
Patidar protests for reservations
[ఈ టపాకు ముందరి ఆర్టికల్ లో ది హిందూ సంపాదకీయం అనువాదం ఇచ్చాను. సంపాదకీయం చేసిన విశ్లేషణపై విమర్శ కూడా ఇచ్చాను. విమర్శను పాఠకుల దృష్టికి తేవాలంటే ఆ భాగాన్ని ప్రత్యేకంగా ఇవ్వాలని భావిస్తూ మరో టపాగా పోస్ట్ చేస్తున్నాను. -విశేఖర్)
*********
పటిదార్ లు, జాట్ ల నుండి రిజర్వేషన్ డిమాండ్లు తలెట్టడానికి పై సంపాదకీయం చూపిన కారణం నిజానికి ఇరుకైనది. ఇది పూర్తి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. తాతల నుండి తండ్రులకు, తండ్రుల నుండి పిల్లలకు వారసత్వంగా భూములు ఆస్తులుగా సంక్రమిస్తున్న కారణం వల్ల భూములు విభజనకు గురై ఆస్తుల మొత్తం తగ్గిపోతున్నదని దరిమిలా భూస్వామ్య వ్యవస్ధ సైతం బలహీన పడుతున్నదని అనేకమంది వాదిస్తున్నారు. చివరికి దేశంలో ‘దున్నేవాడికి భూమి’ అన్న డిమాండ్ సందర్భం కోల్పోయింది అనేంతవరకూ ఆ వాదన వెళ్తున్నది. ది హిందూ సంపాదకీయం ఆ వాదనలనే అరువు తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది.
రిజర్వేషన్ లను ఈ పరిశీలన వెలుగులో చూడడం అంటే అది పాక్షిక పరిశీలన కాగలదు. ఎందుకంటే భారత దేశంలో భూస్వామ్య వ్యవస్ధకు ప్రధానమైన పట్టుగొమ్మ కుల వ్యవస్ధ. భూములను కొన్ని కులాలకు మాత్రమే పరిమితం చేయడం, ఓబిసిలను వివిధ వృత్తులు చేసుకుని బతకమని శాసించడం, ఎస్‌సి లను వెట్టి చాకిరీ బానిసత్వంలో మగ్గేలా చేయడం, ఎస్‌టిలను మరో లోకపు అనాగరికులుగా చూడడంగా భారత దేశ కుల వ్యవస్ధ నిర్మితమై ఉన్నది.
పరిశ్రమలకు ముడి సరుకులు అందించేది వ్యవసాయమే. కనుక పరిశ్రమలను కూడా భూముల యజమానులే -భూస్వామ్య కులాలే- సొంతం చేసుకుని ఉన్నాయి. అనగా ప్రైవేటు రంగం యావత్తు కొద్ది సంఖ్యలోని భూస్వామ్య కులాల యాజమాన్యంలోనే కొనసాగుతున్నది. భారత దేశంలో ప్రస్తుతం సంపదలలో అత్యధిక భాగం ప్రైవేటు రంగంలో ఉన్నందున ప్రైవేటు సంపదలు ఉన్నత కులాల స్వామ్యంలో కొనసాగుతున్నాయి.
ఈ నేపధ్యంలో భూములు పెద్దగా లేని ఓబిసిలు, అసలే లేని ఎస్‌సి, ఎస్‌టి లు అనివార్యంగా ప్రభుత్వ ఉద్యోగాలపైనా, ప్రభుత్వ విద్యా సౌకర్యాలపైనా ఆధారపడవలసిన అగత్యం ఏర్పడి ఉన్నది.
అయితే కులాలు ఏకశిలాసదృశంగా లేవన్నది ఒక వాస్తవం. ఉన్నత కులాల్లో పేదలు, ఓబిసి, ఎస్‌సి, ఎస్‌టి లలో ధనికులు లేకపోలేదు. అనగా కులాలు వర్గాలుగా విభజనకు గురై ఉన్నాయి. అయితే కులాల వర్గ విభజన ఒకే రీతిలో లేనిదీ వాస్తవమే. ఉన్నత కులాలలో పేదల సంఖ్య బహు తక్కువ. నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధలో పై నుండి కిందికి వచ్చేకొద్దీ పేదల సంఖ్య పెరుగుతూ, ధనికుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ధనికులు అసలే లేని కులాలూ ఉన్నాయి.
ఇలాంటి వ్యవస్ధ పైన విదేశీ కంపెనీల దోపిడీ రుద్దబడుతోంది. విదేశీ కంపెనీలకు మన దేశ ప్రజల భూములు కావాలి. వారి వనరులు కావాలి. వారి శ్రమ కావాలి. భూములు, వనరులు, శ్రమ అత్యంత చౌకగా వారికి అందాలి. విదేశీ బహుళజాతి కంపెనీల డిమాండ్లకు భారత పాలకులు జో హుకుం అంటూ నెరవేర్చుతున్న ఫలితమే సరళీకరణ-ప్రయివేటీకరణ-ప్రపంచీకరణ విధానాలు. ఈ విధానాల అమలులో భాగంగా ప్రభుత్వాలు ప్రజల నుండి భూములు లాక్కుంటున్నాయి. వ్యవసాయదారుల ప్రయోజనాలకు విరుద్ధ విధానాలు (ఆహార పంటలకు ప్రోత్సాహం తగ్గించడం, అంతర్జాతీయ వ్యవసాయ కంపెనీల అవసరాలకు అనుగుణంగా పంట విధానాలు రూపొందించడం, గిట్టుబాటు ధరల విధానాలకు తిలోదకాలు ఇవ్వడం, దళారీలకు లాభించే విధంగా దిగుబడుల ధరల్లో హెచ్చుతగ్గులకు అనుమతించడం మొ.వి) అవలంబిస్తున్నాయి.
సరళీకరణ విధానాలు విదేశీ కంపెనీల విచ్చలవిడి ప్రవేశానికి గేట్లు ఎత్తివేశాయి. ప్రపంచీకరణ విధానాలు స్వదేశీ కంపెనీల కంటే విదేశీ కంపెనీలకే ప్రాముఖ్యత ఇస్తున్నాయి. ఈ నేపధ్యంలో సంస్కరణ విధానాలు ప్రభుత్వ ఉపాధిని బాగా తగ్గించివేసాయి. (ఇప్పటికీ ప్రభుత్వ కంపెనీలలో వాటాల అమ్మకం కొనసాగుతోంది.) కుప్పలు తెప్పలుగా విద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్లు వచ్చిపడుతున్నందున ప్రైవేటు ఉపాధి కారు చౌకగా మారిపోయింది. చిన్న బడ్డీ కొట్టు తెరిచి స్వయం ఉపాధి కల్పించుకుందామంటే దానిని కూడా వాల్ మార్ట్ ల పరం చేసేశారు. ఆటో డ్రైవర్ గా వెళ్దామన్నా అక్కడ కూడా ఉబర్ లు రెడీ. పోటీ పెరిగి బాడుగలు దొరకని పరిస్ధితి.
ఈ పరిస్ధితుల్లో ఉన్నత కులాలు, ఓబిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు… ఇలా ఎవరు చూసినా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అంగలార్చుతున్న పరిస్ధితి ఏర్పడింది. ప్రభుత్వ వాటాల అమ్మకం దరిమిలా ఉన్న ఉద్యోగాలే రద్దయి పోతూ కొత్త ఉపాధి పుట్టకపోతున్నందున ఉపాధి అవకాశాలు కురచబారి పోటీ పెరిగి అందరి చూపూ రిజర్వేషన్ పై పడుతోంది.
రిజర్వేషన్ డిమాండ్లు పెరగడం వెనుక పని చేస్తున్న అసలు కారణం ఉపాధి కురచబారడం. ఉపాధి పడిపోవడానికి కారణం 1991 నుండి ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంస్కరణ విధానాలు. సంస్కరణలు రుద్దుతున్నది పశ్చిమ సామ్రాజ్యవాదులు. వారితో జట్టు కట్టిన భారత దళారీ పెట్టుబడిదారులు ప్రజల ఉపాధిని తగ్గించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ కారణాన్ని వదిలి ఉన్నత కులాల భూములు విభజనకు గురి కావడం పైన కేంద్రీకరించడం అసంగతం. భూములు కలిగిన ఉన్నత కులాల ప్రజలు కాకుండా వారిలోని పేద, మధ్య తరగతి ప్రజలు కూడా ఉపాధి కోసం చూస్తున్నారు. వారికి తక్షణ లక్ష్యంగా రిజర్వేషన్ కనిపిస్తున్నది కానీ ప్రభుత్వ కంపెనీల అమ్మకం వల్ల జరుగుతున్న ఉపాధి కోత కనిపించడం లేదు.
ఈ పరిస్ధితిని రాజకీయ పార్టీలు స్వప్రయోజనాలకు ఉపయోగిస్తూ విద్యార్ధుల మధ్య కులాల చిచ్చు రగిలిస్తున్నారు. రిజర్వేషన్ వ్యతిరేకత పెంచి పోషించడం ద్వారా విద్యార్ధుల అసలు లక్ష్యాన్ని కనుమరుగు చేయడం పాలక పార్టీల (వర్గాల) లక్ష్యం. ఈ కారణాన్ని ది హిందు పత్రిక కూడా మరుగుపరుస్తోంది.
Good analysis. Arthika praatipadikapi resrvations undaalanedi naa abhipraayam.