బేసి-సరి: ముంబైకి కూడా కావాలి -ఎన్‌సి‌పి


A Delhi road at ITO Jn.

కాలుష్యం తగ్గించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తమ ఢిల్లీ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న బేసి-సరి పధకం ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తోంది. ఢిల్లీలో అమలు చేస్తున్న పధకాన్ని ముంబై నగరంలో కూడా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

ఎన్‌సి‌పి నేతల డిమాండ్ ను తాము పరిశీలిస్తున్నామని బి.జె.పి ప్రభుత్వ మంత్రులు కూడా చెప్పడం విశేషం. ఢిల్లీలో అమలు చేస్తున్న పధకం విజయవంతం అయినట్లతే దానిని ముంబైలో కూడా అమలు చేసేందుకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర ఆర్ధిక మంత్రి సుధీర్ ముంగటివర్ ప్రకటించాడు.

ముంబైలోనూ గాలి కాలుష్యం పెరిగిపోయినందున ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాన్ని స్వీకరించాలని ఎన్‌సి‌పి నేతలు డిమాండ్ చేశారు. ఎన్‌సి‌పి ముంబై యూనిట్ అధ్యక్షుడు సచిన్ అహిర్ ఈ మేరకు పత్రికా ముఖంగా తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు.

“ఢిల్లీలో అమలు చేస్తున్నట్లుగానే ముంబై వీధుల్లో కూడా బేసి-సరి వాహనాల పధకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. తద్వారా ముంబై నగరాన్ని కాలుష్యం నుండి విముక్తం చేయాలి. ఈ పధకం విజయవంతం అయితే రోజుకి సగం వాహనాలు రోడ్డు మీదికి రావడం తగ్గిపోతుంది.

“ఇలా చేయడం వలన నగరంలో నమోదవుతున్న కర్బన ఉద్గారాలను బాగా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే గ్రీన్ హౌస్ వాయువుల విడుదలలో 26 శాతం పెట్రోలియం ఉత్పత్తులే ఆక్రమిస్తున్నాయి. దానితో పాటుగా నగరంలో ట్యాంకర్లు, ట్రక్కులు, బస్సులు తిరగడం ఎక్కువై పోయింది. రోజు రోజుకీ వాటి సంఖ్య పెరుగుతూ పోతోంది” అని సచిన్ అహిర్ తన డిమాండ్ కు కారణాన్ని వివరించాడు. 

ఎన్‌సి‌పి డిమాండ్ కు మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. “ముంబైలో ట్రాఫిక్ ను కాలుష్యం స్ధాయిని తగ్గించడానికి ఏమేమి చేయవచ్చో అన్నీ చేస్తాము. ఢిల్లీ ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది. ఫలితాలు తెలియడానికి సమయం పడుతుంది. పధకం 4 రోజులే అమలైంది. 4 రోజుల్లో ఫలితాలపై తీర్పు చెప్పలేము. ఢిల్లీలో పధకం వల్ల ఏ మాత్రం లాభం చేకూరిందో మనకు తర్వాత తెలుస్తుంది” అని ఆర్ధిక మంత్రి సుధీర్ చెప్పారు.

“మేము ఈ పధకాన్ని పరిశీలిస్తున్నాము. పధకం విజయవంతం అయిందని మనం భావిస్తే గనక దానిని దేశంలో ఎక్కడైనా అమలు చేయవచ్చు. మంచి అంశాలను ఆమోదించడం 21వ శతాబ్దం ప్రత్యేకత. కొత్త ఆలోచనలకు మనం ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉండాలి. అలాగని కొత్త ఆలోచనల ఫలితాలు తెలియకముందే ముందుకు వెళ్లిపోకూడదని గుర్తించాలి” అని మంత్రి మర్మం బోధించారు.

కొత్త ఆలోచనలకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉండాలనడం బాగానే ఉంది గానీ దానికీ 21వ శతాబ్దానికి సంబంధం ఏమిటో తెలియకుంది. మంచి అంశాలను ఆమోదించడానికి 21వ శతాబ్దం వచ్చేవరకూ బి.జె.పి పార్టీ ఆగిందా అన్న అనుమానాల్ని మహారాష్ట్ర ఆర్ధిక మంత్రి లేవనెత్తారనడంలో సందేహం లేదు.

’20వ శతాబ్దంలో ‘రామ జన్మభూమి – బాబ్రీ మసీదు’ వివాదం మళ్ళీ మళ్ళీ రగుల్చుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టిన బి.జె.పి తదితర సంఘ్ పరివార్ సంస్ధలు 21వ శతాబ్దంలో పాకిస్తాన్ తో సైతం స్నేహ సంబంధాలు కాంక్షించేలా మార్పు చెందాయి’ అని సుధీర్ చెప్పదలిచారా?

సుధీర్ మదిలోని భావన అదే అయితే భారత ప్రజలకు అదేమంత పెద్ద శుభవార్త కాదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో రూపంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం బి.జె.పి 21వ శతాబ్దంలోనూ మానుకోలేదు. తద్వారా డజన్ల సంఖ్యలో, ఒక్కోసారి వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలను, ఆస్తులను హరించివేయడం ఆగలేదు.

కాకపోతే అప్పుడు రెచ్చగొట్టే స్ధానంలో ఎల్.కె.అద్వానీ ఉంటే సర్దిపుచ్చే స్ధానంలో వాజ్ పేయి ఉన్నారు. ఆ తర్వాత రెచ్చగొట్టే బాధ్యతను మోడి ఆక్రమించగా, సర్దిపుచ్చే బాధ్యతను అద్వానీ నెత్తిమీద వేసుకున్నారు. కానీ పాపం ఆయనకి వాజ్ పేయి పదవి దక్కకుండానే అది కూడా మోడీయే లాగేసుకున్నారు.

ప్రస్తుతం రెచ్చగొట్టే స్ధానంలో బి.జె.పి అధ్యక్షులు అమిత్ షా కూర్చోగా సర్దిపుచ్చే కుర్చీలో నరేంద్ర మోడీ ఆసీనులై ఉన్నారు. అమిత్ షా బహిరంగంగా రెచ్చగొట్టడమే ఉండదు కానీ ‘తెరవెనుక చేయవలసింది చేసేది ఆయనే’ అని చెప్పని పత్రిక లేదు. అప్పుడూ ఇప్పుడూ మతవిద్వేష వ్యూహం అలాగే కొనసాగుతుండగా పాత్రల పోషకులే మారుతున్నారు. అంతోసి మార్పుకు 21వ శతాబ్దం అంటూ కాలాన్ని మలినం చేయడమెందుకు?

2 thoughts on “బేసి-సరి: ముంబైకి కూడా కావాలి -ఎన్‌సి‌పి

వ్యాఖ్యానించండి