ఇండియా టుడే చానెల్ మరో సంచలనానికి తెర తీసింది. ఢిల్లీ పోలీసులు చేయడానికి ఇష్టపడని పరిశోధనని తాను చేసి చూపెట్టింది.
చిన్న గొడవగా లాయర్ల హింసను కొట్టిపారవేస్తూ వారిపై పెట్టీ కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసుల నేరపూరిత కుమ్మక్కును ఎండగడుతూ మరో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి పధకం ప్రకారమే విద్యార్ధులు, ప్రొఫెసర్లు, విలేఖరులపై లాయర్లు దాడి చేసి కొట్టారని బయట పెట్టింది.
ఇండియా టుడేకు చెందిన ఇద్దరు విలేఖరులు విక్రమ్ చౌహాన్, ఓం శర్మ, యశ్ పాల్ సింగ్ అనే ముగ్గురు లాయర్లను కలిసి వారినుండి సమాచారం రాబట్టింది. కన్హైయా కుమార్ పై ఎలాంటి దాడి జరగలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ చేసిన ప్రకటన పచ్చి అబద్ధమని లాయర్లే రహస్య కెమెరా ముందు అంగీకరించారు.
దారుణం ఏమిటంటే కన్హైయా కుమార్ ని పాటియాలా హౌస్ కోర్టు ప్రాంగణంలో మాత్రమే కాదని, ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడూ కూడా వెళ్ళి కొట్టామని వారు చెప్పడం.
మూడు గంటల సేపు కన్హైయా కుమార్ తో ఆడుకున్నామని, అతను ‘ఉ_’ పోసుకునేలా కొట్టామని, ‘భారత్ మాతా కి జై’ అంటూ నినాదం ఇచ్చేవరకూ కొట్టామని చౌహాన్ చెప్పాడు.
కోర్టు ప్రాంగణంలో కొట్టింది తాము మాత్రమే కాదని ఢిల్లీ, హర్యానాల నుండి అనేకమంది ఆ రోజు కోర్టుకు వచ్చారని చౌహాన్ తెలిపాడు. ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తానే వారందరినీ పిలిపించానని, దాడిలో పాల్గొన్న వారంతా లాయర్లు కాదని చౌహాన్ వెల్లడి చేశాడు.
[Click link below to watch the sting video]
–
http://indiatoday.intoday.in/embed/irtqtcwiqo
–
స్టింగ్ వీడియో అంశాన్ని సుప్రీం కోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చాడు. లాయర్లు కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డారని వివరించాడు. ఈ అంశాన్ని కోర్టు ధిక్కార నేరం కింద పిటిషన్ గా దాఖలు చేయాలని తాము వెంటనే విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం ఆయనకు హామీ ఇచ్చింది. తమకు ఈ సంగతి ఇంతవరకు ఎవరూ చెప్పలేదని ధర్మాసనం తెలియజేసింది.
స్టింగ్ వీడియో ప్రభావం బిజేపి నేతలనూ తాకింది. ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చిస్తామని బిజేపి నేతలు, మంత్రులు హామీ ఇచ్చారు. లాయర్ల చర్యను ఖండిస్తున్నట్లు చెప్పారు.
రేపు (బుధవారం, ఫిబ్రవరి 24) ఢిల్లీ హై కోర్టులో కన్హైయా కుమార్ బెయిల్ పిటిషన్ విచారణకు రానున్నది. సుప్రీం కోర్టులో లాయర్ల స్టింగ్ ఒప్పుకోలు పిటిషన్ కూడా, సుప్రీం కోర్టులో, విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
బిజేపి నాయకులు, మంత్రులు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నారు. వారి చిరకాల కోరిక నెరవేరబోతోంది. సెక్యులరిజం పైనా, జాతీయత పైనా హిందూత్వ దృక్కోణంలో చర్చ జరగాలని ఆర్‌ఎస్‌ఎస్ పరివారం అనేక యేళ్లుగా డిమాండ్ చేస్తున్నది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది.
ఈ చర్చ ద్వారా జాతీయవాద చర్చకు హిందూత్వ దినుసులను అద్దే సువర్ణావకాశాన్ని బిజేపి ప్రభుత్వం చేజిక్కించుకోబోతున్నది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తెలిసి గానీ, తెలియక గానీ బిజేపి ఉచ్చులోకి లాగబడ్డాయి. వారే చర్చ కోసం పట్టుబడుతున్నారు.
జరగబోయే చర్చ కన్హైయా కుమార్ పై తప్పుడు కేసు దాఖలు చేయడం గురించని లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నాయి. కానీ బిజేపి ఆలోచనలు వేరే ఉన్నాయి. వారు ఆ చర్చను చివరికి హిందూత్వ జాతీయవాదం మీదికి మళ్లించడం ఖాయంగా కనిపిస్తోంది.
సభ వరకు కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు కాసిని పాయింట్లు సంపాదించినట్లు కనిపించవచ్చు గానీ దేశ ప్రజలకు మాత్రం హిందూత్వయే దేశభక్తి, జాతీయత అన్న సందేశం పార్లమెంటు వేదికగా వినిపించబోతున్నారు.