రాధిక, రోహిత్: అచ్చమైన దళిత కధలో పాత్రలు -1


Rohith poster in UoH campus

Rohith poster in UoH campus

పాలక పార్టీ తాజాగా మరో కేంద్ర మంత్రిని రంగంలోకి దించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్ధుల ఆందోళనను పరిష్కరించేందుకు కాదు. రోహిత్, మరో నలుగురు దళిత విద్యార్ధులపై మరింత బురద జల్లేందుకు.

యూనివర్సిటీ పాలకవర్గం ద్వారా తాము సృష్టించిన సమస్య నుండి దళిత కోణాన్ని తొలగించడానికి స్మృతి ఇరానీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో విదేశాంగ మంత్రిని కేంద్రం ప్రవేశపెట్టింది. “నాకు అందుబాటులో ఉన్న సంపూర్ణ సమాచారం మేరకు రోహిత్ అసలు దళితుడే కాదు. ఆయన దళితుడని చెప్పి కుల ఉద్రిక్తతలను రెచ్చగొట్టి పెట్టారు” అని విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం ప్రకటించారు.

యూనివర్సిటీ సమస్యలో అధికారికంగా జోక్యం చేసుకున్న ఇద్దరు మంత్రులూ మహిళలే. ఇది కాకతాళీయమేనా?!

సుష్మా స్వరాజ్ తాజా ప్రకటన ద్వారా యూనివర్సిటీ సమస్యను రోహిత్ దళితత్వం వైపుకు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మళ్లించింది. ఒక పక్క ‘కుల ఉద్రిక్తతలను రెచ్చగొట్టారు’ అని ప్రకటిస్తూ అదే ప్రకటనతో కేంద్ర ప్రభుత్వమే విద్యార్ధుల సమస్యను ‘కుల సమస్య’గా రూఢి చేసింది.

“నేను నిన్ను ఎప్పుడూ మాదిగోడిగా చూడలేదు” అని ఓ అగ్రకులస్ధుడు తన మాల స్నేహితునితో అన్నాడంటే ఏమిటి అర్ధం? అలా అనడంలోనే అతను తన స్నేహితుని ‘మాదిగ’తనాన్ని గుర్తు చేస్తున్నట్లు అర్ధం. ఆ విధంగా తాను తన స్నేహితుడు మాదిగ కులస్ధుడు అన్న అంశాన్ని ఎప్పుడూ మర్చిపోలేదనే అర్ధం.

Pretty Woman పేరుతో హాలీవుడ్ సినిమా ఒకటుంది. రెండుసార్లు ఆస్కార్ గెలుచుకున్న జూలియా రాబర్ట్స్ అందులో హీరోయిన్. కధా నాయకుడు సంపన్నుడు, అవివాహితుడు. వ్యాపారం రీత్యా న్యూయార్క్ వచ్చి హోటల్ లో దిగుతూ వెంట ఒక వేశ్యను తెచ్చుకుంటాడు. ఆమెను వేశ్యగా కాకుండా గరల్ ఫ్రెండ్ గా పరిచయం చేస్తాడు. ఆమెకు మంచి మంచి బట్టలు కొనిస్తాడు. తనతో ఉన్నంత కాలం మంచి గౌరవాన్ని సమకూర్చుతాడు. ఒక సందర్భంలో హీరో అంటాడు “I never treated you like a hooker” అని. దానికామె అతనికి వినపడకుండా “You just did” అని గొణుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అదే. రోహిత్ దళితుడు కాకపోతే సరే. ఆ సమస్యను కాసేపు అలా ఉంచండి. ముందు వారి ఆందోళనకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే కృషి మొదలు పెట్టండి. రోహిత్ కులం గురించి తీరిగ్గా చర్చిద్దాం. అసలీ పరిష్కార ధోరణే కేంద్ర ప్రభుత్వానికి లేనట్లు కనిపిస్తోంది. యూనివర్సిటీ పాలకులేమో ఒకరి తర్వాత మరొకరు సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు.

*********

రోహిత్, అతని తల్లి రాధికలు భారత దేశంలో దళితులు అనుభవిస్తున్న దీన పరిస్ధితులకు అచ్చమైన ప్రతీకలు. ‘దళితులకు ప్రతిభ ఉండదు’ అన్న అగ్ర కులజుల నమ్మకాన్ని బదాబదలు చేసిన ప్రతిభా మూర్తులు వారిద్దరు.

లేకపోతే ఓ వైపు చదువు ఖర్చుల కోసం అక్కడా ఇక్కడా శ్రమలు చేస్తూ సంపాదించిన రోహిత్ రెండుసార్లు ఫెలోషిప్ స్కాలర్ షిప్ కు అర్హత ఎలా పొందగలడు? తన పిల్లలు నేర్పిన చదువును ఒంట పట్టించుకున్న రాధిక కొద్ది సంవత్సరాల్లోనే పట్టా పుచ్చుకున్న పట్టబధ్రురాలు ఎలా కాగలదు?

రాధికను తన మానాన తనను వదిలేసి, ఆమె తల్లిదండ్రుల వద్దనే పెరగనిస్తే కధ వేరుగా ఉండేది. కానీ ఆమెను దత్తత తీసుకునే పేరుతో ఒక విద్యావంతుల కుటుంబం రాధికను పని పిల్లగా తెచ్చుకోవడంతోనే రాధిక కష్టాలు మరో రూపంలో, మరింత అవమానకరంగా మొదలయ్యాయి. చుట్టూ దళిత కుటుంబాలే ఉన్నప్పుడు ‘నువ్వు ఫలానా కులం’ అన్న ఛీత్కారాలు ఎదుర్కొనే పరిస్ధితి రాదు. అదే మరో కులం ఇంట్లో పెరిగితే ఇక అడుగడుగునా ఛీత్కారాలే తప్పవు.

రాధిక పెరిగింది అలాగే. మాల కులం దంపతులకు పుట్టిన రాధికను వడ్డెరకు చెందిన విద్యావంతుల కుటుంబం రికార్డులకు ఎక్కని “దత్తత” తెచ్చుకుంది. అలా దత్తత తెచ్చుకున్న దంపతుల్లో భర్త చీఫ్ ఇంజనీర్ కాగా భార్య టీచర్ అంజని. 

ఆ టీచర్ మాటల్లో చెప్పాలంటే “అది మధ్యాహ్న భోజన సమయం. సూర్యుడు మండిపోతున్నాడు. ప్రశాంత్ నగర్ (గుంటూరు) లోని మా ఇంటి బయట వేప చెట్టు కింద కొద్దిమంది పిల్లలు ఆడుకుంటున్నారు. వారిలో చాలా అందమైన పిల్ల నా కంట పడింది. ఆ పిల్ల ఇంకా నడక కూడా సరిగ్గా నేర్వని వయసు. బహుశా ఒక సంవత్సరానికి కాస్త ఎక్కువ ఉండవచ్చు. ఆ పిల్లే రోహిత్ తల్లి రాధిక” అని అంజని హిందూస్ధాన్ టైమ్స్ విలేఖరికి చెప్పారు.

“మా ఇంటికి దగ్గర్లో ఉన్న రైల్వే ట్రాక్ పై పని చేసేందుకు వచ్చిన వలస కూలి కుటుంబంలో రాధిక పుట్టింది. నేను అప్పుడే ఒక పాపను పోగొట్టుకున్నాను. ఆ పాప నేను పోగొట్టుకున్న పాపను గుర్తుకు తెచ్చింది. పాపను నాకు ఇవ్వాలని కోరడంతో ఆ తల్లి దండ్రులు వెంటనే ఒప్పుకున్నారు” అని అంజని చెప్పారు. ఆ విధంగా రాధిక అంజని కూతురు అయింది.

రాధికను తెచ్చుకున్నాక అంజనికి నలుగురు పిల్లలు కలిగారు. వారంతా ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్ధిరపడగా రాధికకు మాత్రం అక్షరం ముక్క నేర్వ(ర్ప)లేదు. రాధికను దత్తత తెచ్చుకున్నాను అని అంజని చెప్పిన మాటలు ఎంత నిజమో ఈ సంగతి చెబుతుంది. రాధికను పసిపిల్లగా ఉండగానే తెచ్చుకుంది పనిపిల్లగానే తప్ప దత్తత కోసం కాదని రాధిక జీవితం స్పష్టం చేస్తుంది. ‘అమ్మా’ అన్న ఒక్క పిలుపు తప్ప అంజని-రాధిక ల మధ్య ఉన్నది తల్లి-కూతుళ్ల సంబంధం అని చెప్పే ఒక్క సాక్ష్యమూ లేదు.

“కులమా? కులం ఏమిటి? నేను వడ్డెర (ఓ‌బి‌సి). రాధిక తల్లిదండ్రులు మాల. ఆమె కులం ఏమిటో నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆమె నా సొంత కూతురు లాంటిది. మా కులానికి చెందిన వ్యక్తితోనే ఆమె పెళ్లి జరిపించాను” అని రాధిక కులం గురించి అడిగినప్పుడు చెప్పారు. మణి కుమార్ (రాధిక భర్త) తాతగారు వడ్డెర కులంలో గౌరవనీయమైన వ్యక్తి అనీ రాధిక కులం విషయం రహస్యంగా ఉంచి మణికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆయనా తానూ నిర్ణయించుకున్నామని అంజని హిందూస్తాన్ టైమ్స్ కు చెప్పారు.

రాధిక, మణిల కాపురం సజావుగానే సాగుతున్నట్లు సమాజానికి కనిపించింది. కానీ రాధికకు మాత్రం తన కాపురం ఒక నరకం. మణికుమార్ కు తాగుడు వ్యసనానికి బానిస. బాధ్యత గల భర్తగా, తండ్రిగా ఎన్నడూ వ్యవహరించింది లేదు. “ఆయన తాగి వచ్చాక కొన్ని చెంప దెబ్బలు మామూలే” అని రాధిక విలేఖరితో తన (మాజీ) భర్త గురించి వీలయినంత మర్యాదగా చెప్పింది. మొదటి నుండి బాధ్యత లేకుండా మెలిగిన మాణికుమార్ రాధిక పట్ల హింసాత్మకంగా వ్యవహరించాడని టీచర్ అంజని తెలిపారు.

రహస్యం బట్టబయలు

మొదటి 5 సంవత్సరాల్లోనే రాధిక, మణి లకు ముగ్గురు పిల్లలు పుట్టుకొచ్చారు. మొదటి బిడ్డ నీలిమ కాగా రోహిత్, రాజాలు తదుపరి సంతానం. మూడో బిడ్డ కడుపులో ఉన్నప్పుడో (రాధిక చెప్పిందాని ప్రకారం), లేక మూడో బిడ్డ పుట్టినాకనో (తండ్రి, తాతల ఒక సందర్భంలో చెప్పిందాని ప్రకారం -ది హిందు) రాధిక కుల రహస్యం ఆమె భర్తకు తెలిసింది. దానితో ఆయన మరింత పెట్రేగిపోయాడు. తనకు తీరని అన్యాయం జరిగిందని నిర్ధారించుకున్నాడు. రాధికను మరింతగా చితకబాదడం మొదలుపెట్టాడు.

రాధిక వల్లనే తన కొడుకు పిచ్చివాడిగా మారే పరిస్ధితి వచ్చిందని రోహిత్ తాతగారు పడిన బాధకు అర్ధం ఏమిటో ఇప్పుడు తెలుస్తున్నది.

“నా ఆస్తిలో ఒక భాగాన్ని కొడుక్కి ఇచ్చాను. వారి విడాకుల బాధనంతా భరించాను. దీనంతటికీ నా కోడలే కారణం. అసలు ఇదంతా చేసేంది ఆమే. ప్రభుత్వాన్ని మోసం చేసి దొంగ సర్టిఫికేట్ తెచ్చింది. రోహిత్ చావు నాకు బాధగా ఉన్నా, ఆమెను మాత్రం నేను క్షమించబోను” అని తీవ్రంగా ఆరోపిస్తూ రోహిత్ తండ్రి తండ్రి గారు వ్యక్తం చేసిన ఆగ్రవేశాలు ఎందుకోసమో ఇప్పుడు అర్ధం అవుతున్నది.

రోహిత్ తండ్రి మణి కుమార్, ఆయన తండ్రి వెంకటేశ్వర్లుగారి బాధ అంతా ఒక ‘మాల పిల్ల’ను కుటుంబంలోకి తెచ్చుకున్నామే అన్నదే. ఆ మాల పిల్ల రక్తమాంసాలు ఉన్న మనిషి అనీ, ఆ మనిషే తనకు మెరికల్లాంటి ముగ్గురు పిల్లలను కని ఇచ్చిందన్న సంగతిని బ్రాహ్మణీయ కుల మాలిన్యంలో మునిగి ఉన్న మణి, వెంకటేశ్వర్లు మర్చిపోయారు. తమ ఇంట్లో తెంచుకోలేని విధంగా మాలతనం ప్రవేశించిందన్నదే వారి బాధ అంతా!

“మణి ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. కానీ నా కులం గురించి తెలుసుకున్నాక ఆయన మరింత హింసాత్మకంగా మారాడు. దాదాపు ప్రతి రోజూ నన్ను కొట్టేవాడు. ఒక అంటరానిదాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినందుకు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఉండేవాడు” అని రాధిక తెలిపారు.

“ప్రశాంత్ నగర్ లోని వడ్డెర కాలనీలో ఎవరో ఈ రహస్యాన్ని లీక్ చేశారు. రాధిక వాస్తంగా అంజని దత్తత తెచ్చుకున్న మాల పిల్ల అన్న సంగతిని మణి కుమార్ కి చేరవేశారు. అప్పటి నుండి రాధికను విపరీతంగా కొట్టడం ప్రారంభించాడు” అని అంజని చెప్పారు. రాధిక చెప్పిన విషయాలను అంజని ధృవీకరించారు.

………………………….ఇంకా ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s