ఫాసిజం: జే‌ఎన్‌యూ విద్యార్ధి నేత అరెస్ట్


Kanhaiya Kumar

హిందూత్వ ఫాసిజం తన ఫాసిస్టు ప్రయాణంలో మరో అడుగు వేసింది. ఈసారి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పంజా విసిరింది. విద్యార్ధుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అపహాస్యం చేస్తూ యూనివర్సిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హైయా కుమార్ పైకి ఢిల్లీ పోలీసులను ఉసి గొల్పింది. యూనివర్సిటీ విద్యార్ధులపై కఠిన చర్య తీసుకోవాలని తానే ఆదేశించానని కేంద్ర హోమ్ మంత్రి సగర్వంగా చాటుకున్నారు.

యూనివర్సిటీ విద్యార్ధులు ‘జాతీయ-వ్యతిరేక’ భావోద్వేగాలు వ్యక్తం చేశారని కేంద్ర హోమ్ మంత్రి ఎకాఎకిన నిర్ధారించేశారు. ఆరోపణ తానే చేసి తీర్పు కూడా పోలీసు చర్య రూపంలో అమలు చేసేశారు. ‘జాతీయ-వ్యతిరేక’ భావోద్వేగాలను సహించేది లేదని ఆయన ప్రకటించారు. ఇండియా వ్యతిరేక నినాదాలు చేశారని ఆయన నేరుగా విద్యార్ధులపై ఆరోపణలు చేశారు.

పాలించమని అధికారం ఇస్తే తమ హిందూత్వ భావోద్వేగాల పరిధిలోకి రాని పాలితుల అభిప్రాయాలకు రకరకాల ముద్రలు తగిలించి, జాతి వ్యతిరేకులుగా చిత్రీకరించి, దేశ వ్యతిరేకులుగా నిర్ధారించి నోరు ఎత్తకుండా చేయడం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక విధానంగా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

యాకూబ్ మెమెన్ ఉరి శిక్ష అన్యాయం అన్నందుకు రోహిత్ వేముల ప్రభృతులను జాతీయ-వ్యతిరేకులుగా, ఉగ్రవాదులుగా కేంద్ర మంత్రులు చిత్రీకరించారు. అఫ్జల్ గురు ఉరితీత ‘జ్యుడీషియల్ కిల్లింగ్’ అన్నందుకు ఇప్పుడు కన్హైయా కుమార్ జాతీయ వ్యతిరేకి అయ్యారు.

రోహిత్ వేముల, కన్హైయా కుమార్… వీరిద్దరి విషయంలోనూ ఫిర్యాదుదారు ఏ‌బి‌వి‌పి విద్యార్ధి సంఘమే కావడం గమనార్హం. బి‌జే‌పి అనుబంధ విద్యార్ధి సంఘం ఫిర్యాదులకు తక్షణమే విలువ కట్టి చర్యలకు దిగడం ద్వారా నరేంద్ర మోడి నేతృత్వం లోని బి‌జే‌పి ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని దేశానికి, ముఖ్యంగా విద్యార్ధులకు ఇస్తోంది.

కన్హైయా కుమార్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్ధి సంఘానికి అధ్యక్షుడుగా ఎన్నికయిన విద్యార్ది. అఫ్జల్ గురు ను ఉరి తీసి ఫిబ్రవరి 9 తేదీతో మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో కొందరు విద్యార్ధులు ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు ఇండియా వ్యతిరేక నినాదాలు చేశారని కేంద్ర హోమ్ మంత్రి ఆరోపిస్తున్నారు.

యూనివర్సిటీ క్యాంపస్ తో పాటు యూనివర్సిటీ బైట కూడా అఫ్జల్ గురు స్మృతిలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొందరు కాశ్మీర్ విద్యార్ధులు కూడా పాల్గొన్నారు. వారిలో ఒకరు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు ఇచ్కాడని పత్రికల ద్వారా తెలుస్తోంది.

ఢిల్లీ ప్రెస్ క్లబ్ దగ్గర జరిగిన ఈ కార్యక్రమం వద్ద ప్రొఫెసర్ ఎస్ ఆర్ జిలానీ కూడా ఉండడంతో ఆయనపై కూడా దేశద్రోహ నేరం (సెడిషన్) మోపి అరెస్టు చేశారు.

2001లో పార్లమెంటుపై దాడి జరిగిన కేసులో అఫ్జల్ గురుతో పాటు ఎస్ ఆర్ జిలానీని కూడా నిందితుడుగా పోలీసులు అభియోగాలు మోపారు. అయితే సుప్రీం కోర్టు అఫ్జల్ గురును నిందితునిగా నిర్ధారించి ఎస్ ఆర్ జిలానీని నిర్దోషిగా తీర్మానించి విడుదల చేసింది.

యూనివర్సిటీ లోపలా, బయటా జరిగిన రెండు కార్యక్రమాలను పత్రికలు, ఛానెళ్లు కలగాపులగం చేసినట్లు కనిపిస్తోంది. ఇలా కలగాపులగం చేయడం ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతోందా అన్న అనుమానం ‘కన్హైయా కుమార్ అరెస్ట్’ వల్ల కలుగుతోంది.

నిజానికి కన్హైయా కుమార్ కీ, అఫ్జల్ గురు సంస్మరణలో యూనివర్సిటీ లో జరిగిన కార్యక్రమానికి సంబంధం లేదు. అఫ్జల్ గురు స్మృత్యర్ధం జరిగిన కార్యక్రమంతో కూడా అధికారిక స్టూడెంట్స్ యూనియన్ కి సంబంధం లేదు. అతని మాటల్లోనే చెప్పాలంటే…

“అఫ్జల్ గురు కార్యక్రమంలో నేను భాగం కాను. ఏ‌బి‌వి‌పి, నిరసనకారులకు మధ్య కొట్లాట జరుగుతుండడంతో నేను జోక్యం చేసుకున్నాను… జే‌ఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ (ఎన్నికల్లో గెలిచిన అధికారిక సంఘం) కి కూడా అఫ్జల్ గురు కార్యక్రమంతో సంబంధం లేదు… ఇది కేవలం సాకు మాత్రమే. స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో నేను ఏ‌బి‌వి‌పి ని ఓడించాను. అందుకే ఇదంతా జరుగుతోంది…” అని పోలీసులు లాక్కొని పోతుండగానే కన్హైయా కుమార్ పత్రికా విలేఖరులతో సందు చేసుకుని గట్టిగా అరుస్తూ చెప్పాడు.

ఈ మాటలన్నీ ఒకేసారి చెప్పినవి కావు. ఓ పక్క పోలీసులు అతను మాట్లాడకుండా చేయడానికి ప్రయత్నిస్తుండగా మధ్య మధ్యలో సందు చేసుకుని విలేఖరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలుగా చెప్పిన మాటలు.

యూనివర్సిటీ ఆఫ్ హైదారాబాద్ లో బలమైన విద్యార్ధి సంఘంగా అవతరిస్తున్న అంబేడ్కర్ స్టూడెంట్స్ యూనియన్ ను అణచివేయడానికి ఏ‌బి‌వి‌పి ఫిర్యాదును పురస్కరించుకుని రోహిత్ ప్రభృతులను హాస్టల్ నుండి రస్టికేట్ చేశారు. జే‌ఎన్‌యూ లో ఏ‌బి‌వి‌పి ని ఎన్నికల్లో ఓడించినందుకు అధికారిక విద్యార్ధి సంఘం అధ్యక్షుడిపై, ఒక బి‌జే‌పి ఎం‌పి ఫిర్యాదును పురస్కరించుకుని దేశద్రోహం నేరం మోపబడింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్, విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ, కార్మిక మంత్రి దత్తాత్రేయ…. వీరంతా కేవలం ఏ‌బి‌వి‌పి తదితర హిందూత్వ సంస్ధలకు మాత్రమే జవాబుదారీ వహిస్తారా? వారు దేశ ప్రజలందరికీ మంత్రులు, ప్రధాన మంత్రి కారా?

“దేశంలో మళ్ళీ ఎమర్జెన్సీ విధించబోరు అనేందుకు గ్యారంటీ ఏమీ లేదు” అన్న బి‌జే‌పి కురువృద్ధ నేత లాల్ కృష్ణ అద్వానీ మాటలకు అర్ధం ఇదేనా? 

“ప్రధాన మంత్రి నరేంద్ర మోడి దేశ ప్రజలందరికీ ప్రధాన మంత్రి అన్న సంగతి గుర్తుంచుకోవాలి” అని ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారని అదే పత్రికకు చెందిన న్యూస్ ఛానెల్ ఈ రోజు చెప్పింది. మాజీ ప్రధాన మంత్రి కూడా ఈ మాటలు చెప్పారు. బహుశా బి‌జే‌పి మంత్రులు, ప్రధాన మంత్రి గార్ల పనితనం ఎటువైపు దృష్టిసారించిందో ఇంతకంటే వివరంగా చెప్పగల మాటలు గానీ వ్యక్తులు గానీ అవసరం లేదు.

“బీఫ్ రగడపైనా, దాద్రి హత్యపైనా ప్రధాన మంత్రి ఎందుకు మాట్లాడరు? మోడీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం గురించి నమ్మకానికి సంబంధించిన సంక్షోభం దేశంలో నెలకొని ఉంది” అని కూడా మాజీ ప్రధాన మంత్రి ప్రశ్నించారు, వివరించారు.

ఆయన చెప్పని మాటలను ఈ రోజు రాజ్ నాధ్ సింగ్ గారు చెప్పారు. “జాతీయ వ్యతిరేక కార్యక్రమాలను సహించేది లేదు. విద్యార్ధులపై కఠిన చర్య తీసుకోవాలని నేనే ఢిల్లీ పోలీసులను కోరాను” అని ఆయన స్పష్టంగా చెప్పారు. తమ భావజాలానికి వ్యతిరేకంగా ఏది ఉన్నా అది ‘జాతీయ-వ్యతిరేకం’ ‘దేశ్య వ్యతిరేకం’ అవుతుందని హోమ్ మంత్రి గారు చెబుతున్నారు. ఫాసిజానికి అత్యంత మర్యాదకరమైన ముసుగు తగిలిస్తే ఆయనే ఈనాటి రాజ్ నాధ్ సింగ్ గారు!

పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురు దోషి అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు అన్యాయం అనీ, దాడికీ అఫ్జల్ గురు కీ అసలు సంబంధమే లేదనీ, ఆయనను పోలీసులు అన్యాయంగా ఇరికించారని అనేకమంది న్యాయ నిపుణులు చెప్పారు. న్యాయ పరిశీలకులు నిర్ధారించారు. అఫ్జల్ గురు దోషి కాదని చెప్పే వాదనలు ఆయనను దోషిగా నిర్ధారించిన తీర్పులోనే ఉన్నాయని వారు వెల్లడి చేశారు.

ఈ నేపధ్యంలో అఫ్జల్ గురు దోషి కాదు అని నమ్మే భావాత్మక హక్కు ఈ దేశ ప్రజలకు ఉన్నది. ఆ హక్కు ఈ దేశ రాజ్యాంగం ప్రజలకు కల్పించింది. తీర్పు ప్రకటించాక ఆ తీర్పును వ్యతిరేకించడం జాతీయ-వ్యతిరేకం అని ఏ రాజ్యాంగ సూత్రమూ చెప్పలేదు.

సుప్రీం కోర్టు తీర్పు అమలై అఫ్జల్ గురు ఊపిరి ఆగిపోయి మూడేళ్లు గడిచాయి. ఉరితీతను ఈనాటి ఆందోళనకారులు ఎవరూ అడ్డుకోలేదు. కానీ ఆయన ఉరితీత భారత రాజ్యం చేసిన తప్పుగా దేశ ప్రజల్లో కొందరు ఈ రోజు భావిస్తున్నారు. అది జాతీయ-వ్యతిరేకం ఎలా అవుతుంది?

ఇదే వాదనను అటువైపు నుండి చూస్తే ఈ వాదనలోని డొల్లతనం అర్ధం అవుతుంది.

ఒక నేరం జరిగింది. శిక్ష అమలు అవుతోంది. అనగా నిందితుడు శిక్ష అనుభవిస్తున్నాడు. తనపై పడిన శిక్ష అన్యాయం అని అతను, అతని బంధువులు, అతని తరపు లాయర్లు పై కోర్టుకు వెళ్లారు. అందుకని వారంతా సుప్రీం కోర్టు హక్కుల ఉల్లంఘనదారులు, దేశ వ్యతిరేకులు, జాతీయ వ్యతిరేకులు అయిపోతారా?

అఫ్జల్ గురు పార్లమెంటుపై దాడికి కుట్ర చేశారని భారత రాజ్యం ఆరోపించింది. అందుకు ఎలాంటి భౌతిక సాక్షాలనూ (material evidence) అది చూపలేకపోయింది. కానీ పరిస్ధితుల సాక్షాలను, భౌతిక సాక్షాల స్ధాయికి ప్రమోట్ చేస్తూ సుప్రీం కోర్టు ఉరి శిక్ష వేసేసింది. ఇది అన్యాయం అని అఫ్జల్ గురు బతికి వచ్చి చెప్పుకోలేడు. కానీ అతని వాదనలో న్యాయం ఉన్నదని నమ్మిన దేశ పౌరులు ఆయన తరపున ‘అన్యాయం’ అని ఈ రోజు చాటితే అది జాతీయ వ్యతిరేకం ఎలా అవుతుంది?

సుప్రీం కోర్టు తాను ఇచ్చిన తీర్పును తానే సమీక్షించే అవకాశం చట్టాల్లో ఏర్పాటు చేయబడి ఉన్నది. అనగా తాను ఏదైనా తప్పు తీర్పు ఇచ్చి ఉంటే దానిని సవరించుకునే అవకాశం చట్టంలో ఉన్నది. ఒక తీర్పులో నిజంగానే తప్పు దొర్లినా దానిని సమీక్షలో కూడా కోర్టు గుర్తించకపోవచ్చు. కానీ ఇతర న్యాయ నిపుణులు గుర్తించి ఎత్తి చూపవచ్చు. అలా ఎత్తి చూపిన వారి మాటలను పౌరులు నమ్మవచ్చు. ఇవి భావప్రకటనా స్వేచ్ఛలో భాగం. కాగా సుప్రీం కోర్టు గుర్తించని తప్పును ఈ రోజు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్ధులు గుర్తిస్తే అది జాతీయ వ్యతిరేకం ఎందుకు అవుతుంది?

5 thoughts on “ఫాసిజం: జే‌ఎన్‌యూ విద్యార్ధి నేత అరెస్ట్

  1. Sekhar, Assalu miru pradhana mantri ayithe em chesevaro., Supreme court nyayamurthi ayithe Kasab ni kuda material evidence dorakaledhu ano, inkeddho ano ila cheppi encourage chesevaro. Assalu AA VIDYARTHULAKI manina gayalni repentha duradha enduku? Afzal guru ni uri theesindi BJP kadhu, Ayina mikenduku intha kacha? France lo ISIS dadi jargina 72 gantallo oka 132 mandini encounter chesesaru with out any preliminary enquiry, danikosam aa desham rajyanga soothralu rathriki rathri marcha baddayi. Manam emo teevaravdlni konni samthrasarlu jailla lo poshinchi.. chivariki intha racha chestunnam. Okkati gurthu pettukondi, vidyarthulu andaru bagane chaduvu kuntunnaru… ABVP, Vampakshalu, ASA… inka emina undochu … ilanti vidyarthi nayakulu edo oka kallolam srustisthunnaru. Danini Anti – BJP bandwagons horetthisthunnaru. idantha chivariki dari teesthunnatu? Okati cheppandi meere pradhana mantri ayithe ilanti vishyallo elanti nirnayalu theskuntar telusukovalani aasakthi ga undhi?

  2. ఇందులో హిందూ ఫాసిజం ఉందని అంత త్వరగా ఎలా చెప్పేస్తున్నారు .
    కేవలం బిజెపి అధికారం లో ఉంటె, ఏ అరెస్ట్ జరిగినా ఇవే మాటలా ?? జె ఎన్ యు లో అఫ్జన్ గురు కి నివాళులు అర్పించడం తప్పు కాదా ??
    ఉరి శిక్ష లకి వ్యతిరేఖంగా ప్రచారం చేయడం తప్పు కాదు , ఎన్నో ఎన్ జి ఓ లు చేస్తున్నాయి . కాని ఉగ్రవాదులు ని రోల్ మోడల్ గ తీసుకుని భారత వ్యతిరేఖ వ్యాఖ్యలు చేయడం తప్పు కాదా ?? అలాంటి వారి మీద చర్యలు తీసుకుంటే అది హిందూ ఫాసిజం అయిపోతుందా ?? హిందూ ఓట్లు polarisation అవ్వడానికి ఏకైక కారణం ఇవే . నిజం చెప్పాలంటే ఈ దేశం లో వాక్ స్వాతంత్ర్యం చాలా ఎక్కువ. రోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూనే ఉంటారు . కాని జాతి వ్యతిరేఖ వ్యాక్యలు మాత్రం క్షమించరాని నేరం . ప్రభుత్వం డబ్బులు తో చదువుకుంటూ , పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జన్ గురు కి నివాళులు అర్పించడం , దేశం నాశనం అయిపోవాలని నినాదాలు చేయడం , వీటి మీద చర్యలు తీసుకోవడానికి ఏ ఫాసిజం అవసరం లేదు .

  3. why the university people should react for afjal guru first? is that is the purpose for which they are coming to college. i saw the video of even Rohit whom you supported so much talking with ABVP students. his answers are so recklessness. i saw for several days so many articles for one single student suicide. now this issue. i think you are concentrating on unimportant issues. your comments and issues these days loosing interest to open website. whether you agree to this point or not, but most of viewers will agree this point.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s