగ్ కు ఎలా తెలిసింది? బి‌జే‌పి ఎం‌పి ఒకరు ఫిర్యాదు చేయగా, బి‌జే‌పి అనుబంధ విద్యార్ధి సంఘం ఏ‌బి‌వి‌పి సభ్యులు చెప్పగా తెలిసింది. బహుశా JNU స్టూడెంట్స్ యూనియన్ నేతకు ఆపాదించబడిన నినాదాల వీడియో ఇంటర్నెట్ లో వేగంగా వ్యాప్తి చెందడం వల్ల కూడా తెలిసి ఉండవచ్చు. బి‌జే‌పి ఎం‌పి ఫిర్యాదు, రాజ్ నాధ్ సింగ్ ఆరోపణ,  ఆరోపణకు ఆయన ఇచ్చుకున్న సమర్ధన… ఇవన్నీ నిజమే అన్నట్లుగా ఆంగ్ల, హిందీ ఛానెళ్లు మెజారిటీ కన్హైయా ప్రసంగంలో కొంత భాగాన్ని -కేంద్ర ప్రభుత్వ ఆరోపణలకు తగ్గట్టుగా- కత్తిరించి ప్రసారం చేసాయి. లేదా ఎవరో కత్తిరించి ఇచ్చిన వీడియోను ప్రసారం చేశాయి. బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వ అవసరాలకు తగినట్లుగానే కొన్ని పత్రికలు, ఛానెళ్లు ఈ విధంగా కత్తిరించిన, కావలసిన అర్ధం వచ్చే వీడియోలను ప్రసారం చేశాయి. అనగా కేంద్ర ప్రభుత్వ పార్టీ అవసరాలను అవి తీర్చాయి.

ఈ ప్రచారం అంతా బి‌జే‌పి అతి మితవాద (Right extremism) ముద్రను బలీయం చేయడానికి ఉద్దేశించినది. జే‌ఎన్‌యూ వీడియోపై కేంద్ర హోమ్ మంత్రి ‘సహించం’ అంటూ ప్రకటన చేయడం తోనే ‘ముద్ర బలీయం’ కార్యక్రమం మొదలైపోయింది. హిందూత్వ జాతీయవాదం పరిధిలో భారత దేశంలో ఒక సుస్ధీరమైన ఓటు బ్యాంకు ఏర్పడి ఉన్నది. ప్రధానంగా అగ్రకులాల ప్రజలు ఈ ఓటు బ్యాంకులో ఉన్నారు. ఎఫ్‌డి‌ఐలను బహిరంగంగా చట్టాలు చేసి మరీ ఆహ్వానించడం వల్ల ఈ ఓటు బ్యాంకుకు చిల్లి పడవచ్చు. చివరికి ఆర్‌ఎస్‌ఎస్ సైతం విదేశీ పెట్టుబడులకు మద్దతు ప్రకటించిన నేపధ్యంలో హిందూత్వ స్వదేశీ నినాదంలో పస లేదని, అది ఆచరణ కోసం ఇచ్చిన నినాదం కాదనీ ఈ హిందూత్వ ఓటు బ్యాంకుకు కూడా తెలిసి వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మల్లెనే ఓట్ల కోసం జాతీయవాద సెంటిమెంట్లు ప్రకటిస్తూ విధానాల అమలులో అందుకు విరుద్ధంగా పాలించడానికి బి‌జే‌పి కి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని హిందూత్వ ఓటు బ్యాంకుకు తెలుస్తున్నది.

అసలు సంగతి తెలిసిపోతే హిందూత్వ ఓటు బ్యాంకు చెదిరి పోతుంది. కాబట్టి తాము హిందూత్వను వదిలిపెట్టలేదని హిందూత్వ ఓటు బ్యాంకుకు మరోసారి బల్ల గుద్ది చెప్పాలి. రాబోయే రాష్ట్రాల ఎన్నికల కోసం ఈ అవసరం ఇంకా తరుముకుని వచ్చింది. సారం లేకపోయినా సరే, ‘దేశభక్తి’ సెంటిమెంట్లు రెచ్చగొట్టడం కంటే మించిన ‘బల్ల గుద్దుడు’ మరేం ఉండగలదు? అసలు సెడిషన్ కేసు పెట్టడమే అన్యాయం అని ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో తప్పు పడుతుంటే ఆ కేసు విచారణకు వచ్చిన కోర్టు ఆవరణలోనే నల్ల కోట్లు తగిలించుకున్న హిందూత్వ గూండాలు విద్యార్ధులు, విలేఖరులపై భౌతిక దాడికి తెగబడడం ఎలా సాధ్యం అవుతుంది? అదీ కొద్ది రోజుల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉండగా! లాయర్ దుండగులు తమ కళ్లెదుటే వీరంగం వేస్తున్నా ఢిల్లీ పోలీసులు చోద్యం చూస్తూ నిలబడిపోవడం, అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించకపోవడం వెనుక చీకటి ఆదేశాలు లేకపోతేనే ఆశ్చర్యం! సారం ఏ మాత్రం లేని దేశభక్తి-దేశద్రోహం చర్చను రగల్చడానికి ఒక పద్ధతి ప్రకారం కృషి చేస్తుంటే తప్ప ఇలాంటి ఘటనలు వరుసగా జరగవు. ఈ రగడ ప్రధానంగా బి‌జే‌పి రాజకీయ ప్రయోజనాలనే నెరవేర్చబోతున్నది. అఫ్జల్ గురు కార్యక్రమం దరిమిలా జే‌ఎన్‌యూ విద్యార్ధులు కేంద్రంగా ఇప్పుడు దేశంలో జరుగుతున్న చర్చ విజయవంతంగా ప్రజల సమస్యలపై నుండి దృష్టిని మరల్చింది. రానున్న ఎన్నికల్లో ఇక ఆర్ధిక విధానాలు, వాటి ఫలితాలపై చర్చ ఉండదు. మోడి వైఫల్యాలపై చర్చ ఉండదు. ఒకవేళ ఉన్నా అప్రధానంగానే ఉంటుంది. తక్షణం ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టగల ‘దేశ భక్తి-దేశ ద్రోహం’ చుట్టూనే చర్చ తిరుగుతుంది. ఈ చర్చ ఒకవైపు బి‌జే‌పి ఓటు బ్యాంకును మరోవైపు కాంగ్రెస్ ఓటు బ్యాంకును సుదృఢం చేసేందుకు మాత్రమే దోహద పడుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న దరిద్రం, నిరుద్యోగం, ప్రయివేటీకరణ, విదేశీ కంపెనీల దోపిడీ… ఇవేవీ చర్చకు రాకుండానే రాజకీయ పార్టీలు తప్పుకునేందుకు ఒక బీజం జే‌ఎన్‌యూలో పడిపోయింది.

జి‌డి‌పి, ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, ధరలు… ఈ అంశాల చుట్టూనే నరేంద్ర మోడి గత ఎన్నికల ప్రచారం సాగింది. ఈ అంశాలపైనే ఆయన ప్రధానంగా వాగ్దానాలు చేశారు. కానీ ఆ వాగ్దానాల అమలు చర్చకు రాకుండానే మరో ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా ముగించుకునే అవకాశాన్ని బి‌జే‌పి, మోడిలకు అఫ్జల్ గురు రగడ ఇచ్చింది. ఇప్పటికే ప్రారంభం అయిన పార్లమెంటు సమావేశాలు ఈ సంగతిని ధ్రువపరుస్తున్నాయి. కన్హైయా బెయిల్ ను వాయిదా వేయాలని అటు ప్రాసిక్యూషన్, ఇటు డిఫెన్స్ లాయర్లు ఇద్దరూ కోరడంతో ఆయన విడుదల మరింత వాయిదా పడింది. కన్హైయా సమస్య మరింత కాలం కొనసాగుతోంది. తద్వారా పార్లమెంటులో ప్రజల సమస్యలు వదిలి ఇరు పక్షాలు జుట్లు ముడేసుకునే అవకాశం వచ్చింది. సెడిషన్ సమస్యపైన ఎన్ని వారాలైనా చర్చించుకుందాం అని వామపక్ష ఎం‌పిలే కోరుతున్నారు. బి‌జే‌పికి కావలసిఉంది అదే. లోక్ సభలో మంత్రి స్మృతి ఇరానీ ఇచ్చుకున్న సమర్ధన అచ్చంగా హిందూత్వ డిఫెన్స్. ఇలాంటి మాటలు చెప్పే అవకాశం బహుశా హిందూత్వకు ఇప్పటికి మించిన అవకాశం రాదేమో.

కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ ఓటు బ్యాంకు గురించే చర్చ జరిగింది. పార్లమెంటు సమావేశాలకు ముందు జరిగిన పార్టీ సి‌డబల్యూ‌సి సమావేశంలో సీనియర్ నేతలు రాహుల్ దూకుడు పార్టీకి నష్టం అన్న అనుమానం వ్యక్తం చేశారు. దూకుడుగా జే‌ఎన్‌యూ విద్యార్ధుల్ని సమర్థిస్తే కాశ్మీర్, అఫ్జల్ గురు అంశాలు పార్టీకి ఎదురు తిరగవచ్చని హిందువులు మరింత దూరం అవుతారని వారు అభ్యంతరం చెప్పారు. కానీ రాహుల్ ఆ వాదన అంగీకరించలేదు. పైగా లెఫ్ట్ ఓట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలో పడతాయని సమర్ధించుకున్నాడు. రాహుల్ వాదన కరెక్టే కావచ్చు కూడా. హిందూత్వ ఓట్లు ఎలాగూ బి‌జే‌పికే. ఇక మిగిలింది లిబరల్, లెఫ్ట్ ఓట్లు. దళితులు, ఓ‌బి‌సిల ఓట్లు మరో రకం. ఇవన్నీ ఆలోచించుకుని అదనపు ప్రయోజనం ఉందని రూఢి చేసుకునే రాహుల్ రంగంలోకి దిగాడు తప్ప విద్యార్థులపైనా, కాశ్మీర్ పైనా ప్రేమ ఉండి కాదు. దరిద్రం ఒక మానసిక భావన అని భావించే నాయకుడికి విద్యార్ధుల భావోద్వేగాలు అర్ధం కావడం సాధ్యమా?

మూడు: దేశభక్తి చర్చలో హిందూత్వను చొప్పించడం.

ఇది జరిగిపోయింది. ఇప్పుడు దేశం అంటే దేశ ప్రజలు వారి ప్రయోజనాలు కాదు. దేశం అంటే భూభాగాలు. భూభాగాలు ఎంత విశాలంగా ఉంటే అంత దేశ సమగ్రత. పక్కవాడి భూములు లాక్కుంటే మరింత దేశభక్తి. కాశ్మీర్ ప్రజల్ని తొక్కిపెట్టి వారి భూమిని బలవంతంగానైనా కలుపుకోవడం, హిందూత్వను భుజాన వేసుకున్న మోడి, బి‌జే‌పి లు చెప్పే ప్రతి మాటను పొల్లు పోకుండా నమ్మడం… ఇవే నిజమైన దేశభక్తి. వీటికి విరుద్ధంగా ఏది ఉన్నా అది దేశద్రోహం. విరుద్ధంగా మాట్లాడడమే దేశ ద్రోహం. ఒక పోలీసు అధికారి తన నేరారోపణల్ని విమర్శించడమే ‘దైవ దూషణ’ అని నిస్సంకొంచంగా చెప్పాడంటే అర్ధం హిందూత్వ భావజాలం లోని పవర్ ని ఆయన గ్రహించినందువల్లే దానిని అనుకరిస్తూ బానిస సమాజాల నాటి సూత్రాన్ని వల్లించగలిగాడు. బానిస సమాజాల్లో రాజే దైవం, రాజాజ్ఞ ధిక్కరిస్తే అది దైవ రూషణతో సమానం. ఇప్పుడు అదే సూత్రాన్ని వల్లిస్తూ పాలకుల హిందూత్వ ధిక్కారాన్ని దైవ దూషణగా చెబుతున్నారు.

హిందూత్వ అంటే ఏమిటి? గుప్తుల కాలం నాటి హిందూ సామ్రాజ్య వైభవాన్ని పునరుద్ధరించడానికి పూనుకుంటున్న భావజాలమే హిందూత్వ. ఇది నిజంగా ఆచరణలోకి వస్తుందా అన్నది వేరే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఉందా లేదా అన్నది కూడా హిందూత్వ ప్రతిపాదకులకు సమస్య కాదు. వారి పలుకుల్లో హిందూత్వ అంటే ఏమిటన్నది నిగూఢంగానే ఉంటుంది తప్ప స్పష్టంగా ఉండదు. స్పష్టంగా ఉంటే ఆనాటి కరుడుగట్టిన కుల వ్యవస్థను యధారూపంలో పునరుద్ధరించాలన్న వారి కోరికను చెప్పాల్సి వస్తుంది. కులాల కాలకూట విషంలో మగ్గిన హిందూ వ్యవస్ధ అనేది ఒకటుందన్న తమ అనాగరిక, ఆధిపత్యపూరిత నమ్మకాన్ని చెప్పాల్సి వస్తుంది. తరాల తరబడి కింది కులాలను సేవకులుగా తొక్కిపెట్టడమే స్వర్ణ యుగంగా తాము ఉద్దేశిస్తున్న సంగతి వెల్లడించాల్సి వస్తుంది. అందుకే వాటిని ఆధునిక పదజాలం మాటున దాచి ఉచ్చరిస్తున్నారు. అఖండ భారత్ లో కాశ్మీర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు భాగం. పాక్, బంగ్లాలు చర్చలోకి తెస్తే ఫూల్స్ అవుతారు కనుక కాశ్మీర్ వరకు పరిమితం అవుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు డిమాండ్ వెనుక ఉన్నది అఖండ భారత్ భావనే. ఉమ్మడి సివిల్ కోడ్ లో భాగంగానే ఘర్ వాపసి నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. వెనక్కి వచ్చిన వాళ్ళు ఏ కులంలో చేరాలో వివరిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు తమ సైద్ధాంతిక, సూత్రబద్ధ అవగాహనను కొన్ని నెలల క్రితం వెల్లడించారు. వాళ్ళు తమ ఎజెండాను దాచుకోవడం లేదు. పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ సిద్ధించిన నేటి రోజుల కంటే మరొక అవకాశం ఆర్‌ఎస్‌ఎస్ కు లభిస్తుందా? రాముడి గుడి డిమాండ్ ను మోడి ప్రభుత్వం వచ్చాక వివిధ సందర్భాల్లో ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పునరుద్ఘాటించారు కూడా.

ఇవన్నీ కలిసి హిందూత్వ. ఈ భావాలకు వ్యతిరేకంగా ఏది ఉన్నా అది దేశద్రోహమే, జాతీయ వ్యతిరేకమే. వామపక్ష భావజాలం ఇక్కడిది కాదు. ఎవరో జర్మనీలో గెడ్డపాయన ప్రతిపాదిస్తే మనం నమ్మడం ఏమిటి? ఆ విదేశీయులు కనిపెట్టిన సమస్త శాస్త్ర ఆవిష్కరణలను తమ సుఖ జీవనంలో బీరు పోకుండా వినియోగిస్తున్నా అది దేశ ద్రోహం కాదు గానీ హిందూత్వను వ్యతిరేకించే ఏ భావమైన దేశద్రోహమే అవుతుంది. ఈ సందేశాన్ని గట్టిగా, అందరికీ తెలిసేలా చెప్పడం ఆర్‌ఎస్‌ఎస్ కు ఎంతో కాలంగా ఉన్న తీరని కోరిక. ఆ కోరిక పార్లమెంటు సాక్షిగా నెరవేరడం ఆర్‌ఎస్‌ఎస్ కాదనుకోగలదా? అందుకే పార్లమెంటులో జే‌ఎన్‌యూ, రోహిత్ అంశాలను చర్చించడానికి బి‌జే‌పి నేతలు సర్వ సన్నద్ధమై ముందుకు వచ్చారు.

నిన్నటి వరకూ ఉప్పు నిప్పుగా పోట్లాడుకున్న పాలక, ప్రతిపక్షాలు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ఆరంభంలోనే ఒక విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. అది: రోహిత్ వేముల, జే‌ఎన్‌యూ అంశాలను ఉభయ సభల్లో చర్చించడం. ఎటువంటి గడబిడ లేకుండానే వారీ ఏకాభిప్రాయానికి వచ్చారు. జి‌ఎస్‌టి బిల్లు సంగతి ఏమి మాట్లాడుకున్నారో ఎవరూ చెప్పడం లేదు. విదేశాల్లోని లక్షల కోట్ల భారతీయ నల్ల డబ్బు నిమిషాల్లో వెనక్కి తెస్తానన్న మోడీ వీరాలాపాలు అసలు ప్రస్తావనలోనే లేవు. జి‌డి‌పి దొంగ లెక్కలను వామపక్షాలు కూడా ప్రశ్నించడం లేదు. ద్రవ్యోల్బణం మళ్ళీ ఎందుకు పెరుగుతున్నదో అడగడం లేదు. కానీ ఆరంభం లోనే రోహిత్ వేముల, జే‌ఎన్‌యూ సమస్యలపై భావోద్వేగపూరిత ప్రసంగాలు మొదలైపోయాయి.

పాలక, ప్రతిపక్షాలు రెండూ ఇప్పుడు తమ తమ దేశభక్తిని రుజువు చేసుకునే చర్చలో మునిగిపోయాయి. జనాన్ని కూడా తమ వెంట కొనిపోతున్నాయి. అవసరం ఐతే ఎంతకైనా తెగిస్తామని మోడి నేతృత్వంలోని ఫాసిస్టు శక్తులు అటు స్వదేశీ, విదేశీ కంపెనీలకు ఇటు ప్రతిఘటన ఇస్తున్న ప్రజలకు సందేశం ఇస్తున్నాయి. మరోవైపు హిందూత్వ వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా జమ చేసుకునేందుకు కాంగ్రెస్ కాచుకున్నది. వామపక్షాలు సైతం ఆ చర్చలో చేరక తప్పని పరిస్ధితి నెలకొన్నది. తమ విద్యార్ధులను అరెస్టు చేస్తే వారిని వదిలి పెట్టి దేశ సమస్యలపై పార్లమెంటులో పోట్లాడడం ఏ లెఫ్ట్ నాయకుడు చేయగలడు? ఈ చిక్కుల గండంలో బి‌జే‌పి వెంట వెళ్ళి దేశభక్తి-దేశద్రోహం చర్చలో తామూ గొంతు కలపడం తప్ప వామపక్షాలకు మార్గం లేదు.

పార్లమెంటరీ రాజకీయాల లక్షణమే అంత. ముంచదు, తేల్చదు. ఊబిలో కూరుకుపోవడమే అంతిమ ఫలితం. వామపక్షాలు రెండూ తమ విద్యార్ధులు నినాదాలు చేయలేదని చెప్పుకుంటూ మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప కాశ్మీరీలకు సానుభూతిగా ఉండడం దేశద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నించేందుకు పూనుకోవడం లేదు. అరెస్టు చేసిన వెంటనే పోలీసుల కస్టడీలో ఉన్న కన్హైయా దేశవ్యతిరేక చర్యలు వద్దంటూ జే‌ఎన్‌యూ విద్యార్ధులకు చేతివ్రాత సందేశం ఇవ్వాలని పోలీసులు కోరిన వెంటనే రాసి ఇచ్చాడు. ఆ లేఖను జే‌ఎన్‌యూ విద్యార్ధులు తీవ్రంగా తప్పు పట్టడంతో వెనక్కి తీసుకున్నాడు. ఉమర్ ఖలీద్ అండర్ గ్రౌండ్ నుండి వెంటనే బైటికి రావాలని, ఆయన దాక్కోవడం ద్వారా తప్పుడు సందేశం ఇస్తున్నారని జే‌ఎన్‌యూ విద్యార్ధిని ఒకరు బహిరంగ లేఖ రాయడంతో ఉమర్ ఖలీద్ సైతం మళ్ళీ యూనివర్సిటీలో ప్రత్యక్షం అయ్యాడు. ఇతర ముగ్గురు విద్యార్ధులు తాము తప్పు చేయలేదు గనుక లొంగిపోయేది లేదని స్పష్టం చేశారు. జే‌ఎన్‌యూ విద్యార్ధుల మిలిటెంట్ డిమాండ్లు ఏ స్ధాయిలో ఉన్నాయో, తమ నాయకులు ఎలా ఉండాలని వారు కోరుకుంటున్నారో ఈ అంశాలు తెలియజేస్తున్నాయి. కానీ వామపక్ష పార్లమెంటరీ పార్టీలు ఈ స్థాయి మిలిటెంట్ నాయకత్వాన్ని అందించే రాజకీయాలను కలిగి లేవు. కఠినంగా ఉండాలని, హిందూత్వకు గట్టి ఫైట్ ఇవ్వాలని జే‌ఎన్‌యూ విద్యార్ధులు పట్టుబట్టకపోయినట్లయితే బహుశా కన్హైయా ఈ పాటికి విడుదల అయి ఉండేవాడు.

ఈ వాస్తవాలను ప్రజలు గ్రహించాలి. లేనట్లయితే వివిధ పార్లమెంటరీ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఎన్నికల వాగ్దానాలు ఏం చేశారని పాలకులను నిలదీయాలి. ప్రజల మరుపు జ్ఞానంపై నమ్మకం పెట్టుకున్న రాజకీయ నాయకులు తమ నమ్మకాలు తప్పు అని రుజువు చేయాలి. నిజమైన దేశభక్తి దేశ ప్రజలను పట్టించుకుంటుంది తప్ప దేశ సరిహద్దులను కాదని వారికి తెలియజెప్పాలి. తమకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చర్చలు మానుకోవాలని బుద్ధి చెప్పాలి.

(…………అయిపోయింది.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s